“నింగికి ఎగసిన తార” అని వింటూంటాం. ఆ తార ఎగిసినప్పుడు వెలుగులని విరజిమ్మడమూ, అవి ఆ చోటుని దాటి ఎంతో దూరాలకి కాంతిపుంజాలని దూరాలకి వెదజల్లడమూ నిజమే గానీ, తరువాత ఆ ఎగిసిన చోట అది మిగిల్చేది చీకటినేనా? ఉపమానా న్నొదిలేసి నిజజీవితంలోకి వస్తే, ఒక చిన్న ఊరినించీ పధ్ధెనిమిదేళ్ల వయసులో బయటపడి పేరుప్రఖ్యాతులని ఆర్జించుకుని ముఫ్ఫయ్యారు ఏళ్ల తరువాత స్వంత ఊరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎదురయ్యేది ఆ వెలుగుల గూర్చిన సంతోషమా లేక చీకటిలో మిగిలిపోనందుకు అసూయా? ఆమెకి కావలసిం దేమిటి? అది ఆమెకు దొరికిందా? ఇవే కాక మరికొన్ని ప్రశ్నలని మదిలో చొరబడేలా చేస్తారు ది అనెక్స్‌పెక్టెడ్ అన్న కథలో ప్రఖ్యాత రచయిత్రి జాయ్‌స్ కెరోల్ ఓట్స్.
మధ్యమపురుష కథనంలో ఉన్న ఈ కథలోని ప్రముఖపాత్ర, ఉన్నత చదువులని చదవడానికి స్కాలర్‌షిప్పుని దొరకపుచ్చుకుని న్యూ యార్క్ రాష్ట్రంలో బఫెలో నగరానికి దగ్గరగా ఉన్న యూవిల్ అన్న చిన్నవూరినించీ బయటపడ్డ మూడున్నర దశాబ్దాలకి పైగా తరువాత వెనక్కు వచ్చిన రచయిత్రిది. ఆ కాలంలో ఆమె పుంఖానుపుంఖాలుగా రచనలని చేశారు, దేశ మంతటా ఆమె పేరు ప్రసిధ్ధే. అయినా గానీ ఆమెని యూవిల్‌కి కేవలం తొమ్మిది మైళ్ల దగ్గరగా ఉన్న ఊరిలోని కమ్యూనిటీ కాలేజీనించీ స్నాతకోత్సవానికి వక్తగా పిలుపు నందుకోవడానికి కూడా అన్నేళ్లు పట్టింది. పుస్తకాన్ని ప్రచురించిన తరువాత రచయిత్రి(త) దేశంలో పలుచోట్లకి వెళ్లి దానిలో కొంతభాగాన్ని చదవడమూ, అప్పుడు కొన్నవాళ్ళ పుస్తకాల్లో రచయిత్రి(త) సంతకం చెయ్యడమూ అమెరికాలో సాధారణం. అలాంటిది కనీసం అలాంటి పుస్తక పఠనానికి కూడా ఆ చుట్టుపక్కల నుండీ ఆమెకు ఆహ్వానం రాలేదు. అన్నేళ్ల తరువాత ఈ కమ్యూనిటీ కాలేజీ, ఆనరరీ డాక్టరేట్ డిగ్రీతో సత్కరించి పట్టభద్రులవుతున్న విద్యార్థులకి ఈ ఉపన్యాసా న్నిమ్మంది.
ప్రసంగాన్ని ‘కాలేజీ చదువు విలువ’ అంటూ మొదలుపెడదా మనే ఆమె తయారయి వచ్చింది. అయితే, రెండు మూడు తుస్సుమని గాలిపోయిన బెలూన్లవంటి వాక్యాలని వెలువరించిన తరువాత ఆమె తను ఆ ప్రాంతంనించే వచ్చిందని చెప్పి, అనుకున్నదానికి భిన్నంగా, తన కుటుంబం గూర్చీ, విద్యార్థి దశలోని ఉపాధ్యాయులపట్ల కృతజ్ఞత గూర్చీ, అక్కడ చుట్టుపట్ల కనిపించే రోలింగ్ హిల్స్ గూర్చీ, లేక్ అంటారియో మీదనించీ వీచే గాలుల గూర్చీ, ఎంతోసేపు గడిపిన ఆ పక్కవూళ్లో ఉన్న ఒకే గ్రంథాలయం గూర్చీ చెబుతుంది. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా స్టేజీ మీద నించీ, క్రింద విద్యార్థులనించీ కూడా ఆ ప్రసంగానికి పెల్లుబికేలా కరతళధ్వానా లొస్తాయి. అప్పుడు ఆమె మదిలో ఆ క్రింద చప్పట్లు కొట్టినవాళ్లు తనకి తెలుసా అన్న ప్రశ్న మెదులుతుంది. కానీ వీళ్లెవరూ ఆమె సహాధ్యాయులు కాదు. ఆమె మదిలో మెదిలిన ఇంకొక రెండు ప్రశ్నలు: యామ్ ఐ హోమ్ ఎట్ లాస్ట్? ఈజ్ దిస్ వేర్ ఐ బిలాంగ్?
ఆ ప్రసంగం తరువాత ముందుగానే అనుకున్నట్లుగా ఆమె తను పెరిగిన ఊరిలో లైబ్రరీకి వెడుతుంది. అంతకు ముందే అక్కడి లైబ్రేరియన్‌తో మాట్లాడగా ఆ రోజున ఆమె అన్నా ఆమె పుస్తకాలన్నా ఆసక్తి ఉన్న వ్యక్తులు ఆమెను అక్కడ కలుసుకోవడానికి ఏర్పాటు జరిగింది. ఆమెకు తెలిసినంతవరకు ఆ ఊరినించీ వచ్చిన ఇంకొక రచయిత లేకపోవడంవల్ల ప్రసిద్దిచెందిన యూవిల్ సాహితీవేత్తగా తను అక్కడ సత్కారా న్నందుకుంటుందని ఆమె నమ్మింది. దాదాపు ఏమీ మారని లైబ్రరీలో వెనక చిన్నగదిలో హాజరయిన వాళ్లంతా దాదాపు ఆమె వయసువాళ్లే. వాళ్లు పట్టుకొచ్చిన ఆమె రచనల పుస్తకాలు ఎంతో పాతవి. కొన్ని అట్టలు చిరిగిపోయి కూడా ఉన్నాయి. ఎంతోమంది వస్తారని ఆశిస్తే వచ్చినవాళ్లు డజనుమంది కూడా లేరు! కానీ, వారి ప్రవర్తన ఆమె ఆశించినదానికి కొన్ని క్రోసుల దూరంలో ఉన్నది. ఎవరూ ఆమెని ఆనందంతో కౌగిలించుకోలేదు. ఆప్యాయంగా మాట్లాడలేదు. అందరికీ సాధ్యంకాని శిఖరాలని ఆమె చేరుకున్న దన్న గొప్పదనాన్ని తమదిగా భావించి గర్వించలేదు. వందలమంది ముందు నిల్చొని ఆ పొద్దుటి ప్రసంగం చేస్తున్నప్పటి కన్నా పట్టుమని పదిమంది వున్న వాళ్ల ముందు నిల్చోవడం ఆమెకు ఎక్కువ వ్యాకులతని కలగజేసింది. “మీ ముందుకు రావడం నాకు గౌరవాన్నీ, ఉత్తేజాన్నీ కలిగిస్తోంది” అని నట్లు పడుతూ నాలుగు మాటలని అనగలిగింది.
“అత్యధిక సంఖ్యలో పుస్తకాల అమ్మకాలు గల యూవిల్ రచయిత్రితో సంభాషణ” అని ఆ నాటి కార్యక్రమాన్ని ప్రచారం చేశారు కాబట్టి కొంతమంది చేతులెత్తి “రాయడానికి ఐడియాలు ఎలా వస్తాయి? మొదటి రచన చేసేటప్పటికి నీ వయసెంత? ముందు చేత్తో రాస్తావా లేదా ఒకేసారి కంప్యూటర్లోకి ఎక్కిస్తావా? కొత్త రచయిత్రులకి నువ్విచ్చే సలహా ఏమిటి?” మొదలయిన ప్రశ్నలడుగుతారు. ఇంటర్వ్యూలలో సాధారణంగా ఈ ప్రశ్నలని పాఠకుల కోసమో లేదా ప్రేక్షకుల కోసమో అడుగుతారు గానీ, ఇక్కడ అడిగింది వాళ్లకోసమే. తరువాత, “నీకు పిల్ల లున్నారా?” అన్న ప్రశ్నని సంధిస్తారు కూడా. లేరని ఆమె చెప్పిన జవాబుతో ఆగకుండా, ఆ జవాబుని పక్కకు తోసి, “అందుకు విచారిస్తున్నావా?” అన్న కొసమెరుపుని కూడా! ఇవన్నీ ఒక ఎత్తయితే, తరువాత వచ్చిన నిందాపూరితాలు ఇంకొక ఎత్తు. అవి:
“ఈ ఊళ్లో నీ గతాన్ని సొమ్ముచేసుకున్నందుకు సిగ్గు పడుతున్నావా?”
“ఈ ఊళ్లో నీ గతాన్ని సొమ్ముచేసుకున్నందుకు గర్విస్తున్నావా?”
“చరిత్ర తిప్పి రాయగలిగితే మళ్లీ ఇట్లా చేస్తావా?”
“చరిత్ర తిప్పి రాయగలిగితే మళ్లీ ఇట్లా చెయ్యగలవా?”
ఆ ప్రశ్నల్లో, ఆమె చిన్నతనంలో ఆ ఊరిలోని అనుభవాలని తన రచనల్లో పేర్కొనడం వల్లనే ఆమెకు పేరువచ్చిందన్న నమ్మకం ఉన్నది. వాటి ప్రస్తావన లేకపోతే ఆమెకు అంత పేరు వచ్చేది కాదన్న అభియోగం ఉన్నది. ఆ అనుభవాల్లో భాగస్వాము లయిన తమని ముఫ్ఫయ్యారు ఏళ్లలో తలపుల్లోనూ, అక్షరాల్లోనూ తప్పితే మనుషులుగా పట్టించుకోలేదన్న నింద ఉన్నది. అక్షరాల్లోని ఆమె చిత్రణలో తమని గుర్తించిన వ్యక్తులకి దాన్ని గూర్చిన నిరసన ఉన్నది; చిన్నప్పటి ఒక అనుభవాన్ని రచయిత్రి తనకు కావలసినట్లుగా మార్చుకుందన్న ఆరోపణని అక్కడున్న ఒకామె ఆమె మొహంమీదే చేస్తుంది. ఇక్కడ ఎవరు నిజం చెబుతున్నట్లు? ఇంకొకామె తన జీవితమంతా కిండర్‌గార్టెన్ ఉపాధ్యాయురాలిగానే ఉన్నదనీ, ఒక్క పుస్తకమూ రాయలే దనీ, దానికి ఏమాత్రం విచారించట్లే దనీ చెబుతుంది. వేరొకామె, ఒకామె జీవితమంతా కుటుంబానికే ధారపోసిం దనీ, ఆమె పోయిన తరువాత కూడా ఆమెని ఎవరూ మరచిపోలే దనీ చెబుతుంది. “నువ్వు బతికున్నా నిన్ను పట్టించుకున్న దెవరు?” అన్న సూచన వాళ్ల మాటల్లో తేటతెల్ల మవుతుంది. అంతేకాక ఆమె తమలా లేకపోవడంలో ఆమె దోషిత్వం వెల్లడవుతున్నదని కూడా. ఎన్నో పుస్తకాలు రాసిన ఈమెకన్నా అయిదారు పుస్తకాలు మాత్రం రాసిన జేన్ ఆస్టిన్ గొప్పది అని అసిస్టెంట్ లైబ్రేరియన్ అనడంలో “రాశి కాదు వాసి ముఖ్యం” అంటూ ఆమె రచనల గూర్చి వెల్లడించిన అభిప్రాయంతో ఆ రోజు అక్కడ తనకి లభిస్తున్నది దండాలే తప్ప దణ్ణాలు కాదని రచయిత్రికి అర్థ మవుతుంది.
తల్లిదండ్రులు ఎప్పుడో గతించినా చుట్టాలు గానీ ఇంకా టచ్‌లో ఉన్న చిన్నప్పటి స్నేహితులు గానీ ఆ ఊళ్లో ఉండివుంటే, వారిద్వారా ఆ “మీట్ అండ్ గ్రీట్” జరిగివుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో! ఆ చిన్ననాటి సహాధ్యాయులు ఈనాడు ఎలా ఉన్నారని గానీ, ఏం చేస్తున్నారని గానీ, వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయని గానీ తెలిసినా కూడా గ్రంథాలయంలో ఆమెకు ఎదురయిన అనుభవం వేరేగా ఉండి వుండేది. జీవితాల్లో మార్పుల మాట అటుంచి మొహాల్లో వచ్చిన మార్పుల వల్ల కూడా ఆమెకు ఎదురుగా ఉన్నవాళ్ల పేర్ల గూర్చిన ఊహాగానాలు తప్ప ఆమెకు వాళ్లెవరన్న స్పష్టత లేదు. అసిస్టెంట్ లైబ్రేరియన్ మిస్ బియటీ “నే నెవరో తెలియదన్నట్టు నటిస్తున్నావా?” అని అన్నప్పుడు గూడా ఆమెతో పరిచయం రచయిత్రికి గుర్తు రాలేదు. ఎవరి జీవితాలు వాళ్ల కుంటాయి గనుక, వాటిల్లో వాళ్లు తలమునక లవుతుంటారు గనుక అన్నేళ్లు వాళ్లని కలవకపోవడం ఆమె తప్పని ఎవరూ అనలేరు. అలాగని ఆ సహాధ్యాయుల కినుక అర్థం లేనిదనీ అనలేరు.
ఆ రోజు అక్కడికి రావడం గూర్చి ఆమెకు పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పటికే కాలంచెల్లిన తెలిసినవాళ్ల లిస్ట్ చెప్పినప్పుడు తానేదో తప్పుచేసిందన్న భావన కూడా ఆమెకు కలుగుతుంది.
ఆ సమయంలో వాడిపోయిన ట్లయిన ఆమె మనసులోని నిస్తేజాన్ని కొంచెంకొంచెంగా పారద్రోలుతూ దాని స్థానంలో క్రమక్రమంగా ఉత్తేజాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నింపుతాడు రోలాండ్ కిడ్. ఒక దశాబ్దం క్రితం నరాల రోగంతో పక్షవాతం వచ్చి పోయాడని ఆమె అక్కడకు వచ్చే ముందర విన్న వ్యక్తి అతను. ఎనిమిది, తొమ్మిదవ తరగతుల్లో లెక్కల క్లాసులో సహాధ్యాయుడు. ఆమెకి ఇష్టగాడే గానీ ఎప్పుడూ ఆమె నించీ ఆ ఇష్టం గూర్చి విననివాడు. ఆమెకు ఎదురుగా ఒళ్లో సంచీలో ఆమె రాసిన కొన్ని పుస్తకాలని పెట్టుకుని నరాల వ్యాధివల్ల ఒకపక్కకు వాలిపోతూ వీల్ ఛెయిర్లో కూర్చునివున్నాడు. ఆమె రాసిన అన్ని పుస్తకాలనీ చదివానని చెబుతాడు. తన ఇంట్లో పుస్తకాల అలమారాల్లో ఆ పుస్తకాల నన్నింటినీ భద్రంగా అమర్చానని, అసలు అలా చెయ్యడంకోసమే ఆ పెద్ద ఇంటిని కొన్నాననీ, ఆ అలమారాలు ఇంటి బయటనించీ కూడా కిటికీల్లోంచి కనిపిస్తయ్యనీ చెబుతాడు. ఆమెకు భాగస్వామి లేడని తెలిసినట్లుగా, తనకి పెళ్లి కాలేదనీ, ఆమె గూర్చి అతనికి కలిగిన భావనలు వేరెవరి గూర్చి కలగలే దనీ, ఎన్నోసార్లు ఆమె అంటే తనకెంత ఇష్టమో చెబుతూ ఉత్తరాలు రాద్దామని అనుకున్నా డనీ, ఆమె రచనల్లో తన గూర్చి వెదుక్కున్నా ననీ, వాటిల్లో అక్కడక్కడ తను కనిపించడం తనని మరణం లేని వాడిగా చేసిందనీ, ఆ రచనల్లో తనని ఇంకా వెదుక్కుంటూనే వుంటా డనీ చెప్పి ఆమెని తన ఇంటికి వచ్చి ఒక్క క్షణ మయినా ఆ పుస్తకాల అలమారాలని చూసివెళ్లమని బలవంతంచేస్తాడు.
ఆమె అతను తెచ్చిన 17 పుస్తకాలమీద సంతకం పెడుతున్నప్పుడు తను ఆమెకు కొన్ని ఉత్తరాలని రాశాడనీ వాటిని పబ్లిషర్లకు పంపి ఆమెకు చేర్చమన్నా డనీ, ఆమె నించీ జవాబులు రాకపోవడం వాళ్లు ఆ ఉత్తరాలని ఆమెకు పంపకపోవడంవల్ల నని అనుకున్నాడనీ చెబుతాడు. ఆమెకు పాఠకుల నించీ వచ్చిన ఉత్తరాల సంఖ్య బహుస్వల్పం. ఈ మధ్య కాలంలో వాటి సంఖ్య ఇంకా తగ్గిపోయింది. ఈమెయిల్ లేని కాలంలో వచ్చిన ఉత్తరాలకు ఆమె జవాబిచ్చింది. రోలాండ్ రాసిన ఉత్తరాలకు తప్పక జవాబిచ్చి వుండేది.
ఊళ్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మెయిన్ స్ట్రీట్ లో చిన్నవయసులో తల్లితోనూ, అమ్మమ్మతోనూ కలిసి షాపింగ్‌కు వెళ్లడం ఆమెకు గుర్తొస్తుంది. అప్పటి కొన్ని షాపులు ఇప్పుడు మూసివెయ్యబడ్డాయి. ఇంకా ఏవో కొన్ని చిన్నచిన్న మార్పులు తప్ప పెద్ద మార్పు లేవీ ఆమెకు కానరాలేదు. ఆ ఊళ్లో అడుగుపెడుతున్నప్పుడు ఆ రాత్రి ఉండే ప్రసక్తి లేదని నిర్ణయించుకున్నది. కానీ,
నిన్ను నిన్నుగా ప్రేమించుచును
నీ రచనల నిష్టంగ చదువుచును
నీ గొప్పలను గర్వంగ చెప్పే
తోడొక రుండిన అదే –
అన్న అంశాన్ని గుర్తించిన ఆమె సమయం లేదంటూనే వీల్ ఛెయిర్లో కదులుతున్న రోలాండ్ పట్టుకున్న చేతిని విదిలించుకోకుండా రోడ్డు మీద నడుస్తూ అతని ఇంటికి వెడుతుందా? స్నాతకోత్సవ ప్రసంగం తరువాత చప్పట్ల మధ్యలో Am I home, at last? Is this where I belong? అని ఆమె మదిలో రేగిన ప్రశ్నలకు జవాబులు ఆమెకు దొరుకుతాయా?
ఈ కథలో జాయ్‌స్ కెరోల్ ఓట్స్ ప్రస్తావించిన అంశాలు కొన్నింటిని గూర్చి చెప్పుకోవాలి: 1) ఒక తార నింగికి ఎగిసి అక్కడే వెలిగిపోతూ ఆ వెలుగు ఆ తార జీవితంలో అత్యధిక శాత మయినప్పుడు కూడా తను ఎగసిన ప్రదేశాన్ని దర్శించా లని తపన పడడం, 2) అలా సందర్శించి నప్పుడు పాతకాలం నాటి గుర్తులు ఆ ప్రదేశంతో మాత్రమే గాక మనుషులతో కూడా ముడిపడి వున్నాయని గుర్తించడం, 3) ఆ జ్ఞాపకాలతో ముడిపడిన వ్యక్తులు ఇంకా అక్కడ నివసిస్తున్న ట్లయితే వాళ్లల్లో మార్పు వచ్చివుండడాన్ని అంచనా వెయ్యా లనడం, 4) కనీసం కొంత కాలమయినా ఒక రచన నిలబడడానికి అది నిజజీవితాలకి దగ్గరగా ఉండడం – అంటే అస్తిత్వం – ప్రధాన కారణ మవడం, 5) అస్తిత్వ రచనలో ప్రస్తావించిన పాత్రలకి నిజజీవితంలో మూలా లుండడం కారణం కావచ్చు గానీ ఆ చిత్రణని ఆ నమూనాలు మెచ్చకపోవచ్చు నని గుర్తించడం, 6) రచనలకి పాఠకుల మెప్పుదలని తెలుసుకోవా లని రచయిత్రి అనుకోవడం.
మొదటి అంశం ఇండియాలోని పల్లెటూళ్ల నించే గాక చిన్నచిన్న పట్టణాల నించీ కూడా అమెరికా వచ్చిన వారికి బాగా పరిచయం. డయాస్పోరా సాహిత్యంలో, బ్లాగుల్లో ఆ నోస్టాల్జియా కనిపించడం సర్వసాధారణం. ఆ రచయిత లందరూ కథలోని రచయిత్రి లాగే జీవితంలో కనీసం సగభాగం, లేదా దానికి మించి మూలాలనించీ వేల మైళ్ల దూరప్రయాణం చేసినవాళ్లే. ఆ రచనలకి జవాబుగా నన్నట్లుగా, ఇండియాలో పల్లెటూళ్లు అట్లా కనిపించడం మానేసి చాలా కాల మయింది అన్న వ్యాఖ్యలు కూడా అంత సాధారణంగానూ కనిపిస్తాయి. కథలోని రచయిత్రిలాగే పధ్ధెనిమిదేళ్ల వయసులో ఊరిని వదిలిపెట్టి, ఆ వయసుకి రెట్టింపు వ్యవధి తరువాత ఆ ఊళ్లో తిరిగి అడుగుపెట్టిన అనుభూతి గూర్చి స్వానుభవం ఉన్నది. చదువుకున్న హైస్కూల్ కెళ్లి అక్కడి ప్రధానోపాధ్యాయుణ్ణి కలిసినట్లు ఆ మధ్య కొన్నేళ్లపాటు అప్పుడప్పుడూ కలలు వచ్చేవి. గుంటూరులో కలవాల్సినవాళ్ళు ఎవరూ మిగలకపోవడంవల్ల ఇండియా వెళ్లినప్పుడు అక్కడికి పనిగట్టుకుని వెళ్లడానికి చాలాకాలం కుదరలేదు. ఒకసారి వెళ్లి కలిసివచ్చిన తరువాత ఆ కలలు రాలా. ఆనాటి ఉపాధ్యాయులంతా ఉద్యోగాలనుంచీ విశ్రాంతి తీసుకుని ఉంటారని తెలుసు. మీ బళ్లో చదువుకున్నాను అని ముక్కు, మొహం తెలియని ఈనాటి అక్కడి ఉపాధ్యాయులకి చెబితే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు లేదు. కానీ, ఆ ఆకర్షణకి అర్థాన్ని వెదకడం వ్యర్థ ప్రయత్నమే ననిపిస్తుంది. అదే ఆకర్షణ అమెరికాలోని ఈ ఆంగ్ల కథకి మూల మవడం ఆశ్చర్య మనిపిస్తుంది.
రెండవ అంశం: దాదాపు రెండు దశాభ్దాల వ్యవధి తరువాత మొదటిసారి హైస్కూల్లో తిరిగి అడుగుపెట్టి నప్పుడు ముగ్గురు సహాధ్యాయులతో వెళ్ళడం జరిగింది కానీ, ఊళ్లో తిరిగింది పట్టుమని రెండు గంటలు మాత్రం. పుట్టి పెరిగిన గుంటూరులో ఒక నిద్ర చెయ్యడం పాతికేళ్లకి పైగా తరువాత నా రెండు పుస్తకాల ఆవిష్కరణ కారణంగా 2019 జనవరిలో జరిగింది. చుట్టాలూ, స్నేహితులూ లేకపోవడంవల్ల హోటల్లోనే బస. పరిచయ మున్న రోడ్ల మీద తిరిగినా పరిచయం లేని మనుషుల మధ్య, మారిన భవనాల మధ్య తెలియని ప్రపంచంలో తిరుగుతున్న అనుభూతి. బ్రాడీపేట నాలుగవ లైన్లో నడుస్తుండగా నా పక్కన ఆగిన ఒక కారులోంచి ఒక వ్యక్తి ఒక అడ్డరోడ్డు ఎక్కడున్నదని నన్నడగడం నాకు నవ్వు తెప్పించింది.
మూడవ అంశం గూర్చి స్వానుభవం లేదు గానీ నాలుగవ అంశాని కొస్తే, పేరున్న రచయితల కొన్ని రచనల గూర్చి అవి రచయిత బయోగ్రఫీ అన్న నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా ఒక రచన మాత్రమే చేసినవాళ్ల విషయంలో. ఉదాహరణకి, రాల్ఫ్ ఎల్లిసన్ రాసిన ఇన్విజిబుల్ మేన్ నవల. అలా ఊహించ నవసరం లేకుండా స.వెం. రమేశ్ రాసిన “ప్రళయ కావేరి కథలు,” ఖదీర్ బాబు రాసిన “దర్గామిట్ట కతలు” ఉదాహరణలుగా ఉండనే ఉన్నాయి. అయితే, ఈ తెలుగు రచయిత లిద్దరూ చాలా రచనలే చేశారు.
అయిదవ అంశం: రచయిత్రి తనను అంత గొప్పగా చిత్రించలేదని రోలాండ్ స్వయంగా అంటాడు. అయితే, ఆమె అన్ని రచనలలోనూ తాను అక్కడక్కడా కనబడుతూనే ఉన్నాడని అతని నమ్మకం. ఒక మనిషి బొమ్మని గీయడానికి కావలసింది అయిదు తిన్నని గీతలూ, ఒక వృత్తమూ అని హాంగ్‌మాన్ ఆట ఆడినవా రందరికీ తెలిసినట్లుగానే, తుమ్ము శబ్దాన్ని బట్టీ తెలిసిన మనిషిని గుర్తించినట్లుగానే, తెలిసిన మనిషిని నిర్వచించే గుణమో, స్వభావమో ఏదో అక్షరరూపంలో కనిపించినప్పుడు కదా ఆ మనిషంటూ గుర్తుపట్టేది? రోలాండ్ తనని ఆమె రచనల్లో చూసుకున్నాడంటే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు గుర్తుంచుకున్న మెల్లకన్నుతో బాటు ఆమె తనకు మితంగానే అయినా తెలిసిన అతని గుణగణాలనీ, అభిప్రాయాలనీ, ప్రవర్తననీ, ఆలోచనలనీ కూడా వాటిని అతనికి అది తనేనని తెలిసేటంటగా తన రచనల్లో వేరేవేరే చోట్ల ప్రస్తావించే ఉండాలి. నా రచనల గూర్చి కూడా వాటిల్లో తెలిసినవాళ్ల ప్రస్తావన గూర్చిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఆరవ అంశం: ప్రతి రచయిత్రికీ / రచయితకీ, తన రచనలపై పాఠకుల అభిప్రాయాల మీద ఆసక్తి ఉండడం సహజం. వాళ్లూ సాధారణ మనుషులే గనక పొగడ్తలకు పొంగిపోవడానికీ, విమర్శలకు క్రుంగిపోవడానికీ, రెండింటిలో ఏదీ కనబడ్డప్పుడు నిరాశకు గురికావడానికో మినహాయింపు లేమీ కాదు. స్పందనలల్లో హెచ్చుతక్కువ లుంటా యంతే. కథలోని రచయిత్రి రాసిన ఎన్నో పుస్తకాలు వేల సంఖ్యలో అమ్ముడయినా, ఆమె ఆశించింది ఒక చిన్న మెచ్చుకోలు. అది కూడా, తెలిసినవాళ్లనించీ. అది ఆమెకు చిన్నప్పటినించీ పరిచయమున్నరోలాండ్ వద్ద దొరికింది. అందుకని దాని విలువే వేరు. అందరికీ అది దొరక దనడానికి నిదర్శనంగా చిలకలూరిపేటలో జరిగిన అజో-విభో-కందాళం సంస్థ వారి వార్షికోత్సవంలో నేను విన్న వేంపల్లి షరీఫ్ గారి ఒక ప్రసంగాన్ని చెప్పుకోవచ్చు. ఆయన కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత. తన బంధువుల్లో ఎవరికీ తెలుగు చదవడం రాకపోవడంవల్ల తన రచనలని వాళ్లల్లో ఎవరూ చదవలేకపోవడంపట్ల తన నిరాశని ఆయన ప్రస్తావించినప్పుడు రచయితలకి ఆప్తుల నించీ ఆశించే అలాంటి మెచ్చుకోళ్ళ ప్రాముఖ్యత అర్థ మయింది.
ముందు చెప్పినట్లుగా ఈ కథ కొన్ని ప్రశ్నలని రేకెత్తించక పోదు.
మొదటిది, ఆమె రచయిత్రి కాక పేరుమోసిన సైంటిస్టో, స్పోర్ట్స్‌వుమనో, చిత్రకారిణో అయివుంటే ఆమెకు ఇదే రకమయిన స్పందన ఎదురయ్యేదా? కాదని తేలిగ్గా చెప్పగలగడానికి కారణం, ఆయా రంగాల్లో ఉన్నవాళ్లకి తమ చిన్నప్పటి ఊళ్లో మిగిలినవాళ్లని చిత్రించే అవకాశం ఉండదు. కానీ, ఆ తేడావల్ల వాళ్లు అంటీఅంటనట్లుగా ప్రవర్తించే అవకాశం మాత్రం మెండు.
రెండవది, ఈ అనుభవం ఈ కథలోని రచయిత్రిది మాత్రమేనా మిగిలినవాళ్లకి కూడా ఎదురవుతుంటుందా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కొంచెం కష్టం. కీర్తిశేషు లయిన రచయితలని గూర్చి ఇటు అమెరికాలోనూ అటు యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ వాళ్ల స్వంత ఊళ్లల్లో ఈనాటికీ గర్వంగా చెప్పుకుంటూనే ఉంటారు. (ఇండియాలో దాదాపు ఎవరి గూర్చీ పట్టించుకోరని వినికిడి.) వాళ్లు జీవించివున్న కాలంలో కూడా వారికి గౌరవం లభించేవుంటుంది అనుకోవడానికి గల కారణం ఆ కాలంలో అక్షరాస్యత తక్కువవడం వల్ల చదువుకున్నవాళ్లని సాధారణంగా గౌరవించడం అలవాటు గనుక. బ్రతికున్న ఆంగ్ల రచయితలతో పరిచయం లేదు గనుక ఈనాటి పరిస్థితి తెలియదు.
మూడవది, ఇది పూర్తిగా కేవలం కల్పనేనా? లేక, దీనిలో అస్తిత్వం పాత్ర ఎక్కువగా ఉండడంవల్ల కథలోని రచయిత్రి లాగానే జాయ్‌స్ కెరోల్ ఓట్స్ ఒంటరిగానే మిగిలిపోయారా? జాయ్‌స్ కెరోల్ ఓట్స్ భర్త రేమండ్ జె. స్మిత్. నలభయ్యేడేళ్ల దాంపత్యం వాళ్లది. “రవి గాంచనిచో కవి గాంచున్” అన్న నానుడి ఇక్కడ జాయ్‌స్ కెరోల్ ఓట్స్ కు తప్పకుండా వర్తిస్తుంది.
నాలుగవది, ఇల్లలుకుతూ ఈగ తన పేరు మరచిపోయిన రీతిగా రచనా వ్యాసంగమే జీవితంగా గడిపే రచయిత్రులు / రచయితలు ఏమయినా కోల్పోయా మని భావిస్తారా? ఇది ఒక్క సాహిత్యానికి మాత్రమే పరిమిత మయిన ప్రశ్న కాదు. ఏ రంగంలో నయినా గానీ, ఉన్నత శిఖరాలని చేరినవాళ్లకి ఒంటరిగా మిగిలిపోయే అవకాశం ఎక్కువే గానీ వాళ్లు తాము ఏదయినా కోల్పోయామని అనుకునే మనఃస్థితి కలిగే అవకాశం ఉన్నదా? ఉదాహరణకి, మెడికల్ ప్రొఫెషన్ కి ఆమడ దూరంలో ఉండే ఒక రచయిత , రోజులో ఇరవై గంటలపాటు శ్రమించే డాక్టర్లు ఆ పని డబ్బుకోసమే చేస్తున్నారు గానీ తృప్తికోసం లేదా అలా చెయ్యడాన్ని సేవాధర్మంగా భావిస్తూ అని గానీ చెయ్యట్లేదు అంటూ ఒక పాత్రని చిత్రిస్తే, అరవయ్యేళ్ల వయసులో ఆ పాత్ర అలా పనిచెయ్యడం వల్లనే కుటుంబ సభ్యులని దూరం చేసుకున్నాను అంటూ వగస్తే అది వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఎంత? ఈ కథలో ముఖ్యపాత్ర రచయిత్రిది. రాసింది ఒక రచయిత్రి. అందుకని అస్తిత్వ పరకాయ ప్రవేశానికి అవకాశం చాలా ఎక్కువ కావడం వల్ల ఈ కథావస్తువుని ఆమోదించడానికి అవకాశం కూడా ఎక్కువేనని స్వాభిప్రాయం.
చివరగా:
- Yewville అన్నది న్యూ యార్క్ రాష్ట్రంలోని ఒక ఊరు కాదు. అది రచయిత్రి కల్పితం. ఆమె ఇంతకు ముందు రచనల్లో కూడా కనిపిస్తుంది. పలికేటప్పుడు “యూ విల్” (You will) అన్న హోమోఫోన్‌ని గుర్తుచేస్తుంది.
- రచయిత్రికి పుంఖానుపుంఖాన్లుగా ఇచ్చే గౌరవ డాక్టరేట్ పురస్కారాల మీద ఏమాత్రం గౌరవం లేదన్నది కథలో ఒక కమ్యూనిటీ కాలేజీ (ఇవి యూనివర్సిటీల కన్నా ఒక స్థాయి క్రిందవి) ఇచ్చిన “డాక్టర్ ఆఫ్ హ్యుమేన్ లెటర్స్” పట్టా ద్వారా వెల్లడవుతుంది.
గాఢత అధిక మోతాదులో కలిగి బాగా ఆలోచింపజేసే కథ. రచయిత్రికి అభివందనాలు!
రచయిత్రి పరిచయం:
జాయ్‌స్ కెరోల్ ఓట్స్ ప్రసిద్ధ అమెరికన్ రచయిత్రి. ఎన్నో కథాసంపుటాలూ, నాటకాలూ, 58 నవలలూ, వ్యాసాలూ వెలువరించారు. కుటుంబలో హైస్కూల్ పూర్తిచేసిన మొదటి వ్యక్తి ఆమె. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ముఫ్ఫయ్యారేళ్ళు అధ్యాపకులుగా గడిపారు. కొన్నేళ్లుగా నోబెల్ సాహిత్య బహుమతి ఆమెని వరిస్తుందని ప్రతి ఏడాదీ అనుకుంటూనే ఉన్నారు.
*
Add comment