చల్లటి జ్ఞాపకాల్లాగా కొండరాళ్ళమీద కరిగిపోతూ బిందు సందోహం. చెట్టుతొర్రలో చెప్పుకున్న రహస్యం రాతి గుండెలో మారుమోగే లోపు ఎన్ని ఋతువులు యవ్వనాన్ని ధారపోసుకున్నాయి? ఎన్ని చిగురాకులు విఫల మనోరధాలై నేల ఒడిలో నిద్రకి ఒరిగాయి? ఇంతకీ
ఎవరికి తెలుసు రూపాంతరాలు మొదలైన కేంద్రం ఎక్కడో!
గాలి కూడా తాకలేనంత రహస్యమైన తావులో దాచావు మనసుని. ఒక్కో అనుభవాన్నీ ఘాటు తగ్గేవరకు చప్పరించి మెల్లగా గొంతు దించుకుంటావు. రాత్రిని మోసగించి, నిశ్శబ్ద సంగీతాన్ని నిద్రపుచ్చుతావు. విచ్చుకోడం ఆలస్యమైందని పూలని నిందించడం మానేస్తావు ఈపూటకి. దుఃఖం తీరుతుందని కాదు కానీ, తలనిమురుతూ ఓదార్పు పొందే అరచేతుల మీద ప్రేమతోనే కాబోలు ఇంకాసేపు ఏడుస్తావు. అందుకే, ఇప్పుడు ఏ జత కళ్ళని చూసినా అవి నీకు రెండు సముద్రాల్లాగే కనబడతాయి.
***
రెండు పున్నముల మధ్య ఆటుపోట్ల ఆటలో గడుసుదేరిన కెరటం నీ హృదయమయింది. ముత్యపు చిప్పలో మెరిసిన ఒక చిరునవ్వు దాన్ని వేలం వేసి కొనుక్కుపోయింది. “ఇకపై కన్నీళ్లు నావంతు, కవిత్వం నీవంతు” అంటూ పొగమంచు పచ్చగడ్డిపై ప్రేమలేఖ రాసింది.
*
Add comment