మనిద్దరి కథ

ఒక్కోసారి  బాగా తెలిసిన కథలో తెలీకుండానే మనమే పాత్రలం అయిపోతాం. లాంతరు నీడలో మసల్తూ చీకట్లో ఉన్నాం అనుకుంటాం.

ఒక్కో కథ ఒక్కోచోట మొదలవడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. తలుపుకి చెరొక వైపు నిలబడి మొదటిసారి మనం ఎదురుపడ్డప్పుడు ఎక్కడా ఏ కదలికా లేకపోయి ఉండొచ్చు. ఏమో! ఎక్కడో పచ్చటి పొలాల్లో ఒక గడ్డిపరక పక్కకి వంగి మట్టివాసనతో మనగురించి ఒకమాట చెప్పి ఉండొచ్చు. ఆ సాయంత్రం ఒక్క నిమిషం ఆలస్యంగా చీకటిపడి ఉండొచ్చు. ఎందుకో తెలీకుండానే నీకో నాకో ఒకమాట తడబడి ఆ తప్పు పలికిన పదం ఇప్పటికీ గుర్తుండి ఉండొచ్చు.

తలుపుకవతల నిర్లిప్తంగా నువ్వు. “ఎవరు కావాలి?” అని అడుగుతూ నా కొత్తరెక్కలు సరిచూసుకుంటూ, కొత్తకలల్ని కాటుకలా దిద్దుకుంటూ నేను. “ఏం లేదు. ఇక్కడ లేదు” అని గొణుక్కుంటూ వెళ్ళిపోయావు నువ్వు.

**

నువ్వు నాకు బాగా తెలుసో తెలీదో తెలిసేది కాదు. కానీ ఎవరికీ అర్థం కావని నేను వాడటం మానేసిన పదాలు కొన్ని నీదగ్గర వినపడేవి. నువ్వు చదువుకునే పుస్తకాల్లో అచ్చం నేను రాసుకునే వాక్యాల్లాంటివే ఉండేవి. నేను నవ్వుతూ కలువపూల గురించి చెప్పేటప్పుడు  గతాన్ని నింపుకున్న కళ్లతో నావైపు చూసేవాడివి. పాతకవిత్వపు డైరీలు చించి పిల్లలకి కాగితం పడవలు చేసిపెట్టే నిబ్బరంతో నామాటలు వినేవాడివి.

**

చంద్రుడి కళలు చాలాసార్లు మారాయి. కలువపూలు చెరువులో ఈదుకుంటూ చాలాదూరం వెళ్ళిపోయాయి.  రెక్కలు మడిచి లోపల దాచిపెట్టిన సంచి భుజానికి తగిలించుకుని కాలినడకన వెళ్తూ ఏవేవో చెట్లకింద ఆగడం అలవాటైంది. కాటుక భరిణె మూత పెడుతూ తెరుస్తూ కాలం గడిచిపోయేది. ఎక్కడికి వెళ్ళినా నీనుంచి కొన్ని పలకరింపులు, పరామర్శలు మాత్రం గూళ్లకిచేరే పక్షుల్లా వేళకి వచ్చి వాలేవి.

“అమ్మాయీ… వాల్డెన్ ని వెతుక్కుంటూ హెన్రీ ధోరో  వెళ్లినట్టు నాకూ వెళ్లాలనుంది. నువ్ మాత్రం నగరాన్ని తేలిగ్గా వదిలేసి వూళ్లలో అడవుల్లో తిరగడానికి అలవాటు పడిపోయావ్. కానీ, నువ్ లేని నగరం నాకు బోసిగానే ఉంది. మీరా భజన్లు వినేటప్పుడు నువ్వు గుర్తొస్తావు. ఆ పాటలు వింటూ నువ్వెవర్నో గుర్తు చేసుకోవడం గుర్తొస్తుంది.”

జవాబుగా నీకు కొన్ని మౌనాలు, కొన్ని కన్నీళ్ళు పంపేదాన్ని. కొన్నాళ్ళకి మొహమాటం తెగ్గొట్టి ఒక ప్రశ్నని పంపాను.  “అప్పట్లో నా ఇంటితలుపు కొట్టినప్పుడు ఏదో వెతికేవాడివి కదా, దొరికిందా? అసలింతకీ నీ కథేంటి?”

“ఇప్పుడు నవ్వున్నావు చూడు. నేను ఎప్పట్నుంచో అలానే ఉన్నాను. నెలలు, తారీఖులు తెలీకుండా వదిలెళ్ళిపోయిన ఆమెకోసం  అలమటిస్తూ  ఉండేవాణ్ణి.కోలుకోవాలని ఉండేది కాదు. ఇప్పుడు బయట పడ్డాను కానీ ఇంకా బ్రతుకులో పడలేదు.”

నువ్వెప్పుడూ అదే కథ చెప్పేవాడివి, గతాన్ని తింటూ జ్ఞాపకాల్లో నిద్రపోతున్న మనిషి లాగా.

**

ఎన్ని దిక్కుల్లో తిరిగినా నాకు దిగులే ఎదురయ్యేది. ఎన్ని రుతువులు మారినా కళ్లలో నీటిపూలే పూసేవి. అందర్లాగా నువ్వు ఈ దుఃఖం అనవసరం అనలేదు. mere emotions అని నవ్వలేదు. “నొప్పి నిజంగా లేదు, నీ మెలాంకలిక్ టెంపర్మెంట్ వల్ల సృష్టించుకుంటున్నావ్” అని తీసిపడెయ్యలేదు.

మళ్ళీ మళ్ళీ ఒకేమాటే అడిగేదాన్ని; “ఎట్లా బతకను?”

ప్రతిసారీ ఒకేలా సముదాయించేవాడివి ఈ మాటలు చెప్పి;

“రోజుకి కొద్దిగా నవ్వుతూ బతుకుదాం. తెలీక రాంగ్ అడ్రస్ లో దిగిపోయాం. ఇక్కడ మనవూరి వాళ్ళెవరూ లేరు. చెయ్యి పట్టుకో, ఈసారి జాగ్రత్తగా నడుద్దాం. ఇంత గాయపడతామని తెలీకనే అట్లా తాకి వెళ్ళిపోతారు మనుషులు. ఎవర్నీ ఏమనకు. పేదది జీవితం. ప్రేమకోసం వేధించకు దాన్ని. బిడ్డకు అన్నంపెట్టలేని తల్లిలా ఏడుస్తుంది. జాలిపడి వదిలేద్దాం.”

ఒక్కోసారి  బాగా తెలిసిన కథలో తెలీకుండానే మనమే పాత్రలం అయిపోతాం. లాంతరు నీడలో మసల్తూ చీకట్లో ఉన్నాం అనుకుంటాం.

**

ఒక్కో కథ ఒక్కోచోట మలుపు తిరగడం ఊహాతీతం కాకపోవచ్చు. ఆ మలుపు తిరిగిన క్షణాల గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తావు;

“ప్రేమించి, దుఃఖించి, శుష్కించిన జీర్ణ హృదయంతో నా దగ్గరకొచ్చావు ఒక వానాకాలపు ఉదయం. ఎందుకొచ్చావో తెలీలేదు. ఇన్నాళ్ళుగా తెలిసిన మనిషివే, ఎన్నోసార్లు పరిష్కరించలేక చూస్తూ ఊరుకున్న వేదనే. గుక్కపట్టి ఏడ్చే పసిపిల్లని ఊరుకోబెట్టినట్టు ముద్దుపెట్టాను.”

**

ఆరోజు అక్కడ కురవకుండా ఆగిపోయిన వానమబ్బొకటి  ఆ తర్వాతి కథ చెప్పింది;

“ఏడుపాగిపోయింది. సగం కళ్ళు తెరిచి విషాదం అంచునుంచి లేచి ఆమె పక్కున నవ్వింది. రెండు శిశిరాలు కలిసి ఒక పూలతోటగా విచ్చుకున్నాయని పైకెగిరిన పిట్టలు చెప్పుకుంటే విన్నాను.”

**

 

 

 

Swathi Kumari

నా పేరు స్వాతి, రిషివాలీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. మనుషులంటే ఆసక్తి. మనుషుల ఆలోచనలు, మాటతీరు, రకరకాల వ్యక్తిత్వాలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. వాటిని గమనించడం ఒక వ్యాపకం. చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనించడం, పదాల్లో పెట్టడం ఒక ఇష్టమైన ఆట. అరుదుగానే రాసినా కథలు రాయడం వెనకున్న కారణాలు ఇవే. రాసే వాక్యం చదవడానికి అందంగా ఉండాలనేది ఒక పట్టుదల. కథ చెప్పే పద్ధతి రొటీన్ గా ఉండకూడదని ప్రయత్నం.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండు శిశిరాలు కలిసి ఒక పూలతోటగా విచ్చుకున్నాయి… beautiful expression.

  • పేదది జీవితం. ప్రేమకోసం వేధించకు దాన్ని. బిడ్డకు అన్నంపెట్టలేని తల్లిలా ఏడుస్తుంది. జాలిపడి వదిలేద్దాం.

    నచ్చేసింది. చాలా బాగా… సారంగకు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు