అరుణ గురించి ఏం రాయగలను?
అరవై ఏళ్ల పైబడిన తన జీవితంలో నాకు తెలిసినది ఆరు సంవత్సరాలు కూడ కాదు. అది కూడ ఎప్పుడో ముప్పై ఏళ్ల వెనుక.
కాని పువ్వు రాలిపోయినా పరిమళం గాలిలో మిగిలిపోయినట్టు, నది ప్రవాహం ఆగిపోయినా గత ఉధృతి చిహ్నాలు చెరిగిపోనట్టు, ఆ ఆరు సంవత్సరాల సంభాషణలే, సాన్నిహిత్యమే హృదయం లోలోపల చెరిగిపోని జ్ఞాపకాలుగా నవనవోన్మేషంగా ఉన్నాయి.
కె అరుణ, కుందేటి అరుణ, ఉప్పలూరి అరుణ, రెండు నదులు అరుణ, ఎల్లి అరుణ, సౌదాఅరుణ, ఏ విశేషణమూ అవసరం లేని అరుణ.
దాదాపు ముప్పై ఏళ్లుగా దూరమైనా జననాంతర సౌహృదం లాంటి అవ్యాజమైన స్నేహబంధం ఐదారు సంవత్సరాలదే గాని హృదయపు లోలోతుల్లోది. ఎప్పుడో ముప్పై ఆరేళ్ల కింద వాడరేవు సముద్రతీరంలో పరిచయమైన రోజు గంటలకు గంటలు మాట్లాడుకున్న నాటి నుంచి మొన్న జూన్ 6 సోమవారం సాయంకాలం ఖాజాగూడ స్పర్శ్ హాస్పైస్ లో నొప్పిలో, మగతలో, మాట్లాడలేకుండా పడుకుని ఉన్న తన తల నిమిరిన దాకా కొనసాగిన ఆత్మీయ స్నేహబంధం అది.
జూన్ 5 ఆదివారం ఉదయం మిర్యాలగూడలో వ్యాసరచన వర్క్ షాప్ ప్రారంభం కాబోతుండగా “అరుణ చనిపోయిందట కదా, మీకు తెలుసా” అని మిత్రులెవరో గుండె పగిలే మాట అడిగారు. పక్కనే ఉన్న డా. సాహితి “కనుక్కుందాం” అని అరుణ చెల్లెలు డా. గీతకు ఫోన్ చేసింది. అరుణ పాంక్రియాటిక్ కాన్సర్ తో కొన్నాళ్ల కింద నిమ్స్ లో చేరిందని, వారు పది పదిహేను రోజుల చికిత్స తర్వాత, ఇంక చికిత్స అవసరం లేదని, చివరి రోజులని, పాలియేటివ్ కేర్ కు తీసుకుపొమ్మని చెప్పారని, ఖాజాగూడలోని స్పర్శ్ హాస్పైస్ లో చేర్చారని తెలిసింది. మరణవార్త నిజం కాదని కుదుటపడడానికి లేకుండా, చివరి రోజులనే విచారవార్త సిద్ధంగా ఉంది.
ఆ మర్నాడు స్పర్శ్ కు వెళ్లి అరుణను చూశాను. ఆ పాలియేటివ్ కేర్ లో మందులేమీ ఇవ్వరు. చికిత్స లేనట్టే. అరుణ కళ్లు తెరవడం లేదు. భరించలేని నొప్పికి మత్తు మందు మాత్రం ఇచ్చారట. సౌదాను కౌగిలించుకుని స్పర్శతోనే సాంత్వన అందించడానికి ప్రయత్నించాను.
“నిర్మల పాలియేటివ్ కేర్ లో చేర్చాక ఆరు నెలలు ఉంది. అధైర్యపడకు” అని ఏవో నాకే నమ్మకం లేని మాటలు చెప్పబోతుంటే, “ఫాల్స్ హోప్ ఇవ్వొద్దు వేణూ, అయిపోయింది. ఇవాళో రేపో అని డాక్టర్లు చెప్పారు” అని సౌదా భోరుమన్నాడు.
“ఇదిగో వేణు వచ్చాడు చూడు కన్నా” అని అరుణకు చెప్పడానికి ప్రయత్నించాడు.
ఆ వాతావరణం మార్చడానికి ముప్పై ఏళ్ల వెనక్కి వెళ్లి అరుణ, ఉప్పలూరు, బెజవాడ కబుర్లు తవ్వాను.
“వీళ్లే ముందు నుంచి ఉన్నవాళ్లు, నేను తర్వాత వచ్చినవాణ్నే” అని వాళ్ల చెల్లెలితో చెప్పాడు అంగలూరు రజనినీ నన్నూ చూపుతూ.
ఇటీవల ఏవో పాత ఉత్తరాల కోసం వెతుకుతుంటే అరుణ ఉత్తరం ఒకటి కనబడింది. సౌదాకు దాని గురించి చెప్పాను. ‘ఎంత బాగా ఉత్తరాలు రాసేది. కవిత్వం. నా దగ్గర కొన్ని ఉండాలి. ఒకటి ఈ మధ్యే కనబడింది. ఆకుపచ్చ సిరాతో రాసిన అద్భుతమైన ఉత్తరం’ అన్నాను. “అవును, ఆకుపచ్చ సిరా వాడేది. ‘అది ఎవరినీ సార్ అననక్కరలేని వాళ్ల రంగు. ఆ రంగు సంతకం పెట్టారంటే, ఇక అది ఫైనల్’ అనేది” అన్నాడు.
నాలుగేళ్ల కింద ‘మాటిగారి’ పునర్ముద్రణ వెయ్యదలచుకున్నప్పుడు, అది అనువాదం చేసిన వెంకటేశ్వర రావు గారు (అరుణ తండ్రి) లేరు గనుక సౌదాకు ఫోన్ చేసి, అరుణ అనుమతి కావాలి అని చెప్పాను. అరుణ ఫోన్ తీసుకుని “అయ్యో తప్పకుండా వెయ్యి” అంది. ఇప్పుడు సౌదా అది గుర్తు చేసి, “నీ ఫోన్ రాగానే చాల సంబరపడింది. మరుక్షణం, ఒక్క క్షణం కూడ ఆలోచించకుండా, ఒప్పుకుంది. అంతకుముందు మేమే వేద్దామా అని ఒకసారి అనుకున్నప్పుడు ‘నాన్నగారు ఎప్పటికైనా అది స్వేచ్ఛాసాహితి ప్రచురణే అన్నారు’ అని కూడ అంది” అన్నాడు. “పుస్తకం వెనుక అట్ట చూసి ‘మూల రచయిత గూగి పరిచయం కన్న నాన్నగారి పరిచయమే రెండు వాక్యాలు ఎక్కువ రాశాడు చూడు వేణు’ అని మురిపెంగా చెప్పింది” అన్నాడు.
తనను అలా చూసి వచ్చి సరిగ్గా పది రోజులు. నిన్న రాత్రి ఈ విషాద వార్త.
తనతో మొదటి పరిచయం ఎప్పుడో నాకు గుర్తు రాలేదు గాని, తన పాత ఉత్తరాలు వెతుకుతుంటే, మా మొదటి పరిచయం మీద తాను రాసిన ఉత్తరం ఒకటి ఉంది. ఇప్పుడు వెతికితే దొరికిన ఐదారు ఉత్తరాలు చదువుతుంటే తన శైలికి అబ్బురపడుతున్నాను, వెన్నలో ముంచి రాసినట్టున్న ఆ సాంద్ర కవితామయ కలానికి ముగ్ఢుడినవుతున్నాను.
చీరాలలో జి శ్రీనివాస్ ఎం కాం చదువుతున్నప్పుడు, వాళ్ల కాలేజి ఎదురుగా ఇల్లు తీసుకుని ఉన్నాడు. ఆ ఇంట్లో, అక్కడి నుంచి రెండు మూడు కిమీ దూరంలోని వాడరేవు సముద్రతీరంలో బహుశా 1986 మార్చ్ ఏప్రిల్ లలో మేం మొదటిసారి కలుసుకున్నామట. ఆ తర్వాత కొద్ది నెలలకే నేను బెజవాడ ఆంధ్ర పత్రికలో సబెడిటర్ గా చేరాను. విరసం కృష్ణాజిల్లా యూనిట్ లో పని చేయడం మొదలుపెట్టాను. అరుణ కూడ అప్పుడే విరసంలో చేరింది. కృష్ణాబాయి, ఆలూరి భుజంగరావు, పల్లెర్లమూడి దశరథరామయ్య, అంగలూరు రజని (డి రజనీ కుమారి), డానీ, భరద్వాజ , యువక, శ్రీనివాస్, మరియదాసు, కె నర్సింహాచారి, అల్లం నారాయణ, అనురాధ, త్రిపురనేని శ్రీనివాస్ వంటి వారెందరో ఉండిన యూనిట్ అది (వీళ్లలో కొందరు నేనున్న 1986 ఆగస్ట్ నుంచి 1990 నవంబర్ మధ్యలో పూర్తి కాలం కాకపోయినా కొద్ది కాలమే అయినా బెజవాడలో ఉన్నారు, విరసంలో ఉన్నారు). అప్పటి నుంచి 1992 దాకా బెజవాడలోనూ, ఇతర చోట్లా ఎన్నెన్నో విరసం సభల్లో, ఇతర సభల్లో మేం కలుసుకుంటూనే ఉన్నాం.
విరసం యూనిట్ సమావేశాలు కొన్ని సార్లు ఉప్పలూరులో జరిగాయి. లేదా ఊరికే అయినా ఉప్పలూరు వెళ్తుండేవాణ్ని. అలా ఆ కుటుంబ ఆత్మీయతను కూడ అనుభవించాను. వెంకటేశ్వరరావు గారు గణితశాస్త్రంలో లెక్చరర్. ఇంట్లో అందరూ సాహిత్య జీవులు. ఆధునిక ప్రగతిశీల ఆలోచనలకు కేంద్రం ఆ ఇల్లు. అరుణ గొప్ప చదువరి. అప్పటికే చలం ప్రభావంలో ఉంది. దొరికిన పుస్తకమల్లా చదివేది. మంచి భావుకమైన, సాంద్రమైన కవిత్వం లాంటి అభివ్యక్తి ఉండేది. ఉత్తరాలు చాలా బాగా రాసేది.
విశాలాంధ్ర ప్రచురణగా ‘రెండు నదులు’ (1981) నవల అప్పటికే ప్రచురితమై ఉంది. విరసంలో చేరాక ఒకటి రెండు సంవత్సరాలకు ‘ఎల్లి’ రాసింది. ‘ఎల్లి’ తొలి డ్రాఫ్టులు విరసం యూనిట్ లోనో, విడిగానో తాను చదివి వినిపిస్తుండడం ఇంకా చెవుల్లో వినబడుతూనే ఉంది. ‘ఎల్లి’ మొదటి ముద్రణ 1992లో విరసం ప్రచురణగానే వెలువడింది. ఆ తర్వాత దానికి సీక్వెల్ గా ‘నీలి’ రాసి, రెండూ కలిపి 1996లో తానే ప్రచురించింది.
1990 నవంబర్ లో నేను ఆంధ్ర పత్రికనూ, బెజవాడనూ వదిలి వచ్చేస్తున్నప్పుడు, కృష్ణా జిల్లా విరసం యూనిట్ సభ్యులందరమూ ఒకరోజంతా కలిసి ఉన్నాం. ఏదో హోటల్లో భోజనం చేసి, ప్రకాశం బారేజి, కృష్ణా తీరం, ఉండవల్లి గుహలు, ఆ వెనుక కొండ వెళ్లి, ఐదారు గంటలు గడిపాం. విరసం సభ్యులం మాత్రమే కాక, నారాయణ, చారిలకు సన్నిహితుడైన చంటి అనే ఫోటోగ్రాఫర్ కూడ మాతో వచ్చి, చిరస్మరణీయమైన ఫొటోలు తీశాడు.
‘ఎల్లి’ పునర్ముద్రణ నాటికే సౌదా, అరుణ సహజీవనం ప్రారంభించినట్టున్నారు. విరసం నుంచి కూడ దూరమయ్యారు. ఆ తర్వాత గడిచిన ఇరవై ఐదేళ్లలో సౌదాఅరుణ అనే ఇద్దరు మనుషులుగా కాక ఒకే మనిషిగా అవిభాజ్యమైన సాహిత్య, కళా స్రష్టలుగా అపారమైన కృషి చేస్తూ వచ్చారు. అన్ని రచనలూ జంటగానే వెలువడ్డాయి, లేదా ఒకరి పేరుతో వెలువడినా మరొకరు ఆ రచనలో అంతర్భాగంగా ఉన్నారు. కథలు రాశారు, పురాణకథలు తిరగరాశారు, అనువాదాలు చేశారు, సైద్ధాంతిక రచనలు చేశారు, నాటక రంగంలోకి ప్రవేశించారు. ఇవన్నీ అటాటలుగా విన్నవీ, పుస్తకాలుగా చూసినవీ మాత్రమే. ఈ ఇరవై ఏళ్లలో అప్పుడపుదు ఏదో ఒక సభలోనో, లేదా ఏడాదికొకసారి బుక్ ఫేర్ లో వాళ్లు పెట్టే షాప్ లోనో కలుసుకోవడం తప్ప పాత సాన్నిహిత్యం కొనసాగలేదు. కారణాలేవైనా, ఇప్పుడు వాటి గురించి ఏమనుకున్నా, సౌదాతోనూ అరుణతోనూ దూరం పెరిగింది. ఇప్పుడు తలచుకుంటే విచారమూ దుఃఖమూ కలుగుతాయి.
తన స్వభావం నుంచీ, ప్రవర్తన నుంచీ, వాళ్ల కుటుంబంలో వెంకటేశ్వరరావు గారి నుంచీ నేను నేర్చుకున్నవి ఎన్నో ఉన్నాయి. ఒక ఇంగ్లిష్ మాటను నేను తప్పుగా ఉచ్చరిస్తున్నప్పుడు అరుణ చేసిన సవరణ ఈ ముప్పై నాలుగేళ్లలో నాకు ఆ మాట చదివిన ప్రతిసారీ, లేదా ఏ మాట ఉచ్చారణ గురించి ఆలోచించినప్పుడైనా గుర్తుకొస్తూ ఉంటుంది. ఆర్ ఇ ఎ ఎల్ ఎం అనే మాటలో ఎల్ సైలెంట్ అనుకుని రీం అంటుండేవాణ్ని. అరుణ చెప్పింది, ‘అది రెల్మ్ అనాలి’ అని.
పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోక ముందు ఇద్దరమూ ఒకే రెల్మ్ లో బతికిన, ఆలోచించిన, కలిసి పనిచేసిన దినాలున్నాయి. ఆ తర్వాత ఒకే విశ్వంలో వేరు వేరు గెలాక్సీలలో ఉన్నామనుకున్న కాలమూ ఉంది. ఇప్పుడు అసలు కనబడని, వినబడని ఏ రెల్మ్ కు వెళిపోయావు అరుణా? మళ్లీ రావూ, ఉప్పలూరులో మీ ఇంట్లో, రైల్వే స్టేషన్ లో, మీ పొలం దగ్గర మన స్నేహ పరిమళాల రెల్మ్ లోకి మళ్లీ ఒకసారి….
*
ఆమె రచనలు ఏవీ ఇంతవరకూ చదవలేదు. ఈ రోజు వెల్లువెత్తుతున్న నివాళులు చూస్తుంటే ఎందుకు చదవలేదని బాధ కూడా వేస్తోంది. మీ సాహితీ, వ్యక్తిగత అనుభవాలను చదివి కన్నులు చెమ్మగిల్లాయి.
🙏🙏🙏
అరుణ చనిపోయిందంటే బాధగా ఉంది. సౌదా , అరుణ ఇద్దరూ నాటకం ద్వారానే కలిసారు హైదరబాద్ రవీంద్రభారతిలో. ఘటోత్కచూడు కొడుకని నాకు జ్గ్నాపకం అతని ద్వారా గిరిజనుల బాధలు చూపించారు. నాటకం అయినక నన్ను ఎవరో మిత్రులు సౌదా గారికి పరిచయం చేశారు. ఎంతో ఆప్యాయంగా నాటకం లో కొన్ని మార్పులు చేస్తే మంచిదని సలహా ఇచ్చాను. చాలా సంతోషించారు అప్పుడే ఆయన అరుణ గారికి పరిచయం చేశారు.
నాకు, హైదరబాద్ లో ఉన్న రసరంజని వారు 2005 లో సన్మానించినప్పుడు అరుణ, సౌదా గార్లు నన్ను అభినందించారు. నాకీ ఎప్పటికీ మరిచిపోలేని జ్గ్ణపకం.
అరుణ గారికి అశృ నివాళి
సౌదా అరుణ జ్ఞాపకాలతో కూడిన జీవితానికి అలవాటు కావడానికి బాగా కాలం పట్టొచ్చు. అరుణకి నివాళి.
స్పూర్తిదాయకమైన అరుణ వ్యక్తిత్వాన్ని ఆమె జ్ఞాపకాల నుంచి వెలికి తీశారు సర్!
అరుణ అరుదైన ముత్యం.
ఆమెకి జోహార్లు