మంటో కథ: ముగింపుకు ముందు మాట

ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీసాడు మన్‌మోహన్

“హలో… 44457”

“క్షమించండి.. రాంగ్ నంబర్” అవతలనుండి మృదువైన  స్త్రీ కంఠం.

మన్‌మోహన్ రిసీవర్ పెట్టేసి తిరిగి పుస్తకం తెరిచాడు. అతనా పుస్తకం ఇప్పటికి ఇరవైసార్లు చదివాడు. అలా అని అదంత గొప్ప పుస్తకమేమీ కాదు. ఆ గదిలో అది తప్ప వేరే పుస్తకం లేదంతే. పైగా అందులో చివరి పేజీలు చిరిగిపోయాయి కూడా.

ఒక వారం నుంచీ మన్‌మోహన్ అక్కడుంటున్నాడు. ఆఫీస్‌రూం లాంటి ఆగది అతని స్నేహితుడిది. ఈ మహానగరంలో గూడు లేక పేవ్‌మెంట్ల మీద రాత్రుళ్ళు గడిపే వేలాదిమంది నిర్భాగ్యుల్లో మన్‌మోహన్ ఒకడు. అతని స్నేహితుడు  బిజినెస్ కోసమై  అప్పు కోసం  వేరే వూరు వెళ్తూ కనిపెట్టుకుని వుండమని ఆ గదిలో వుంచాడతన్ని.

ఉద్యోగం చేయడం అతనికిష్టం వుండదు. అందుకే అతనికి పనేం లేదు. బయట తిరుగుతూ వుంటాడు. అతను గనక నిజంగా పనిచేయాలని ప్రయత్నిస్తే ఏ ఫిలిం కంపెనీలోనో డైరెక్టర్ గా తీసుకునేవారు. ఎందుకంటే అతనొకప్పుడు ఆ పని చేసాడు కాబట్టి. కానీ తిరిగి ఆ రొంపిలోకి దిగడం అతనికిష్టం లేదు. మంచిమనిషే.. ఎవరికీ హాని చేయడు. అతనికి పెద్దగా ఖర్చులంటూ వుండవు.   ఉదయం ఒక టోస్టు, ఒక కప్పు టీ., మధ్యాన్నం ఇంత బ్రెడ్డు, కూర, ఒక పేకెట్టు సిగరెట్లు. అంతే. అతని అదృష్టం కొద్దీ ఈ చిన్న చిన్న అవసరాలకు ఆదుకునే మిత్రులు చాలమంది ఉన్నారు.

మన్‌మోహన్ కి కుటుంబం గానీ బంధువులు గానీ లేరు. అవసరం అయితే తిండి లేకుండా ఎన్ని రోజులైనా గడిపేయగలడు. చిన్న వయసులోనే ఇంటి నుండి పారిపోయి బోంబాయి పేవ్‌మెంట్ల మీద ఏళ్ళతరబడి గడిపేడన్న విషయం తప్ప అతని స్నేహితులకు అతని గురించి వేరే ఏమీ తెలీదు. అతని జీవితంలో బహుశా లేనిదీ, కోల్పోయినదీ ఏమన్నా వున్నదీ అంటే అదొక్కటే- స్త్రీ. ఒక్క ఆడది నాతో ప్రేమలో పడితే చాలు నా జీవితం మారిపోయి వుండేది అంటాడతను.

“అయినా సరే నువ్వు పని మాత్రం చేయవు” అంటారతని స్నేహితులు.

“అప్పుడు  పని చేసే వాళ్లకి ఆదర్శవంతంగా వుంటాను ” అంటాడు.

“అయితే మొదలుపెట్టు” అంటారు వాళ్ళు.

“ప్రేమలో మగాడు చొరవ తీసుకుంటే ఏం బావుంటుంది చెప్పండి” తిరిగి అంటాడతను.

*        *         *

అప్పుడు మధ్యాన్నం భోజనం  చేసే సమయం! తిరిగి ఫోన్ మోగింది.

ఫోన్ అందుకుని, ” హెలో 44457″ అన్నాడు.

“44457?” స్త్రీ గొంతు .

” ఆ…  అదే . మన్‌మోహన్”

” మీరెవరు?” అవతల నుండి.

“నేను…  మన్‌మోహన్”

అటుపక్క నుండి జవాబు లేదు.

“ఎవరు కావాలి” అతనడిగాడు.

“మీరు” ఆమె సమాధానం

“నేనా?”

“మీకభ్యంతరం లేకపొతేనే..”

“నాకెందుకు అభ్యంతరం?”

“మీ పేరు మదన్‌మొహన్ అన్నారు కదూ”

“లేదు మన్‌మోహన్”

అటుపక్క నిశ్శబ్దం.”మీరు నాతో మాట్లాడాలకుంటున్నారని నాకు అనిపిస్తోంది” మన్‌మోహన్ అన్నాడు

“అవును”

“అయితే  చెప్పండి”

“నాకు తెలియట్లేదు. మీరే ఏమన్నా చెప్పండి”, అటునుంచి ఆమె.

“మంచిది. ఇదివరకే చెప్పాను కదా. ప్రస్తుతానికి ఇదే నా నివాసం. సాధారణంగా నేను పేవ్‌మెంట్ల మీద నిద్రపొతుంటాను. కానీ గత వారం రోజులుగా ఈ ఆఫీసు టేబుల్ మీద పడుకుంటున్నా”.

“మరి దోమల బారినుండి ఎలా తప్పించుకుంటున్నారు. పేవ్‌మెంట్ మీద కూడా దోమతెర కట్టుకుంటారా?”

మన్‌మోహన్ పెద్దగా నవ్వాడు., ” ఈ ప్రశ్నకి జవాబు చెప్పే ముందు ఒక మాట చెప్పనివ్వండి. నేను అబద్ధాలు ఆడను. నేను ఏళ్ళ తరబడి పేవ్‌మెంట్ మీదే పడుకున్నాను”

“అదే ఎలా ..”

“సరే.. ఇక్కడ నాదగ్గర ఒక పుస్తకం వుంది. దాని చివరి పేజీలు లేవు. ఏదో ఒకరోజు నా చేతికి అవి దొరుకుతాయి.అప్పుడు ఆ ప్రేమికులకి ఏమయ్యిందో తెలుసుకుంటాను”

“మీరు చాలా  ఆసక్తిగా అనిపిస్తున్నారు”

“అది మీ అభిమానం”

“ఏం  చేస్తుంటారు మీరు”

“చేయడమా?”

“అదే మీ ఉద్యోగం”

“ప్రస్తుతం అదేం లేదు. అయినా పని చేయని వాడికి వేరే వ్యాపకాలు ఏవుంటాయి.కానీ, మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే పగలంతా తిరిగి రాత్రికి నిద్రపోతాను”

“ఇలాంటి జీవితాన్ని  మీరు ఇష్టపడుతున్నారా…”

“ఆగండి!” మన్‌మోహన్ అన్నాడు.” ఆ ప్రశ్న నాకు నేనే వేసుకోలేదు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న నాకు నేనే వేసుకుంటున్నా. ఈ జీవితాన్ని నేను ఇష్టపడుతున్నానా”

“అయితే జవాబు చెప్పండి”

“ఊ.. దీనికి జవాబు లేదండీ. ఇలా జీవించడం నాకు అలవాటు అయిపోయింది. ఇంతవరకూ ఎలా జీవించానో మిగిలిన కాలం కూడా అలానే జీవిస్తే అది నాకు నచ్చినట్లేగా”

అవతల నవ్వు. “మీరు చాలా అందంగా నవ్వుతారు” మన్‌మోహన్ అన్నాడు

“థాంక్యూ” ఆమె సిగ్గుపడింది. ఫోన్ కట్ అయింది. చాలా సేపు రిసీవర్ పట్టుకుని నవ్వుతూ వుండిపోయాడు మన్‌మోహన్.

మర్నాడు ఎనిమిది గంటలకు ఫోన్ శబ్దానికి గాఢంగా  నిద్ర పోతున్న మన్‌మోహన్  లేచి ఆవలిస్తూ పోన్ అందుకున్నాడు.

“హెలో.. 44457”

“గుడ్‌మార్నింగ్ మన్‌మోహన్ గారు”

“గుడ్‌మార్నింగ్… ఓహ్ .. మీరా? గుడ్‌మార్నింగ్”

“నిద్రపోతున్నారా?”

“అవును. ఇక్కడకి వచ్చాక చాలా పాడయిపోయాను. తిరిగి పేవ్‌మెంట్ మీదకు వెళ్తే కష్టాలపాలవుతాను”

“ఎందుకని”

“ఎందుకంటే పేవ్‌మెంట్ మీద ఉదయం అయిదు గంటలకే నిద్ర లేవాలి”

అవతలనుండి నవ్వు.

*        *         *

” నిన్న అంత హటాత్తుగా ఫోన్ పెట్టేసారేం”, అడిగాడు.

” అది సరే.. నేను అందంగా నవ్వుతానని మీరెలా అన్నారు?”

“ఏం ప్రశ్నండీ? ఏదైనా అందంగా వుంటే మెచ్చుకుంటాం  కదా?”

“నాకది ఇష్టం వుండదు”

“మీరిలా ఆంక్షలు పెట్టకూడదు. ఎవరైనా ఆంక్షలు పెడితే వప్పుకోను నేను.  మీరు నవ్వినంత సేపూ అందంగా నవ్వుతారనే అంటాను”

“అలా అయితే – మీనుంచి మెప్పు పొందడం నాకు మానుకోలేనంతగా అలవాటు అయిపోతుంది”

“మీ ఇష్టం మరి” అతనన్నాడు.

“నేను బాధపడితే మీరు నిజంగా పట్టించుకోరా?”

“సరే.. నన్ను నేను బాధపెట్టుకోడం నాకిష్టం లేదు అంటే,    అందంగా నవ్వే మిమ్మల్ని చూసి, మీ నవ్వు అందంగా ఉందని నేను చెప్పలేదనుకోండి,  అది నా అభిరుచికి అన్యాయం చేసినట్లే ”

అటువైపు నుంచి కాసేపు నిశ్శబ్దం. మళ్లీ మాట్లాడసాగింది ఆమె. ” క్షమించండి. మా పనామె తో మాట్లాడుతున్నా. సరే, మీ అభిరుచుల గొప్పదనం పట్ల మీరు ఖచ్చితంగా వుంటారన్న మాట. ఇంకా ఏవేం  గొప్ప అభిరుచులున్నాయి మీకు”

“అంటే”

“అదే… మీ హాబీలు, వర్క్, అసలు మీరేం చేయగలరు”

మన్‌మోహన్ పెద్దగా నవ్వి అన్నాడు, “పెద్దగా ఏం లేవు. ఒక్క  ఫోటోగ్రఫీ తప్పించి, అది కూడా కొంచమే”

“చాలా మంచి హాబీ కదా”

“అది మంచిదనీ చెడ్డదనీ నేనెప్పుడూ అనుకోలేదు”

“అయితే మీ దగ్గర మంచి కెమేరా వుందా”

“లేదండీ. అప్పుడప్పుడూ నా  ఫ్రెండ్ దగ్గరనుండి తెస్తుంటాను. డబ్బులు కూడితే నా దృష్టిలో ఒక మంచి కేమెరా వుంది. అది కొనాలి”

“ఏంటది”

“ఎక్సాక్టా. రిఫ్లెక్స్ కేమెరా. నాకెంతో నచ్చింది”

అటువైపు నిశ్శబ్దం, “నేనొకటి ఆలోచిస్తున్నా”

“ఏంటది?”

“మీరసలు నా పేరు గానీ ఫోన్ నంబర్ గానీ అడగలేదు”

“అది అవసరం అనుకోలేదు”

“ఎందుకని”

“మీ పేరు ఏదయితేనేం. నాకనవసరం. మీదగ్గర నా నంబర్ వుంది. నేను చేయాలనుకున్న రోజు మీరు తప్పక ఇస్తారని తెలుసు”

“లేదు… నేనివ్వను”

“మీ ఇష్టం. నేనూ ఇంక అడగను”

“చాలా విచిత్రమైన మనిషండీ మీరు”

“అవును నిజమే”

అటువైపు నిశ్శబ్దం.

“మళ్ళీ ఆలోచనలా” అతనడిగాడు.

“అవును. అంతా అస్పష్టంగా వుంది”

“మరి ఫోన్ పెట్టేయండి”

“మీరు చాల కఠినాత్ములండీ” ఆమె బాధగా అంది.

నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసాడు మన్‌మోహన్. బయటకి వెళ్ళడానికి తయారయ్యేటప్పటికి తిరిగి ఫోన్ రింగ్ అయింది.

“హెలో 44457”

“మన్‌మోహన్ గారూ” అదే గొంతు.

“చెప్పండి ఏం చేయనూ” అడిగాడు.

“నేనేం బాధపడలేదండీ. అదే విషయం చెప్పాలనుకున్నాను”

“మంచిది” అన్నాడు.

“ఇందాక నేను తింటున్నప్పుడు  అనిపించింది, మీ గురించి బాధ పడకూడదని. ఇంతకీ మీరు తిన్నారా”

“లేదు. ఇప్పుడే బయటకు వెళ్ళబోతుంటే మీరు ఫోన్ చేసారు.”

“ఓహ్! సరే అయితే”

“అంత తొందరేం లేదు లేండి. ఇవాళ డబ్బులు కూడా లేవు. నాకు తిండి కూడా వుండదు”

“ఎందుకలా మాట్లాడతారు. ఇలా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం ఇష్టమా”

“లేదు ఇదే నా జీవితం. దీనికి అలవాటు పడిపోయాను”

“డబ్బులు పంపనా నేను”

“అలా అయితే నా పెట్టుబడిదారుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోతుంది”

“అయితే వద్దులేండి”

“సరే, మీ ఇష్టం”

“పెట్టేస్తున్నా”

“పెట్టేయండి”

మన్‌మోహన్ ఫోన్ పెట్టేసి ఆఫీసునుంచి బయటకి వచ్చేసాడు. తిరిగి సాయంత్రం చాలా ఆలస్యంగా ఆఫీసుకి చేరాడు. రోజంతా ఆమె గురించిన ఆలోచనే. ఆమె గొంతుని బట్టి వయసులో చిన్నదానిలా, మాటల్ని బట్టి చదువుకున్న దానిలా అనిపిస్తోంది. అందంగా నవ్వుతోంది కూడా . పదకొండు గంటలకు ఫోన్ రింగ్ అయింది.

“హెలో”

“మన్‌మోహన్ గారు?”

“అవును అతనే”

“రోజంతా ఫోన్ చేస్తూనే వున్నాను. ఎక్కడున్నారు?”

“నాకు వుద్యోగం ఏం లేకపోయినా చేయవలసిన పనులు చాలా వున్నాయి”

“ఏంటవి?”

“రికామీగా తిరగడం”

“తిరిగి ఎప్పుడొచ్చారు”

“గంట క్రితం”

“నేను కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు?”

“టేబుల్ మీద పడుకుని మీరు ఎలా వుంటారా అని వూహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మీ గొంతు తప్ప నాకేం తెలీదు కదా”

“బాగా ఊహించారా?”

“లేదు”

“మంచిది. అసలు ప్రయత్నించకండి. నేను చాలా అందవిహీనంగా వుంటాను”

“సరే అయితే ఫోన్ పెట్టేయండి. నేను అందవిహీనతను అసహ్యించుకుంటాను”

వాళ్ళు కొంతసేపు మాట్లాడుకోలేదు. అప్పుడు మన్‌మోహన్ అడిగాడు. “ఏం ఆలోచిస్తున్నారు”

“ఏం లేదు. కానీ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను”

“బాగా ఆలోచించి అడగండి”

“మీకోసం ఒక పాట పాడనా”

“ఊ పాడండి”

“అయితే ఆగండి”

ఆమె గొంతు సవరించుకోవడం వినిపించింది. మంద్ర స్థాయిలో శ్రావ్యమైన పాట వినిపించిందామె.

“చాలా మధురంగా వుంది”

“థాంక్యూ” ఆమె ఫోన్ పెట్టేసింది.

రాత్రంతా ఆమె గొంతు గురించే కలలు కన్నాడతను. వుదయం మామూలుకన్నా ముందుగానే లేచి ఆమె పిలుపు గురించి ఎదురు చూసాడు.

 

కానీ ఆమె ఫోన్ చేయలేదు. గదిలో పచార్లు చేసి విసుగెత్తి టేబుల్ మీద పడుకుని అప్పటికే ఇరవైసార్లు చదివిన పుస్తకం తిరిగి తెరిచాడు.

సాయంత్రం ఏడుగంటలకి ఫోన్ మోగింది. వెంటనే అందుకున్నాడు.

“ఎవరక్కడ?”

“నేను”

“రోజంతా ఎక్కడున్నారు?” కఠినంగా అడిగాడు.

“ఎందుకు?” ఆమె గొంతు వణికింది.

“నేనిక్కడ ఎదురు చూస్తున్నాను. చేతిలో డబ్బులున్నా సరే, ఏమీ తినలేదు ఈరోజు”

“నేను అనుకున్నప్పుడు ఫోన్ చేస్తాను. మీ…”

మన్‌మోహన్ మధ్యలోనే ఆపాడు- ” చూడండి ఇదంతా ఇంతటితో  ఆపేయండి. లేదా ఎప్పుడు ఫోన్ చేస్తారో చెప్పండి. నేనిలా ఎదురు చూస్తూ వుండలేను.”

“ఈ రోజుకి క్షమించండి. రేపటి నుంచీ ఉదయం సాయంత్రం ఫోన్ చేస్తాను. ప్రామిస్. సరేనా”

“సరే”

“నాకు తెలీదు మీరు…”

“పర్వాలేదండీ. కానీ, నిరీక్షణ నావల్లకాదు. ఏదన్నా అనుకున్నది చేయలేకపోతే నన్ను నేను శిక్షించుకుంటాను”

“ఎలా?”

“ఈరోజు వుదయం మీరు ఫోన్ చేయలేదు. మామూలుగా అయితే బయటకి వెళ్ళి వుండేవాడిని. కానీ  వెళ్ళలేదు. మీమీద కోపంతో అలానే కూర్చుండిపోయాను.”

“నేను కావాలనే ఫోన్ చేయలేదు .”

“ఏం “

“మీరు నా ఫోన్ కోసం ఎదురు చూస్తారా లేదా అని తెలుసుకుందామని “

“మీరు మహా చిలిపి . సరే వుండండి నేను బయటకి వెళ్లి ఏమన్నా తిని రావాలి “

“సరే, ఎంత సేపు పడుతుంది?”

“అరగంట .”

మన్ మోహన్ అరగంటలో వచ్చేసాడు. ఆమె ఫోన్ చేసింది. వాళ్ళు చాలా సేపు మాట్లాడుకున్నారు. నిన్న రాత్రి పాడిన పాటని మరోసారి పాడమని అడిగాడతను. ఆమె నవ్వి పాడి వినిపించింది.

ఇప్పుడిక ఆమె పొద్దున్నా సాయంత్రం క్రమం తప్పకుండా ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ఒక్కోసారి గంటలు గంటలు మాట్లాడుకునేవారు. ఆమె పేరు గానీ ఆమె ఫోన్ నంబర్ గానీ మన్ మోహన్ ఎప్పుడూ అడగలేదు. కొత్తల్లో ఆమెని ఎలా వుంటుందా అని ఊహించ ప్రయత్నించేవాడు. ఇపుడు అది కూడా అనవసరం అనిపిస్తోంది.

ఆమె స్వరమే అతనికి అన్నీ.  ముఖం, శరీరం, ఆత్మ… అన్నీ ఆమె స్వరమే  .

ఒక రోజామె అడిగింది.  “మోహన్ ! నా పేరు తెలుసుకోవాలని లేదా మీకు ?”

“మీ స్వరమే మీ పేరు .”

ఇంకోరోజు అడిగిందామె, “ మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా ?”

“లేదు.”

“ఎందుకని ?”

“దీనికి సమాధానం చెప్పాలంటే నా జీవితంలో విషాదాన్నంతా తవ్వుకోవాలి. అయినా , అక్కడ ఆశించిన వెలుగు దొరక్కపోతే ఆ బాధ వర్ణనాతీతం.”

“అయితే వద్దులే “

అలా ఒక నెల గడిచింది. అవసరమైన సొమ్ము దొరికిందనీ, ఒక వారంలో బాంబే వస్తున్నాననీ స్నేహితుడి వద్దనుండి వుత్తరం  వచ్చింది. ఆరోజు సాయంత్రం ఆమె ఫోన్ చేసినప్పుడు అతను చెప్పాడు- ” నా సామ్రాజ్యం ఇంతటితో అంతరించిపోతోంది”

“ఎందుకు?”

“నా స్నేహితుడు వచ్చేస్తున్నాడు”

“ఫోన్ వున్న స్నేహితులు మీకింకా వున్నారా?”

“వున్నారు… కానీ నేను నంబర్ ఇవ్వను”

“ఏం?”

“మీ గొంతు ఇతరులు వినడం నాకిష్టం లేదు”

“ఎందుకు?”

“అసూయ! అనుకోండి”

“మరేం చేద్దాం?”

“చెప్పాలి”

“మీ సామ్రాజ్యం అంతరించి పోయే రోజున నా ఫోన్ నంబర్ మీకిస్తాను. సరేనా?”

అంతవరకూ అతన్ని ముంచెత్తిన దుఃఖం పోయింది వెంటనే. ఆమె రూపాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాడు మళ్ళీ. కానీ కుదరలేదు. ‘ఇంకా వుండేది మూడు రోజులే. ఆమెని ఎప్పటికి చూడగలను’ అనుకున్నాడతను.

మర్నాడు ఆమె ఫోన్ చేసినప్పుడు చెప్పాడు, “మిమ్మల్ని చూడాలని వుంది”

“ఎందుకని”

“నా సామ్రాజ్యం అంతరించి పోయే రోజున మీ నంబర్ ఇస్తానని చెప్పారు మీరు”

“అవును!”

“అంటే దానితో మీరెక్కడుంటారో చెప్తారనే కదా అర్ధం? నాకు ఎలాగైనా మిమ్మల్ని చూడాలని వుంది.”

“మీరెప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. ఇప్పుడైనా సరే”

“ఊహూ. ఈ రోజు కాదు. నేను మంచి డ్రస్ వేసుకున్నప్పుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నా స్నేహితుడ్ని అడిగాను”

“మీరు చిన్నపిల్లాడిలా అనిపిస్తున్నారు. మిమ్మల్ని కలిసినప్పుడు మీకు మంచి బహుమతి ఇస్తాను”

“మిమ్మల్ని కలవడం కన్నా గొప్ప బహుమతి ఈ ప్రపంచంలో లేదు.”

“మీకోసం ఒక ఎక్సాక్టా కేమెరా కొన్నాను”

“ఓహ్”

“కానీ ఒక షరతు. మీరు దాంతో  నా ఫోటో తీయాలి”

“కలిసినప్పుడు చెప్తా దాని సంగతి”

“రెండు రోజుల పాటు ఫోన్ చేయను మరి”

“ఎందుకని?”

“మేం వూరు వెళ్తున్నాం. రెండు రోజులే”

ఆ రోజు మన్‌మోహన్ ఆఫీసు వదల్లేదు. ఆ మర్నాడు వుదయం అతనికి జ్వరం వచ్చినట్లయింది. ఆమె ఫోన్ చేయలేదు కాబట్టి తోచట్లేదనుకున్నాడు మొదట. మధ్యానానికి జ్వరం ఎక్కువయింది. కళ్ళు మంటలు  వొళ్ళంతా  సెగలుగా అనిపించింది. మధ్యమధ్యన మంచి నీళ్ళు తాగినా దప్పిక తీరనట్లు అలానే టేబుల్ మీద పడుకున్నాడు. ఆ మర్నాటికి అతను పూర్తిగా  అలసిపొయాడు. ఊపిరి కూడా ఆడని స్థితికి వచ్చేసాడు.

జ్వరం ఎక్కువై అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆమెతో మాట్లాడున్నట్లు, ఆమె తియ్యటి గొంతు వింటున్నట్లు అనిపిస్తోందతనికి. అతని మస్తిష్కంలో ఏవేవో శబ్దాలు, ఒకేసారి వెయ్యి ఫోన్‌లు మోగుతున్నట్లు, ఎవరెవరో మాట్లాడుతున్నట్లు వుంది. అతను ఊపిరి తీసుకోలేక పోయాడు.

తిరిగి ఫోన్ మోగినప్పుడు అతనికి వినిపించలేదు. చాలా సేపు మోగాక ఆ శబ్దం వినిపించి బలవంతాన గోడకానుకుని నుంచుని వణుకుతున్న చేతుల్తో ఫోన్ తీసాడు. గొంతుక పెగల్చి “హెలో!” అన్నాడు.

“హెలో మోహన్” అందామె.

“అవును! మోహన్” అతని గొంతు పలికింది.

” మీ మాటలు వినిపించట్లేదు నాకు”

ఏదో చెప్పబోయాడు కానీ, అతను మాట్లాడలేక పోయాడు.

“మేం అనుకున్నదానికంటే ముందుగానే వచ్చేసాం. మీతో మాట్లాడాలని గంటలతరబడి ప్రయత్నిస్తున్నా. ఎక్కడికెళ్ళారు?”

మన్‌మోహన్ తల తిరగడం మొదలెట్టింది.

“ఏమయ్యింది?”

“ఇప్పుడే నా సామ్రాజ్యం అంతరించిపోతోంది” అతికష్టం మీద గొంతుక పెగల్చుకుని అన్నాడు.

అతని నోట్లోంచి ఒక్కసారిగా రక్తం బైటకి వచ్చి మెడవరకూ కారింది.

“నా నంబర్ రాసుకోండి… 50314… 50314. పొద్దున్నే ఫోన్ చేయండి. ఇప్పుడు నేను వెళ్ళాలి”

ఆమె ఫోన్ పెట్టేసింది.

రక్తం కక్కుకుంటూ కుప్పకూలిపోయాడు మన్‌మోహన్.

*

Badshahat ka Khatma,  Saadat Hasan Manto,  Kingdom’s end, Eng:  Khalid Hasan  

ఉమా నూతక్కి

వృత్తి రీత్యా ఎల్ఐసి లో Administrative Officer ని. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం. నా బలం నా బలహీనతా ఇవే.

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ సూపర్భ్ అండి ,అభినందనలు

  • మంటో కథ అని తెలియకుంటే అనువాదం అనిపించనంత దగ్గరగా చేసుకుని రాసారు ఉమా గారూ 👌

  • అనువాదం అనిపించని అనువాదం. అభినందనలు ఉమ గారూ!

  • మంటో బహుముఖీన సాహితీ ప్రపంచంలో ఒక పార్శం ఈ కథగాని చిన్న కథ. స్వర పరిచయమే ఆమె ముఖ పరిచయంగా మారి ఆ పలకరింపు కోసం ఎదురుచూసేలా చేసింది. మంటో కథల్లో ఇది ఊహించని మలుపు కాదుగానీ , అది ఎంత సహజంగా ఉంటుందో ఉమా బాగా చెప్పారు. తాత్కాలికమైన భౌతిక ఆకర్షణ నుంచి విముక్తులవటమే ప్రేమకు అర్థమయితే , దాన్ని సూక్ష్మ రూపంలో ఈ కథలో చూడచ్చు. మన్ మోహన్ తోపాటు పాఠకుడికి కూడా ఆమె ఎవరు అని ఎదురుచూసేలా సాగుతుంది కథనం. మంటో ఏ కథైనా ఎప్పటికీ రెలెవంటే కాబట్టే అనేక అనువాద ప్రయత్నాలు.
    ఉమా .. మీ నుంచి మరెన్నో మంటో కథలు రావాలి. ఉర్దూ మాతృకకి దగ్గరగా ఉండే వాటిని ఎంపికే అసలు సమస్య. అభినందనలు.

    • Sir.. thank you. Khalad Hasan అనువాదం బాగుంది sir. Filmy mirchi అని ఒక యూట్యూబ్ ఛానెల్ వుంది. అందులో Manto ఆడియో కథలు వినడం అలవాటు అయింది. ఒరిజినల్ కథలు చదవలేని వాళ్ళకి ఈ ఆడియో ఫైల్స్ ఒక వరం. Sadat Hasan నుంచి అనువాదం చేసాక, ఆడియో ఫైల్ విని, ఏమన్నా మిస్ చేసానా అని సారి చూసుకున్నాను. ఇప్పుడు Khalid Hasan పుస్తకం ప్రామాణికంగా తీసుకోవచ్చని నమ్మకం కుదిరింది. ఆడియో సపోర్ట్ ఎలానూ వుంది కదా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు