తను చెప్పేది వింటూ
ఎప్పుడూ
నిశబ్దమై పోతావు
రాయడం ఒక అదృష్టం
అనుకొని
కొత్త పదాలను వెతుక్కుంటూ
నీటిలో వలయం లా
వాటిని కలిపేసుకుంటుంటావు
అప్పుడే
ఒక మెరుపు
వెర్రిగా ఒక నవ్వు
అంతలో
అరచేతుల్లో ముఖాన్ని దాచుకుంటావు
ఎందుకంటావు?
గుండెలో ఎన్నో సముద్రాల హోరు
ఇంకా కాగితం పై చేరని పదాలు
ఏదో అలికిడి
తల తిప్పి చూసే ఓపిక లేని నువ్వు
అది తెలుసుకున్న ఒక రాలిన ఆకు
నీకు ఏదో కథ చెప్పాలని
నీ ముందుకు వచ్చింది నీకు దగ్గరగా
కానీ/
నువ్వు వినే స్థితిలో వున్నావో లేదో అని
సంశయంతో నీ వైపు చూస్తూ నిలుచుంది
అది అర్థం అయిన నువ్వు
ఏమిటో చెప్పమని కళ్ళు ఎగరేస్తావు
ఓహ్ పరవాలేదు అనుకొని
కథ మొదలు పెడదామనుకునే లోపు
ఎక్కడి నుంచో శబ్దాలు
చెవులు చిల్లులు పడేలా
తట్టుకోలేక నువ్వు చెవులు, కళ్ళు మూసుకుంటావు
కాసేపు ఆగి కళ్ళు తెరిచి చూస్తావు
ఆకు ముక్కలు ముక్కలై
గాలికి కొట్టుకు పోతోంది.
తను చెప్పాలనుకున్న కథ
చెప్పకుండానే మట్టిలో కలిసిపోతుంటే
నీ కళ్ళ నుండి కొన్ని కన్నీటి చుక్కలు జారి నేలపై పడ్డాయి.
మళ్ళీ బరువుగా కళ్ళు మూసుకొని కూర్చున్నావు.
*
బావుంది
ధన్యవాదాలు సర్