మంచి కథల పల్లకి  – శ్రీపతి          

త కొన్నేళ్ళుగా శ్రీపతి గారు యెక్కడున్నారు,యెలా వున్నారు అనే ప్రశ్నలైతే వేసుకునే వాడిని కానీ, ప్రయత్నించినా వారి వివరాలు తెలియలేదు. ఆరోగ్యం బాగాలేదు అని తెలిసేది, విషాదవార్త యెపుడు వినాల్సి వస్తుందో అని భయం వేసేది. అలాగే నిన్న (08-02-2024) తన గ్యాపకాలను,తన సాహిత్యాన్ని,స్నేహ సమూహావరణాల్లో తన పాదముద్రలను వదిలి, ఈ లోకాన్ని వీడి వెలిపోయారని తెలిసింది. ఆ వార్త కాసేపు నన్ను నిశ్చేష్టున్ని చేసింది. ( ఆ వార్త తెలిసిన సమయంలో సాహితీమిత్రుడు గంటేడ గౌరునాయుడు సాహిత్యంపై సేవ సంస్థ నిర్వహించిన గూగుల్ మీట్ లో వున్నాను. వెంటనే వార్తను మీట్ లో తెలిపి, శ్రీపతి గురించి క్లుప్తంగా మాటాడి సంతాప సూచకంగా రెండు నిముషాలు మౌనం పాటించి జోహార్లర్పించామ్) . శ్రీపతి గారి చుట్టూ నా ఆలోచనలు తిరిగాయి.  కొన్ని గ్యాపకాలు కదిలినాయి.

మా వూరి పంచాయితీ లైబ్రరీలో శ్రీపతి గారి ‘మంచు పల్లకి,మరి తొమ్మిది’కథలు చదివాను(యెమెస్కో వారి ప్రచురణ). బహుశా 1969లో అనుకుంటా,అపుడు నేను యెస్సెస్ యెల్సీ పాసయి, ఆర్ధిక స్తోమతు లేక కాలేజీకి వెళ్ళక,వూరిలో వున్న రోజులనుకుంటా. నా వయసు 16. సరిగ్గా ఇదే పదహారేళ్ళ వయసులో తొలికథ ‘సహృదయ’రాసిన పుల్లట చలపతిరావు అనే శ్రీపతి గారు అలా తొలిగా వారి రచనతో పరిచయమయ్యారు.

మంచుపల్లకి ,మరి తొమ్మిది కథలు వేసిన ముద్ర చాలా బలమైనది. ఆ కథల్లోని ప్రాంతము, ఆ ప్రాంతాల్లోని మనుషులు,వారి కట్టూ,బొట్టు,మాటతీరు…ముఖ్యంగా నేను మరికొన్నాళ్ళ తర్వాత ఇష్టంగా వినే    “అదిగదిగో తీరప్రాంత మదేనంట ఉద్దానము. ఉద్దానమ్ కాదురా ఉద్యాన వనం రా “పాట దృశ్యాన్ని, ఉద్దానమ్ సౌందర్యాన్ని ఈ కథల్లో చూశాను. అప్పటికి నేను కేవలం పాఠకడినే,రచయితను అవుతానని గానీ,అవాలనిగానీ అనుకోలేదు.

ఆ తర్వాత వారి కథలు ‘నర్తోడు’,’తూరుపు’నక్సలైట్ రాత్రులు,పెద్దల న్యాయం వంటి మరికొన్ని కథలు చదివాను. అవన్నీ జరుగుబాటు లేని పేదలు చేసిన తిరుగుబాటు కథలు. ఆ తిరుగుబాటు మా వూరి పరిసరాల్లో కూడా జరుగుతోంది,ఆ తిరుగుబాటు వెనక వున్న రాజకీయ సిద్ధాంతం తెలియకుండానే తిరుగుబాటుకు ఆకర్షితుడిని అయిన సందర్భంలో ఈ కథలు మరింతగా ఆకర్షించాయి. రచయిత పట్ల గౌరవం కలిగింది. 2005లో ప్రచురించిన “సత్యజిత్ రాయ్ యెవరు” సంపుటిలో నామాట    అని శ్రీపతి గారు రాసిన వాక్యాల్లో – “ఓ వర్తమాన సామాజిక,రాజకీయ వాతావరణం,ప్రపంచ వ్యాప్త సంక్షోభం అతి సామాన్యుని జీవితాన్ని సైతం ప్రభావితం చేస్తాయి. తప్పించుకోవటం మన చేతుల్లో వుండదు….” అనీ, ఆనాటి శ్రీకాకుళ రైతాంగ పోరాట ప్రభావంతో ,పీడిత జన పక్షపాతంతో,విప్లవరచయితల సంఘ చైతన్యంతో ఆ కథలు రాసేనని అన్నారు.

నా పదహారేళ్ళ వయసు నుండీ (1969-70) వారి రచనలు  పరిచయమయితే, 2005 డిసెంబర్ లో వారు ప్రచురించిన నాలుగు కతా సంపుటాలను, 1.మంచుపల్లకి మరితొమ్మిది కధలు 2.సత్యజిత్ రాయ్ యెవరు? 3.యెల్లోరాలో వాళ్ళు ముగ్గురు 4.బెనారస్ చిత్రాలు శ్రీకాకుళంలో యగళ్ళ రామక్రిష్ణ గారు పరిచయ సభ (27-01-2006) పెట్టినపుడు శ్రీపతి గారు నాకు ఇచ్చారు. ఆ సభకు కల్లూరి భాస్కరం,జింబో గారు కూడా వచ్చినట్టు గుర్తు.

ఆ తర్వాత 12.12.2012న వారి మరో కధాసంపుటి “కాటుక కళ్ళు-కధలు మూడు’ బహుశా వారి ఇంటికి వెళ్ళినపుడు ఇచ్చారనుకుంటా,..ఈ సంపుటిని…అమ్మ చనిపోయిన తరవాత అమ్మలా నన్ను పెంచిన అట్టాడ రత్నాలమ్మకి ప్రేమతో అని అంకితమిచ్చారు.

70లలో శ్రీపతి కథలు చదివిన  తర్వాత వారిని హైదారాబాద్ లో వేదగిరి రాంబాబు సాహిత్య సభలు పెట్టినపుడు ప్రత్యక్షం గా (అది యే యేడాదో గుర్తు లేదు)కలిశాను. అప్పటికి నేను రచయితను అయినాను, నా కథలు ఆయన చదువుతున్నారట. బహుశా,నా “పోడు-పోరు” కథ సంపుటి వచ్చినది అనుకుంటా.1988 కావచ్చు. ఆ సందర్భంలో శ్రీపతి నన్ను,గంటేడ గౌరునాయుడ్ని,మధురాంతకం రాజారాం గారినీ తన ఇంటికి తీసుకు వెళ్లారు, భోజనం పెట్టి చాలా విషయాలు మాటాడేరు. నాకు చాలా ఆనందం కలిగింది.  మంచుపల్లకి గురించి చెప్పాను. అప్పుడే చెప్పారు…తన కన్నతల్లి పుట్టింటి పేరు అట్టాడ అని…బంధుత్వం అతని గొంతులో విన్పించింది. ఆనాటి నుంచి నన్ను ఇంటి పేరుతో సహా పలకరించేవారు. (కన్నతల్లి శ్రీపతికి రెండేళ్ల వయసులోనే మరణించింది.)

ఆ తర్వాత ఆయన ఇటువేపు వస్తే తప్పక కలిసేవారు. తరచుగా విశాఖ లో ఓ స్తల వివాదం మీద వచ్చేవారు. విశాఖలో ఓ స్థలం కొన్నారు, చాన్నాళ్ళ కిందట. యెవరో పేదవాడు ఒకాయన వాచ్మేన్ గా స్థలం  కాపు కాస్తానని వచ్చాడట, సరే అని వుంచారు. స్థలానికి  కాంపౌండ్ వేశారు. లోన ఒక పూరిపాక వేసుకుని వున్న వాచ్ మేన్ కొన్నాళ్ళకి మట్టితో వున్న ఇంటి గచ్చులు సిమెంట్ గచ్చులు చేశాడట, శ్రీపతి గారు యెప్పటికో వచ్చి చూసి,ఇదేమిటి? గచ్చు వేశావని అడిగితే…మట్టితో ఇబ్బందిగా వుంది, వర్షాకాలం బురద అవుతోంది, వున్నన్నాళ్లు ఇబ్బంది యెందుకని వేశాను, మీరు ఇల్లు కట్టుకున్నా, స్థలం అమ్మేసినా ఖాళీచేసి వెలిపోతాను అన్న వాడు, తరవాత పూరి పాకను రేకులతో కప్పినాడటా. అలా ఆ స్థలం  అమ్మబోతే వాడు ఖాళీ చేయ కుండా తగవుకి దిగాడట. దాని పరిష్కారం కోసం విశాఖ వచ్చినపుడల్లా కలవడమో,ఫోనులో మాటాడడమో చేసేవారు. ఇంతకీ ఆ వివాదం యెమయ్యిందో?

తొలిసారి మంచుపల్లకీ మరి తొమ్మిది కథలు చదివి ఇష్టపడ్డానే తప్ప, వాటిని విశ్లేషించలేదు. కానీ 2006 లో మళ్ళీ ఆ పుస్తకం ఇచ్చినపుడు ,బహుశా ఆ పుస్తకం గురించి నేను ఉపన్యసించేనేమో…కొన్ని కధలు చివరన నా సంక్షిప్త విశ్లేషణ రాసుకున్నాను, అవి యేమిటంటే –

మంచుపల్లకి కథ గురించి – నేనింకా బాల్యం వీడని యవ్వనదశలో చదివి,లీలగా … ఒక బస్సూ, ఆసుపత్రికి తీసుకెళ్లబడిన తల్లి సమాచారం కోసం యెదురు    చూసే బాలుడూ,బస్సు కోసం నిల్చున్న ఉపాధ్యాయులూ వారి ప్రవర్తనా …చివరికి తల్లి చావు కబురూ – ఒక దుఖపు ఘట్టం ఇప్పటికీ గుర్తుంది.

ప్రతివ్యక్తికీ ఇలాంటి దుఖఘట్టాలు యెదురైనా,చదివి అనుభవించినా …అవి ఆ వ్యక్తి మరణించేదాకా గుండెల్లో చెమ్మని నింపుతాయి.

కుటుంబం కథ గురించి – మానవ సంబంధాలూ,మానవ ప్రవృత్తులూ జంతుదశను దాటలేదని,జంతు ప్రవృత్తికి భిన్నంగా లేవని – ఒక సాధారణ జీవన పర్యావరణంలోంచి సర్వజనామోదంగా తేల్చి చెప్పిన మరో మంచి కధ…కుటుంబం కథ.

సమాధిలోంచి లేచిన గ్యానమ్ కథ గురించి – 61లో ఈ కథ రాసిన రచయిత ఒకనాటికి ఋషుల తాత్వికతలోకి చేరుతాడని వూహించవచ్చు. ( శ్రీపతి అలానే ..ఓ స్వామి శ్రీరామ్ అనే స్వామి తాత్వికతకు చేరారు.)పూవు పూయటం,రాలటం …బ్రతుకంటే అదే అనటం – ఈ తాత్వికతకు మూలం. కానీ ప్రకృతీ,మానవజీవితం ఒకటిగా వుండదు…కొన్ని సామ్యాలున్నా సరే. ప్రకృతి సహజ సిద్ధం,మానవ ప్రవృత్తి సమాజంతో తీర్చిదిద్దబడుతుంది. యెండకు వేడి ఉండడం సహజం,కానీ మానవుడికి దుర్మార్గత్వం  సహజం కాదు…

ఇలా వారి కథల మీద నా విశ్లేషణ రాసుకున్నా. నిజానికి శ్రీపతి గారు తొలినాళ్ళలో విరసంలో నిబద్దతతో పని చేశారు. మనిషిలో నిబద్దత వుంది. తాను దేన్ని విశ్వసిస్తాడో దాని పట్ల నిబద్దతతో వుంటాడు.చివరిలో స్వామి శ్రీరామ్ పట్ల కూడా. తన ప్రయాణ మలుపుల్ని దాచుకోలేదు. మలుపు పట్ల తనదైన నమ్మకాన్ని ప్రకటించాడు. నటన యెరుగరు. భావజాల రంగంలో తాను యేమి విశ్వసిస్తాడో దానినే రచనలో ప్రతిపాదిస్తాడు. అయినా భిన్న భావజాల మిత్రులతో స్నేహాన్ని కొనసాగించటంలో శ్రీపతి గారిదే చొరవ.

అయిదు సంపుటాల్లో 54 కధలున్నవి. ఉద్దానమ్ నుంచి బెనారస్, యెల్లోరా , దేశంలో అనేక ప్రాంతాల జీవితాలను కధనం చేశారు. అనేక ప్రాంతాలను దృశ్యమానం చేశారు.

సహజసిద్ద ప్రకృతి వర్ణన, సౌందర్య చిత్రణ… (కళింగ సముద్రం,పనస,జీడి,కొబ్బరి తోటలు,ఆకుపచ్చ పంటపొలాలు,అరటి తోటలలో నీలం ఆకాశాన్ని ఆకుపచ్చని అందాలతో కప్పెసే ఉద్దానమ్ గ్రామాలను వీరి రచనల్లో చూస్తాము) శ్రీపతి రచనా శిల్పంగా (విప్లవ కథల్లో కూడా )అందరూ చెప్తారు. అలాగే వ్యక్తిగా కూడా సౌశీల్యంతో, సౌమ్యంగా, స్నేహశీలంగా వుంటారు.ఆరోగ్య జాగ్రత్తలూ బాగా తీసుకుంటారు. టూత్ బ్రష్,పేష్ట్ వాడరు,దుశ్చిన పుల్లతో పల్లు దోముకుంటారు. శారీరక,మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్న శ్రీపతి గారు తన యెనభై మూడో యేట మనల్ని విడిచి వెలిపోయారు. తెలుగు సాహిత్యం,ముఖ్యంగా కళింగాంధ్ర సాహిత్యం ఒక సౌందర్య, సౌశీల్య, సంస్కారయుత రచయితను కోల్పోయింది.

శ్రీపతి గారు నాకంటే ముందటి తరం కథకులు. పదహారేళ్ళ వయసులో తొలి కథ ‘సహృదయ’రాసిన పుల్లట చలపతిరావు అనే శ్రీపతి గారు వందలోపే కథలు రాసివుంటారు. కానీ రాసినవన్నీ వాసికెక్కినవే.

*

అట్టాడ అప్పల్నాయుడు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “రాసినవన్నీ వాసికెక్కినవే” గొప్ప రచయితను పరిచయం చేసినందుకు థాంక్స్ సార్

  • శ్రీపతి గారి కథల్లానే
    శ్రీపతి గారు కూడా చాలా సున్నితమనస్కులు.
    చాలా నెమ్మదిగా దాదాపు whisper చేస్తున్నట్లు మాట్లాడేవారు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు