“వచ్చే కవితలలో నూటికి 90 శాతం కవిత్వం ఉండదు. ఆ పది శాతంలోనూ కనీసం చదవగలిగిన కవితలు అయిదు కూడా వుండవు! ఏమిటీ పరిస్థితి? కవిగా నాకు కవిత్వ పక్షపాతం వున్నా కూడా ఆ కవిత్వం చదివినప్పుడు ఆత్మ క్షోభిస్తుంది! ఏం చెయ్యాలో తెలీదు”
ఇటీవలి కవిత్వంపై అప్పుడప్పుడు వినిపించే ఫిర్యాదూ, కొందరు ప్రసిద్ధులైన కవులనుండికూడా వస్తున్న నిట్టూర్పులూ! సరిగ్గా ఇలా కాకపోయినా ఇంచుమించు ఇదే భావం కెంగార మోహన్ గారి మాటల్లో-
“ ఇష్టమొచ్చినట్టు రాసి ఇదే కవిత్వం అని భ్రమింపజేసేవాళ్ళు కోకొల్లలుగా తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో చాలామంది ఉన్నారు. ఆ మాత్రమైన రాస్తున్నారు కదా అనే వాళ్ళూ , యేదైనా రాయనీలే అదీ కవిత్వమే కదా అనుకునే వాళ్ళూ, రాస్తే చాల్లే అనుకునే వాళ్లూ సమర్థిస్తున్న ప్రస్తుత సందిగ్ద వాతావరణంలో చిక్కని కవిత్వాన్ని సమాజానికందిస్తే మరింత మేలు జరుగుతుందని యోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు”.
వాక్యం రసాత్మకం కావ్యం అని పెద్దల నుడి. ఒక వాక్యం రసాత్మకం ఎలా అవుతుందీ?
“కవిత్వం అంటే నైతికతను పాదుకొల్పే ఒక శక్తివంతమైన సాధనం” అంటారు షెల్లీ మహాకవి.
“Emotions recollected in tranquility” అంటారు వర్డ్స్ వర్త్ అనే మరో మహాకవి.
“ ఉండాలోయ్ కవితావేశం
కానీవోయ్ రసనిర్దేశం
దొరకదటోయ్ శోభాలేశం” అంటూ శ్రీశ్రీ కవిత్వ మౌలిక లక్షణాలను చెప్పారు.
రసోవైసః అన్నట్లు నవరసాలూ కవిత్వపు ఊపిరులే కవిత్వం అనుభూతి ప్రధానమైనది. ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడో ఒక విషయం వింటున్నప్పుడో మనలో కలిగే అనుభూతి అక్షర రూపం దాలిస్తే ఆ అక్షరాలు మన అనుభూతులను అవిష్కరించినప్పుడే శ్రీశ్రీ చెప్పిన రసనిర్దేశమూ శోభాలేశమూ ఆవిష్కరణ అవుతాయి.
కాల్పనిక సాహిత్యంలో కవిత్వానికి ఉన్న ఒక విశేష లక్షణం conceal చెయ్యడం. కవి విషయ వ్యక్తీకరణా, రసావిష్కరణా కూడా వీలైనంత తక్కువ పదాలతో నిర్మితం కావాలి.
ఏ భాషలోనైనా కవిత్వం హృదయ సంబంధి.
ఒక కవి రాసిన కవిత్వం రసావిష్కరణ చెయ్యలేనప్పుడు ఆ కవిత నిరర్ధకం.
ఇటీవలి కాలపు ఆవేదనకు కారణాలుగా నాకు తోస్తున్న కొన్నివిషయాలు మీతో పంచుకుని మీతో ఈ సంభాషణ కొనసాగిస్తాను.
- సామాజిక చలనాలూ, ఉద్యమాలూ బలంగా ఉన్నచోట అవి మన ఆలోచనలను ప్రభావితం చేసినంతగా అవిలేనిచోట మన ఆలొచనలనూ, భావావేశాన్నీ ప్రభావితం చెయ్యలేవు.
- సాహిత్యం కీర్తి ప్రతిష్టలను చేకూర్చే సాధనమైనప్పుడు అది inorganic intellectuals పుట్టుకకు కారణమౌతుంది.
- సహజ భావావేశం తో రాయగలిగిన వారు కూడా వ్యక్తీకరణ పరిమితులకు లోనవుతున్నారు.
- వ్యక్తీకరణ పరిమితులు రచయితల/కవుల భాషను వ్యక్తీకరించే క్రమంలోని ఇబ్బందులవల్ల ఏర్పడుతున్నవి.
- సమకాలీన విద్యావిధానంలో భాషా శాస్త్రాలకూ సామాజిక శాస్త్రాలకూ చోటు తగ్గిపోవడం..
- సామాజిక మాధ్యమాలు అవకాశాలు ఇచ్చే వేదికలు మాత్రమేగాని మార్గదర్శక వేదికలు కాకపోవడం.
- సామాజిక మాధ్యమాలలో ప్రచురించాలనుకున్న text కు editorial restrictions లేక పోవడం.
- తక్షణ, కవి వాంచిత ఫలితాలను అవి అందివ్వగలగడం.
- వాటిలో అస్మదీయులు అందించే సకారాత్మక ప్ప్రోత్సాహకాలకు అలవాటు పడడం.
- ఇచ్చి పుచ్చుకునే సహకార ధోరణిలో సాహిత్య పరిచయాలూ, సమీక్షలూ, పరామర్శలూ చెలామణి అవుతూ సామయిక అవసరాలను పట్టించుకోక పోవడం.
- నర్మగర్భంగా చెప్పడం తెలియకపోవడంతో ప్రమాదకరం అనుకునే విషయాలకు దూరంగా ఉండడం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సాహిత్య anatomy పాఠం అవుతుందిగానీ సాహిత్యానికైనా, సామాజికానికైనా వైయుక్తికానికి అయినా మనం వేసుకోవలసిన ఒక మౌలిక ప్రశ్న “ఎందుకు?”
ఈ “ఎందుకు?” మనం చేయదలచిన ఏ పనికైనా relevance ను సూచిస్తుంది.
ఒక కవి ఒక కవితను ఎందుకు రాయాలనుకుంటారు?
తను చెప్పవలసిన విషయాన్ని వెంటనే చెప్పేందుకు అనుకుందాం.
వెంటనే చెప్పేందుకు కవితే ఎందుకు? మరేదైనా ప్రక్రియ సరిపోతుంది గదా!
ఆ కవి కవితే చెప్పాలనుకుంటే అందుకు ఆ కవికి ఒక బలమైన కారణం ఉండాలి.
ఆ బలమైన కారణం ఏమిటి”
మనం పైన ఉటంకించుకున్న Wordsworth నిర్వచనం తో పాటు కవిత్వానికి ఇంకొక లక్షణం ఉందంటారు.
A sudden flow of words with strong expressive emotions. ఒక కవితలో ఆ కవిత రాసిన కవి తపన కనబడుతుంది.
ఉదాహరణకు సంక్షోభ కాలంలో ఒక కవి రాసిన ఒక కవితను పరిశీలిద్దాం.
మహా భావుకుడైన పరదేశి ఒకడు మోకరిల్లి విలపించాడు
యెన్నో శిలువలనిచ్చావు నువ్వు చెట్టూ ఒక్క క్రీస్తును కూడా నీకు ఇవ్వలేకపోయాము
ఆ అపరిచితుడి ప్రార్థన విని చెట్టు నిర్ఘాంతపడింది
‘క్షమించు ఈ అడవిలోని ప్రతి చెట్టూ ఒక క్రీస్తును మోసింది
వారి గుందేల్లోదించిన ప్రతి తూటా మా గుండెలను చీల్చింది
బలిదానమిస్తున్న యువక్రీస్తులతో అడవి పోర్లిపోయింది
ఇక శిలువలు లేవు జనవరి 23 గుర్తుందా?
శిలువలు కరువై హన్మకొండ చౌరాస్తాలో మేఘ్యంను ట్రాన్స్ఫార్మర్ కు వేలాడదీశారు
పరదేశీ! మేము వోట్టిబోయాము
మీ క్రీస్తులకు శిలువలు ఇచ్చే యోగ్యత మాకు లేదు
క్షమించు ‘
అని తూటాల గాయాలతో చెట్టు ఒరిగిపోయింది”
పై కవితలో కవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలనూ సామాజిక సంక్షోభాలనూ వర్తమాన పర్యవసానాలనూ ఆవిష్కరించిన తీరు కవులందరూ ఆలోచించదగ్గది.
కవితలోని జీవావరణాన్ని కవి భావుకతతో ఆవిష్కరించిన తీరు.
ప్రేమా, త్యాగమూ, దుఖమూ, మనవ హక్కులూ, పర్యావరణమూ, మానవత్వపు విలువలూ. ప్రభుత్వాలతీరూ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
కవి సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం రాసిన ఈ కవిత నేటికీ సామయికంగానే ఉంది.
కవి తను చెప్పదలచుకున్న విషయాన్నీ సందర్భాన్నీ కాలాన్నీ కూడా సమగ్రంగా అర్థం చేసుకోగలిగినప్పుడే కాలంతో పాటు పయనించి చరిత్రను రికార్డు చెయ్యగలిగిన మనిషి హృదయ లయ అవుతుంది.
కవిత: చెట్టు చెప్పిన జవాబు, కవి సౌదా, ప్రచురణ ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రిక.
*
చిత్రం: సృజన్ రాజ్
బాగా వివరించారు..అభినందనలు సర్