మంచి నవలలు వస్తూనే వున్నాయి!

రాయలసీమ సాహిత్యంలోని వివిధ అంశాలపై, రచయితలపై ప్రత్యేక రచనలకు సారంగ ఆహ్వానం పలుకుతోంది. మీ రచనలని editor@saarangabooks.com కి పంపించండి.

రాయలసీమ కథకులు  తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకొన్నారు. నేలవిడిచి సాముచేయని విధంగా, మట్టివాసనలను పలవరిస్తూ ఒక ఆమోదయోగ్యమైన పీఠం మీద ఉన్నారని వారి శైలీశిల్పాలే నిరూపిస్తున్నాయి. సింగమనేని నారాయణ ఒకచోట “ఇక్కడి రచనలు వ్యాపారమయం కాలేదు. సామాజికతృష్ణ కలిగినవారు. వస్తువు వల్ల మాత్రమే కాదు. కళాత్మకంగా విశ్వసనీయత లోపించకుండా సమ్యమనంగా రచనలు చేయడంవల్లనే రాయలసీమ రచనలు ఈనాడు పాఠకులు, విమర్శకులూ  ఆహ్వానిస్తున్నారు”  అనే మాటలు సరిగ్గా ఆర్.సి.కృష్ణస్వామిరాజు రచించిన “మేకలబండ” గురించే చెప్పినట్లు నాకనిపిస్తోంది.

వేంపల్లి గంగాధర్‌ ముందుమాటలో గ్రామీణ వాతావరణం గురించి గానీ మానవ సంబంధాల గురించి గానీ వస్తున్న రచనలు “బాగా తగ్గిపోయాయి” అనడంలో పూర్తి నిజం లేదనిపిస్తుంది. రాయలసీమ నుండి రాజుగారితో సహా, వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డివంటి ఎంతోమంది రచయితలు రాయలసీమ గురించి, గ్రామీణ వాతావరణం, మానవసంబంధాలపై కథలు, నవలలు రాస్తూనే ఉన్నారు. “తగ్గిపోవడం” అనేది కేవలం మొదటితరం, రెండవతరం రచయితలను దృష్టిలో పెట్టుకొని అన్నట్టు అనిపిస్తుంది. మునుపటికన్నా ప్రస్తుతం కథలు, నవలల పోటీలు ఉధృ తమయ్యాయి. రాయలసీమ రచయితలు సైతం పోటీపడి రాస్తూ అవార్డులు, బహుమతులు తెచ్చుకుంటున్నారన్న సత్యానికి  ఈ “మేకలబండ” నవల అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ వారి పురస్కారానికి ఎంపిక అవడమే!

రా.వి శాస్త్రి, కా.రా, భరాగో వంటివారు వారి కళింగ మాండలికంలో కథలు, నవలలు రాసినప్పుడు హర్షామోదాలు తెలిపిన పాఠకులు, విమర్శకులు, మొదట్లో రాయలసీమ భాష, యాస విషయంలో ఎందుకో అంత సుముఖత చూపించినట్లు నాకనిపించలేదు. మధురాంతకం రాజారాం చెప్పినట్టు “రెండు బండల మధ్యగల నెరియలోంచి అంకురించి తన ఉనికికోసం, మనుగడ కోసం, ప్రకృతితో పోరాడే రావి మొక్కలా ఎదిగి శాఖోపశాఖల మహావృక్షంలా విస్తరిల్లిన రచయిత కె.సభా” అని సంభావించారు. కె.సభా నుండి ప్రారంభమయిన కథ, నవలా సాహిత్యం అనేక మలుపులు తీసుకొని స్వయంసిద్ధంగా స్వచ్ఛమైన రాయలసీమ భాషతో, ధైర్యంగా నిలబడ్డానికి  “ఇదీ మా భాష! ఇదీ మా యాస!” అని ఎలుగెత్తి చాటడానికి  వీలయింది.

15 కథాసంపుటులను ఇప్పటికే ప్రచురించిన ఆర్.సి.కృష్ణస్వామిరాజు ఇటీవలే జక్కదొన కథాసంపుటిని వెలువరించి మంచి గౌరాభిమానాలు పొందారు. ఒక దశాబ్ద కాలంగా మినీ కథలు, ఆధ్యాత్మిక కథలు, హాస్యకథలు ఎన్నో రచించారు. అనేక బహుమతులు, పురస్కారాలు, అవార్డులు దక్కించుకొన్న రచయిత.

“నవల నావల్ల కాదేమో” నని అనుమానం వ్యక్తం చేస్తూనే “మేకలబండ” నవల రాసి,  తొలినవలతోనే “అంపశయ్య నవీన్ ట్రస్ట్” వారి బహుమతిని కైవసం చేసుకొన్నారు. డిశెంబరు 2023 లో ప్రచురితమైన నవల ఇది. దీనిలో నల్లగొర్రె, కుంటి మేక, మేకపోతు, పొట్టేలు ప్రధాన పాత్రలు కాగా వాటిని పెంచుకొనే సుందరం, వడివేలు, పెంచల్‌రాజు, తిరుపాలు ముఖ్య పాత్రలు. ప్రధానంగా, నవల మొత్తం ఈ ఎనిమిది పాత్రల చుట్టూనే తిరుగుతుంది.

ఈ నవలను విశ్లేషించుకొనే ముందు ఓ విషయం చెప్పాల్సి ఉంది. నవలలో పాత్రలుగా జంతువులు ఉండడమేమిటి? ఇవేమైనా పంచతంత్ర కథలా? లేక చిన్నపిల్లల చందమామ కథలా? అని ఆలోచించే వారు ఎంతో మంది ఉండొచ్చు. ఓకే! అలాంటి పాత్రలు ఉంటే ఉండొచ్చు గాక! అలాంటి నవలకు బహుమతి రావడమేమిటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు కూడా ఉండొచ్చు. ఇక్కడ నాకొక విషయం చెప్పాలనిపిస్తున్నది. గత సంవత్సరం నెల్లూరు విశాలాక్షి మాసపత్రికవారు కథలపోటీ పెట్టారు. దానికి విశేష స్పందన లభించి 120 పైగా కథలు వచ్చాయి. నాతో సహా మరో యిద్దరిని న్యాయ నిర్ణేతలుగా నియమించగా మొదటి మూడు బహుమతుల విషయంలో మా ముగ్గురిలో ఏ భేదాభిప్రాయం లేదు. విడివిడిగా పరిశీలించినప్పటికీ అందరిదీ ఒకే అభిప్రాయం. అదలా ఉంచితే, డా.ఎం.సుగుణారావు రాసిన “ధర్మదేవత” కథ మొదటి బహుమతి పొందిన కథ. దానిలో ఒక కుక్క హీరోగా ఉంటుంది. యిలా జంతువులతో కథ నడిపించడం ఒక క్రొత్త తలంపు (కాన్‌సెప్టు) గా భావిస్తున్నాను. భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని జంతువులైనా, మనుషులైనా ఆనందంగా స్వీకరించాలి తప్ప, తమకే ఏదో అన్యాయం జరిగిపోయిందని, ఇతర జీవులన్నీ హాయిగా ఉన్నాయని అనుకోవడం పొరబాటని, “సీత కష్టాలు సీతవైతే, పీత కష్టాలు పీతవి” అన్నట్టు ప్రతి జీవికీ ఏవో కష్టాలు ఉంటాయనే సందేశాన్నిస్తుందీ నవల.

రాజుగారు ఈ నవల మొత్తం 10 అధ్యాయాలుగా విభజించి రాశారు. కథ టూకీగా నాలుగు మాటల్లో చెప్పాలంటే అనగనగా ఒక ఊర్లో  నలుగురు వ్యక్తులు. వాళ్ళు చదువుకోకపోవడం మూలాన మేకలు, పొట్టేళ్ళు కాచుకొని జీవిస్తుంటారు. వీరందరూ కలిసి ఆ జీవాలను గోవిందపాదం అనే ప్రదేశానికి చేర్చి, తాము తెచ్చుకున్న ఆహార పదార్ధాలు అందరూ కలిసి ఆనందగా తింటూ ఉంటారు.

ఒకనాడు మందను తప్పించుకొని, నల్లగొర్రె, కుంటి మేక, మేకపోతు, పొట్టేలు అనే నాలుగు జీవాలు గోవిందపాదం దాటి పారిపోయి చాలా దూరం వెళ్తాయి. నాలుగు జీవాలు తమ తమ ఇండ్లలో ఉండే కష్టాలు చెప్పుకుంటాయి. ఈ చెప్పుకోవడంలో  గ్లోబలైజేషన్ ద్వారా మానవాళికి సంక్రమించిన సాంకేతిక పరికరాలైన సెల్‌ఫోన్లు, ఇంకా టీవీలు వంటివి రావడం  వల్ల మనుషులు వాటికి బానిసలై తమను  పట్టించుకోవడంలేదన్న ఆవేదన వెళ్ళగ్రక్కుతాయి.

అవి అడవిలో ప్రయాణిస్తుండగా ఒక స్వామీజీ కనిపించి వాటి గొడవ అర్ధం చేసుకొని, మానవ భాష అర్ధం చేసుకోవడం, మాట్లాడటం  అనే వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ జీవాలన్నీ సంతోషించి అలా తిరుగుతూ ఉండగా, వాటిలో కూడా మానవుల తాలూకు ఈర్ష్యా ద్వేషాలు, స్వార్ధం, అసూయ… వాటిని ఒకదాన్ని మరొకటి మోసం చేసుకోవాలన్న ఆకాంక్షలు వచ్చి చేరడంవల్ల అవి మానవప్రవృత్తితో ప్రవర్తిస్తాయి. ఆ  సమయంలో మరలా స్వామీజీ వచ్చి పరామర్శించగా, అవి “మాకు మానవ జీవనం వద్దు, మానవులంతా కుళ్ళు, కుతంత్రాలతోనే ఉంటారని తెలుసుకొన్నాక మా జీవనమే మేలని తెలుసుకున్నాం” అనేసరికి స్వామీజీ వాటికిచ్చిన వరాన్ని ఉపసంహరించి మామూలు జీవాలను చేస్తాడు. మనసు మార్చుకున్న జీవాలు మళ్ళీ వాటి స్వస్థానాలు చేరాలని అడుగులు ముందుకేస్తాయి.

ఈ నవలలో రచయిత అనేక సామెతలను, లోకోక్తులను ఉపయోగించి మంచి హాస్యస్ఫోరకంగాను, వ్యంగ్యోక్తితోను కథను నడిపిస్తాడు. నీళ్ళలోంచి చేపను బయటకు తీసినట్లు, ఆకలిగొన్నోడికి తియ్యటి లడ్లు దొరికినట్టు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, కాకులకీ గ్రద్దలకీ వేసినట్టు, గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది, చెల్లని కాసులు, కడుపా చెరువా, నంగనాచి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడటం, కష్టాలు కలకాలముండవు, పైసా ఆదాయం లేదు, క్షణం తీరికలేదు, వానలో తడవని వాడూ పెళ్ళాం మాట వినని వాడు ఉండరు,  యిలా అడుగడుగునా సామెతలను, లోకోక్తులను గుప్పించి మంచి రసకందాయంలో నడిపించాడు. అలాగే నిష్టూరపడటం, కుశాల, గుడిసేటి బుద్ధి… వంటి మాండలిక పదాలు వాడి నవలకు చిత్తూరు జిల్లా వాతావరణం అద్దారు.

ఇంకా అనేక హాస్య సంభాషణలున్నాయి. జీవాలు స్వామీజీని కోరిక కోరుకున్నప్పుడు “అప్పుడప్పుడూ కొన్ని ఇంగ్లీషు పదాలు మాట్లాడేలా వరమివ్వండి” అని అడగడం, సుందరం పెళ్ళి కోసం పడే తంటాలు, రావిచెట్టు మీద ఉన్న పక్షులు కొన్ని “వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసినట్లు” ఆసక్తిగా చూడడం, “నొప్పిలేకుంటే డాక్టరును, కష్టాలు లేకుంటే దేవుణ్ణి పట్టించుకోరు”, ప్రశ్న చెప్పి తాయత్తు కట్టే స్వామి సంఘటనలు, చిలక జ్యోస్యం సంఘటనలు, బ్లూక్రాస్ అమ్మాయి జీవ సంరక్షణ కడుపుబ్బా నవ్విస్తాయి. పులికాట్ సరస్సులో విదేశీ పక్షులు ఫ్లెమింగోల గురించీ, ఇతర దేశాల్లో సాంకేతికతతో రిమోట్ కంట్రొల్‌తో పశువుల్ని మేపడం వంటి విజ్ఞానదాయక విషయాల ప్రస్తావన ఉన్నది.

ఇందులో పాత్రలన్నీ దాదాపు జానపదులే కావడంతో “ఈతగింజా..ఈతగింజా”, “జొన్న చేను కాడ”, “ఏయ్ పిల్లా..కోయిల పిల్లా” వంటి  పాటలు సందర్భోచితంగా నవలకు వన్నె తెచ్చాయి. చిన్న చిన్న దోషాలు తప్ప నవలలో అనౌచిత్యం కానీ, దోషాలు కానీ ఏమీలేవనే చెప్పాలి.

ముగింపుగా ఒక్క మాట. ఈ నవల పరమోద్దేశం ఏమిటి? చివరకు రచయిత చెప్పేదేమిటి? అని ఆలోచిస్తే ఈ సృష్టికి ఒక కారణముంది. ఒక ప్రయోజనము వుంది. ఈసృష్టిలో కొన్ని లక్షల జీవులున్నాయి. ఈ సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల యోనులున్నాయి. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజములనే ఈ నాలుగు రకాలలో, మరల ఒక్కొక్కటి ఇరవై యొక్క లక్షల జీవాలతో ఉన్నది. మనుష్యాది యోనులను జరాయుజాలంటారు. వీటిలో మనుష్య జన్మ, పరమ దుర్లభం. కానీ నేటి మానవుడు కుళ్ళు, కుతంత్రాలు, స్వార్ధం, అసూయ, ద్వేషం, దోపిడీతనం, వివక్షతలు నరనరాన నింపుకొని జీవనం సాగిస్తున్నాడు.   అందువల్లనే ఆ జంతువులు చివరలో “మమ్మల్ని మాలాగే ఉండనివ్వండి. అందులోనే మాకు ఆనందం ఉంది” అంటాయి. సృష్టిలోని జీవులన్నిటికీ “ఆనందో బ్రహ్మ” అనే విధంగా జీవనం సాగించాలని, ‘సర్వే జనా సుఖినోభవంతు!’ అనే దిశగా సాగాలని రచయిత కోరుకుంటున్నాడన్న భావన అడుగడుగునా కనిపిస్తుంది.

పేజీలు  118

ధర 100

ప్రతులకు 9393662821

టేకుమళ్ళ వెంకటప్పయ్య

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు