మంటో బతికే ఉన్నాడు!-మొదటి భాగం

సాదత్ హసన్  చచ్చిపోవచ్చు. అయినా మంటో మాత్రం బతికే ఉంటాడు. 

సుప్రసిద్ధ హిందీ కవి, రచయిత, నాటక కర్త, విమర్శకుడు డాక్టర్  నరేంద్ర మోహన్ రాసిన ‘మంటో జిందా హై’ పుస్తకం విశేషం ఆదరణ పొందింది.  దాన్ని సుప్రసిద్ధ అనువాద రచయిత్రి,  డాక్టర్ వసంత  ‘మంటో బతికే ఉన్నాడు’ అనే పేరుతో తెలుగు లోనికి అనువదించారు.  త్వరలో ఇది పుస్తకంగా రాబోతోంది. ఈ లోపల ఆ పుస్తకాన్ని సంక్షిప్తంగా మీ ముందుంచుతున్నాం.

నరేంద్ర మోహన్ జూలై 30, 1935 లో లాహోర్ లో పుట్టారు.  ఒక్క మాటలో ఆయన గొప్ప తనం చెప్పాలంటే ‘ఉజాలే కీ ఓర్’ అనే 26 ఎపిసోడ్ల హృషీకేశ్ ముఖర్జీ టి‌వి సీరియల్ కి ఈయనే సృష్టి కర్త.  నరేంద్ర మోహన్ కి మంటో అంటే పిచ్చి ప్రేమ.  అందుకనే ఆయన ఎంతో పరిశోధన చేసి మంటో జీవిత చరిత్రని పుస్తక రూపంలో తీసుకొచ్చారు.  ముందు మాటగా ఆయన ఈ పుస్తకం గురించి ఏమి చెప్పారో చూద్దాం.

 

డా.నరేంద్ర  మోహన్ ముందు మాట (క్లుప్తీకరించి):

 

మధ్య నేను జీవిత చరిత్ర రాస్తూంటే ఒక స్నేహితుడు హఠాత్తుగా నా దగ్గరకి గబగబా అడుగులు వేసుకుంటూ వచ్చాడు.

“ఏం చేస్తున్నావు?”

“మంటో బయోగ్రఫీ రాస్తున్నాను.”

“ఉర్దూ లో అశ్లీలమైన రాతలు రాసేవాడు, తాగుబోతు. ఆయన జీవిత చరిత్రా? నీ కేమైనా మతి పోయిందా?”

“ఏమో! నా కెందుకో తెలియదు గానీ, అతనికీ, నాకు మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉందని అనిపిస్తుంది.”

“అవును. సంబంధం ఎందుకుండదూ? నువ్వు అమృత్సర్ కి చెందినవాడివి, ఆయనా అంతే. నువ్వు లాహోర్ వాడివి, ఆయనా అంతే……….” అంటూ వ్యంగ్యంగా కిలకిలా నవ్వాడు.

“నువ్వు అనవసరంగా ఏవేవో ఊహిస్తున్నావు. నేనొక రచయితని. ఆయనా ఒక రచయితే.  రచయితకి రచయితకీ మధ్య ఉండే బంధం మాది.”

“వాహ్! రచయితకీ రచయితకీ మధ్య ఉండే బంధమా! అంతే?”

నేను మాటను మార్చాను.”గాలిబ్ గురించి తెల్సా?”

“ఆ….. కవే గా!”

“గాలిబ్ కీ, మంటో కీ ఎన్నో సమానతలు ఉన్నాయి తెల్సా?”

“ఏం మాట్లాడుతున్నావు? మతి ఉండే మాట్లాడుతున్నావా?”

“గాలిబ్ ఒక షేర్ చెప్పనా?”

“వినిపించు.”

“విను.”

యే  లాష్ బే కఫన్, అసద్  ఖస్తా జాకీ హై

హక్ మగఫిరత్ కరే, అజబ్ ఆజాద్ మర్ద్ థా

 

“సరే…. షేర్….వీర్…. కానీ మంటో మధ్యనుంచి ఎక్కడ ఊడిపడ్డాడు?”

“షేర్ విన్నావుగా… గాలిబ్ వింతైయన స్వేచ్ఛ గల మగాడు.”

“అయితే….. “

“మంటో కూడా అట్లాగే వుండేవాడు.”

“నీ కేమైనా పిచ్చి పట్టిందా! గాలిబ్ ఎక్కడ, మంటో ఎక్కడ!”

“ఒప్పుకుంటాను. ఇద్దరికీ మధ్య చాలా బేధం ఉంది. కానీ, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. గాలిబ్ ఎంత వింతగా ఉండేవాడో, ఎంత స్వేచ్ఛగా ఉండేవాడో అంతకంటే మంటో ఏ మాత్రం తక్కువ కాదు. ఇద్దరూ చనిపోయారు.  అయినా ఈ నాటికీ ఇద్దరూ బతికే ఉన్నారనిపిస్తుంది.”

***

జ్ఞాపకాల సెగ నుండీ నేను బయట పడ్డాను.  కానీ ఏ శబ్దాలతో పాటు రచయిత అనుక్షణం ఉంటాడో, చస్తూ బతుకుతూ ఉంటాడో, కలలు కంటాడో, ఎందులో అయితే సత్యం ఉందో, సంస్కృతి ఉందో ఆ శబ్దానికి చావుంటుందా? అవి చస్తూ ఉంటే మనం ఊరుకోగలుగుతామా? వ్యాసుడూ, వాల్మీకి, గురునానక్, కబీర్, తుకారాం, గాలిబ్, రవీంద్రనాథ్ టాగూర్, ప్రేమ్ చంద్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, మంటో లాంటి రచయితలని  ప్రజలు గుర్తుచేసుకోరా? వాళ్ళ జ్ఞాపకాల నదిలో వీళ్ళు నీళ్లంత స్వచ్ఛంగా, తాజాగా లేరా?

మంటో ఒక సారి స్వయంగా చెప్పారు – “సాదత్ హసన్  చచ్చిపోవచ్చు. అయినా మంటో మాత్రం బతికే ఉంటాడు.  ఏం? ఇట్లా కాకూడదా?”  నిజానికి ఆయనన్న మాటలలో ఎంతో సత్యం ఉంది.  సాదత్ హసన్ జనవరి 18, 1955 న చనిపోయారు.  కానీ మంటో ఈ 21వ శతాబ్దంలో కూడా బతికే ఉన్నారు. ఈనాడే కాదు, రాబోయే కాలంలో కూడా బతికే ఉంటారు.  నిజానికి ప్రతి వర్గం వాళ్ళలోనూ, అన్ని భాషల పాఠకుల ఆత్మలలో ఆయన సజీవంగా ఉన్నారు.  వాళ్ళలో ఒక భాగమై పోయారు.  అసలు మీరే చెప్పండి ఇటువంటి రచయితను ‘హిందూస్తానీ’,‘పాకిస్తానీ’ అంటూ బోనులో నించోబెట్టడం సబబేనా? అసలు ఆయన ఇటువంటి కేటగిరీలను ఎన్నడూ ఒప్పుకోలేదు.  జీవితం – రచనల మధ్య క్షణక్షణం చస్తూ బతికారు.  ఫీనిక్స్ పక్షి లాగా తను బూడిదైపోయి మళ్ళీ అందులోనే పుట్టారు.  ఉవ్వెత్తున ఊయలలో ఊగారు. పైపైకి ఎగిరిపోయారు.  భారతీయ ఉప మహా ద్వీప వాసుల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు.  నిజానికి ఈనాడు మనం ఘోరమైన పరిస్థితులలో జీవిస్తున్నాము. ఎటు చూసినా రక్త పాతం, అన్యాయాలు, అత్యాచారాలు, అంతటా శోషణ, వీటి నుండి బయట పడే ధైర్యం మనకి ఆయన రచనలు, కధలు, డ్రామాలు, వ్యాసాలు ( నిజానికి వీటన్నిటి లో ఆయన వ్యక్తిత్వం నిబిడీకృతమై ఉంది)  మొదలైన వాటి వల్ల కలుగుతుంది.  బాధలు, కష్టాలు, కన్నీళ్లని అధిగమించి, ముందడుగు వేసే ఆత్మ బలం వారి రచనలనుంచి కలుగుతుంది.

మంటో లో పరస్పర విరుద్ధమైన భావాలున్నాయి.  వీటితో పాటు జ్ఞానం, సంవేదనా కూడా ఉన్నాయి.  నిజానికి ఆయన తన కున్న జ్ఞానాన్ని అందరి ముందూ ప్రదర్శించేవారు కాదు.  సంవేదనని భావుకత అనే పాకం లో ముంచరు. ఆయనలో సత్యాన్ని బల్ల గుద్ది చెప్పే ధైర్యం ఉంది.  దీనినే ఆయన తన రచనలలో వ్యక్తం చేశారు.  కధలకి మానవత్వమే పునాది అయ్యింది.  అందుకే బహుశ ఆయన ఏ సిద్ధాంతాల వెనుక పరిగెత్త లేదు.  వాటి పక్షాన వాదించలేదు.  అసలు ఏ ఉద్యమాన్నీ నడపలేదు.  కానీ, ఆయనే ఒక ఉద్యమం, ఒక పోరాటం.  అందువల్లనే ఆయన మీద ఎన్నో విమర్శలు, చర్చలు.  ఆయన నడిచిన బాట ముళ్ళ బాట.  అసలు ఈ బాట లో ఇంతకు ముందు ఎవ్వరూ నడవలేదు.  ఆయన స్వయంగా ఒక బాట వేసుకున్నారు. ఈ కథా బాట మంటో బాట అయ్యింది.  అసలు ఈ బాటలో నడవడం చాలా కష్టం.  స్ఫటికం లాంటి నిజాల్ని అసలు ఎటువంటి కల్తీ లేకుండా రచనల ద్వారా వ్యక్తం చేయడం వల్ల ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కోవల్సి వచ్చింది. ఎన్నో అపవాదులకి గురి కావల్సి వచ్చింది.  కబీర్ లా నిర్భయంగా చెప్పేదేదో చెప్పేవారు.  దేనికీ జంకే వారు కాదు.  దీనివలన ఆయనకు అడుగడుగునా అగ్నిగుండాలే ఎదురయ్యాయి.  అయినా ఆయన ఎప్పుడూ వెనుకంజ వేయలేదు.  హక్కుల కోసం అంతా వదులుకున్న వారే ఆయనతో నడవగలరు. ఆపదలెదురైనా, సుడిగుండాలలో చిక్కుకున్నా ఆయన రాయడం మాన లేదు.  పైగా ఎంతో విలువైన కథలు రాశారు. ఆయన చూసింది రాశారు.  అనుభవ జ్ఞానం అక్షర రూపం దాల్చింది.  కథలు అనుభవాల తుఫానుల నుండి పుట్టినవే.  అనుభవాలు కేవలం ఆయనవే కాదు. వీటిలో సమాజం ఉంది.  కబీర్ లా అందరి మనస్సుల పొరలలో ఆయన జీవించే ఉన్నారు.  జీవించే ఉంటారు.  ఇదే నిస్సందేహం.

మంటో కి, పాఠకులకీ మధ్య అవినాభావ సంబంధం ఉంది.  ఆనాటి పాఠకులే కాదు, ఈనాటి పాఠకులు కూడా మంటో కథలతో మమైకమైపోతారు.  అసలు ఏ విమర్శకుడి సహాయం లేకుండానే కొత్త పరిస్థితులలో, కొత్త దృష్టి కోణంలో మంటో గురించి, ఆయన రచనల గురించి పరామర్శ చేస్తారు.  మంటో కథలలోని అనుభవాలు పాత్రలవే అయినా పాఠకుల మనసులలో అవి చొచ్చుకుపోతాయి.  పాఠకులలో ఎన్నో స్థాయిలు ఉండడం సహజం.  వీరందరూ ఆయనతో మమైకమైన వారే.  కావాలని చరిత్ర వేటినైతే చిన్న చూపు చూసిందో, తన పుటలలో వాటికి స్థానం ఇవ్వలేదో, వాటన్నిటినీ మంటో తన కలం తో స్పర్శించారు.  ఎక్కడైతే లోపలా, బయటా గాఢాంధకారం ఉందో మంటో పాఠకులని అక్కడి దాకా తీసుకెళ్లారు.  ఆయన కథలలో చోటుచేసుకున్న ఆనాటి సంఘటనలు, స్మృతులు, ఆయా వ్యక్తుల జీవితాలు చరిత్రకి కొత్త కోణంలో చూడదగ్గ శక్తినిచ్చాయి.

***

దాదాపు నలభై, యేభై సంవత్సరాల నుండి మంటో తో నాకు సంబంధముంది.  ఇన్ని సంవత్సరాల నుండి నేను మంటో ను ముక్కలు ముక్కలుగా మాత్రమే తెల్సుకున్నాను.  విడి విడి భాగాలు.  కానీ జీవిత చరిత్ర రాసేటప్పుడు అన్ని విడి విడి భాగాలు ఒక దగ్గరికి వచ్చాయని అనిపించింది.  ఇదొక కళాత్మకమైన అనుభవం.  ఆయనతో నా సంబంధం ఎంతో గాఢమ్ గా  మారింది.  చేయి చాచి ఆయన స్పర్శ నందుకొంది.

( మళ్ళీ వచ్చే నెల కలుద్దాం)

డాక్టర్ వసంత

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు