మనసు వంతెన కట్టిన ఆచార్య ఆత్రేయ

మే ఏడు ఆత్రేయ శత జయంతి

రళత, క్లుప్తత, ఆర్ద్రత, భావ పరిధి,  మాటైన, పాటైన సామాన్యుని కూడా చేరే రీతిన రాసినవాడు ఆత్రేయే అని విజ్ఞుల అభిప్రాయం. గత సంవత్సరం మే 7వ తేదీన ఆత్రేయ శతజయంతి సంద ర్భంగా ఎందరో అభిమానులు తమ తమ నివాళులు పత్రికలలో, సాంఘిక మాధ్యమాలలో అందించారు. శతజయంతి ముగింపుగా ఆయనకు నివాళిగా, మీ అందరి ఆశీస్సులతో,  అందిస్తున్న చిన్న  వ్యాసం.  ఆత్రేయ మనకి దూరమై 33 సంవత్సరాలు కావస్తుంది. అయినా ప్రపంచ వ్యాప్తంగా అనేక తెలుగువారి గుండెల్లో నినదిస్తూనే ఉన్నాడు. ఆత్రేయ వివరాలలోకి వెళ్ళేముందు, ఆయన మరణవార్త విని, కలతచెంది, సెప్టెంబర్-1989 లో నేను రాసిన నివాళితో ప్రారంభిస్తాను.

ఆధునిక ఆంధ్ర నాటకానికి ఆద్యుడుగా, సినీ సాహిత్య సామ్రాజ్యానికి సార్వభౌముడుగా;

అంతకంటే తనలాటి మనుష్యుల సమస్యలను, బాధలను గుండెలు పిండేలా నినదించి, విశ్లేషించి;

మనిషి మనిషిగ బ్రతకటానికి ముందు ‘మనస్సు ‘ ప్రతి మనిషికి ఉండాలని చెప్పి చెప్పి;

మనలను విషాద సాగరంలో ముంచివేసి, జగవద్విలీనం అయిన మహాకవి ఆత్రేయకు సజల నయనాలతో అంజలి ఘటిస్తూ ఈ చిరు నివాళి:

మనసుని.. మనిషిని

నిలదీసి.. నిలదీసి

అనుభవాలకు.. ఆవేదనకు

అక్షర రూపమిచ్చి –

ఆ భావన నాదే

ఆ అనుభవం నాదే ..

ఆ ఆక్రోశం నాదే

ఆ పారే కన్నీరు నాదే ..

 

అనిపించి .. అనిపించి

ఎద తలుపులు బద్దలు కొట్టి

ఎద లోతులు తట్టి తట్టి చూపి

నిక్కచ్చిగా జనావళికి –

సూటిగా .. ధాటిగా

తెలియచెప్పి –

జీవన సరళిని చూసేలా

మనో నేత్రాలు తెరిపించి ..

ఈ కష్టాలకు ..  ఈ కన్నీళ్ళకు

నీవే.. నీవే.. నేనే.. నేనే ..

మూలమనే .. కారణమనే

చారిత్రిక సత్యాన్ని వెలికి దీసి –

మనస్సుతో .. శాంతితో

మానవ జాతి ఆక్రందనకు

చరమ గీతం  పాడమని

అర్ధించి .. ప్రార్ధించి –

పోయినోళ్ళు అందరూ

మంచోళ్ళు అంటూ –

మంచోళ్ళతో కలసిపోయి

మాటలకందని ఎత్తు కెగిసిన –

మనసుల రవి, కవి, ఆత్మశాంతికి — ఇదే నా శ్రద్దాంజలి.

ఆచార్య ఆత్రేయ రాసినవి కొన్ని పాటలే (1679; 483 చిత్రాలు) ఆయినా, మనుషుల మనసులలోని చప్పుళ్లను తడిమి తడిమి చూసి, ఆ భావాలు అల్ప పదాలలో పలికించాడు. తన పదునైన సంభాషణలతో సినిమాలను విజయవంతం చేశాడు. సత్యానంద్ పైడిపల్లి మరియు పరుచూరి బ్రదర్స్ గార్ల తరువాత 153 చిత్రాలకు సంభాషణలు అందించాడు. (రాజశ్రీ డబ్బింగ్ రచయితను మినహాయిస్తే).

1951 లో కె యస్ ప్రకాశరావు దీక్ష చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసి, అర్థాంగి, జయభేరి, తోడికోడళ్ళు, వెలుగు నీడలు, మాంగల్య బలం, మూగమనసులు, డాక్టరు చక్రవర్తి, పెళ్లికానుక, శ్రీ వేంకటేశ్వర మహత్యము, మంచి మనసులు, అంతులేని కథ, ప్రేమనగర్ … ఇలా ఒకటేమిటి, రాసిన ప్రతి మాట, పాట లోను వైవిధ్యమే!

పాటలే కాదు, అంతకు ముందు, ఎన్నో నాటకాలు, నాటికలు (ఎన్‌జి‌ఓ, గౌతమ బుద్ధ, సమ్రాట్ అశోక, భయం, విశ్వశాంతి మొదలైనవి) రచించి, ఆధునిక తెలుగు నాటకాన్ని ఒక మలుపు తిప్పినవాడు ఆత్రేయని, చాలా మందికి తెలియదు. తెలుగులో వచ్చిన అత్యుత్తమ నాటకాలలో, భయం, లాంటి మరొక ఆణిముత్యము ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

తను వేదనకు గురియై, పాటలు రాయక నిర్మాతలను ఏడిపిస్తాడని నిందలు వేసినా, చివరకు జనాలను తన పాటలతో ఏడిపించాడు. మానవ చరిత నుండి, నేటికి కూడా మనిషిని వెంటాడిన, వెంటాడా బోయే ప్రశ్న, దేవుడు ఉన్నాడా అని?

దానికి ప్రతి సమాధానం ఇచ్చింది ఒక్క ఆత్రేయే:

‘దేవుడనే వాడు ఉన్నాడా అని మనిషికి కలిగెను సందేహం –

మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం’.

ఆత్రేయ నెల్లూరు జిల్లా, సూళ్ళూరు పేట తాలూకా, మంగళంపాడు గ్రామంలో సీతమ్మ కృష్ణమాచార్యులు దంపతులకు, మే 7వ తేదీ 1921 లో జన్మించారు. అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. తన పేరులోని ఆచార్య, తన గోత్రంలో ఆత్రేయ ను కలిపి ఆచార్య ఆత్రేయగా తన కలంపేరు పెట్టుకున్నారు. ప్రాధమిక విధ్య స్వగ్రామం ఉచ్చూరు లో జరిగిన, చిన్న తనంలోనే తల్లిని పోగుట్టుకున్న ఆత్రేయ తదుపరి చదువులు మేనమామ ఇంట్లో కొనసాగాయి. చిత్తూరులో SSLC వరకూ, Intermediate రాయ వెల్లూరులోని ఊరీస్ కళాశాలలో జరుగగా, ఉపాధ్యాయ శిక్షణ మరల చిత్తూరులో కొనసాగించారు. 1940 లో శ్రీమతి పద్మావతి గారితో వివాహం జరిగింది.

1940 దశకంలో Quit India, స్వాత్వంత్ర ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1995 లో కమ్యూనిస్టు పార్టీ కోసం ప్రచార ప్రదర్శనలు ఇచ్చారు. ఏ వృత్తిలోను సరిగా ఇమడని ఆత్రేయ, నెల్లూరు మున్సిఫ్ కోర్టులోను, తిరుత్తణి సెటిల్మెంట్ కార్యాలయంలోను గుమాస్తా గా పనిచేశారు. ‘జమీన్ రైతు’ పత్రికలో సహాయ సంపాదకునిగాను, ఆంధ్ర నాటక కళా పరిషత్తులో వేతన కార్యదర్శి గాను పని చేశారు.

అనేకానేక నాటికలు నాటకాలు రచించి, నటించి, దర్శకత్వ, ప్రయోక్త గాను కూడా వ్యవహరించి అనేకానేక ప్రదర్శనలు ఇచ్చి, ఆధునిక తెలుగు నాటకానికి ఆద్యుడు అయ్యారు. ఆ ప్రస్థానంలో ఎన్నో బహుమతులు, అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. శాంతి, డాక్టర్ కొట్నిస్, సాధన నాటకాలు-  ఉత్త  అనుమానం, తహతతై, పిచ్చాసుపత్రి, బెంగాల్ కరువు, నిజం ఎవరికెరుక, బలిదానం, అమరత్వానికి ఆహ్వానం లాంటీ అనేక నాటికలు నేడు అలభ్యం. ఆత్రేయ సాహితీ సంకలనంలో పొందుపరచినవి 10 నాటకాలు, 15 నాటికలు.

ఆత్రేయ నాటకాలు: 10

అశోక సామ్రాట్             ఈనాడు                               కప్పలు                                గౌతమబుద్ధ                NGO

పరివర్తన                              భయం                       వాస్తవం                                విశ్వశాంతి                  మనసు-వయసు

 

ఆత్రేయ నాటికలు: 15

అశ్వఘోషుడు             ఆత్మార్పణ                  ఎవరు దొంగ                ఒక్క రూపాయి                   ఓటు నీకే

అంతర్యుద్ధం                అంత్యార్పణ                 కళ కోసం                   కావాలావాని దీపం        చస్తే ఏం?

చావకూడదు               తెరిచిన కళ్ళు              ప్రగతి                        మాయ                      వరప్రసాదం

ఆరోజుల్లో నాటక పరషత్తులలో ఆత్రేయ నాటకాలు, నాటికలు విశేష ఆదరణ పొంది, అనేక బహుమతులు అందుకొనేవి. ఆచార్య మొదలి నాగభూషణం లాంటి వారు ఆత్రేయను ‘ఆంధ్ర ఇబ్సెన్’ అని అభివర్ణయించారు.  ఎన్.ఆర్. నంది ఈనాటికీ విలక్షణమైన తన నాటకం ‘మరో మొహెంజొదారో’ను ఆచార్య ఆత్రేయ కు అంకితమిచ్చారు. డా. సి నారాయణరెడ్డి గారు ఏమంటారు అంటే: “ఆత్రేయ అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగకర్త. ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడికోట, పాటల ముత్యాల పేట.” ఆత్రేయ ఈ లోకాన్ని విడిచి వెళ్ళే కొద్ది నెలలముందు, తాను వైస్ ఛాన్సలర్ గా తెలుగు యూనివర్సిటీ తరపున డా. నారాయణరెడ్డి గారు ఒక గొప్ప పని చేశారు. ఆత్రేయ సాహితీ సేవకు గుర్తింపుగా, ‘కళప్రపూర్ణ’ అంటే ‘గౌరవ డాక్టరేట్’ ఇచ్చి ఘనంగా తనతోటి కవిని గౌరవించారు.

తన మృదు మధుర భావనలతో, అల్ప పదాలలో అనల్ప అర్ధాన్ని ఇమిడ్చిన మహాకవి ఆత్రేయ 1989 సెప్టెంబరు 13 వ తేదీ బుధవారం రాత్రి 10 గంటలకు మద్రాసులో తన భౌతిక జీవన యానాన్ని ముగించి, మంచోళ్ళ సన్నిధికి చేరుకున్నారు.

ఆత్రేయ ఒకచోట అంటాడు: “మనిషి పుట్టిన క్షణం నుండి చావడం మొదలు పెడతాడు. ప్రతి క్షణం ఎంతో కొంత చస్తూంటాడు. సాధారణంగా ఈ చావడం ఆగిపోవడాన్నే మనం చావంటాం. కానీ, అప్పటి నుండే మనిషి  బ్రతకటం మొదలు పెడతాడు.”

ఆత్రేయ – సినిమా పాట విశిష్టత

సినిమా పాట సాహిత్యమా? అనే మీమాంస ఎప్పుడూ ఉంది. పాటకు సినీజగత్తులో పట్టాభిషేకం చేయించిన ‘అపర శ్రీనాధుడు’ ఆత్రేయ అని అభివర్ణిస్తారు. మరి పాట ప్రత్యేకత ఏమిటి?

సంగీతం రాగానుభవాన్ని ఇస్తుంది, సాహిత్యం శబ్దానుభవాన్ని ఇస్తుంది.

సంగీతాన్ని, సాహిత్యాన్ని సమ పాళ్ళతో సృష్టించిన పాట –

రాగానుభవాన్ని, శబ్దానుభవాన్ని దాటి మనకు రసానుభవాన్ని ఇస్తుంది.

మనకు తెలియకుండానే మనం పాటకు ముందడుగు వేస్తాం- అందుచేతనే!

ఒక అద్భుతమైన, అజరామరమైన పాట పలకాలంటే- “భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి” అంటాడు ఆత్రేయ. ఆవేశం ఉప్పొంగి హృదిలోని అనుస్వరాలను, ఒక పాటగా చిత్రించే కవి అనే కళాకారుడి సృష్టికి, ఆ భావాలను స్వరాలలో కూర్చే సంగీత మేస్త్రి కల్పన జోడై, ఆ భావాలకి, స్వరకల్పనకి, జీవంపోసే గాయకుల గళ విన్యాసం నర్తిస్తే- వినేవారికి ఆనందానుభూతి కలిగించే పాటలు, ఎదలు పులకింప చేయనది ఎవరికి? ఆ ఆనందానుభూతిని సృజించిన కవి, సంగీత దర్శకుడు మరియు గాయకులను- “పాటకు త్రిమూర్తులు” ‘triumvirate of song’ గా అభివర్ణిస్తాను.

తమ జీవితాన్ని కాచి, వడపోచి, మంచిని చెపుతూ- మనకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచి, నిరాశలో వెన్నుతట్టి, జీవన సమరంలో మార్గాన్ని చూపుతూ, స్పూర్తి నిచ్చి, మార్గాన్ని చూపిన- ఆత్రేయ, శ్రీశ్రీ, మల్లాది, సముద్రాల, పింగళి, ఆరుద్ర ఇత్యాది మహామహులు ఎందరో ఉన్నారు. ఆ మేటి సాహిత్యానికి ధీటిగా స్వరకల్పన చేసిన సాలూరి, పెండ్యాల, మహదేవన్ లాటి వారి దిశా నిర్దేశంలో తమ అద్భుత గానం ద్వారా నటించిన- ఘంటసాల, సుశీల, జానకి, బాలు లాంటి గాయకులు తెలుగు సినిమాను, పాటను సుసంపన్నం చేశారు.

“భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను, తెమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడంలోనూ ఈ ఆచార్యుడు (ఆత్రేయ) తిక్కనకు వారసుడు.” – వేటూరి

ఆత్రేయ సినీ పాటల గణాంక విశ్లేషణ

1932 నుండి 2000 వ సంవత్సరం వరకు తెలుగులో విడుదలైన 5,203 చిత్రాలు, అందులోని 31,257 పాటలను ఒక విస్తృత కోశంగా మలచిన తొలి వ్యక్తి, సిడ్నీ వాస్తవ్యులు డా. ఊటుకూరి సత్యనారాయణ గారు. ఆయన తన దశాబ్దాల కృషిలో అందించిన గణాంకాలు ఆధారంగా ఆత్రేయ సినీ సాహిత్యానికి అందించిన సంపద గురించి తెలుసుకుందాం. ఈ తెలుగు సినీ గేయ ప్రస్థానంలో 587 రచయితలు, 427 సంగీత దర్శకుల సారధ్యంలో 1,165 గాయకుల గళ విన్యాసం మనలను అలరించింది. ఇంతవరకు ఏ సినిమా కవి గురించి లోతైన, నిజ నిర్ధారణ చేసిన, పటిష్టమైన గణాంకాలు ప్రచురించబడలేదు. డా. ఊటుకూరి గారి పుస్తకాలు, మరియు Interactive Databook ల సహకారంతో విస్తృతమైన పట్టికలు నిర్మించడం జరిగింది. ఇటువంటి ప్రయత్నం మిగతా కవులు గురించి చేయాలని డా. ఊటుకూరి గారి మరియు నా తపన.

రాసిన ప్రతి పాట హిట్ కావడంతో ఆత్రేయ రాసిన పాటలు వేలాల్లో ఉంటాయని అనుకుంటాం. 1951 దీక్ష సినిమాతో ప్రారంభించి తన నాలుగు దశాబ్దాల ఆత్రేయ శకంలో 483 చిత్రాలకు 1,679 పాటలను అందించాడు. నిజానికి ఆత్రేయ వేటూరి ధీటిగా వెలుగుతున్న తరుణంలోనే అత్యధిక పాటలను అందించాడు. ఆత్రేయ 57 సంగీత దర్శకులతో పనిచేశాడు. అందు ముందు ఉండే పదిమంది వివరాలు పట్టిక-1 లో పొందు పరిచాను. అలాగే పట్టిక-2 సినీ దర్శకులతో, పట్టిక-3 గాయకులతో, పట్టిక-4 నిర్మాతలతో అనిబంధాన్ని తెలియచేస్తుంది. అలాగే పట్టికలు 5-7 ఆత్రేయ సినిమా సంభాషణల గణాంక వివరాలు, దర్శకుల, నిర్మాతల, నటులతో అనుబంధాన్ని తెలియచేస్తుంది. ఈ వివరాలను మరింత లోతుగా పరశీలించవలసిన అవకాశం ఉంది. కానీ, స్థలాభావం వలన, దానిపై మరొక వ్యాసాన్ని త్వరలో అందించే ప్రయత్నం చేస్తాను.

పట్టిక-1:  సంగీత దర్శకులతో ఆత్రేయ అనుబంధం 

ఆత్రేయ మొత్తం పాటలు/ సినిమాలు 1,679 483
స్థానం సంగీత దర్శకుడు (స. ద.) ఆత్రేయ పాటలు ఆత్రేయ % స్వరం కూర్చినవి స. ద. %
1 కె,వి. మహదేవన్ 572 34.1 2,133 26.8
2 చక్రవర్తి 207 12.3 2,750 7.5
3 సత్యం 134 8.0 1,701 7.9
4 యం. స్. విశ్వనాధం 128 7.6 750 17.1
5 ఇళయరాజా 110 6.6 1,646 6.7
6 జె. వి. రాఘవులు 83 4.9 668 12.4
7 పెండ్యాల నాగేశ్వరరావు 73 4.3 956 7.6
8 యస్. రాజేశ్వరరావు 45 2.7 1,347 3.3
9 జి. కె. వెంకటేష్ 28 1.7 200 14.0
10 జి. రామనాధం 27 1.6 167 16.2
  1,407 84 12,318  

 

పట్టిక-2:  సినీ దర్శకులతో ఆత్రేయ అనుబంధం 

స్థానం సినీ దర్శకుడు (సి. ద.) ఆత్రేయ సినిమాలు ఆత్రేయ % దర్శకత్వం చేసినవి సి. ద. %
1 వి. మధుసూధనరావు 35 7.2 65 53.8
2 పి. చంద్రశేఖర్ రెడ్డి 25 5.2 64 39.1
3 కె. బాపయ్య 16 3.3 25 64.0
4 కె. రాఘవేంద్రరావు 15 3.1 81 18.5
5 కె. యస్. ప్రకాశరావు 15 3.1 30 50.0
6 ఆదుర్తి సుబ్బారావు 14 2.9 27 51.9
7 కె. బాలచందర్ 13 2.7 34 38.2
8 రేలంగి నరసింహారావు 13 2.7 63 20.6
9 దాసరి నారాయణరావు 12 2.5 112 10.7
10 విజయనిర్మల 12 2.5 38 31.6
11 బోయిన సుబ్బారావు 10 2.1 27 37.0
12 పి. పుల్లయ్య 10 2.1 24 41.7
13 వి. బి. రాజేంద్రప్రసాద్ 10 2.1 13 76.9
  200 41.4 603  

 

పట్టిక-3:  గాయకులతో ఆత్రేయ అనుబంధం 

స్థానం గాయకులు (గా) ఆత్రేయ పాటలు ఆత్రేయ % గా.  మొత్తం పాడినవి గాయకులు %
1 పి. సుశీల 812 48.4 6,701 12.1
2 యస్. పి. బాలసుబ్రహ్మణ్యం 741 44.1 9,254 8.0
3 ఘంటసాల 187 11.1 2,477 7.5
4 జానకి 180 10.7 2,741 6.6
5 రామకృష్ణ 50 3.0 392 12.8
6 యస్. పి. శైలజ 41 2.4 836 4.9
7 యల్. ఆర్. ఈశ్వరి 36 2.1 704 5.1
8 వాణి జయరాం 29 1.7 398 7.3
9 పి. బి. శ్రీనివాస్ 28 1.7 659 4.2
10 జేసుదాస్ 27 1.6 296 9.1
[డబుల్ కౌంట్] 2,131 126.9 24,458  

 

పట్టిక-4:  సినీ నిర్మాతలతో ఆత్రేయ అనుబంధం  (పాటలు రాసిన మొత్తం చిత్రాలు: 483)

స్థానం నిర్మాత (ని) ఆత్రేయ సినిమాలు ఆత్రేయ % ని. నిర్మించినవి నిర్మాత %
1 డి. రామానాయుడు 17 3.5 52 32.7
2 వి. బి. రాజేంద్రప్రసాద్ 12 2.5 17 70.6
3 వి. వేంకటేశ్వరులు 8 1.7 9 88.9
4 ఏ. వి. సుబ్బారావు 7 1.4 22 31.8
5 కె.  మురారి & నరసింహులునాయుడు 7 1.4 9 77.8
6 యం. మోహన్ బాబు 6 1.2 22 27.3
7 దుక్కిపాటి మధుసూధనరావు 5 1.0 18 27.8
8 యం. ఆర్. అనూరాధాదేవి 5 1.0 11 45.5
9 సి. దండాయుధపాణి 4 0.8 4 100.0
10 సి. సుందరం 4 0.8 5 80.0
11 జి. వి. యస్. రాజు 4 0.8 7 57.1
12 యం. ఏ. వేణు 4 0.8 5 80.0
13 యం. యస్. రెడ్డి 4 0.8 21 19.0
  87 18.0 202  

 

పట్టిక-5:  సినీ దర్శకులు – ఆత్రేయ సంభాషణలు

స్థానం సినీ దర్శకుడు (సి. ద.) ఆత్రేయ సినిమాలు ఆత్రేయ % మొత్తం దర్శకత్వం చేసినవి సి. ద. %
1 వి. మధుసూధనరావు 22 14.8 65 33.8
2 ఆదుర్తి సుబ్బారావు 10 6.7 27 37.0
3 కె. యస్. ప్రకాశరావు 8 5.4 30 26.7
4 వి. బి. రాజేంద్రప్రసాద్ 7 4.7 13 53.8
5 పి. పుల్లయ్య 6 4.0 24 25.0
6 కె. ప్రత్యగాత్మ 6 4.0 21 28.6
7 తాతినేని రామారావు 5 3.4 30 16.7
8 ఆర్. త్యాగరాజన్ 4 2.7 16 25.0
9 కె. వాసు 3 2.0 29 10.3
10 ఆర్. ఏం. కృష్ణస్వామి 3 2.0 4 75.0
11 ఏ. సంజీవి 3 2.0 9 33.3

 

పట్టిక-6:  నిర్మాతలు – ఆత్రేయ సంభాషణలు (మాటలు రాసిన మొత్తం చిత్రాలు: 153)

స్థానం నిర్మాత (ని) ఆత్రేయ సినిమాలు ఆత్రేయ % ని. నిర్మించినవి నిర్మాత %
1 వి. బి. రాజేంద్రప్రసాద్ 11 7.4 22 50.0
2 డి. రామానాయుడు 8 5.4 52 15.4
3 ఏ. వి. సుబ్బారావు 6 4.0 22 27.3
4 దుక్కిపాటి మధుసూధనరావు 5 3.4 18 27.8
5 యం. ఏ. వేణు 4 2.7 5 80.0
6 టి. గోవిందరాజన్ 4 2.7 6 66.7
7 కె. యస్. ప్రకాశరావు 3 2.0 12 25.0
8 సి. దండాయుధపాణి 3 2.0 4 75.0
9 సి. సుందరం 3 2.0 5 60.0
10 వి. వేంకటేశ్వరులు 3 2.0 9 33.3

 

పట్టిక-7:  నటులు – ఆత్రేయ సంభాషణలు

స్థానం నాయికి/ నాయకుడు (నా. నా.) ఆత్రేయ సినిమాలు ఆత్రేయ % మొత్తం నటించినవి నా. నా. %
1 అక్కినేని నాగేశ్వరరావు 52 34.9 223 23.3
2 జగ్గయ్య 42 28.2 311 13.5
3 శోభన్ బాబు 17 11.4 229 7.4
4 అంజలీదేవి 20 13.4 212 9.4
5 చంద్రమోహన్ 17 11.4 376 4.5
6 సావిత్రి 16 10.7 163 9.8
7 యం. టి. రామారావు 15 10.1 281 5.3

 

ఆత్రేయ సందేశం

‘నా పాట నీ నోట పలకాల శిలకా’ అంటూ కలకాలం మన నోళ్ళలో తన పాటలు పలికిస్తున్నాడు!

‘కలలే మనకు మిగిలిపోవు కలిమి సివరకు, ఆ కలిమి కూడ దోచుకొనే దొరలు ఎందుకు?’

నిజమే, కాని, దొరలు మారలేదు …

ఒక విధంగా, ఆత్రేయ తీర్మానం ఇదేనేమో?

తన కలల, భావ తరంగాలలో, తను చెందిన ఆర్ద్రతకి, శిఖరాలకి మనలను తీసుకొనిపోతూ, ఒక సత్యాన్ని మన ముందుంచాడు:

‘మనసున్న మనషులే మనకు దేవుళ్ళు

మనసు కలసిన నాడే మనకు తిరనాళ్ళు’

ఆ దేవుళ్ళని, తిరనాళ్ళని మానవజాతి చూసినదా? లేక ఇంకా వాటికి సుదూర తీరాల్లో చరిస్తున్నదా?

ఆయన పాట వింటూ కన్నీరు విడిచే మనసులు అర్పించే సుదీర్ఘ నివాళికి – సశేషం!

ఆ మహనీయునికి, ఆత్రేయ స్మృతికి, మనమేమీ చేయాలో – ఒక్కసారి ఆలోచించండి!?

ఉపయుక్త గ్రంధాలు

కె. జగ్గయ్య & పైడిపాల (1990). ఆత్రేయ సాహితి, సంపుటి 1-7, మనస్విని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్, మదరాసు.

వి. యస్. వూటుకూరి (2017). తెలుగు చలనచిత్ర గీతకోశం (1932-2000), సంపుటి 1-3, వి. యస్. వూటుకూరి, సిడ్నీ, ఆస్ట్రేలియా.

వి. యస్. వూటుకూరి (2018). తెలుగు చలనచిత్ర సంభాషణల రచయితల సంకలనం (1932-2000), సాహిత్య సంగీత సమాఖ్య, హైదరాబాద్.

వి. యస్. వూటుకూరి (2018). తెలుగు చలనచిత్ర నిర్మాతల సంకలనం (1932-2000), సాహిత్య సంగీత సమాఖ్య, హైదరాబాద్.

వి. యస్. వూటుకూరి (2018). తెలుగు చలనచిత్ర దర్శకుల సంకలనం (1932-2000), సాహిత్య సంగీత సమాఖ్య, హైదరాబాద్.

వి. యస్. వూటుకూరి (2019). తెలుగు చలనచిత్రాల సంకలనం (1932-2000), సంపుటి 1-2, ప్రొఫెసర్ తుఫాని పబ్లిషర్స్, అమెరికా.

 

సారధి మోటమఱ్ఱి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Very well composed essay saradhi garu. Learnt lot of new details about Acharya Atreya. Thank you.

  • It was great presentation though not exhaustive since the telugu cine songs are not quoted in sufficient, however the other side of the Atreya was really a feast. Thanks for the touching memory.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు