ఆమె అనేక జీవితాలను ఒకేసారి జీవించింది. జీవితమే పోరాటమైనప్పుడు నిబ్బరంగా నిలబడి కథారచనను ఆలంబన చేసుకున్నారు. తెలంగాణ గ్రామీణ జీవితం నుండి ప్రజాపోరాటాల వైపు ఆమె ప్రయాణం కొనసాగింది. కరుణ మనుషుల అంతరంగంలో ఉంటే చాలదు- మానవాళిపై కరుణ ఉండాలి. కరుణ, తెగువ మనుషుల జీవితాలను ఏదరికి చేరుస్తాయి? విప్లవకారిణిగా కొనసాగాలనుకున్నారు. రహస్య జీవితంలోని తాజాదనాన్ని అనుభవించారు. రసార్ద్ర హృదయగవాక్షం నుండి ప్రజా వెల్లువలోకి దారిచేసుకోగలిగారు. సామాన్య స్త్రీ ఆయుధధారిగా మారడం వెనుక ఉన్న ధీశాలతను- ప్రజల నుండి గ్రహించింది. అనేక ఘర్షణల తర్వాత ఆమె కథా రచయితగా నిలబడినారు. విప్లవ రచయితల సంఘంలో కొనసాగుతున్నారు.
తాయమ్మ అనే పాత్రను విశ్వవ్యాపితం చేసిన కరుణ “టుంబ్రి “అనే కలం పేరుతో కథలు రాశారు. తాయమ్మ కథ తాయమ్మ కరుణగా మార్చింది. అడవి, నగరం ఆమె జీవితాన్ని ఉన్నతీ కరించాయి. ప్రజల నుండి సాహిత్య రచనను స్వీకరించారు. అరణ్యం నుండి పోరాట మెలకువ ను గ్రహించారు. చివరకు నగర జీవితంలో స్థిరపడ్డారు. తను ఎంచుకున్న మార్గం ఆయుధం. స్త్రీలు ఆయుధం పడితే సమాజ గతినే మార్చగలుగుతారు. జీవితంలోని ఖాళీ నుండి ఆమె బయలుదేరలేదు.అదుపుతప్పిన వక్ర సమాజపు రీతులను సరిచేయాలనుకుంది .పోరాట క్రమంలో భాగమైంది. తెలంగాణ సామాజిక జీవితం ఇచ్చిన జీవన ఆర్తిని దారినిండా నిలుపుకుంది.
విప్లవంలో ప్రేమ అనే భావన ఉంటుంది. అది ఎవరో ఒకరి అమరత్వం దగ్గర నిలిచిపోదు. ప్రేమ అనే భావన సున్నితత్వానికి సంబంధించిన అంశం కాదు. రెండు శరీరాల తన్మయత్వం కాదు. ఒకా నొక జీవనానుభవము. ప్రేమను ప్రజాపోరాటాలలో ఎలాఅర్థం చేసుకోవాలి! మంజీరా విప్లవ కారుడు రచయిత. ప్రేమ వ్యక్తిగత ఆకర్షణ కాదు. ప్రజా పోరాటాల దగ్గర, మృత్యువు దగ్గర సేదతీ రుతున్నప్పుడు ఒకానొక స్వాంతన..మంజీరా, కరుణ రెండు నామవాచకాల వెనుక ప్రవహించే నదీ ప్రవాహాలు.ఉద్యమ ప్రస్థానంలో వారి ప్రేమ కూడా ఒక భాగమే. రచయితగా, ఉద్యమకారునిగా మంజీరా, కరుణను తనలో భాగం చేసుకున్నాడు. కరుణలోని సృజనాత్మకతకు మరిన్ని మెరుగులు దిద్దాడు. కరుణపై మంజీరా ప్రభావం వుంది. ఉద్యమ మమేకతను,సాహిత్యంలోని వాస్తవికతను మంజీరా కరుణకు పరిచయం చేశాడు. ప్రేమ ఉద్యమం, రచన ఈ కలయిక ఒక కొత్త ప్రపంచాన్ని వాగ్దానము చేసింది. ఇక్కడ అమరత్వం వారు ఊహించనది. ఆశయం నుండి మొలకెత్తిన ప్రేమ ఏనాటికి అలీనం కాదు. మంజీరా, కరుణకు ఉపాధ్యాయుడు, సహచరుడు, ఉద్యమ ప్రేమికుడు. ఈ మొత్తం పరిణామాలన్నీ కరుణను రచయితను చేశాయి.ఆదివాసి అమరుడు “టుంబ్రి” అనే పేరుతో రచనలు చేసారు. ఆయుధం, కలం, ప్రేమ వీటన్నిటి పునాది అడవి. తాయమ్మ కరుణలో మంజీరా అనేక భాగాలుగా తర్జుమా అయినాడు.
మంజీరా అమరత్వం కరుణను ఒంటరిని చేసింది.మంజీరా ఎడబాటు నుండి తేరుకోవడానికి కరుణ జీవన్మరణ పోరాటమే చేసింది.కేవలం ఇక్కడ ప్రేమ మాత్రమే సరిపోదు. ప్రజల కేంద్రంగా ప్రజాపోరాటంలో ఇద్దరు ఉన్నత ప్రేమను సొంతం చేసుకున్నారు. ఆవెలుగులో తమను తాము ఉన్నతీ కరించుకున్నారు. ఒంటరితనం మంజీరాలేని జీవితం కరుణ అంతరంగాన్ని కుదుపు వేసింది. సహచరుని అమరత్వం. ఒకనాటి దుఃఖంనిండా అనేక అమరత్వాలు. కరుణ ఈ స్థానాంశము నుండి ఉద్యమ ప్రస్థానంలో నిలకడగా నిలబడింది.. రచన, ఉద్యమ భావజాలాన్ని మంజీరా నుండి స్వీకరించింది. మంజీరా అదృశ్యమైతే తాయమ్మ కరుణగా రూపాంతరం చెందింది.
ఇవాళ “టుంబ్రి” తాయమ్మ కరుణ కథా రచనలో భాగం. నక్సలైట్ జీవితంలో నుండి మైదాన ప్రాంతంలోకి చేరారు. ముందున్న పోరాటం మానసికమైనది. తన మైదాన జీవితంలోకి అనువర్తనం చెందడానికి ఆఒరవడిలో గట్టి ప్రయత్నమే చేసారు. విప్లవ భావజాల నిర్మితిలో నూతన మానవిగా తాయమ్మ కరుణ కొనసాగుతున్నారు. ఉద్యమ, సహచరుల జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడి మనుషుల వ్యక్తిత్వాలున్నాయి. అమరత్వం కింద జారిపోయిన కలలున్నాయి. వీటన్నిటివెనుక సమాజ పురోగమన వేదన ఉంది. స్త్రీగా ఆమె అర్థం చేసుకున్న విప్లవోద్యమ పరిణామక్రమం వేరు. తాయమ్మ కరుణ వీటన్నిటికీ సజీవ సాక్ష్యం.
కథా రచనా క్రమంలో తాయమ్మ కరుణకు రూప, శిల్ప పరిణితి వుంది. తెలంగాణ కుటుంబ సాంస్కృతిక జీవనంలోని అనేక అంశాలు తాయమ్మ కరుణ కథలనిండా కనబడతాయి. ఇవి మధ్యతరగతి స్త్రీల జీవనచిత్రంగా కనబడినా సారాంశంలో పోరాట భూమికను చిత్రించిన కథలు. స్త్రీగా తను అర్థం చేసుకున్న కుటుంబ సంబంధాలలోని నిజపాత్రలు తాయమ్మ కథలు. నాటకీయుత, కృత్రిమత్వం,తనకు తెలియని జీవితం గురించి కరుణ రాయలేదు. ఒకానొక సమాజ వాస్తవికత వెనుక దాగిన చీకటి- వెలుగులను అంతే తడితో చిత్రించారు. దీని వెనుక ఉన్న మానసికశ్రమ ఒక అబ్యాసం. జీవితం అనేక ఎడబాటుల మధ్య మిగిలిన ఒంటరివేదన. ఒక మహానగర మానవసంబంధాల మధ్య తనను నిర్మాణం చేసుకున్నారు.
కరుణ వంటి స్త్రీలు అరుదుగా ఉన్న సమాజం మనది.తనను ప్రేరేపించిన అనేక మార్గాలకు ఒకే దారని తెలిసి అదేబాటను ఎన్నుకున్నారు. విప్లవ కథకురాలిగా, కార్యకర్తగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగింపులోని అనుభవాలు ఆమె కథావరణం.
ఇవాళ సాహిత్యంలో గిరిజన, ఆదివాసి జీవనం నుండి సాహిత్య సృష్టి జరుగుతుంది. తెలుగు సాహిత్యానికి ఇదొకచేర్పు. ఆది వాసి జీవన సంస్కృతి చుట్టూ అలముకున్న అనేక జీవన అభినివేశాలు ఆదివాసి కథలు. వీటిధార తెలుగుసాహిత్యంలో నమోదవుతున్నాయి. ఆదివాసి కథారచనలో విప్లవోద్యమంలో పనిచేస్తున్న మహిళా కామ్రేడ్ల చొరవ ముఖ్యమైనది. తాయమ్మ కరుణ కథారచనలో కూడా ఆదివాసి సమాజపు చిత్రణ ఉన్నది. ఇక్కడ ఆదివాసి కథలంటే కేవలం డాక్యుమెంటరీ మాత్రమే కాదు. ఒకానొక జీవనవాస్తవికత. వారు మాట్లాడే భాషతో సహా ఆదివాసి కథలు క్రమాన్ని పరిశీలించవచ్చు. అనేక కథలను ఆదివాసి నేపథ్యంలో రాశారు. కరుణ ఆదివాసిల నుండి ఒక సజీవ భాషను నేర్చుకున్నారు.ఆమె కథలలో ఆదివాసి జీవన విధానం, జీవభాష ఉంటుంది. “నేను నడుస్తున్న దుఃఖాన్ని అని ప్రకటించుకున్న”తాయమ్మ కరుణ జీవితం,ఆచరణ, రచన, ఉద్యమం వీటన్నిటి మధ్య జీవితాన్ని కొనసాగిస్తుంది. ఒకానొక స్త్రీలో ఇన్ని భావోద్వేగాలు పలుకుతున్న తీరు తాయమ్మ కరుణ జీవనక్రమణికలో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఒంటరిగా అనేక జ్ఞాపకాల మధ్య కథల అల్లికను చేస్తున్నారు. తెలుగు సమాజంలో కరుణ వంటి అనుభవాలు కలిగిన మనుషులు వేరు. కరుణ విశాల జ్ఞాపకాల నుండి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విప్లవోద్యమ ఆచరణ నుండి తనని తాను విప్లవీకరించుకున్నారు. తెలుగు సమాజపు ఉన్నతాశయాలకు వేసినదారులు తెలుగు సాహిత్యాన్ని మరింత ఉన్నతీకరించాయి. తాయమ్మ కరుణ దీనికి కొన సాగింపు. జీవికకు ఒకనాటి టైపురైటింగ్ ఉండనే వుంది. ఒకరిపై ఆధారపడని జీవన భద్రత.
*
Add comment