మంచుతడి రాత్రులు

ఆమె తాను పోగొట్టుకున్న యవ్వనపు రోజుల్ని నాలో వెతుక్కుంటున్నదని ఆ ఊరి నుండి వచ్చాకే బోధ పడింది.

రిపోర్ట్ కార్డ్ నాన్నగారి చేతికందించి, ఆయన మొహంలోకి చూస్తున్నాను – కొంత భయంగా, కొంత ఆశగా. ఇంగ్లీషు, మేథ్స్ లలో మార్కులు బాగా వచ్చాయనీ, ఆ రెండు సబ్జక్ట్స్ లోనూ క్లాసు ఫస్టు నాదేననీ గుర్తించి మెచ్చుకుంటారేమోనని నా ఆశ.

ఆయన పెదవి విరిచి, సంతకం పెడుతూ, మా అమ్మకేసి తిరిగి –

“ఈసారి కూడా దీనికి హిందీలో బాగా తక్కువ మార్కులు వచ్చాయి. శారదా టీచర్ దగ్గర ట్యూషన్ పెట్టించు.” అన్నారు.

నాకు పట్టరాని ఉక్రోషం వచ్చింది. హిందీలో నూటికి పదిహేను వచ్చినా పాస్ అయినట్టే అనీ, నిజానికి హిందీలో కూడా నాకు క్లాసులో థర్డు ప్లేస్ వచ్చిందనీ, ఫస్టు వచ్చినవాడు హిందీవాడనీ, వాళ్ల ఇంట్లో హిందీయే మాట్లాడతారనీ, సెకెండ్ వచ్చిన అమ్మాయి ముస్లిం అనీ, ఉర్దూ హిందీలకి పెద్ద తేడా ఉండదనీ, తెలుగు పిల్లని అయి ఉండి హిందీలో ఇన్ని మార్కులు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం అనీ…ఇంకా చాలాచాలా చెప్పాలనుకున్నాను. కానీ నోరు పెగలలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతూండగా –

“శారదా టీచర్ ఎవరికీ ట్యూషన్ చెప్పదు,” అని మాత్రం అన్నాను, బుంగమూతి పెట్టుకొని.

నాన్నగారు నావైపు చూడనైనా చూడకుండా,

“నేను మాట్లాడతానులే,” అనేసి, ‘హిందూ’ పేపర్ ని మళ్లీ తన చేతుల్లోకి తీసుకున్నారు.

***

‘దిల్ జో న కెహసకా

వొహీ రాజ్-ఎ-దిల్

కెహనేకి రాత్ ఆయీ’

 

ఇదీ ఆ పాట. లతా మంగేష్కర్ పాడింది. రఫీ కూడా పాడినట్టున్నాడు. కానీ లతాదే గుర్తుండి పోయింది నాకు. అందుకు కారణం, ఆ పాటని తరచూ పాడుతూఉండే శారదా టీచర్ శ్రావ్యమైన గొంతు. ఆ పాట రేడియో రోజుల్లో అప్పుడప్పుడూ వినబడేది. బాల్యపు అమాయకత్వాన్ని కూడా అది విడిచిపెట్టలేదు. విన్నప్పుడల్లా గుండెల్లోంచి మాటల్లో చెప్పలేని ఏదో బాధ ఎగతోసుకొచ్చేది.

ఇప్పుడు విన్నా కూడా నరాలను ఎవరో మెలితిప్పినట్టుగా ఉంటుంది. ‘అయ్యో! ఎందుకీ ప్రపంచంలో ప్రతీ చోటా ఇంత దుఃఖం, అశాంతి, కొట్లాటలు, యుద్ధాలు ఉన్నాయి? ఈ మనుషులంతా ఎందుకిలా నానా బాధలూ పడుతున్నారు?’ అనిపిస్తుంది. ఈ అనుభూతిని జర్మన్ భాషాపదం అయిన ‘వెల్ట్ ష్మెర్జ్’ (weltschmerz) సరిగ్గా ప్రకటిస్తుందని ఎమ్మే ఇంగ్లీషు లిటిరేచర్ చదువుతూండగా తెలిసింది. బుద్ధుడు ప్రస్తావించిన ప్రాపంచిక దుఃఖం ఇదే కాబోలు.

చిన్నతనంలోనే నాలో సర్వవ్యాపిత ప్రాపంచిక దుఃఖం గురించిన అనుభూతిని కలిగించిన ఆ పాటని ఇటీవలే, అంటే సుమారుగా ఏభై ఏళ్ల తరవాత యూట్యూబ్ దినాల్లో – గూగుల్ సాయంతో వెతికి పట్టుకోగలిగాను. అది ‘భీగీ రాత్’ అనే సినిమాలోదనీ, ఆ పంక్తుల అర్థం – కాస్త అటూఇటూగా ఇలా ఉంటుందనీ – అప్పుడే తెలుసు –

‘హృదయం విప్పి చెప్పలేని

ఆ రహస్యాన్ని

చెప్పగలిగే రాత్రి మళ్లీ వచ్చింది’

 

చాలా హిందీ పాటలకి అర్థం తెలుసుకోగలిగానంటే అది శారదా టీచర్ చలవే. ఆమెకి హిందీ ఎంత బాగా వచ్చేదంటే ఆవిడ క్లాసులో పూర్తిగా హిందీయే మాట్లాడేది. ప్రత్యేకించి నన్ను అందరిలాగా పద్మా, పద్మావతీ అని కాకుండా, ఇంట్లో వాళ్లు పిలిచినట్టే, ‘పాపా’ అని పిలిచేది. నాకు తప్ప ఇంకెవ్వరికీ ట్యూషన్ చెప్పేది కాదు. నాక్కూడా వారానికి రెండు రోజులే – శని, ఆదివారాల్లోనే. మా నాన్నగారు ఆ ఊరి గవర్నమెంట్ డాక్టరు కదా, ఆయన మాట కాదనలేక నాకు మాత్రం చెప్పేది. ఇలాగని మా అమ్మ నాతో అంది. మొదటి రోజు హిందీ ట్యూషన్ కని బయిల్దేరుతూంటే, మా అమ్మ –

“పాపా, ఇప్పుడే చెప్తున్నాను. మళ్లీమళ్లీ చెప్పను. శారదా టీచర్ని నీ యక్ష ప్రశ్నలతో వేధించకు,” అన్నది.

“అంటే?” – నాకర్థం కాలేదు.

“ఆమె కుటుంబం గురించీ, ఆమె భర్తను గురించీ ఏమీ అడగకు,”

“ఏం? ఎందుకని?” నాలో కుతూహలం పెరిగిపోయింది.

“శారదా టీచర్ వాళ్లూ మనవాళ్లే గానీ పోయిపోయి మాలవాడ్ని చేసుకుంది,” అంది అమ్మ – స్వరం తగ్గించి రహస్యం చెబుతున్నట్లుగా.

“అయితే?”

“నీ కర్థం కాదు,”

నాకు అర్థం కాని విషయాలు ఈ ప్రపంచంలో ఉంటాయంటే ఒప్పుకొనే వయసు కాదు నాది. మరో ప్రశ్న వేసేలోగా అమ్మ,

“నర్సక్కని నీకు తోడుగా పంపనా? ఆమె డ్యూటీ అయ్యాక వెళ్దువుగాని. వచ్చేటప్పుడు నేను వస్తాను. రోడ్లమీద పోకిరీ వెధవలుంటారు,” అంది.

నర్సక్క అంటే మా నాన్నగారి హాస్పిటల్ లో పనిచేస్తున్న సీనియర్ నర్స్. ఆమె అసలు పేరు మెర్సీ. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతుంది. మంచి పనిమంతురాలని మా నాన్నగారికి ఆమె అంటే చాలా గురి. ఆయన ఆస్పత్రిలో పనిచేసేవాళ్లని మేము ‘అక్కా’, ‘అన్నా’ అని పిలవాలని నాన్నగారు పట్టుబట్టేవారు.

“అక్ఖర్లేదు. దగ్గరే కదా! నేనొక్కర్తినీ వెళ్లిరాగలను,” అన్నాను చిరాగ్గా.

ట్యూషన్ కి వెళ్లిన మొదటి రోజే ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. స్కూలునుంచి వచ్చాక శారదా టీచర్ కి పాత హిందీ సినీమా పాటలు పాడుకోవడం ఇష్టం. ఎప్పుడైనా ఓసారి భానుమతి పాటలు పాడేది. ఆమె గనక పాడకపోతే రేడియో మోగుతూ ఉండేది; రేడియో సిలోన్, లేకపోతే వివిధ్ భారతి. మా ఇంట్లో రేడియో ఉన్నది మా నాన్నగారు ఇంగ్లీషు వార్తలు వినడానికీ, ఆయన చేతి గడియారాన్ని, లేదా మా గోడ గడియారాన్ని సరిదిద్దుకోవడానికీ మాత్రమే. ఇంకెవ్వరూ రేడియోని ముట్టుకోకూడదు. గ్రామఫోను కూడా అంతే. ఆదివారం పొద్దున్నపూట భోజనానికి ముందు రెండు గంటలసేపు మా నాన్న వినిపించే శాస్త్రీయ సంగీతం మాత్రమే వినాలి. శారదా టీచర్ మాత్రం అలాకాదు. తన రేడియోని తిప్పనిచ్చేది. అంతేకాదు, ఆదివారాలలో అయితే నాకోసం ఏదో ఒక చిరుతిండి చేసిపెట్టేది. జంతికలు, సున్నుండలు, మైసూరు పాక్, సాతాళించిన శనగలు, పకోడీలు, బజ్జీలు – ఇలా అన్నమాట. శారదా టీచర్ ట్యూషన్ జీతం తీసుకోదు గనక మా అమ్మ కూడా ప్రతీసారీ ఏదో ఒకటి చేసి నాతో పంపేది.

మొత్తం మీద హిందీ ట్యూషన్ పట్ల నాకు మొదట్లో ఉన్న అభ్యంతరాలన్నీ తొలగిపోయాయి. అంతే కాదు, శని, ఆదివారాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూడడం మొదలుపెట్టాను. శారదా టీచర్ వద్దకు ట్యూషన్ కి వెళ్లడం, ఆమెతో ఆ కొద్దిగంటలూ యథేచ్ఛగా గడపడం మా అమ్మా నాన్నలపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగానూ, వాళ్లు విధించే ఆంక్షలపై తిరుగుబాటు చేస్తున్నట్లుగానూ అనిపించి నా మనసుకి దిలాసాగా ఉండేది.

రోజులు గడుస్తున్నకొద్దీ శారదా టీచర్ గురించి చాలా విషయాలు తెలిసాయి. అప్పుడంటే ఆ చిన్న ఊళ్లో టీచర్ గా పనిచేస్తూ ఉండేది గానీ అంతకు ముందు ఆమె దేశంలో ఎన్నోచోట్లకి వెళ్లిందట. జోధ్ పూర్, జైసల్మీర్, మౌ, దెహు, లడ్డాఖ్, గౌహతి,…ఈ పేర్లన్నీ మొదట శారదా టీచర్ ఇంట్లో ఆమె నోటనే విన్నాను. అవన్నీ గొప్ప వింతలతో నిండిన అద్భుతమైన ప్రదేశాలని నేను ఊహించుకున్నాను. నా ప్రశ్నలకు అంతు లేదు. ఆమె విసుక్కోకుండా నవ్వుతూ జవాబులు చెప్పేది. అట్లాస్ తీసి ఇండియా మ్యాప్ లో వాటిని చూపించేది. ఆ ఊళ్లకి వెళ్లాలంటే ఎక్కడెక్కడ ట్రెయిన్లు మారాలో చెప్పేది. పుస్తకాలు తెరిచి ఎన్నో వివరాలు చూపేది. ఎన్సైక్లోపీడియా తీసి నా ముందుంచేది.

దెహు సమీపాన ఉండే కార్లా బౌద్ధ గుహల గంభీర ఏకాంతం, వర్షాకాలంలో లోనావలాలో పశ్చిమ కనుమల అందాలు, పూనా-బొంబాయి రైలు మార్గంలో ఉండే భయం గొలిపే సొరంగాలు – కళ్లకు కట్టినట్లుగా ఆమె వర్ణించిన తీరు మూలంగా – నాలో శాశ్వతమైన ముద్రను వేసాయి. నేను స్వయంగా వెళ్లి ఆ ప్రదేశాలన్నీ చూశానేమో అని నాకనిపించేది. అనేక నూతన ప్రపంచాలను దర్శింపజేసే కిటికీలను ఆమె నాకై తెరిచింది.

విసుగు పుట్టించే ఆ పల్లెటూర్లో, శారీరక మార్పులు తెచ్చిపెడుతూన్న సంభ్రమానికీ, ఆందోళనకీ మధ్య సతమతమవుతూ, పిల్లల ఆటల్లో ఆసక్తిని పోగొట్టుకొనీ, పెద్దవాళ్ల నంగిమాటల వెనుక దాగి ఉండే ఆంతర్యాన్ని పూర్తిగా తెలుసుకోలేకా తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్న ఆ రోజుల్లో శారదా టీచర్ నాకొక స్వంత ఉద్యానవనాన్ని ఏర్పరచింది. అందులో స్వేచ్ఛగా విహరిస్తూ, అక్కడి వింత పూల సువాసనలను ఆస్వాదిస్తూ, పక్షుల కిలకిలారావాలు వింటూ ఎన్నో సాయింత్రాలు నన్ను నేను మైమరచిపోయాను. లతా, ఆశా, రఫీ, తలత్, హేమంత్, ముకేష్, కిశోర్ లు సృష్టించిన రసమయ ప్రపంచం, నా లోలోపల చెలరేగుతూన్న తుఫానులనుండి నాకు తెరిపినిచ్చింది. అయితే అంతకుముందు లేని కొత్తకొత్త వాంఛల్నీ, ఆకాంక్షల్నీ కూడా చిగురింపజేసింది. నా సాహచర్యం ఆమెకు కూడా అంతే ప్రాణప్రదంగా మారిందని నాకు అనిపించసాగింది.

హిందీ పాఠాలనేవి మా మధ్య పెరుగుతూన్న స్నేహపు కొనసాగింపుకి ఒక సాకు మాత్రమే. ట్యూషన్ కని వెళ్లినప్పుడల్లా ఆ వారంలో మా క్లాసులో జరిగిన విశేషాలు, నా స్నేహితులతో జరిగిన వాగ్వివాదాలు, మాటలు మానెయ్యడాలూ, మళ్లీ కలిసిపోవడాలూ, మాలో కొందరికి దొంగ చూపుల అబ్బాయిలు రాసే ప్రేమలేఖలు – వీటన్నిటి గురించీ పూసగుచ్చినట్లుగా, నిర్భయంగా ఆమెకు చెప్పేదాన్ని. వాటిల్లో మా అమ్మకి కూడా చెప్పని సంగతులెన్నో ఉండేవి. ఆమెకూడా విప్పారిన కళ్లతో ఆసక్తిగా వినేది. వివరాలు అడిగేది. మా మధ్య మొలకెత్తుతూన్నది స్నేహం కన్నా కూడా ఒక పాలు ఎక్కువే అనిపించసాగింది. ఆమె తాను పోగొట్టుకున్న యవ్వనపు రోజుల్ని నాలో వెతుక్కుంటున్నదని ఆ ఊరి నుండి వచ్చాకే బోధ పడింది.

ఆర్మీలో కేప్టెన్ గా ఉండిన తన భర్తతో ఆమె దేశంలో ఎన్నో మారుమూల ప్రదేశాలలో తిరిగిందట. ఆ సుదూర ప్రాంతాలలో తీసుకున్న ఫొటోలు కొన్ని గోడల మీదా, చాలా ఆల్బంలలోనూ ఉండేవి. అన్నీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలే. అసలు శారదా టీచర్ ఇల్లే ఒక మ్యూజియంలాగా ఉండేది. ఆమె తన భర్తతో తీసుకున్న ఫొటో డ్రాయింగ్ రూంలో పటం కట్టి గోడకి తగిలించి ఉండేది. అందులోంచి వాళ్లిద్దరూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ముందుముందు ఏం జరగబోతోందో అని ఆసక్తిగా చూస్తూండేవారు. ఆ ఫొటోలో అతను అర్మీ యూనిఫాంలో ఆత్మవిశ్వాసంతో – వేసవి సెలవులకి విశాఖపట్నం వెళ్లినప్పుడు చూసిన ‘హమ్ దోనో’ సినీమాలో మీసాల దేవ్ ఆనంద్ లాగా స్మార్ట్ గా ఉంటాడు. కాకపోతే కాస్తంత నలుపు. శారదా టీచర్ వయసులో బాగా చిన్నగా, అందంగా, కాటుకదిద్దిన అమాయకపు కళ్లతో, కొంచెం సిగ్గుపడుతూనే కుతూహలంగా చూస్తూ ఉంటుంది. ఆ ఫొటోని ఎన్నిసార్లు, ఎంత సేపు చూశానో. ఇప్పుడు ఆమె కళ్ల చుట్టూ చేరిన నల్లరింగులుగానీ, నుదుటి మీద పేరుకున్న గీతలుగానీ ఆ ఫొటోలో కనబడవు. ఆ ఫొటోలో ఆమె కట్టుకున్న చీర తాలూకు బోర్డర్ కూడా నాకిప్పటికీ గుర్తే. మొదట్లో ఓమారు అలా చూస్తూంటే, శారదా టీచర్ –

‘మా పెళ్లయిన వారం రోజులకి స్టుడియోకి వెళ్లి తీయించుకున్నాం, జైసల్ మీర్ లో,’ అంది.

ఆనాటి నుండీ ఆమె రహస్య శిబిరంలో కాలం వెళ్లదీస్తున్న రాజకుమార్తెలాగా కనబడేది. ఆమెను అక్కడ దాచిపెట్టి అర్ధాంతరంగా యుద్ధానికి వెళ్లిపోయిన రసపుత్ర వీరుడిలాగా ఆమె భర్త అగుపించాడు. గుర్రాల డెక్కల చప్పుడూ, సకిలింపులూ, కత్తులు ఝళిపించే రౌతుల అదిలింపులూ వినబడేవి. మండుటెండలో దౌడుతీసే గుర్రాలు రేపిన ఎడారి ఇసుక తెరలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. అతగాడు వెళ్లేముందు ఆమె ఇంటి చుట్టూ సైనికులను పహారాకి పెట్టకపోవడం నాకు విచారం కలిగించేది.

అతని పేరు సెబాస్టియన్ అని ఒక ఆర్మీ ఆఫీసర్ల గ్రూప్ ఫొటో ద్వారా తెలిసింది. ఆ పక్కనే ఒక మెడల్ వ్రేలాడదీసి ఉంది. దానిమీద కూడా అదే పేరు – ‘కేప్టెన్ రొనాల్డ్ ఎల్. సెబాస్టియన్’. వెలవెలబోయిన ఆ మెడల్ నీ, వెలిసిపోయిన దాని రిబ్బన్ నీ పరిశీలనగా చూస్తూంటే –

“1962 చైనా వార్ లో ఆయనకిచ్చారు,” అన్నది శారదా టీచర్. కొంచెం గర్వం ధ్వనించింది ఆమె గొంతులో.

“మరి దాని మీద 1964 అని ఉందే?”

చెప్పాలా వద్దా అన్నట్లు ఆమె ఒక్క నిమిషం తటపటాయించింది.

“ఆయన రెండు సంవత్సరాల పాటు చైనా వాళ్ల చేతుల్లో ఖైదీగా ఉండి వచ్చారు,” అంది చివరికి. నాలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. నోరు విప్పేలోగా,

“పాపా, నిన్నటి పాఠం మరో సారి చెప్పుకుందాం, పుస్తకం తియ్యి,” అంది హిందీలో. అంటే టీచర్ అవతారం ఎత్తిందన్నమాట. ఇంక కబుర్లు చాలు అని దానర్థం.

అమ్మ చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. ఎంత లోతైన స్నేహబంధాన్నయినా తెగేదాకా లాగకూడదని నాకు తెలుసు. వాళ్లిద్దరి కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటో ఒక్కటీ కనబడలేదు, ఎందుచేత చెప్మా? రమారమి మరో ఏభై ఏళ్లకిగాని ఈ సందేహానికి జవాబు దొరకలేదు.

***

మరుసటి ఏడు మా నాన్నగారికి ఆ ఊరినుండి బదిలీ అయిపోయింది. మరో ఏడాదిలో నేను కాలేజిలో చేరాను. రెండు మూడేళ్లపాటు క్రమం తప్పకుండా న్యూ ఇయర్ గ్రీటింగ్స్, టీచర్స్ డే శుభాకాంక్షలు పంపాను. ఉత్తరాలు రాశాను. ఆమె కూడా అప్పుడప్పుడూ రాసేది. ఆ తరువాత మా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. శాశ్వతం అనుకున్న బంధం అలా ముగిసిపోయింది. చూస్తూ ఉండగానే నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి. శారదా టీచర్ ఇప్పుడెలా ఉందో?… అసలు ఉందో లేదో?…

ఆ ముందు ఏడాది నాన్నగారు పోయారు. మొదటి వర్ధంతి సందర్భంగా పేపర్లలో ఫొటో వేయించాం, నర్సక్క అది చూసిందట. ఎంతో అభిమానంగా ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడింది. విశాఖపట్నంలోనే ఉందటగానీ అనారోగ్యం మూలంగా రాలేకపోతున్నానంది. నన్నే వాళ్ల ఇంటికి రమ్మంది. చుట్టాలందర్నీ సాగనంపాక నేను బయల్దేరాను. మా డ్రైవర్ కి ఆ ఏరియా బాగా తెలుసు. ఇల్లు సులభంగానే కనుక్కున్నాం.

నర్సక్క ఇల్లు చిన్నదేగానీ చాలా పరిశుభ్రంగా ఉంది. చిన్న డ్రాయింగ్ రూంలోనే నర్సాపురం లేసులు పరచిన సోఫా సెట్టు; గోడపై వెలుగుతూ ఆరుతూ ఉండే చిన్న బల్బుల మధ్య దీవిస్తున్న ఏసు క్రీస్తు – ముళ్లకిరీటంతో.

కునుకుతీస్తున్న పోమెరేనియన్ నన్ను చూడగానే నిద్రలేచి భౌభౌమని పలకరించి హడావుడిగా అటూఇటూ పరుగులు తీసింది. దాని అరుపులు వినబడ్డాయి కాబోలు,

“రా అమ్మా! కూర్చో! అదేం చెయ్యదు. ఎంత పెద్ద దానవైపోయావో!” అంటూ వాకర్ సాయంతో నడుస్తూ లోపల్నించి వచ్చింది – నర్సక్క. బాగా చిక్కిపోయింది. జుత్తు పూర్తిగా నెరిసిపోయి పలచబడింది. నర్సు యూనిఫాంలో స్మార్ట్ గా, స్ట్రిక్ట్ గా ఉండేది. ఇప్పుడామె వేసుకున్న హౌస్ కోటు వదులుగా ఆమె శరీరంపై వేలాడుతోంది, ఆమె చర్మం లాగే. గొంతు మాత్రం ఖణీమని వినిపిస్తోంది – పూర్వం మాదిరిగానే. నన్ను ఆప్యాయంగా కౌగలించుకొని నుదుటిమీద చిన్న ముద్దుపెట్టింది.

“గో ఇన్సైడ్, గూఫీ, గో ఇన్సైడ్,” అంది కుక్కతో. అది ఆమె కేసి ఒకసారి చూసి, సోఫా ముందున్న టీపాయ్ క్రింద కూర్చుంది – మా మాటలు వినడానికని.

“నేనిక్కడ ఈ చేతుల కుర్చీమీద కూర్చుంటాను పాపా. ఇక్కడైతే నాకు లేవడం సులువు. నువ్వలా సోఫా మీద కూర్చో,” అన్నది. నన్ను ఇంట్లో ‘పాపా’ అని పిల్చేవాళ్లని ఈమెకి ఇంకా గుర్తుంది. లేదా ఆ మస్తిష్కపు సన్ననిదారులనుండి ఆకస్మికంగా, అనాలోచితంగా వెలువడిన జ్ఞాపక శకలమేమో?

నేను తీసుకొచ్చిన స్వీట్ పేకెట్ ని టీపాయ్ మీద ఉంచాను.

మెర్సీ నన్ను పరిశీలనగా చూస్తూ, ఇంగ్లీషులో –

“నిన్ను చూస్తుంటే మీ అమ్మే గుర్తుకొస్తోంది. డాక్టర్ గారి పోలికలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ముక్కూ, నుదురూ ఆయనవే. చిన్నప్పుడు తెలీవుగానీ, పెద్దవుతున్నకొద్దీ బయటపడతాయి,” అన్నది.

“అక్కా! నీకు అభ్యంతరం లేకపోతే మన మాటలు రికార్డ్ చేస్తాను,”

“చేసుకోలేగానీ, ఏం చేద్దామని – ఈ రికార్డింగ్?”

“నేనూ, తమ్ముడూ, చెల్లీ – నాన్నగారి జ్ఞాపకాలతో ఒక సావనీర్ లాగా తీసుకొద్దామనుకుంటున్నాం. ఆయన స్నేహితులు, ఆయనతో పనిచేసిన వాళ్లతో ఇంటర్వ్యూలు – దొరికితే ఫొటోలు చేర్చాలనుకుంటున్నాం. ఇంగ్లీషు, తెలుగు – నీకెలా తోస్తే అలాగే,” అంటూ నా స్మార్ట్ ఫోన్ ని రికార్డింగ్ మోడ్ లో పెట్టాను. నర్సక్క మాట్లాడడం మొదలు పెట్టింది –

“నేనాయనతో కలిసి పని చేసింది పదేళ్లే అయినా డాక్టర్ గారి గురించి చెప్పాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. అప్పుడు మీరంతా బాగా చిన్నవాళ్లు, మీకు తెలియని సంగతులు చాలానే ఉంటాయి. మొట్టమొదట ఒక విషయం చెప్పాలి. అసలు ఉత్తరాంధ్ర జిల్లాలలో పబ్లిక్ హెల్త్ కేర్ అంటే ఏమిటో, జనాలకి, ముఖ్యంగా బీదవాళ్లకి దాని మూలంగా ఎంత మేలు జరుగుతుందో మీ నాన్నగారు వచ్చాకే అందరికీ తెలిసింది. మేం కూడా ఎంతో ఉత్సాహంతో ఆయన కింద పనిచేసాం. స్టాఫ్ ని ఎలా చూసుకోవాలో, వాళ్ల దగ్గర్నుంచి ఎలా పని రాబట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన దగ్గర మేమంతా చాలా నేర్చుకున్నాం. మేం చేస్తున్న పని దైవకార్యమనే మేమంతా అనుకొనేవాళ్లం. పేషెంట్లకయితే ఆయన దేవుడే. ఆయన మంచి డాక్టర్, సందేహం లేదు; అంత కన్నాకూడా ముఖ్యంగా చాలా మంచి మనిషి. రెండు మూడు కేసులు చెప్తాను, అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు…” ఇలా చాలా చెప్పుకుపోయింది.

నాన్నగారూ, అతని సహోద్యోగులూ రాత్రనక, పగలనక వైద్యసేవలందించేవారని మెర్సీ వివరించినప్పుడు అది కొత్త విషయం అనిపించలేదుగానీ పేషెంట్లతో, వారి బంధువులతో ఆయన చాలా సౌమ్యంగా మాట్లాడేవారనీ, ప్రాణాంతకమైన జబ్బులతో బాధపడే వాళ్లకు కూడా ఎంతో మనోధైర్యం కలుగజేసేవారనీ ఆమె అన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. పరిమితమైన నిధులతో, పరికరాలతో, సదుపాయాలతో ఆ రోజుల్లో నాన్నగారిలాంటి గవర్నమెంటు డాక్టర్లు అన్ని మంచి పనులు చేశారంటే ఇప్పుడు నమ్మడం కష్టం. నాన్నగారి మీద నాకున్న గౌరవభావం పదింతలు పెరిగిపోయింది – మెర్సీ మాటలతో. ముక్కూమొహం తెలియనివాళ్లు అంతమంది ఎందుకు ఇంటికి వచ్చీ, ఫోన్లు చేసీ పరామర్శించారో కొంచెంకొంచెంగా అర్థం కాసాగింది. నాన్నగారి పాతకాలపు మంచితనాన్నీ, ఆ తరంవాళ్ల అంకితభావాన్నీ తల్చుకుంటే మాటల్లో చెప్పలేని దుఃఖం ముంచుకొచ్చింది. తల్లిదండ్రులు వదిలి వెళ్లే జ్ఞాపకాలు, క్షోభ, పశ్చాత్తాపం మన లోలోపల గూడుకట్టుకొని శాశ్వతంగా ఉండిపోతాయి; మన అంతిమ ప్రయాణాల్లో కూడా తోడుగా సాగి శ్మశానం చేరుకొనే వరకూ మనల్ని వెంటాడతాయి.

మెర్సీ మాటల ప్రవాహం ఆగింది. కొంచెం ఆయాసపడుతూ,

“చూశావా? మర్చేపోయాను. టీ తాగుదాం. నీ కోసం కేకు తెప్పించాను – నా మనవరాలి చేత. దాంట్లో ఎగ్ ఉంటుంది. తింటావు కదా?” అంటూ లేచి వాకర్ తో లోపలికి నడిచింది. నేనూ ఆమె వెంట నడుస్తూ –

“అన్నీ తింటాను. అయినా అక్కా, టీ నేను చేస్తానులే, పద,” అన్నాను.

గూఫీ నిద్ర లేచి తనక్కూడా ఏదైనా పెట్టమని కాబోలు, తోకాడిస్తూ మాతోబాటుగా వంటింట్లోకి చేరుకుంది.

***

టీ తాగుతూ మాట్లాడసాగింది, మెర్సీ. ఆమెలో పాత జ్ఞాపకాలు రేకెత్తించిన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది –

“డాక్టర్ గారి వైద్యం గురించి చాలానే చెప్పాను కదా? ఆయన చేసిన సోషల్ సర్వీస్ గురించి కొంచెమైనా చెప్పాలి. ఈ రోజుల్లో ఇరుగుపొరుగు వాళ్లనే పట్టించుకోరు. ఆయన ఎంతమందికి ఎన్ని విధాలుగా సాయపడ్డారో చెప్పడం కష్టం. నాకు తెలిసిన కేసులే లెక్కలేనన్ని ఉన్నాయిగానీ, నీకు పరిచయం ఉన్న వ్యక్తి గురించి చెబుతాను. శారదా టీచర్ నీకు గుర్తుందా? నువ్వు ట్యూషన్ కి కూడా వెళ్లేదానివి,”

సోఫా మీదనుండి క్రింద పడిపోతానేమో అన్నంతగా షాక్ అయ్యాను. ఎప్పటి శారదా టీచర్!? వొళ్లంతా ఒక గగుర్పాటు.

“1962లో జరిగిన చైనా వార్ లో ఆమె భర్త యుద్ధఖైదీగా టిబెట్ లో రెండేళ్లున్నాడు. తిరిగి వచ్చేవరకూ అతను బతికున్న విషయం ఎవరికీ తెలియలేదు. పోయాడనే అనుకున్నారు – అంతా. శారదా టీచర్ అతన్ని చేసుకోవడం ఆమె ఇంట్లో ఎవరికీ ఇష్టంలేదు. ముఖ్యంగా ఆమె తమ్ముడికి. సెబాస్టియన్ – ‘మిస్సింగ్ ఇన్ ఏక్షన్’ అని తెలిసినప్పుడు ఆమె ఇంటిమీద పడ్డాడు. చంపుతానని బెదిరించాడు. కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడు మీ నాన్నగారు స్వయంగా వెళ్లి అడ్డుకున్నారు. పోలీసు కంప్లయింట్ ఇచ్చారు. దాంతో అతగాడు తోక ముడిచాడు. శారదని కొన్నాళ్లు మా ఇంట్లో దాచారు,”

“1964లో అతను తిరిగి వచ్చాడన్నమాట. పోనీ అప్పుడైనా కొంతకాలం పాటు భార్యా భర్తలు వాళ్ల మానాన వాళ్లున్నారా?”

“అరు నెలలు కూడా తిరక్కుండా 1965లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది. దురదృష్టం ఏమిటంటే అప్పుడు కూడా సెబాస్టియన్ కాలికి తూటా తగిలి శత్రువులకి పట్టుబడ్డాడు. ఏమయ్యాడో తెలియలేదు. శారద చాలా అప్సెట్ అయిపోయింది. హిస్టీరికల్ గా తయారైంది. అప్పుడు కూడా డాక్టరుగారు ఆమెకు చాలా సాయం చేసారు. డిప్రెషన్ కి మందులిచ్చారు. వైజాగ్ తీసుకొచ్చి మొదట కేజీఎచ్ లో, తరవాత మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ తరవాత ఆయన ద్వారా శారద ఎంతో మంది పెద్దవాళ్లని కలిసింది. డాక్టరుగారు రక్షణ మంత్రికీ, ప్రధాన మంత్రికీ స్వయంగా ఉత్తరాలు రాశారు. లోకల్ ఎంపీ చేత పార్లమెంటులో ప్రశ్నలు అడిగించారు. చివరికి సెబాస్టియన్ బతికే ఉన్నాడని తెలిసింది. అరవై తొమ్మిదిలో విడుదలయ్యాడనుకుంటాను. మళ్లీ 1971లో యుద్ధం వచ్చింది. నీకు జ్ఞాపకం ఉండాలే?”

“అవును, బాంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. బాగా గుర్తుంది,”

“1971 బాంగ్లాదేశ్ యుద్ధంలో మన సైనికులు ఢాకా పట్టణాన్ని సమీపిస్తూండగా జరిగిన పోరాటంలో సెబాస్టియన్ చనిపోయాడు. అప్పటికతను మేజర్ గా ప్రమోట్ అయ్యాడు. చనిపోయాక వీరచక్ర ఇచ్చారు. శారదా టీచర్ ఢిల్లీ వెళ్లి రిపబ్లిక్ డే నాడు ప్రెసిడెంట్ చేతులమీదుగా తీసుకుంది.”

“శారదా టీచర్ ఇప్పుడు…?”

“పోయి పదేళ్లు అవుతుంది. భర్త పోయాక ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.”

“పిల్లలు?”

“ఆమెకు పిల్లలు కలగ లేదు. ఒక ఆడపిల్ల – పురిట్లోనే పోయింది. నేనే మంత్రసానిని. అప్పటికి నువ్వు చాలా చిన్నదానివి. ఆ బిడ్డ బతికి ఉంటే మీ చెల్లెలు వయసుది అయి ఉండేది,”

“ఆమె చివరిలో డబ్బుకి ఇబ్బంది పడిందా?”

“అబ్బే, ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పెన్షన్ వచ్చేది. అయినా ఒంటరిది. పిల్లా, జెల్లా ఎవరూ లేరు కదా! ఆమెకు డబ్బు అవసరాలు అంతగా ఏముంటాయి? పైగా ఆమెకు హైవేమీద ఒక పెట్రోల్ బంకు కూడా ఎలాట్ అయింది,”

“పోన్లే…చివరి రోజుల్లో బాగానే గడిచిపోయింది కదా?”

“ఏం బాగు? ఆమె తమ్ముడు ఆ బంకుని నడిపేవాడు. బాగా సొమ్ము చేసుకున్నాడు. అడ్డగోలుగా సంపాదించాడంటారు. ఈమె చేతిలో పాతికో పరకో పెడుతూండేవాడు. ఊళ్లో తగవులన్నీ ఇంటి మీదకి తెచ్చేవాడు. శారదకి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఆమె మొహం చూసి జనం ఊరుకొనేవారు. అతనిప్పుడు దేశభక్తుల పార్టీ నాయకుడు,”

“నీకివన్నీ ఎలా తెలుసు?”

“సెబాస్టియన్ ది నర్సపూర్, వెస్ట్ గొడావరి. అది మా పినమావగారి అల్లుడి ఊరు. వాళ్లదీ వీళ్లదీ ఒకే చర్చి. మాకూ సెబాస్టియన్ కీ కూడా ఏదో బీరకాయపీచు బంధుత్వం ఉంది. ఇవన్నీ తరవాత తెలిసాయి. సెబాస్టియన్ సమాధి పక్కనే తనని కూడా పాతిపెట్టమని శారదా టీచర్ చివరి కోరిక. నాకు కబురు పెట్టింది; పాస్టర్ గారికి కూడా చెప్పింది,”

“మరి…?”

“అది కూడా నెరవేరలేదు. ఆమె తమ్ముడు పడనివ్వలేదు. దహనమే చేశారు, హిందూ పద్ధతి ప్రకారం. అప్పుడనిపించింది, మీ నాన్నలాంటి పెద్దమనుషులెవరైనా మాకు తోడుగా వచ్చి ఉంటే ఆ మూర్ఖుడు దిగి వచ్చేవాడేమో అని. ఈ రోజుల్లో డాక్టర్ గారి లాంటివాళ్లెవరూ కనిపించడం లేదు,”

కాసేపు మా ఇద్దరి మధ్యా మౌనం. ఏమనడానికీ నాకు తోచలేదు. నా లోలోపల ఏదో అలజడి. మెర్సీయే మళ్లీ నోరు విప్పింది –

“నేనూ పాస్టరుగారూ వెళ్లి శారద తమ్ముడ్ని చాలా బతిమాలాం. కాళ్లావేళ్లా పడ్డాం. కనీసం కొంచెం అస్థికలైనా, చివరికి బూడిదైనా ఇవ్వమన్నాం – సెబాస్టియన్ సమాధి పైన జల్లడానికి. అతను పరమ కర్కోటకుడు. ఎన్ని విధాలుగా చెప్పినా అతని మనసు కరగలేదు. మమ్మల్ని నానా తిట్లూ తిట్టి గుమ్మంలోంచే పంపేశాడు.”

నాకు పట్టరాని దుఃఖం వచ్చింది. వెక్కివెక్కి ఏడవసాగాను. మెర్సీ నెమ్మదిగా లేచివచ్చి సోఫాలో నా పక్కన కూర్చుంది. నన్ను దగ్గరకు తీసుకుంది. నా తలను ఆమె ఒళ్లో పెట్టుకుంది.

గూఫీ ‘కుయ్యి, కుయ్యి’ అంటూ మెర్సీ హౌస్ కోట్ ని కరచిపట్టుకొని లాగింది. దానికేదో అర్థం అయింది.

మరి కాసేపట్లో ఇంటికి బయిల్దేరాను. మనసంతా దిగులుగా ఉంది.

హృదయం విప్పి తన సహచరుడికి రహస్యం చెప్పుకోగల చల్లని మంచు రాత్రులు రాకుండానే శారదా టీచర్ కథ ముగిసిపోయింది.

*

Unudurti Sudhakar

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా రోజుల తర్వాత సుధాకర్ గారి కథ చదివే అవకాశం కలిగింది…మనుషుల్లో క్రూరులు,దయామయుడు,నిర్లిప్తులు
    ఎంతోమందుంటారు.ఆ పొరలను విప్పిచెప్పటంలోనే కథకుడి ప్రతిభ కనిపిస్తుంది.కులాంతర వివాహం లోని ఆర్ద్రత హత్తుకునేలా చెప్పారు.. టీచర్,హిందీ పాటలు..ఇంట్లో స్ట్రిక్ట్ గా ఉండే నాన్న..నర్సక్క లాంటి వారితో గతంలోకి తీసికెళ్ళారు రచయిత..దేశభక్తుల పార్టీ నాయకుడు ఆ తమ్ముడు అని సెన్సిటివ్ గా చెప్పడంలో నే
    ఇప్పుడెటునడుస్తున్నామో చెప్పారు..
    Readability is writers forte
    We don’t miss it here also
    Kudos to Sudhakar Garu..

  • ఏంటండీ ఇది, కధా, గాధా, జీవితశకలమా, అందరి ఆత్మకథ లా….ఆహా…..ఆపాత మధురం….నన్ను పూర్తి గా లోబరుచుకున్న అత్యంత ఆసక్తికరమైన రమ్యమైనదీ ఇది….ఆశ్చర్యపోతూ……ఉండిపోతాను…వే బతికి ఉన్న ప్రతి రోజూ……………

  • కథ చాలా బాగుంది. మనసుక అత్తుకునేలా నిజ జీవితంలో జరిగే విషయాలు ఎన్నో ఇందులో ఇమిడి ఉన్నాయి అనిపించింది. చివర్లో శారదా టీచర్ విషాదం నిజంగా మనసును కదిలించింది.

  • బాగుంది. ముఖ్యంగా ఆసక్తికర కధనం. విభిన్న అంశాలు స్పృశిస్తూ, ఒక్కో ముడి విప్పుకుంటూ….. విషాదాంతం అయినా దానిని మనం తొలగించాలని…తొలగించగలమని….ఒక. positive దృక్పథం కలిగిస్తూ…

  • సుధాకర్ గారూ .. ఎంత బాగా రాశారండీ. శారద పాత్రను మీరు ఏదో రూపంలో ఎరగకపోయి ఉంటారని నేను అనుకోను. సాఫీగా సాగినకథనమే కాని ఎక్కడో గుండె పట్టెసిన అనుభూతి . ధన్యవాదాలు .

  • ‘మంచుతడి రాత్రులు’ కథపై తమతమ అభిప్రాయాలను తెలియజేసిన మిత్రులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కథలో ప్రస్తావించిన పాటకై ఇక్కడ క్లిక్ చేయగలరు:

    రచన: సాహిర్ లుధియాన్వి, సంగీతం: రోషన్, గాయని: లతా మంగేష్కర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు