నావరకూ నాకు నచ్చిన కథే మంచి కథ అనుకుంటాను.
కనుక ఇదే మంచి కథ అనో, లేక అది మంచి కథే అనో ఎవరినీ ఒప్పించే ప్రయత్నం చేయలేను. నాకు నచ్చడానికి ముందుగా వస్తువులోనో, కథనంలోనో కొత్తదనం కనిపించాలి. అందులోనూ కథనంలో కనిపించే పనితనమే నన్ను ఎక్కువ ఆకర్షిస్తుంది. ఈ కొత్తదనం వాక్యంలో పదాల పొందికలోనో,కథా నిర్మాణంలోనో కావచ్చు, ఒక మానసిక వాతావరణాన్ని సృజించడంలో కావచ్చు. కథ పరిమితుల్ని అధిగమించడంలోని సృజనాత్మకత మరీ నచ్చుతుంది. భావోద్వేగాలు సటిల్ గా ఉంటేనే ఇష్టం.
మంచి కథ అంటే పాఠకుడి కళ్ళు చెమర్చాలి, అణగదొక్కిన గొంతులు వినిపించాలి, ఆలోచన రగిలించాలి, వ్యక్తిత్వ వికాసానికో, సామాజిక ప్రయోజనానికో తోడ్పడాలి, వంటివి చలామణీలో ఉన్న అభిప్రాయాలే అయినప్పటికీ ఆ లక్షణాలున్న కథను ఆహ్వానించగలను కానీ, అవే మంచి కథకు గుర్తులంటే ఒప్పుకోలేను. క్లుప్తతా, గోప్యతా, ఐక్యతా ముఖ్యమనుకుంటాను. ఎక్కువ మంది పొగిడినంత మాత్రాన కథ మంచిది కాబోదు.
ఒక కథ మంచి కథ అనడానికి కచ్చితమైన లక్షణాలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఏవి మంచి కథకు ఉండకూడని లక్షణాలు అనుకుంటామో, ఆ లక్షణాలతోటే మంచి కథ అనిపించుకునేవి వస్తూనే ఉంటాయి. అలాగే మంచి కథ లక్షణాలని మనం అనుకునేవన్నీ పొదుగుకునీ నిరుత్సాహపరిచే కథలూ ఉంటాయి. మంచి కథ మొదలయ్యాక ఏదో క్షణంలో పాఠకుణ్ణి ట్యూన్ చేసుకుని తనలో లీనం చేసుకుంటుంది. అందుకు పాఠకుడి నేపథ్యమూ, అనుభవాలూ కూడా అన్నిసార్లూ కారణం కాకపోవచ్చు. చదివే సమయంలో మానసిక స్థితే కారణం కావచ్చు. చిట్టచివరికి అది పాఠకుడిపై కలగజేసే స్పందనా, ప్రభావమే గీటురాళ్లు. ఎవరి మంచి కథను వాళ్లే కనుక్కోవాలి, అది ఏదో వాళ్లే నిర్ణయించుకోవాలి.
ఎక్కువగా చదివే కొద్దీ నచ్చే కథలూ తగ్గుముఖం పడతాయేమో! ఎంత బాగున్నప్పటికీ అదే కథను పదే పదే తిరగరాస్తే నచ్చదు కదా! అన్ని రకాల దుఃఖాలనూ, కష్టనష్టాలనూ, అణచివేతల్నీ, వైఫల్యాలనూ, వైరుధ్యాలనూ, నైతిక సూత్రాలనూ, జీవన సత్యాలనూ దాటాక కథ కళారూపంగానే నిలవాలి. ఒకే వాస్తవం సృజనలోనే బహుముఖాలుగా వికసిస్తుంది.
వచ్చే సంచికలో…మెహెర్
సత్యం!
చెలామణిలో “మంచి కథ” అంటే ఇలానే ఉండాలి అనే సైద్ధాంతికమైన చట్రంలో ఇమిడినంత మాత్రంలో కథ “మంచి కథ” అవదు. అలాగే, మీరు అన్నట్లు “ఎక్కువ మంది పొగిడినంత మాత్రాన కథ మంచిది కాబోదు”
ధన్యవాదాలు.sir, . మంచి కథ గురించి బాగ రాశారు.. కథ రాయాలని అనుకునే మాలాంటి వారికి ఉపయోగం గా మంచి కథ అంటే ఏమిటో తెల్పారు!
Sir మీకు నచ్చిన or మంచి కథలుగా భావించిన కొన్ని కథలను సూచించరూ..
తాను వలచిందే రంభ అనే చందంగా.. అందంగా చెప్పారు సార్. మీతో నేను ఏకీభవిస్తున్నాను 👍
బాగా చెప్పారు సార్..
చాలా అద్భుతమైన విషయాలను అద్భుతంగా చెప్పారు