రాతిలో రత్నాలు, మట్టిలో మాణిక్యాలు ఉంటాయనేది కొందరి జీవితాలు పరిశీలిస్తే నిజమనిపిస్తుంది. 1943 సంవత్సరం భారత కమ్యూనిస్టుపార్టీ కృష్ణాజిల్లా కమిటీ కళాకారుల కోసం వెతుకుతున్న సమయంలో ఒక గ్రామంలో దొరికిన మాణిక్యమే మాచినేని వెంకటేశ్వరరావు. మాచినేని పుట్టింది, పెరిగింది విజయవాడ దగ్గరలోని కొండపల్లిలో. అంజయ్య, సీతమ్మ దంపతుల ప్రథమపుత్రుడు. 1924 సంవత్సరంలో జన్మించారు.
కృష్ణాజిల్లా, దుగ్గిరాలపాడు గ్రామంలో ఆదిరాజు సుందరరామయ్య, ఆదిరాజు సీతారామచంద్రమూర్తి వద్ద అటు చదువు, ఇటు సంగీతం అభ్యాసాన్ని చాలా చిన్నవయసులోనే మాచినేని మొదలుపెట్టారు. ఆ తర్వాత పువ్వు పిచ్చయ్య మాష్టారు శిష్యరికంలో జానపద కళారూపాల్లో శిక్షణ పొందారు. ముఖ్యంగా బుర్రకథ కళను ప్రత్యేకశ్రద్ధతో నేర్చుకున్నారు. అలా కేవలం పదేళ్ళ ప్రాయంలోనే పాఠశాల ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా బుర్రకథ గానం చేసి శభాష్ అనిపించుకున్నారు మాచినేని. తన తొలి బుర్రకథా గానానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాటి కృష్ణాజిల్లా కలెక్టర్ మాచినేని ప్రతిభను ప్రశంసించి, బహుమతి అందజేశారు. అలా బాల్యదశలోనే మొదలైన మాచినేని కళాప్రస్థానం విశేషమైన రూపాల్లో వృద్ధి చెందుతూ వచ్చింది.
నాటక రంగాన
అది 1947, జనవరి 19. మద్రాసు వాణీమహల్‌లో అభ్యుదయ రచయితల సంఘం 4వ మహాసభ నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా నాటకం ఏర్పాటు చేశారు. దాదాపు థియేటర్లో రెండువేల మంది ప్రేక్షకులు. నాటకం పేరు ‘పరివర్తన’. దీనికి రచన ఆచార్య ఆత్రేయ. ఇందులో కార్మిక నాయుకుని పాత్రధారి మాచినేని. ఆ పాత్రలో మాచినేని చెప్పిన సంభాషణకు కిక్కిరిసిన ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మారుమోగింది.
‘‘ఈ అస్థిపంజరాలు కనపడతాయి. వారి రోదనలు మనకు వినపడతాయా? వీళ్ళు అందరూ మనుషులు. ఈ మనుషులే దేశం, సంఘం, మరువకండి కవులారా! ఆలోచించండి ఇప్పటికైనా?! మీ కవిత్వాన్ని కష్టజీవుల కొరకు వినియోగిస్తారా? లేక ధనికుల ఆశ్రమమే స్వర్గధామమనుకుని వాళ్ళకు చక్కిలిగింతలు పెడతారా? ఆసక్తి కలిగించే ప్రణయగీతాలు రాస్తారా? కవి అంటే కష్టాలు తొలగించేవాడు’’
ఇలా మాచినేని కార్మిక నాయకుని పాత్రలో చెప్పిన డైలాగ్‌లు ప్రేక్షకుల్లో రోమాంచితమైన అనుభవాన్ని కలుగజేశాయి. అసలే పొడగరి, అందమైన విగ్రహం, గంభీర కంఠం, సిద్ధాంతంపై అచంచల విశ్వాసం.. అన్నీ కలగలిపి ఆ పాత్రలో లీనమై నటించారాయన.
నిజజీవితంలోనూ మాచినేని చాలా నిర్మొహమాటంగా ఉండేవారు. మద్రాసులో ‘పరివర్తన’ నాటకాన్ని చూసిన ప్రఖ్యాత నటులు దర్శకులు ఫృథ్వీరాజ్‌కపూర్ ‘‘లండన్‌లో 18 ఏళ్ళ కుర్రాళ్ళు పెద్దవాళ్ళ వేషాలు వేస్తే దేశం అంతా మారుమోగుతుంది. మరి ఇక్కడేం లేదా?’’ అంటూ అంతటి మంచిపాత్ర చేసిన మాచినేని వెంకటేశ్వరరావుకి ఆయనే స్వయంగా సన్మానం చేసి, సత్కరించడం విశేషం.
ప్రఖ్యాత దర్శకుడు కె. వెంకటేశ్వరరావు, మాచినేని వారికి ’నేను ఏకలవ్య శిష్యుడి’ని అన్నారు. మిక్కిలినేని, వల్లం నరసింహారావు, కర్నాటి లక్ష్మీనరసయ్య, కోగంటి గోపాలకృష్ణ వంటి వారెందరో మాచినేనితో కలిసి నటించినవారే.
సంగీతంలోనూ..
మాచినేని బుర్రకథా కళాకారుడు, నటుడు మాత్రమే కాదు, మంచి గాయకులు. స్వీయ స్వరకల్పనలో ఎన్నో పాటలు రూపొందించి, పాడేవారు. స్వతహాగా సాహిత్య అభిరుచి ఉండటం కారణంగా పాటలూ రాసేవారు. తమ నాటకాల ప్రదర్శన సందర్భంలో ముందుగా గురజాడ వారి ‘దేశమును ప్రేమించమన్నా!’ పాటను ఆయనే స్వయంగా పాడేవారు. ఈ పాటను మొదట ట్యూన్ చేసిన పాడినవారు మాచినేని గారే.
ప్రజానాట్యమండలిలో
నాటకాలు, కళారూపాలపై నిషేధాలు, కళాకారులపై నిర్బంధాలు కొనసాగే సమయాల్లోనూ డా॥ గరికపాటి రాజారావుతో కలిసి ప్రజానాట్యమండలి రాష్ట్ర దళ నిర్మాణ బాధ్యతలు నిర్వహించేవారు. రాష్ట్ర ప్రజా నాట్యమండలి దళంలో ‘మాభూమి’ నాటకంలో ‘దాదా’ పాత్ర ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. కాకినాడ ఆంధ్ర కళా పరిషత్తులో కొప్పరపు సుబ్బారావు రచించిన ‘ఇనుపతెర’, సుంకర, వాసిరెడ్డి రచించిన నాటకాలకు ఆయనే దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈ సందర్భంగా అనేక బహుమతులూ పొందారు.
ఎల్‌ఐసి ఉద్యోగిగా పనిచేస్తూనే ప్రజా కళ ఉద్యమానికి ఎంతో కృషి చేశారు. సత్కారాలు, సన్మానాలు, ప్రభుత్వ ఆదరణ కోసం ఆయన ఏనాడు ఆశపడలేదు. నూరేళ్ళ జీవితం, ఆరోగ్య పరిరక్షణపై ఆయన తీసుకునే జాగ్రత్తలు, మనోనిబ్బరం, ఇప్పటి కళాకారులు అందిపుచ్చుకోవాల్సినది. మిక్కిలినేని, గరికపాటి రాజారావు, అల్లు రామలింగయ్య, వల్లం నరసింహారావు, తదితర మిత్రులు సినిమా రంగానికి వెళ్ళటమూ ఆయనకు ఇష్టంలేదు. ఆయన ఎంత నిక్కచ్చిగా ఉండే వారంటే స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయనకు ఫించను వస్తే తిరస్కరించారు. ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమ విలువను గౌరవిస్తూ, ఆచరిస్తూనే కడవరకూ జీవితాన్ని గడిపారు. ఇవన్నీ నేటి ప్రజా కళాకారులకు ఆదర్శనీయం, అనుసరణీయం.
గుండు నారాయణరావు
రచయిత కృష్ణాజిల్లా, ప్రజానాట్య మండలి మాజీ కార్యదర్శి
Add comment