మనం నేర్చుకునే పాఠం…

ఒక సాహిత్య జీవిగా కొరోనా ప్రభావాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? మీ అనుభవాలు రాయండి. ఈ వరసలో మొదటి అనుభవం ప్రముఖ కథారచయిత నారాయణస్వామి అందిస్తున్నారు.

ఇంకో ముప్ఫై నలభయ్యేళ్ళ తరవాత, బతికి బాగుంటే, రిటైరైన మిలెనియల్ తరం వారు తమ మనవళ్ళతో చెప్పుకోవచ్చు, నలభై నిండే లోగా నాలుగు మహా కల్లోలాలు చూశామని. ఇరవయ్యొకటో శతాబ్దం పుట్టక మునుపే ఒక కల్లోలాన్ని తీసుకొచ్చింది, కంప్యూటర్లలో Y2K బగ్ రూపంలో. ఇక్కడ ఒక ఐరనీ గమనించండి. కంప్యూటర్లో ఎలక్ట్రానిక్ రూపంలో మాత్రమే ఉన్న ఆ లోపాన్ని బగ్ అని పిలుచుకున్నాం. ఇప్పుడు నిజమైన సజీవమైన బగ్ మనల్ని గడగడ లాడిస్తోంది. 2001 సెప్టెంబరు 11న అమెరికాలో మూడు చోట్ల జరిగిన టెర్రరిస్టు దాడులు కొన్ని వేల మందిని పొట్టన బెట్టుకోవడమే గాక ప్రపంచ గతిని, ముఖ్యంగా అమెరికాలో జీవన గతిని గుర్తు పట్టలేకుండా మార్చేశాయి అంటే అతిశయోక్తి కాదు. 2006-7లో మొదలై 2008లో పతాక స్థాయికి చేరుకున్న వాల్ స్ట్రీట్ ఆర్ధిక సంక్షోభం అమెరికానే కాక ప్రపంచ ఆర్ధిక విపణుల్ని అతలాకుతలం చేసింది. ఈ రెండు సంఘటనలూ రెండు విషయాలను స్పష్టం చేశాయి. ఒకటి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రపంచం అంతా ఏ ఒక్కరూ విడదీయలేనంతాగా చిక్కుముళ్ళు పడిపోయి ఉంది. రెండు, ఆధునిక మానవజాతి మనుగడ చాలా బలహీనమూ, చాలా లోప భూయిష్టమూ అయి, కొద్ది పాటి బలమైన గాలివాటుకే కూలిపోయే పేకమేడ అని తెలిసి వచ్చింది.

ఇప్పుడీ కొరోనా. జీవ పరిణామ సిద్ధాంతంలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నాడు డార్విన్. ఫిట్టెస్ట్ అంటే, బలవంతుడు అని గాక, ఒక మార్పు ఎదురైనప్పుడు దానికి అనుగుణంగా తనని తాను మార్చుకుని, తన జాతిని మలచుకో గలిగిన లక్షణం అని చెప్పుకోవచ్చు. చటుక్కున మారిపోయిన పరిస్ఠితులకు అనుగుణంగా తమ అలవాట్లని, జీవన విధానాన్ని మార్చుకోడానికి నానా తిప్పలూ పడుతున్న మానవ జాతి ఫిట్నెస్ ని పరీక్ష చేస్తోంది ఈ కొరోనా క్రిమి. సెప్టెంబరు 11 దాడులకి ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తూ, అమెరికనులు తమ జీవన విధానాలను మార్చుకోడానికి సిద్ధంగా లేరని సగర్వంగా ప్రకటించారు అప్పటి అమెరికా అధ్యక్షులు. ఈ సూక్ష్మ క్రిమి ముందు అలాంటి భేషజం ఏమీ లేకుండా బళ్ళూ, గుళ్ళూ, ఇళ్ళూ అన్నీ మూసుకుని కూర్చున్నారు అంటే అతిశయోక్తి కాదు. అమెరికనులే కాదు, ప్రపంచ ప్రజలందరూ, మానవజాతి మొత్తం మూసుకుని కూర్చుందిప్పుడు.

మనం చెప్పుకున్న ఇదివరకటి ఉపద్రవాల లాగానే ఈ కొరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. వ్యాధి మొదలైన కారణం ఏదైనా, ఇంత త్వరగా ఇంత విస్తృతంగా వ్యాపించడం అనేది స్పష్టంగా ఈ శతాబ్దపు లక్షణం. అన్ని విధాలా! వ్యాపారం ఐతేనేమి, కుటుంబ సంబంధాలు ఐతేనేమి, మతం ఐతేనేమి – తిలాపాపం తలా పిడికెడు. సీసాలొంచి భూతం బయటికి వచ్చేసింది. దాన్ని మళ్ళీ సీసాలోకి పంపే మంత్రం మన దగ్గర లేదు. కనీసం ఇప్పటికిప్పుడైతే లేదు. వ్యాధి విస్తృతి ప్రధానంగా ఉత్తర అర్ధ గోళంలో ఎక్కువగా ఉన్నా, దీని వలన మొదలైన సంక్షోభం, ముఖ్యంగా ఆర్ధిక సంక్షోభం ప్రపంచాన్నంతా ఒక కుదుపు కుదుపుతోంది. అంతే కాదు, వ్యాధి విస్తృతి కూడా, ఇతరత్రా వ్యాప్తి చెందక మానదని కొన్ని మోడల్స్ చెబుతున్నాయి. సందేహం లేదు, ఇది ప్రపంచ వ్యాప్తమైన ఉపద్రవం.

నేరుగా వ్యాధిగ్రస్తులైన వారు, వారి కుటుంబాలు మొట్టమొదటి బాధితులు. అటుపైన, విద్యుక్త ధర్మ నిర్వహణలో ఈ రోగులకు సేవ చేయవలసిన వైద్య సిబ్బంది ఈ క్రిమి చేస్తున్న దాడిలో రెండో వరస బాధితులు. వీరిది చాలా దుర్భరమైన స్థితి. ఒక పక్కన కంటికి అగుపించని సూక్ష్మక్రిమి పై మాయా యుద్ధం. తగినన్ని రక్షణ కవచాలు కానీ, ఆయుధాలు కానీ అందుబాటులో లేవు. ఎదురుదాడి చేసే అవకాశమే లేదు. ఇంకొక పక్కన తెల్లారి లేస్తే ఉద్యోగ బాధ్యతల మూలంగా, మనసులో ఏయే భయాలున్నా వాటిని అదిమి పెట్టి, లేచి పోరాటానికి సిద్ధపడాల్సిందే, బయటికి వెళ్ళాల్సిందే! ఎదురయ్యే ప్రతి మనిషీ – ఇంతకు మునుపు ప్రాణ మిత్రులే కావొచ్చు, లేదా బొత్తిగా పరిచయంలేని ఆగంతకులు కావొచ్చు – ప్రతీ మనిషీ ఒక పొటెన్షియల్ మారణాస్త్రం! ప్రతి వారినీ మహా అనుమానంతో చూడాల్సిందే. వీరి వెనుక మూడో వరుసలో నిత్యావసర సేవలను అందించే వ్యాపారాలు, వారి సిబ్బంది. వారిదీ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్నా, నేనున్నది అమెరికాలో గనుక ఇక్కడ ఈ సమాజంలో నా కంటికి కనబడుతున్న పరిస్థితులను గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నా ఇక్కడ.

ఈ మూడు వరసల వారినీ దాటి సమాజంలోకి తొంగి చూస్తే ఈ కొరోనా వాత తగిలింది జీవనాధార వృత్తులకీ, ఆదాయానికీ. తొలి విడతలోనే వినోద పరిశ్రమ మూత బడింది. నాటకశాలలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్ళు, వాటి వాటి సిబ్బంది ఒక్క పెట్టున జీవనభృతిని కోల్పోయారు. సమాజంలో, ఆర్ధిక వ్యవస్థలో వివిధ స్థాయిల్లో స్వఛ్ఛంద సేవలనందించే వృత్తులవారందరూ ఆగిపోవలసి వచ్చింది. రకరకాల భవనాల రిపేర్లు చేసే వృత్తులవారు, శుభ్రత సేవల నందించేవారి దగ్గర నుంచి అనేక కంపెనీలలో పెద్ద స్థాయిలో కాంట్రాక్టు మీద పనిచేసే నిపుణుల వరకూ తమ జీవన భృతిని కోల్పోయారు. ఫేక్టరీలన్నీ మూత పడడంతో ఉత్పత్తి రంగంలో పనిచేసే వర్కర్లూ మేనేజర్లూ అందరూ తాత్కాలిక నిరుద్యోగ స్థితిలోకి నెట్టబడ్డారు. సాధారణంగానే ఈ దెబ్బ సమాజంలోని పేద వారి మీద, అట్టడుగు వర్గాల మీద బలంగా పడింది, కాస్త వెనకేసుకున్న వారి మీద కంటే.

ఇక నా బోటి ఆఫీసు ఉద్యోగస్తుల పరిస్థితి. ఇంటి నించి పని చెయ్యాలి అనే కొత్త సూత్రంతో పని యొక్క రూపు రేఖలు మారి పోయాయి. ఆధునాతన టెక్నాలజీ రంగంలో ఇలా ఇంటినించి పని చెయ్యడం, రిమోట్ లొకేషన్ నించి పని చెయ్యడం కొంత సాధారణంగా ఉంది గత పదిహేను ఇరవయ్యేళ్ళుగా. ఈ దెబ్బతో, సాధారణంగా చాలా కంజర్వేటివ్ గా ఉండే మా ఆటోమోటివ్ (కార్ల తయారీ) రంగం వారు కూడా ఈ కొత్త కల్చర్ కి తల వొగ్గక తప్పలేదు. వేరే ప్రత్యామ్నాయం లేదు. పదేళ్ళ కిందట కూడా చాలా పరిమిత స్థాయిలో మాత్రమే ఈ పద్ధతులు నిడిచేవి. అప్పటికి దీనికి తగిన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు విరివిగా లభ్యమవుతున్న 4G వంటి టెక్నాలజీల ఫలితంగా పెద్ద యెత్తున అన్ని వృత్తి కలాపాలూ ఆన్‌లైన్‌లో జరపడానికి వీలవుతున్నది. పదేళ్ళ కిందట ఇదే పరిస్థితి ఎదురై ఉంటే ఇప్పటికి ఇంకా నడుస్తున్న వ్యాపార కలాపాల్లో 80-90 శాతం మూతపడి ఉండేవి. పోనీలే ఉద్యోగం అంటూ ఉంది. ఎంతో కొంత కోత పడినా, రెండు వారాలు తిరిగ్గే సరికి జీతం అంటూ బేంకులో పడుతోందనే తృప్తి ఉండగా, మరొక పక్కన వివిధ రకాల ఆందోళనలు ఉద్యోగస్తులను కలవర పరుస్తున్నాయి. ఇప్పటికే 2008 ఆర్ధిక ఉపద్రవంతో తీవ్రంగా మార్పు చెందిన వృత్తి సంస్కృతి ఇప్పుడు ఇంకా వొత్తిడికి గురవుతోంది. కంపెనీల మేనేజిమెంట్లు అన్నీ తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తి సాధించడమనే నినాదానికి బాగా అలవాటు పడ్డాయి ఈ పన్నెండేళ్ళలో. ఇంకా ఉద్యోగం అంటూ మిగిలి ఉన్న ఉద్యోగస్తులు ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలనే ఆరాటంలో మిగతా విలువలను పక్కకు తోసి పెడుతూ ఒక మాదిరి బండతనాన్ని సంతరించుకోవడం కనిపిస్తున్నది.

ఆర్ధిక సంక్షోభం సమయంలో ఆటోమోటివ్ రంగంలో ప్రత్యక్షంగా చూశాను, ఉద్యోగస్తుల మొహాల్లో నిజమైన భయాన్ని. రేపు ఏమి జరుగుతుందో తెలియని అయోమయపు భయం. ఏ మూలన ఇంకే ఉపద్రవం పొంచి ఉందో అని భయం. అదే భయం బయట సమాజం గురించిన వార్తల్లోనూ వినిపిస్తుండేది. సమాజ జీవన విధానాలను నిర్దేశించే నాయకుల మాటల్లోనూ, చర్చలు జరిపే మేధావుల మాటల్లోనూ అంతకు మునుపెన్నడూ లేని ఒక వినయం తొంగి చూడ్డం మొదలెట్టింది. హమ్మయ్య, అప్పటి వరకూ సాగుతున్న హద్దులు లేని కన్స్యూమర్ మహాప్రవాహం నుండి అమెరికా కొంచెం పక్కదారి పడుతుందేమో ననే ఆశ చిగురించేది. కానీ త్వరలోనే ఆ ఆశ సమసి పోయింది. సంక్షోభం వెనకబట్టి ఆర్ధిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటోందనే సూచనలు రాగానే అటు సంస్థలలోనూ ఇటు వ్యక్తులలోనూ ఇది వరకటి విర్రవీగే గర్వం మునుపటికంటే దారుణంగా బలంగా ప్రకటితమైంది. అన్ని రంగాలలోనూ దూకుడే ప్రధాన లక్షణంగా కనబడ సాగింది.

ఆ దూకుడికి కళ్ళెం వేసింది ఈ కొరోనా.

ఇప్పుడు మనుషుల కార్యకలాపాలన్నీ దాదాపు నిలిచిపోయిన స్థితిలో ప్రకృతి మళ్ళీ వికసిస్తోంది, భూమి పులకరిస్తోంది లాంటి భావాలు అక్కడక్కడా వ్యక్తమవుతున్నాయి. నిరాశ వెదజల్లడం నాకిష్టం లేదు గాని, ఈ వ్యక్తమవుతున్న ఆశాభావం తాత్కాలికమేననీ, ఇప్పటి బలవంత నిర్బంధం కొంత సడలగానే లోతుగా పాతుకుని ఉన్న మానవ జాతి గర్వం మళ్ళీ బయటికి విరుచుకు పడుతుందనీ నా నమ్మకం.

ఇరవయ్యో శతాబ్దంలో ప్రపంచ గమనాన్ని, తద్వారా మానసిక స్థితిని, కొంతవరకూ తాత్త్విక దృష్టినీ కూడా ప్రభావితం చేసినది రెండో ప్రపంచ యుద్ధం, దానికి సంబంధమైన యూదుల మారణహోమం (హోలోకాస్ట్). ఇతరత్రా మరి కొన్ని అల్లకల్లోలమైన సంఘటనలు జరిగినా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో సాహిత్యమూ, ఇతర కళలూ చాలా బలంగా దీని వలన ప్రభావితమయ్యాయి. యుద్ధం ముగిసిన యాభై డెబ్భై యేళ్ళ తరవాత కూడా షిండ్లర్స్ లిస్ట్, సేవింగ్ ప్రైవేట్ రయన్ లాంటి సినిమాలు వచ్చి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. మరి ఇరవయ్యొకటవ శతాబ్దంలో సెప్టెంబరు 11 దాడుల నేపథ్యంతోనూ, అటుపై ఆర్ధిక సంక్షోభం నేపథ్యంతోనూ పుస్తకాలూ సినిమాలూ వచ్చాయి. ఇవి ఎక్కువగా నిజ జీవిత కథనాలుగా ఉన్నాయి. పుస్తకాలైతే వివిధ రంగాల నిపుణులు రాసిన విశ్లేషణలుగా ఉన్నాయి. అంతేకాక మొత్తమ్మీద అమెరికన్ చదువరుల దృష్టి కాల్పనిక సాహిత్యాన్ని విడిచి పెట్టి ఎక్కువగా నిజ జీవిత కథనాల వేపుకి మొగ్గు చూపుతున్నది. ఆదరణ పొందుతున్న కాల్పనిక సృష్టిని చూస్తే – పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ కూడా – పూర్తిగా కాల్పనిక జగత్తుల కథలకి పట్టం కట్టడం కనిపించేది. బేట్ మేన్, ఎవెంజెర్స్, స్టార్ వార్స్ ఇటువంటి సినిమాలూ, పుస్తకాల్లో హంగర్ గేంస్ వంటి కల్పనలూ.

ఈ కొరోనా సంక్షోభానికి వస్తే, మరొక ఐరనీ ఏంటంటే, ఇటువంటి పరిస్థితిని ఊహించి ఇప్పటికే ఎన్నో నవలలూ సినిమాలో వచ్చాయి. రాబిన్ కుక్, మైకెల్ క్రిక్టన్ లాంటి సైన్స్ ఫిక్షన్ ఉద్దండులు 80 లలోనే నవలలు రాశారు. తరవాత కంటేజియన్ లాంటి సినిమాలూ చాలానే వచ్చాయి. ఐతే అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం చాలా మారింది. మనుషుల జీవన శైలులే కాదు, దృష్టి కోణాలు కూడా చాలా మారి పోయాయి అప్పటికీ ఇప్పటికీ. ఈ ఉపద్రవం తరవాత, కోలుకున్నాక సమాజం మారుతుందా? సాహిత్యమూ కళలూ మారుతాయా?

తప్పక మారుతాయి.

మొదటగా వృత్తి, పని స్వరూపాలు మారిపోతాయి. వ్యక్తుల వేపునుంచి ఇంకా సంపాయించాలి, ఇంకా ఏవేవో కొనాలి అనే కన్స్యూమర్ భావన తగ్గు ముఖం పడుతుంది. తద్వారా ఉత్పత్తి వేగమూ, తద్వారా వనరుల వినియోగ వేగమూ కూడా తగ్గుతాయి. మరొక పక్కన అన్ని రకాల స్థాయిల్లో ఏయే నాయకులు ఎన్నెన్ని పొరబాట్లు చేశారు అనే విశ్లేషణలు బాగా వస్తాయి. వెరసి అన్ని రంగాలలోనూ కొంచెం తగ్గి ఉండడం కనిపిస్తుందని నేను భావిస్తున్నాను. ఇంత సుదీర్ఘ కాలం ఇతర మానవస్పర్శ లేక గడప వలసి రావడం అందరిలోనూ తమ విస్తృత కుటుంబాల పైన, తమ చుట్టుపక్కల సమాజం పైన కొంత ఎక్కువ ప్రేమని కలిగిస్తుందని ఆశ పడుతున్నాను. ఒక సారి అలా గుండె చెమరిస్తే ఆ చెమ్మ ప్రపంచాన్నంతటినీ ఆవరించుకోవచ్చు. కేవలం మనుషులే కాదు, సర్వ ప్రాణి కోటినీ అలముకోవచ్చు. ఈ ఉపద్రవం అక్కడే కదా మొదలైంది – మానవుడు తానే మహరాజునని విర్రవీగి ఇతర ప్రాణికోటిని హింసించడం దగ్గరే కదా! దాన్నించి మనం నేర్చుకునే పాఠం మనకి నిజంగా మానవతని నేర్పడం కంటే కావలసినదేముంది.

ఐతే అందులో ఏవి నిజంగా ఆహ్వానించ దగిన పరిణామాలో, ఏవి తిరోగమన భావాలో, చివరికి దేనిది పైచేయో – కాలమే నిర్ణయించాలి.

*

painting: Rafi Haque

ఎస్. నారాయణస్వామి

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Bavundi,consumer bshavana,taggumukham pattadam, taggivundatam inataksnte kavsladindi ledu. Gundechemma kosam eduru chustu

  • I am not sure if this is going to change people behavior a lot. All it takes is for this to calm down and live opens up.. people tend to forget and get back to the same routine. Yes, there could be some better practices on clean, sharing work at home etc. but human mind is also once out of quarantene demands partying and people may just go freelance is my opinion. Its true in general its making people think but how long the change sticks is the question.. mind is very elastic to go back …Irrespectively lets home there is end to this and back to normalcy and better humanity and behavior in all.

  • ఎదురయ్యే ప్రతి మనిషీ – ఇంతకు మునుపు ప్రాణ మిత్రులే కావొచ్చు, లేదా బొత్తిగా పరిచయంలేని ఆగంతకులు కావొచ్చు – ప్రతీ మనిషీ ఒక పొటెన్షియల్ మారణాస్త్రం!
    మీ విశ్లేషణ బాగుందండీ! ధన్యవాదాలు!

  • మంచి విశ్లేషణ. మనుషులు కొందరేనా మీరు చెప్పినట్టు మారతారనే ఆశ కలుగుతోంది. కానీ ఎంత జననష్టం చూడాలో అన్న తప్పదు . కానీ ఉగ్రరూపం ధరించిన ప్రకృతి శమిస్తుంది అన్న ఆశే
    ముందుకు నడుపుతోంది

  • People dont change at all with this experience. All know this will also go. if this type of bad incidents change people behaviour then they would have not elected same political party twice or alternatively.

  • పాఠం కాదు పలాయనం

    కొరోనా వైరస్ నుంచి నేరుగా పాఠం నేర్చుకుందామంటే నా చుట్టూ ఉన్న

    ప్రపంచం నన్ను నా గోడల మధ్య బందీని చేసింది.

    అదిలా బైటకు వచ్చిందో లేదో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు దానికి కోవిడ్-19

    అని నామకరణం చేశారు. అంటే అది పోయినేడాది పుట్టింది. పుట్టి

    ఏడాది కూడా కాకుండానే యావత్ మానవాళిని ఓ బంతాట

    ఆడుకుంటోంది. మా ఇంట్లో వాళ్ళు వాకిట్లో దీపాలు పెడుతుంటే

    కలికాలపు ఈ కొత్త అతిథిని సాగనంపడానికి మనిషి ఇంకా ఎన్నెన్ని సార్లు

    ఎన్నెన్ని పాత్రలు పోషించాలో అన్న ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాను.

    మిగతా ప్రపంచం కంటే మన దేశంలోకి కాస్త ఆలస్యంగా వచ్చినా కానీ

    మనవాళ్ళు దానికి ప్రాచుర్యం కల్పించడంలో మిగిలిన వాళ్ళ కన్నా

    ముందు ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అవగాహనలోనూ

    అంతటా ముందంజలో ఉంది.

    కోవిడ్-19 దెబ్బకు చిన్నప్పుడెప్పుడో చదువుకున్న స్వర్ణ పత్ర సూక్ష్మ దర్శిని

    (Golden Leaf Micro Scope) గుర్తుకొచ్చింది. వైరస్ రూప

    లావణ్యాలు, రంగూ రూచీ వాసనా గురించి అన్ని రకాల డాక్టర్లు

    సామాజిక మాధ్యమాల ద్వారా మా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి

    కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడి గీతోపదేశంలా చేస్తుంటే నాలుగు

    గోడల మధ్య స్వచ్ఛంద బందీనైన నేను మరోదారి లేక వారి మాటలకు నా

    చెవులు అప్పగించేశాను.

    నిబంధనలు ఉల్లంఘించి బైటకు వచ్చిన వారిని రక్షక భటులు కొడుతున్న

    విడియోలు చూసి ఆనందించిన నేను తర్వాత్త్వరాత నిర్బంధపు

    పొడిగింపుల ప్రకటనలకు నిశ్చేష్టుడనయ్యాను.

    పాలకుల మాట్లాడుతున్నారంటే అంతా సిద్ధం చేసుకొని వారి

    ప్రసంగాలను యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించడం ఇప్పుడు

    నా దినచర్యలో ఒక భాగమైపోయింది. ఇలా చూడ్డం మా కుటుంబంలో

    అందరికీ ఓ వైరస్ లా అంటుకుంది.

    మార్చి నెల మూడో వారం నుంచి మహమ్మారి అన్న మాట రేడియోల్లో,

    టీవీల్లో వినీ వినీ, ఈ పేపర్లలో చదివీ చదివీ నా బుర్రలో అదొక కీ వర్డ్ లా

    మారిపోయింది.

    మొదట్లో తమ ప్రవచనాల ద్వారా ప్రజల్లో ధైర్యం నూరిపోయడానికి

    ప్రయత్నించిన ఆయా మతాల ప్రవచనకర్తలు ఈ మధ్యకాలంలో

    మృత్యువు గురించి ఎక్కువ మాట్లాడటం నేను గమనించిన కొత్త సంగతి.

    ఇన్ని రోజుల స్వచ్చంద గృహ నిర్బంధంలో నేను తెల్సుకున్నది మహాత్మా

    గాంధీ సూచించిన మూడు కోతుల తరహాలో కోవిడ్-19 అనవద్దు,

    కోవిడ్-19 వినవద్దు, కోవిడ్-19 చూడొద్దు అన్న నానుడి.

    ఎందుకంటే ఏ మందుకూ లొంగకుండా, ఏ వ్యాక్సినూ కనిపెట్టే అవకాశం

    ఎవ్వరికీ ఇవ్వకుండా ప్రపంచం అంతా చుట్టేయ్యడంలో నిమగ్నమై పోయి

    ఉన్న ఆ వైరస్ నాకెటూ పాఠం చెప్పే పరిస్థితిలో లేదు. ప్రస్తుతం దానితో

    నాదంతా పలాయనవాదమే.

    -మహేష్ ధూళిపాళ్ళ

  • మీ విశ్లేషణ, బాగుంది. సర్!..నిజమే, కాలమే నిర్ణయిఉంచాలి..!మన అందరి ఆశ,భవిష్యత్ అదే.

  • చాలా బావుందీ వ్యాసం. ఇట్లాంటి మంచి వ్యాసాలు పత్రికల్లో కూడా చూడలేం. ఫస్టునుంచి చివరి వరకూ సమాచారం, ఆవేదన, ఆలోచన, ఆశావహదృక్పథం కలిగించే విశ్లేషణ సర్

  • భవిష్యత్తులో మనుషుల మనసులో కనిపించే చెమ్మ కనుక వస్తే అంతకన్న కోరుకునేది ఇంకేముంటుందడీ.. బాగా విశ్లేషించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు