రాయవలసిన వారు తమ జ్ఞాపకాలను రాసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాల విలువ మనకు తెలిసొస్తుంది.వారి జ్ఞాపకాలు
జీవితం రెప్ప విప్పుకునే క్రమంలో బాసటగా నిలిచినవారు, బాధ్యత నేర్పేవారు చేసిన సాయం మనలను ఆత్మ పరిశీలన చేసుకోమంటాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులుగానే కాకుండా, చరిత్రను బోధించిన వారుగా, చరిత్రకారులుగా వకుళాభరణం రామకృష్ణ జీవితానుభవాలు వారి మచ్చ లేని వ్యక్తిత్వానికి నిదర్శనం.వారి ఆత్మీయమైన పలకరింపు మనలో చాలామందికి సుపరిచితం.
నన్ను నడిపించిన చరిత్ర శీర్షికన ఇటీవలి వారు తమ స్వీయచరిత్రను వెలువరించారు. ఈ పుస్తకానికి ప్రేరణ వారి శ్రీమతి లలిత.బాధించే వంటరితనంలోంచే ఆయన తన గతాన్ని, వర్తమానాన్ని తడిమారు.తటస్థ పరిశీలకుడిగా ఉంటూనే మనలని ఆ జ్ఞాపకాల్లోకి నడిపిస్తారు. ఆయన తన జీవితంతో పాటు, సమకాలీన అంశాలను కూడా పొందుపరచినా ఆయన జీవితకధనమే ఆసక్తిగా సాగుతుంది.
ఆయన జీవితమంతా వైవిధ్యమే.ప్రకాశం జిల్లా దర్శి తాలూకాలోని పొతకమూరు అనే చిన్న గ్రామంవారి స్వస్థలం.తండ్రి గుడి పూజారి. చిల్లిగవ్వ ఆస్తిలేదు. గుడిసె నివాసం పేదరికంతో సావాసం. ఆ పేదరికంతోనే స్కూల్ కు వెళ్ళటం.అది కలుగచేసే నిస్పృహ మనలనూ తాకుతుంది. పిల్లల చదువు కోసం తండ్రి కుటుంబంతో ‘పాకల’ అనే మరో చోటుకు తరలివెళ్ళటం తండ్రి సంకల్పానికి నిదర్శనం అంటారు.అయితే ఇంటర్మీడియట్ కావలి లోని జవహర్ భారతి లో చదవటం ఆయన మార్గానికి అవసరమైన భూమిక నేర్పరిచింది.
అక్కడే డిగ్రీ పూర్తి చేసిన ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం లో చేశారు. మొదటనుండి వారు వామపక్ష భావాల అభిమాని. కావలి జవహర్ భారతి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిందంటే అందుకు కారణం ఇరవై ఏళ్ల వయసులో కళాశాల స్థాపనకు పూనుకున్న దొడ్ల రామచంద్రారెడ్డి(డి.ఆర్.గా ప్రసిధ్ధులు) మరొకరు కవి పండితులు ఎస్వీ భుజంగరాయశర్మ అంటారు.
జవహర్ భారతి నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది అని గర్వంగా చెప్పుకుంటారు రామకృష్ణ.
భుజంగరాయశర్మ గారి శిష్యరికం ఆయన వ్యక్తిత్వాన్ని విస్తృత పరిచింది. అలాగే డి.ఆర్. ఆయన్నెంతగానో అభిమానించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవగానే ఉద్యోగంతో ఆదుకోవటమేకాక, రామకృష్ణ గారు జె. ఎన్. యు.లో ఎమ్. ఫిల్ చేసేకాలంలోను, ఆ తరువాత పి. హెచ్. డి. చేసే సమయంలోను లీన్ ఇవ్వటానికి సహకరించారు.
రామకృష్ణ గారు ఎమ్.ఫిల్ చేసినప్పుడు, ఆ తర్వాత పి. హెచ్.డి.చేసినప్పుడు ఇంటి బాధ్యతను తన భుజాలపై వేసుకుని భర్తను ప్రోత్సహించిన ఘనత లలిత గారిది.రామకృష్ణ గారిది, లలిత గారిది ప్రేమ వివాహం.లలిత గారు మాజీనేరస్థజాతులపై చేసిన పరిశోధనలు,అనంతర కాలంలో తెలుగు అకాడెమీ లో సంపాదకత్వం వహించిన గ్రంథాలు వారి ప్రతిభా పాటవాలకు నిదర్శనాలు.
రామకృష్ణ గారి జ్ఞాపకాలలో జె. ఎన్.యు.ది గొప్ప పాత్ర. జె. ఎన్.యు.లో గొప్ప చరిత్ర కారులు బిపిన్ చంద్ర, రోమిలా థాపర్, సర్వేపల్లి గోపాల్ ల నుంచి నేర్చుకున్న అంశాలే కాకుండా జె. ఎన్. యు. కేరక్టర్ నూ మనకు బోధపరుస్తారు వారు..అక్కడి విద్యార్థుల ప్రత్యేకత,విభిన్నంగా ఉండే బోధనా పద్ధతులను పరిచయం చేస్తారు.
రామకృష్ణ గారెక్కడున్నా వారందరికీ ప్రీతిపాత్రులు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివేకాలంలో వారికిష్టం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుంది. కాలేజీ ఉత్సవాలకు ముఖ్య అతిథిని పిలవటంలో అప్పటి వైస్ ఛాన్సలర్ నిర్ణయాన్ని విద్యార్థులకు చెప్పి ఒప్పించటంలో రామకృష్ణగారు పడ్డ మథన, ఆయనలోని పట్టువిడుపులను తెలియచేస్తుంది. ఇలాంటి సందర్భాన్ని(అప్పుడొక రాజకీయ సభ అంశం) ఆయన సెంట్రల్ యూనివర్శిటీ లో డీన్ బాధ్యతలు
నిర్వహించే కాలంలో ఎదుర్కొన్నారు.
మరో అంశం వారి విదేశీ పర్యటనలు.మొదటిసారి 1967లో చేసినా అమెరికా పర్యటన అయినా
1997 లో జర్మనీ పర్యటన అయినా, తిరిగి 2014లో చేసిన కుటుంబ పర్యటన అయినా, ఆ పర్యటనలను ఆయన ఉపయోగించుకున్న తీరు అబ్బురపరుస్తుంది.ఆ ప్రాంతాల సంస్కృతిని అధ్యయన చేయటానికి ఆ అవకాశాలను వినియోగించుకున్నారాయన.
రామకృష్ణ గారు గొప్ప స్నేహశీలి. అదే వారిని ఎందరో అభిమానించేలా చేసింది. ప్రతి పర్యటనలోను ఆయనొక perspective ను మనకు పంచుతారు. ఆయన జర్మనీ పర్యటనలో రెండు జర్మనీ లు ఏకీకృతమయినా తూర్పు జర్మనీ ఏం కోల్పోయిందో, ఎలా కోల్పోయిందో వారి సునిశితంగా విశ్లేషిస్తారు. అమెరికా పర్యటనలు కూడా ఆ విధమైన లోచూపుతో సాగుతాయి.
వారిలోని మరో పార్శ్వం ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ స్థాపించి వార్షిక సదస్సులు నిర్వహించి క్రీస్తు పూర్వం ఐదువేల నుంచి రెండువేల సంవత్సరం వరకు తెలుగు వారి చరిత్ర ను ఎనిమిది సంపుటాలుగా(మొదట ఇంగ్లీష్ లోను అనంతరం తెలుగులో ను)తేవటానికి వారు చేసిన కృషీ, సాహసాలు అంతా ఇంతా కాదు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో కూడా వారు పలు బాధ్యతలు నిర్వహించారు. వారి జీవితాన్ని గమనిస్తే అడ్డంకులు దాటుకుంటూ అనుకున్నది సాధించటానికి మనిషి తప్పకుండా ప్రయత్నించాలన్న సందేశం అంతర్లీనంగా కనిపిస్తుంది. కుటుంబాన్ని వదిలేసి నా స్వార్థం నేను చూసుకున్నాను
అని కన్నీటి పర్యంతరమవుతారు జ్ఞాపకాలను వివరించే క్రమంలో.
వారి పరిశీలనలు క్లుప్తంగా ఉన్నా సూటిగా ఉంటాయి. జవహర్ భారతి గురించి ప్రస్తావిస్తూ దొడ్ల రామచంద్రారెడ్డి రెండులక్షలు ఖర్చు పెట్టి రెండొందల మంది కమ్యూనిస్టు లను తయారుచేస్తున్నాడు అని వూళ్ళో అనుకునేవారంటారొకచోట. మరో సందర్భంలో సర్వేపల్లి గోపాల్ తక్కువ మాట్లాడతారు,కానీ వారి ఆలోచనలు స్పష్టంగా ఉండేవి అంటారు..జె.ఎన్.యు.లో కందుకూరి వీరేశలింగం పై ఎమ్. ఫిల్. చేయాలనుకున్నప్పుడు Focus on how he purified Public life of his times అన్న ప్రొఫెసర్ గోపాల్ గారి మాట శిరోధార్యమయిందంటారు రామకృష్ణ.
మీరు మీ జ్ఞాపకాలు రాయాలండీ అని చెప్పి తనను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయిన భార్య లలిత ను ఆర్ద్రత తో గుర్తుచేసుకుంటూ ,
ఎనభయ్యవపడిలో తన జీవితాన్ని రివైండ్ చేసుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను ప్రేమగా తడుముతారు రామకృష్ణ.
తరుముతున్నట్టు కాకుండా ఇంకొంచెం విస్తృతంగా రాస్తే బాగుండేది కదా అని కొన్నిచోట్ల అనిపించినా పడమటి సంధ్యకు వాలిపోతున్న జీవితాన్ని అదిలించి తనకు కావాలసినవి, మనకు ఇవ్వవలసిన వాటిని జాగ్రత్తగా ఇస్తారు వకుళాభరణం రామకృష్ణ చాలాచోట్ల..
అందుకు వారి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే
*
Add comment