మధ్యతరగతి మందహాసాన్ని చిత్రించిన కథలు

“మనం నిత్య జీవితంలో అనుభవిస్తున్న సత్యాన్ని, సౌందర్యాన్ని సాహిత్యo అంటాము. కథా సాహిత్యం కూడా అందులో ఓ భాగమే. అది మనోరంజకానికే కావచ్చును. మన విజ్ఞానానికే కావచ్చు. లేదా ఇంకే విధంగా సంఘానికి ఉపకరించొచ్చు.”

తెలంగాణ విస్మృత సాహిత్యంలోకి పాతాళగరిగే వేసి డా. సంగిశెట్టి శ్రీనివాస్ సాహితీలోకానికి పరిచయం చేసిన మరో సాహిత్యాణిముత్యం ధరణికోట శ్రీనివాసులు (1916-1967). తెలంగాణలోని చాలా మంది సాహిత్యకారుల్లాగే ధరణికోట శ్రీనివాసులు కూడా నిన్నటి దాకా విస్మృత కథకుడే. “1936-1956 మధ్య కాలంలో దాదాపు 20 ఏండ్ల పాటు అనేక కథలు, నాటకాలు, కవిత్వం రాసిన ధరణికోట శ్రీనివాసులు స్వయంగా నటులు కూడా. ‘సాహితీ మేఖల’, ‘నీలగిరి సాహితీ’ లాంటి పలు సంస్థలను నిర్వహించారు.” 1949లోనే ధరణికోట శ్రీనివాసులు కథా సంపుటిని హైదరాబాద్ లోని ‘సాధన సమితి’ “మా ఇంట్లో’ పేరిట వెలువరించింది. “అన్నంలోకి” కథా సంపుటి కూడా వీరిదే.

తెలంగాణలో మధ్యతరగతి లేదు అందుకే ఇక్కడ కేవలం విప్లవ కథలు, ఉద్యమ కథలే వచ్చాయనే అపవాదు మొన్నటి దాకా ఉండేది. కాని డా. సంగిశెట్టి శ్రీనివాస్ లోకార్పితం చేసిన “ధరణికోట శ్రీనివాసులు కథలు” చదివితే ఈ విమర్శ ఎంత సత్య దూరమో అర్థం అవుతుంది. మొన్నటిదాకా పత్రికల పుటల్లో మగ్గిపోయిన ఈ కథలు తెలంగాణలోని మధ్యతరగతి మందహాసాన్ని పరిచయం చేసి తెలంగాణ కథకు  కొత్త చేర్పుగా మిగిలిపోయాయి.

తెలుగు కథా సాహిత్యంలో మునిమాణిక్యం నరసింహారావు ‘కాంతం’ పాత్రను సృష్టించి ఆంధ్రా ప్రాంతపు మధ్యతరగతి జీవితాన్ని రికార్డు చేస్తే ‘కాంతం’ ప్రభావంతో ధరణికోట శ్రీనివాసులు ‘కనకం’ పాత్రకు ప్రాణం పోసి ఇక్కడి మధ్య తరగతి జీవితాల్లోని ఆనందాల్ని, దుఃఖాల్ని, సర్దుబాట్లను, కోరికలను, నిజాయితీని, వెటకారాలు, చేదు నిజాలు, అమాయకత్వాన్ని, సామాజిక వైకల్యాలను, భార్యాభర్తల మధ్య పరచుకున్న సున్నితమైన హాస్యాన్ని ఎంతో ఆర్ద్రంగా కథీకరించారు. సంసార సాగరంలో పడి కన్ను తడవకుoడా ఈదడానికి కథకుడు, అతని భార్య కనకం పడే బాధలన్నీ ఈ కథల్లో అక్షరీకరిoపబడ్డాయి.

ఈ కథలు 1936-1956 మధ్య రాసిన కథలే అయినా ఇప్పుడు రాసినట్లుగా తళతళ మెరుస్తాయి. ఆనాడు సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన అంటరానితనం, వితంతు వివాహ వ్యతిరేకత, కులాంతర వివాహ వ్యతిరేకత, మూఢనమ్మకాల జాడ్యం అన్నీ కనిపిస్తాయి ఈ కథల్లో. ఆనాటి కథల్లోని సంఘ సంస్కరణ దృక్పథం కొత్త కోణంలో కనిపిస్తుంది.

ధరణికోటది నిశితమైన చూపు. మన నిత్య జీవితంలోని అన్ని శకలాలను కథా చూపుతోనే చూస్తారు ఆయన. అందుకే అన్నంలోకి ఏమీ లేదంటే ఓ కథ, కూరలో కొంచెం కారం ఎక్కువైందంటే ఓ కథ, గాజులు వేయించుకున్నానంటే ఓ కథ, పిల్లవాళ్ళను బాదానంటే ఓ కథ ఇలా జీవితంలోని ప్రతి సన్నివేశాన్ని కథగా మలిచే నేర్పు ఆయన సొంతం.  నలిగిన జీవితం అందరికీ ఉంటుంది కాని అందులో ఏ శకలం కథకు పనికి వస్తుందో పట్టుకోవడం అందరికీ రాదు. ఈ క్లిష్టతను సులభంగా దాటి మధ్యతరగతి కథల పంటను పండించిన కథకులు ధరణికోట.

ఈ ప్రపంచoలో ఏ ఆధారం లేని దిక్కుమాలిన మధ్యతరగతి పక్షుల కథలివి. మధ్య తరగతి జనం ‘కోతలు’ విరివిగా కొస్తారని చెప్తూ కోతలను సామాన్యం, విపరీతం అని రెండు వర్గాలుగా విభజించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. “కోతలు కోసేవాడు నేటి ప్రపంచంలో చాలా తెలివైనవాడు. యథార్థవాది. ఒట్టి మట్టిపిడత, దద్దమ్మ, కోతలు లేకుంటే గతులు లేవు” అంటాడు. మధ్యతరగతి జీవితాల్లోని ‘ముష్టి’ స్వభావాన్ని కూడా వర్ణిస్తాడు మరో కథలో. “పరోపకారానికి రక్తమాంసాలు అర్పితం చేసి ఎముకలు మాత్రం మిగిల్చుకున్న తన శరీరాన్ని కుక్కి మంచం మీద వాల్చి ఏదో ఆలోచిస్తున్నాడు ఒక కష్టజీవి. ఆలోచించినా కొద్దీ అతని కళ్ళ ముందు అంధకారం క్రమ్ముతూ ఉంది. యెదలో అగ్నిపర్వతాలు ఎన్నో ప్రేలుతున్నాయి. ఒక్క వేడి నిట్టూర్పు విడిచి అతి కష్టంగా మంచానిoకొక ప్రక్క దొర్లాడు. అతని దృష్టి గుడిసెకు కొంచెం దూరంలో దున్నుకుంటూ ఉన్న రైతుల మీద పడింది. తనకున్న అరచేతంత భూమిని దున్నుకోవడం ఏలాగు?” ఇది ఒక మధ్య తరగతి జీవుని ఆవేదన.

“దరిద్రులకు ఈ లోకంలో వుండే అర్హత లేదు” కాని బంగారం కొనివ్వలేదని వాపోయే భార్యతో “నా దృష్టిలో నీవే కనకపు బొమ్మవు. దేవకన్యవు. సహజంగా, సుందరంగా వున్న నీకు మళ్ళీ దిక్కుమాలిన నగలన్నీ పెట్టి నీ సహజ సౌందర్యాన్ని మాపడం నాకు ఇష్టం లేదు. నా పాలిటికి నీవు కనకానివి” అని మధ్యతరగతి మనస్తత్వం నుంచి మాట్లాడుతూ భార్యను మునగ చెట్టు ఎక్కిస్తాడు. మరో చోట “పరమేశ్వరుని సృష్టిలో వున్న రహస్యమేమిటి… ప్రతి వ్యాధి వెంట దాని మందును కూడా పుట్టించాడు” అంటాడు మధ్యతరగతి కష్టాలకు ఉపాయాలను వెదుకుతూ. కథల పై పొరలో హాస్యం తొంగి చూస్తున్నా అంతర్గత పొరల్లో ఎంతో దుఃఖం పొంగిపొర్లుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి కుటుంబ కథలు.

ధరణికోట చాలా కథల్లో శిల్ప పరంగా ప్రయోగాలు కూడా చేశారు. ‘ఇంతకన్నా చేసేదేముంది?’, అపస్వరాలు’ కథల్లో చూపిన శిల్ప నైపుణ్యం వెంటాడుతుంది. రచయిత సంభాషణా చాతుర్యం కూడా ఆకట్టుకుంటుంది. ‘దొంగను కాగలిగేను కాబట్టే మనుష్యున్నయ్యాను’, ‘ఐశ్వర్యం వస్తే..!” కథలు అనువాద కథలు. అయినా మధ్యతరగతి జీవితాలను ప్రతిబించే కథలు. రచయిత స్వీయ కథల్లానే భ్రమింపజేస్తాయి. ‘తిరుపతి మొక్కు’ కథ వస్తు పరంగా గొప్ప కథ. చాలా కథల్లోని ముగింపు ఓ హెన్రీ కథల్లోని ముగింపులను తలపిస్తాయి.  చాలా కథల్లో పాటించిన క్లుప్తత చదువరికి హాయిని గొల్పుతుంది.

నల్లగొండ జిల్లా అమ్మనబ్రోలులో ధరణికోట నృసింహం, వెంకట నరసమ్మ దంపతులకు జన్మించిన ధరణికోట శ్రీనివాసులు ప్రాథమిక విద్యను స్వగ్రామoలోనే పూర్తి చేసుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలో మెట్రిక్యులేషన్ పాసై ప్రజా పనుల శాఖలో ఉద్యోగం చేశారు. పలు నాటకాలు రాయడమే గాకుండా వరవిక్రయం, మధుసేవ, రంగూన్ రౌడి తదితర నాటకాల్లో నటించారు. కవిగా కూడా ప్రసిద్ధిగాంచిన ధరణికోట శ్రీనివాసులు కవిత్వం ఆనాడే పలు కవితా సంకలనాల్లో చోటు దక్కించుకుంది.

 

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆకట్టుకునే ముగింపులు, మధ్యతరగతి జీవితాల యొక్క చిత్రణ, కథలలో చూపిన శిల్ప నైపుణ్యంతో తెలుగు కథా సాహిత్యంలో ధరణికోటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. విలువైన కథలకు, అంతే విలువైన సమీక్ష చేశారు. డా. వెల్డండి శ్రీధర్ గారికి, డా. సంగిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐

  • థాంక్యూ శ్రీధర్..
    కథల ఆత్మను అక్షరబద్ధం చేసినవ్..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు