ఒక రచయిత తెలిసినా, తెలియక పోయినా – వారి కథలు అక్కడక్కడా చదివినా కూడా – ఒక సంపుటిలో ఆ రచయిత కథలన్నీ ఒకేసారి చదివినప్పుడు, ఆ రచయిత అంతర్గతం తెలిసి వస్తుంది. రచయిత మనసు లోలోపల దాగి వున్న భావమేదో హారంలో తీగలా పాఠకుడి తోస్తుంది. ఎంతో వైవిధ్యంగా వున్న కథలలో కూడా ఇదిగో ఈ రచయిత ఈ విషయాన్ని ప్రధానంగా చేసుకుని కథలు వ్రాస్తున్నాడు – ఇదే ఈ కథలలో అంతఃసూత్రం – అని ఓ చదువరే చెప్పగలుగుతాడు.
‘రైటర్స్ వర్కషాప్’ గ్రూపులోని మంచి చదవరులైన కొద్దిమంది రచయితలకి వచ్చిన ఈ ఆలోచన పుస్తక సమీక్ష సీరీస్ కి దారితీసింది. అందులో పాణిని జన్నాభట్ల కథల సంపుటి ‘ చెయ్యాల్సిన పని – మరికొన్ని కథలు’ ఎంచుకుని ఫిబ్రవరి ఒకటవ తారీఖున జరిగిన సమావేశంలో గ్రూప్ మెంబర్స్ చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చలో పాల్గొన్న వారి అభిప్రాయాలని ఇదిగో ఇక్కడ యధాతథంగా మీకోసం.
రచయిత పాణిని జన్నాభట్ల కథా సంకలనం ‘చెయ్యాల్సిన పని’ పై మా సమీక్ష
విజయ కర్రా – పాణిని కథ ‘చెయ్యాల్సిన పని’ లో తనని కష్టపెట్టే వారిని అర్థం చేసుకుంటూ, ఇష్టపడే వారెవరో తెలుసుకోవడం వైపు ఆ ప్రోటోగనిస్ట్ సాగించిన నడక ఎన్నో లేయర్స్ తో నిండి ఓ మరచిపోలేని చక్కని కథ. ఆరోజున అతడు ఎదురుకున్న ఓటమిలే నిజానికి అతడి విజయాలు. జీవితశకలం లాంటి ఓ రోజు ప్రయాణంలో మనం ముందు వెనుకల కథని, ఆ పాత్రల స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం. చెయ్యాల్సిన పని కథతో పాటు పాణిని కథలలో విషం దేవుడు, ఆఖరి గోడ, అసంకల్పిత ప్రతీకారాలు – ఇవి ఆలోచింపజేసె కథలే కాదు, చదివిన ప్రతిసారి కొత్త అర్థాలు చూపించే కథలు.
కథని కొత్తగా చెప్పగలిగే సామర్థ్యంతో పాటు… పాణిని కథల్లో చివరి వరకూ చదివించగలిగే ఓ సస్పెన్స్ ఎలిమెంట్ వుంటుంది. దాంతో అతడు మొదట్లోనే పాఠకుడిని కథకి కట్టివేస్తాడు. ‘చెయ్యాల్సిన పని’, ‘జనులా పుత్రుని కనుగొని’, ‘ఎండ్ ఆఫ్ ది టన్నెల్’, ‘లింబో’ లాంటి కథలు ప్రశంసలు పొందడానికి అతడి శైలితో పాటు ఇది కూడా ముఖ్య కారణం. కొత్త రచయితలు గమనించాల్సిన విషయం. పాణిని కథలలో నాకనిపించిన మరో ముఖ్య కారణం పాత్రల తీరుతెన్నులు, స్వభావాలు. వారి బలహీనతలు, ఇష్టాయిష్టాలు – మనం రోజూవారి జీవితాల్లో ఎదురయ్యే మనుషులలో చూసేవి, గమనించేవి. సాధారణ వ్యక్తిత్వాలలో అసాధారణ తత్వన్ని పట్టి చూపించేవి. ఇవే సీరియస్ కథనాలకి ఆత్మలాంటివి.
అలా కొన్ని ఇంతకుముందు చదివినవి, మరికొన్ని చదవనివి కలిసి ఈ ‘చెయ్యాల్సిన పని’ సంపుటిలో కథలన్నీ ఒకేసారి చదవడంతో పాణిని రచనా వైవిధ్యం తెలిసింది. ఇంకా ఇలాగే ఎన్నో మరెన్నో మంచి వైవిధ్యమైన కథలు పాణిని నుండి రావాలని నా కోరిక.
మధు పెమ్మరాజు – ఇవాళ తెలుగు కథారచయితల్లో పాణిని కలం ఒక కొత్త ఒరవడి, వురవడి. అతి తక్కువ సమయంలో రెండు కథా సంకలనాలు ప్రచురించి తెలుగు కథని సుసంపన్నం చేస్తున్నారు. రచనలో వేగం, వస్తువైవిధ్యం, కథన ప్రయోగాలు చూస్తుంటే పాణిని గారికి సృజన అంటే ఇష్టం అని అర్థం అవుతుంది. విభిన్నమైన కథాంశాలు, కథన రీతులు, అసంపూర్ణ పాత్రలు, సంభాషణలు (. ‘చెయ్యాల్సిన పని’ పుస్తకం వీటికి తార్కాణం.
‘చెయ్యాల్సిన పని’, ఒక రోజులో చెయ్యాల్సిన పనుల పట్టిక ద్వారా ప్రధాన పాత్ర నైజాన్ని, జీవితాన్ని పొరలుగా విప్పి చూపడం కొత్తగా అనిపించింది. మనకి సానుభూతి చూపాలో, లేక అసహ్యించుకోవాలో తెలీని మీమాంసలో పడతాము. కానీ రైల్వే పట్టాల ముగింపు అర్థవంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకుంటాము. మాండలికం కథకి సొగసుని అద్దుతుంది. చాలా ఇంటెలిజెంట్ కథ. ‘అంతర్థానం కథలో “వాటిని అందుకొని అతృతతో కిచెన్ బయటకొస్తూ, ఏదో గుర్తొచ్చి హఠాత్తుగా ఆగిపోయావు నువ్వు” – ఆ వాక్యం చదవగానే, చదవడం ఆపేసాను. అంతదాకా చదివిన దృశ్యాలు రివైన్డ్ చేసినట్టుగా అనిపించింది. ఇక ముందుకి కదల్లేదు. నేను అంత దాకా ఆ పాత్రతో ట్రావెల్ చేస్తున్నానని తెలుసుకున్నాను.
ఆధునిక కథంటే సూటిగా చెప్పడం అనడం వింటాము. నా మటుకు నాకు, కథలో తగినంత వర్ణన లేకపోతే కనెక్ట్ కాలేను. కథ చదివిన కాసేపు అందులోని పాత్రలతో గడపాలి, వారున్న పరిసరాల్లోకి చేరుకోవాలి. వారి దృక్కోణం నుండి సందర్భాన్ని చూడాలి, అప్పుడు కథ ప్రయోజనం చేకూరుతుంది. ఈ అంచనాలని పాణిని కథ తాకుతుంది. ‘ఎండ్ అఫ్ ది టన్నెల్’ కథలోని మోజరిల్లా చీజ్..ఆలివ్ ఆయిల్ వాసనలు మనని ఆ వాతావరణంలోకి లాక్కెళతాయి. ఆకర్షణీయంగా లేని డేట్‌ని చూడగానే ప్రధాన పాత్రలో కలిగే వ్యతిరేకత, ఆ తర్వాత జరిగే సంభాషణలతో కథని ఆసక్తికరంగా ముందుకి నడుపుతూ, “నన్ను నేను మర్చిపోవడానికి…. రిమోట్ లాక్కోడానికి ఒకరు కావాలి’ అని చోట నుండి ఫీల్ గుడ్ ముగింపు కథని పూర్తి చేయగానే ఒక సంతృప్తి, ఇదంతా మనమే దగ్గరుండి చేయించినంత అనుభూతి. పాఠకుడు ఇంతకంటే ఇంకేం ఆశిస్తాడు. పాణిని తెలుగు కథకి అవసరం. ఇంకా ఎన్నో ఉత్తమ కథలు ఆశిస్తూ, అభినందనలు!!
శివ సోమయాజుల – పాణిని కథల్లో చదివించే లక్షణం ఉంది. కొత్త విషయాన్ని చెప్పాలి, కొత్తగా చెప్పాలి అనే తపన ప్రస్ఫుటంగా ఉంది. ఒకే జాన్రాకి పరిమితం కాకుండా వేర్వేరు అంశాలని చెప్పాలనే ఉద్దేశ్యపూర్వకమైన ప్రయత్నం ఉంది. తనదైన శైలి ఉంది. సరళమైన భాషలో సంక్లిష్టమైన భావోద్వేగాలను వ్యక్తీకరించే నైపుణ్యం ఉంది.
నాకు నచ్చిన కథల్లో ‘చెయ్యాల్సిన పని’ ఒకటి. కథ చదవగానే ఇది కథా సంకలనానికి ఎంపిక అవుతుందని చెప్పాను. రమణమూర్తి గారు, ఉమా మహేశ్వరరావు గారు కూడా ఈ కథపై తమ సమీక్షలు రాశారు. కొన్ని సినిమా డైలాగులు మొదటిసారి వినగానే షాకవుతాము. ‘చెయ్యాల్సిన పని’ కథలో “ఆ ధనుంజయ్‌ని బార్‌కి తీసుకెళ్లి వచ్చే దారిలో చంపేయాలి” అని చదవగానే అలానే అనిపించింది. అంత దాకా ‘కేకు తీసుకుని రావాలి..” అలా మాములుగా సాగే లిస్టులో ఈ కుదిపేసే వాక్యం చదవగానే ఇక్కడేం జరుగుతోందనే ఉత్కంఠ వెంటాడింది.
‘రైటర్స్ బ్లాక్’, కథలో ప్రధాన పాత్ర తన భావాలని పచ్చిగా చెప్పే విధానం నన్ను ఆకట్టుకుంది. ఆ చెప్పే విధానం ఇంకో జానర్ అనేంత కొత్తగా అనిపించింది. ఈ కథ చదవగానే పాణిని రచయితగా ఇంకో మెట్టు ఎక్కారని నా స్పందన వెంటనే తెలియజేశాను. దీనిలో ప్రత్యేక వాక్యం చెప్పుకోవచ్చు “అంకుల్, ఏమీ అనుకోకు, ఈ సరి నుండి సన్ గ్లాసెస్ పెట్టుకో నాకు ఫ్రీగా ఉంటుంది.” ఈ వాక్యం చెంపపై చెళ్లుమని కొట్టినట్టు తాకుతుంది. కథ ముగింపు కూడా చాలా బావుంటుంది.
మీరు సీరియస్ కథలతో పాటు హాస్యం బాగా పండిస్తారు. సర్వనామ ఫ్యామిలీ, ఎక్సట్రీమ్ చెలగాటం కథలు వాటికి తార్కాణం. ఆఖరి గోడ, అసంకల్పిత ప్రతీకారాలు, విషం దేవుడు వంటి సర్రియల్ కథలు ప్రయోగాత్మక సాహిత్యం ఇష్టపడే పాఠకులని తప్పక అలరిస్తాయి.
శ్రీనిధి – మీ కథలు షాపింగ్ మాల్‌లో నడుస్తూ రంగురంగుల అద్దాలు నుండి చూసే వింత దృశ్యంలా చిక్కుముడిలా, బుర్రకి పదును పెట్టే కథలు. సరదాగా చదివి వదిలేసే కథలు కావు. అంతర్లీనంగా ఏమి చెబుతున్నారో తెలుసుకోవాలంటే శ్రద్ధ పెట్టి చదవాలి. పాఠకుడిని పైమెట్టుపై ఉంచే కథలు. మీ హాస్య కథలు కూడా చాలా నచ్చాయి. అసలు ఆఖరి గోడ ఐడియా ఎలా వచ్చింది, ఇంత క్లిష్టమైన కథనాన్ని అంత సమర్థవంతంగా ఎలా నడపగలిగారనే జవాబు లేని ప్రశ్న. ఇది కేవలం సాహిత్యం తెలిస్తే సరిపోదు, మేధస్సు కూడా అవసరం అనిపించింది. నాకు పుస్తకంలో అన్ని కథలూ నచ్చాయి.
కొత్తావకాయ సుస్మిత – పాణిని బాష చాలా బావుంటుంది. శిల్పం కొత్తగా ఉండాలనే ప్రయత్నం ప్రతి కథలోనూ కన్పిస్తుంది. నాకు కథ నచ్చినా నచ్చకపోయినా, మీ కథలోని పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేను. మీకు స్వతహాగా ఉన్న ప్రతిభ కావచ్చు లేక మీరు శ్రమించి సాధింది కావచ్చు. ఏ రెండు కథలు ఒకలా ఉండకూడదని చాలా మంది రచయితలు ప్రయత్నిస్తారు, కానీ ఇంత తరచుగా రాస్తూ ప్రతీ కథ కొత్తగా ఉండాలంటే ఇంకెంత శ్రమించాలో నేను ఊహించగలను.
నారాయణస్వామి శంకగిరి – పాణిని గారి కథా ప్రస్థానాన్ని దగ్గరగా గమనిస్తున్నాను. పాణిని గారి కథాకథన వైవిధ్యంతో పాటు కల్పనా శక్తి నన్ను అబ్బురపరుస్తుంది. అతి తక్కువ సమయంలో ఇంత రచనా వ్యుత్పత్తిని సాధించిన మరో రచయితని చూడలేదు. ప్రతి రచనా కొత్తగా ఉండాలి, కొత్తగా చెప్పాలనే అంశాన్ని గమనిస్తే పాణిని ప్రతిభ ఇంకా గొప్పగా అనిపిస్తుంది.
అంతఃసూత్రం:
మొదటి పేరాలో చెప్పుకున్నట్లు… ఈ కథా సంకలన సమీక్షలో అందరికీ నచ్చే కొన్ని కామన్ కథలు, వ్యక్తీకరించిన భావాలు కథలలో అంతఃసూత్రాన్నిపట్టి చూపించాయి.
అటు సీరియస్ కథలైనా లేదా హాస్య కథలైనా – అనేక వైవిధ్యాలతో కూడివున్న పాణిని కథలలో పాత్రల స్వభావాలలో మనకి కనిపించేవి ఒకరకమైన సందిగ్ధతతో కూడిన సంఘర్షణ. వస్తువు ఏదైనా, అతడు ఎంచుకుని రాస్తున్న కథలో అవి అంతర్లీనంగా వచ్చి చేరి కథకి కేంద్రం అవుతాయి. ఆ రకంగా ఈ రచయిత కథా సంకలనం ‘చెయ్యాల్సిన పని’ లో ‘ఆత్మ సంఘర్షణ’ అన్నది అంతఃసూత్రంగా కనబడుతుంది. ఈ కథా సంకలనంలోని కథలన్నీ చదివితే మీరు కూడా మాతో ఏకీభవిస్తారని మా నమ్మకం.
పుస్తకం కావాలనుకునే వారికి ఈ క్రింది వివరాలు ఉపయోగపడతాయి:
‘చెయ్యాల్సిన పని’ – కథా సంపుటి
రచన . పాణిని జన్నాభట్ల / MRP-175
అన్వీక్షికి ప్రచురణ సంస్థ, హైదరాబాద్
ఫోన్: 9705972222/9849888773
OR
From Amazon India: with a discounted rate
OR
With in USA – email to panini@gmail.com
పుస్తకాన్ని సమీక్షించిన రైటర్స్ వర్క్ షాప్ బృందానికీ, సమీక్షా కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించి, అందరి అభిప్రాయాల్నీ ఒకచోటకి చేర్చి సారంగ కి అందించిన మధు పెమ్మరాజు గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.