మీరు రాసిన మొదటి కవిత, దాని నేపధ్యం ఏమిటీ?
నేను రాసిన మొదటి కవిత అగాధంలోకి. సంవత్సరం గుర్తులేదు బహుశా బాబ్రీ విధ్వంసం తర్వాత రాసానేమో. అహింస ను కాంక్షించిన కవిత. నేనప్పటికి గాంధేయవాదిని. అదే రాశాను అందులో.
కవిత్వం ఎందుకు రాయాలి?
కవిత్వం ఎందుకు రాయాలి అనే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు ఎందుకంటే భిన్నమైన పార్శ్వాలూ పాయల్లోంచి కవిత్వం రాయబడుతుంది కాబట్టి.
కాని నేనెందుకు కవిత్వం రాస్తున్నాను అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వగలను. భిన్న సామాజిక పరిస్థితుల, పరిణామాల నేపధ్యంలో ఎదురొచ్చే పరీక్షలనీ, సవాళ్ళను తట్టుకొని నిలబడడానికి నాకు నేను ఇచ్చుకునే భరోసా నా కవిత్వం. జనం తమ ఆకాంక్షలను వివిధ ఉద్యమరూపాల్లో వ్యక్తీకరించినపుడు నా వంతు ప్రదిస్పందన నా కవిత్వం. మనిషిగా నాకు చేతనైంది ఇది.
మీకు నచ్చిన మీ కవిత ఏది?
నిజానికి నా కవిత్వం నాకేమీ తృప్తినివ్వదు చాలాసార్లు. ఆ విషయంలో ఎక్కువగా రాజీపడలేను నేను. అయితే ఇటీవల రాసిన విప్లవ ప్రేమ కవిత్వం, సూఫీ కవిత్వం కొంత సంతృప్తిని ఇస్తోంది. 2018 లో రాసిన “ఇలాగే” కవిత నాకు నచ్చింది.
*
వాడిప్పుడు ఎక్కడ ఉంటాడు?
ఇది
ఖచ్చితం
వాడిని మోయదిక
జన హృదయం
కొన్ని వీడ్కోళ్ళు నిర్దయగా ఉంటాయి
కలిసిబతికినోడు
కన్నీళ్ళు పంచుకున్నోడైతే కాదు
కాబట్టి
వాడు వెళ్ళిపోతూంటే
ఎవడి గుండె చెదరలేదు
ఎవడి కన్నూ చెమర్చలేదు
ఒక ఆత్మీయుడి చివరి ఆలింగనంలా
వెచ్చదనం కోసం ఎవడి బాహువులు విచ్చుకోలేదు
కాక్టస్ కరచాలనం నుంచి చేతిని వెనక్కు తీసుకున్నట్టు
వాడి ముఖంమీదికి ఒక అసహజ నమస్కారం విసర్జించబడింది
వాడిపుడు ఆ తిరస్కరణని
తుడుచుకోడానికి తంటాలు పడుతుంటాడు బహుశా…
2.
మామూలు కంటే వెన్నెల ఆ రోజు బాగా కురిసింది
వాడి కనుసన్నల్లో ప్రపంచం
శిధిలమైపోతుందన్న భయం మూలాల్లోంచి తెగిపడి,
కొత్తాశ కనుదోయి మీద అంకురంలా చిగుర్చింది
యుధ్ధభీభత్సపు అనుభవం మిగిల్చిన కన్నీటిని
సిరియా తన చెక్కిలి మీంచి తుడుచుకుంది
కష్టాలు పెట్టినోడే గానీ పట్టించుకున్నోడు కాదు
కనీస మానవుల కన్నీటిని ధనికులు తాగే షాంపేన్లా అమ్ముకున్నోడు
నయావలసవాదం నెత్తిన కత్తులు కట్టి
దేశాల నడిబొడ్ల మీద
విధ్వంస నృత్యం ఆడించినోడు
నాలుగు సంవత్సరాల అధికారంలో
రుతువుల వలసల మీద సిఐఏ నిఘా పెట్టి
మిగతా ప్రపంచాన్ని క్షామం పాల్జేసి
తన ఇంటిని పూల గుఛ్ఛాలతో అలంకరించుకున్నోడు
కొలంబస్ నౌక లోంచి దిగిన
సామ్రాజ్యవాద జెనొసైడియల్ సంస్కృతికి పట్టంకట్టిన యాంకర్
ఆకారం వాడు
డిగో డీ లాండా లా మాయన్ లిపిని మాయం చేసినట్టు ప్రతి చారిత్రక ప్రతిని తగులబెట్టినట్టు
తెల్లభవనపు సుఖం కోసం స్థానికతల తలలను వారి పునాదుల దేహాల నుంచి వేరుపరచడానికి
ప్రయత్నించినవాడు
ఉసుమాసింటా నది పరివాహంలో రంగులకలలా వెలసిల్లనిన యాక్షీషిలాన్ నాగరికతా నమూనాలను
మానహట్టన్ ఆకాశహార్మ్యాల సుఖ సమాధుల కింద కప్పెట్టిన కరకు డాలర్ మారకం విలువ వాడు
బంగారు వజ్రాల వేట కోసం “నేటీవ్ అమెరికన్” కలల చుట్టూ ఇనుప పట్టీలు కట్టి బానిసత్వానికి అంకురార్పణ చేసిన స్పానిష్ హంతక నేపధ్యాన్ని నెత్తిన మోసినోడు
కాంగో ను తన ఆస్తిగా ప్రకటించుకున్న లియోపాల్డ్ లా ప్రపంచాన్ని తన గుత్తాధిపత్యం కిందికి తీసుకురావడానికి దేశదేశాల్లో వ్యాపారకేంద్రాల్ని ఏర్పాటు చేసుకున్నోడు
కాసిన్ని డాలర్ కలలతో మెక్సికన్ సరిహద్దు దాటి వలసపట్టే పేదరికాన్ని ఆపడానకి నింగెత్తు గోడ కట్టిన షావుకారు అహంకారం వాడు
3
ఇప్పుడు వాడు ఎక్కడా కనబడడం లేదు
కొలరాడో గ్రేట్ కాన్యాన్ వొంపుల్లో తప్పిపోయాడా?
విషాదాన్ని ఇంధనం చేసి
Keystone XL పైపుల్లోంచి ప్రపంచం అంతాటా సరాఫరా చేయాలనుకున్న
గనుల గర్భాల్లోకి “గొల్లామ్” లా కుంచించుకుపోయాడా
పారిస్ అకార్డ్ నుంచి మానవత్వాన్ని తప్పించి పర్యావరణాన్ని పెట్టుబడికి తాకట్టు పెట్టాలనుకున్న
మైనింగ్ మాన్ హోల్స్లో జారిపోయి ఉంటాడా?
బహుశా
వాడెక్కడో సంపద సృష్టించిన ఒక పాలరాతి గుహలో
చీకటి విసర్జించిన దుఃఖంలా పడి ఉంటాడు
యాంటిసెమిటిజం
విషాదానికి పుట్టిన వికృతపోకడ వాడు
మూతి వంకరలోంచి మొలిచిన బొమ్మజెముళ్ళ మాటల్లో తన్ను తాను కోల్పోయి
తన అశుధ్ధంతో తానే మూతి తుడుచుకుంటూ ఉంటాడు
నిర్లక్ష్యపు వేదిక మీద నిలబడి
నాలుగు లక్షల మంది ప్రాణాల్ని ప్రాణాంతక వ్యాధి మూతికి మాస్క్ ల తొడిగినోడు
నల్లజాతి కంఠం మీద ఇంకోసారి బానిసత్వపు ఇనప్పాదం ఉంచి ఊపిరాడకుండా చేసినోడి
తల బిరుసుతనం ముందు
తలవంచకుండా
ప్రజాస్వామ్యం ఈ కాలానికి అందించిన
పరిష్కారపు బరువు కింద వాడొక
విసర్జిత శిలాజంలా
మిగిలి ఉంటాడు..
*
డిగో డీ లాండా – ఇతడో ప్రీస్ట్. 16 శతాబ్దంలో అమెరికా లో మాయన్ నాగరికతను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. మాయన్ సాహిత్యాన్ని తగులపెట్టించాడు.
యాక్షీషిలాన్ – మాయన్ కాలపు నగరం..
Keaystone pipe- కెనడా భూగర్భంలో దొరికిన క్రూడ్ ఆయిల్ ని పైపు ద్వారా అమెరికా చేర్చాలనే ప్రణాళిక. ఈ ప్రణాళికకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు ఉద్యమిస్తున్నారు
యాంటిసెమిటిజం- యూదు వ్యతిరేకత
గొల్లామ్ – లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో వికృత ఆకారం జీవి
కవిత లు బాగున్నాయి!👍👌సర్! మనిషీగా,మీకు చేతనైంది, బాగా రాశారు..!
Thank u very much