నేను గత రెండు సంవత్సరాలలో చదివిన తెలుగు నవలలో ఓల్గా గారు రచించిన యశోబుద్ధ మంచి నవలల్లో మొదటి శ్రేణిలో నిలుస్తుంది.
తన ఉపోద్ధాతంలో ఆవిడ ఇలా అన్నారు “ యశోధర గురించి ప్రత్యేకమైన విషయాలు తెలియకపోయినా వీటిని గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక నవలకు ముడి వస్తువు దొరికింది. ఈ నవల రాయడంలో అంతర్లీనంగా ఉన్న ఆలోచన చరిత్రలో స్త్రీలు మరుగున పడి ఉన్నారనీ, చరిత్రలో వారి పాత్ర మీదా, చరిత్ర నిర్మాణంలో వారి భాగస్వామ్యం మీదా వెలుగు ప్రసరింప చేయాలనీ. ఇది కాల్పనిక నవలే, కానీ, ఈ నా కల్పనకు కొన్ని ఆధారాలున్నాయి.”
ఓల్గా ఇంకా ఇలా అంటారు. “ఎంతో మంది స్త్రీలు తమను తాము ప్రత్యక్ష కార్యాచరణరంగం నుంచి ఉపసంహరించుకొని, మరుగున పడి చరిత్రను నడిపించారు. వారి చరిత్రల గురించి ఊహలైనా మొదలైతే, ఆ తర్వాత చారిత్రక పరిశోధన, స్త్రీల చరిత్ర నిర్మాణం జరుగుతాయి. ఈ నవల రాయడం ఆ ఆశతోనే.”
ఈ గొప్ప రచనలో ఓల్గా స్త్రీ-పురుష సంబంధాల గురించి , సున్నితంగానూ, మంచి భాషలోనూ వ్యక్తీకరించిన పద్ధతి చాలా బావుంది. అలాగే అద్వైతం గురించీ, యజ్ఞం గురించీ, యుద్ధం గురించీ ఆవిడ తన దైన ప్రత్యేక శైలి లో చెప్పారు.
గౌతముడు చిన్ననాటినుంచే తన చుట్టూ జరుగుతున్న సామాజిక, రాజకీయ సంగతులు పరిశీలిస్తూ తన ఆలోచనలు రూపొందించుకోవడమే కాక ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేవాడు. తండ్రి శుద్ధోధనుడు కూడా అతనికి వ్యవహార జ్ఞానం కలుగుతుందని సమావేశాల్లో పాల్గొననిచ్చే వాడు. అలాంటి ఒక సమావేశంలో సమృద్ధి అనే మాటను వ్యక్తీకరిస్తూ గౌతముడిలా అంటాడు “ ‘మహాశయా – సమృద్ధి అనే మాటను మీరు అమితంగా, ఎక్కువగా ఉండటమనే అర్ధం చేసుకుంటున్నారు. ఆ మాటకు ఆ అర్ధం ఉంటే దానిని పక్కకు పెడదాం. మరీ అవసరమయితే వాడుకుందాం . నేను ఆ మాటను సరి అయిన అర్ధంలో చెపుతున్నాను. సమృద్ధి అంటే “సమవృద్ధి” – అందరూ సమంగా వృద్ధి చెందడం. నీరెంత ఉన్నా సమంగా పంచుకోవడం మనం నేర్చుకుంటే సమంగా వృద్ధి చెందుతాం. అప్పుడు శాంతి తప్ప తగవులకు కారణమే కనిపించకుండా పోతుంది.” మనం ప్రస్తుతం లోకి వస్తే నీళ్ళు సమంగా పంచుకోవడం కోసం దెబ్బలాడుకుంటూ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాం.
గౌతముడు , యశోధరల మొదటికలయిక కూడా ఓల్గా చాలా ఆహ్లాదకరంగా మనస్సులకు మధురంగా తోచేలా ఒక గొర్రెపిల్ల సహాయంతో చిత్రీకరించారు.
యశోధరకు చిన్నపటినుంచే యజ్ఞం తర్వాత జరిగే జంతు బలిని చూసి “ తండ్రి చేసే యజ్ఞాలపై మనసులోనే అయిష్టాన్ని పెంచుకుంది. యజ్జ్ఞాల గొప్పదనాన్ని తండ్రికి నూరిపోస్తున్న బ్రాహ్మణ పురోహితులంటే ఆమెకు ఎంత విముఖతో చెప్పలేము. వాళ్ళు చెప్పే ప్రతి ఆచారమూ సంఘంలో వాళ్ళ ప్రాముఖ్యతను కాపాడుకునేందుకు చెప్పేవిగా ఆమెకు తోచేవి.” కానీ తండ్రి ఆడవారికి అర్హతలేని మాట్లాడవద్దని మందలించేడు. ఆడవాళ్ళకు ఆలోచన ఉండదనే మాట సున్నిత మనస్కురాలయిన ఆమెను బాధించేది.”
మళ్ళీ యశోధర-గౌతముల సాంగత్యం లోకి వెళ్తే , ఓల్గా వారి కలయికని ఎంత మధురంగా చెప్పొరో చూడండి. “ యశోధర అక్కడనుంచి వెళ్ళేందుకు లేచింది అనాలోచితంగానే సిద్ధార్ధుడూ నిలబడ్డాడు. యశోధర వెళ్లిపోతున్నదని అతనికి తోచింది … “మీ పేరు?” అని అడగాలని తోచింది. … ఇంతలో యశోధర మళ్ళీ వెనక్కువచ్చి తన పూల సజ్జలోని పూలు చేతినిండా తీసుకొని , సిద్ధార్ధుని చేయి తన చేతిలోకి తీసుకుని, ఆ పూలను అతని అరచేతిలో పోసి “ నేను యశోధరను, బింబానన, విశిష్టల పుత్రికను. మాది కౌలీయ గ్రామం “ అని చెప్పి అతని ముఖం మరొక్కసారి చూసి చిరునవ్వు నవ్వి వెనక్కు తిరిగి వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లిపోయింది. … సిద్ధార్ధుడు ఎప్పటికో తెలివి తెచ్చుకున్నాడు. తన చేతిలోని పూలను పరిశీలనగా చూసి వాటిని ఉత్తరీయంలో పోసుకొని, పూలకు వత్తిడి కలగకుండా (గమనించండి) వదులుగా ముడివేసుకొని దానిని అతి భద్రంగా భుజంపైకి నిలిపి ధ్యానంలో కూచునే యోచన లేనట్లు అక్కడనుంచి వెళ్ళాడు.” ఇంత అందమైన ప్రణయ సమాగమాన్ని బహుశా నేను మొదటిసారి చదివాను. ఇలా కలిసిన యశోధర అతని ఏకాగ్రతను ఛేదించి మనస్సులో నిలిచిన విధాన్ని కూడా బాగా చెప్పారు రచయిత్రి.
గౌతముడు తనను తాను యశోధరకు పరిచయం చేసుకున్నాడో కూడా చూడండి.” నేను క్షత్రియ వంశంలో పుట్టినా యుద్దలన్నా, ప్రతాపనిరూపణలన్నా ఇష్టంలేదు , నాకు లోకాన్ని అర్ధంచేసుకోవాలనే కోరిక ఉంది. అది తప్ప మిగిలిన కోరికలేమీ నన్ను బాధించవు. లోకాన్ని అందులోని శోకాన్ని అర్ధంచేసుకోవాలనే ఆసక్తితో మిగిలిన వ్యవహారాలన్నిటికీ దూరంగా ఉంటాను. బ్రాహ్మణ క్రతువులకు కూడా విముఖుడినే – మామూలు మనుషులకు నేనొక విభిన్న మానవుడిగా కనిపిస్తాను. నీ ఆశల గురించి, కోరికల గురించి నాకు తెలియదు. నన్ను కోరుకుంటున్న నీవు అసలు నేనేమిటో తెలుసుకుని నిరాశ పడితే, ఆ నిరాశ ఇప్పుడు కలగడమే మంచిది కదా.
యశోధర కూడా అంతే స్థిరంగా తన స్పందన తెలిపిన పద్ధతి కూడా తిలకించండి. “ మీ గురించి నాకు చెప్పటం అంటే నన్నెంతో గౌరవించినట్లుగా ఉంది నాకు. మీరు నాకిచ్చిన ఈ గౌరవం నేనింకెక్కడా పొందలేదు, పొందలేను. ఆ గౌరవం వొదులుకోలేను. మీరేమిటో తెలుసుకొనే అన్వేషణ నన్ను చేయనివ్వండి. మీ అన్వేషణ కూడా అప్పుడు నాకు అర్ధమవుతుంది. నేను నిరాశపడను. మీవలే భిన్నంగా అలోచించగలిగే అవకాశం నాకింతవరకూ రాలేదు. అయినప్పటికీ నాకు యజ్జ్ఞ యాగాదులన్నా, వాటిలో జరిగే జంతు బలులన్నా చెప్పలేనంత కోపం. వైదిక ధర్మపన్నాగాలు నకసలే నచ్చవు. అలాగని నాకు లోకాన్ని అర్ధం చేసుకోవాలనేంత ఆశ కూడా లేదు. ప్రశాంతంగా అవమానపడకుండా, గౌరవంగా బ్రతికితే చాలనుకుంటున్నాను. అది మీ వద్ద సంభవమనే నాకనిపిస్తోంది.”
ఇద్దరూ కలిసి అంతే ప్రేమగా తోట లోపలకు ఆమె వెళ్తుంటే సిద్ధార్ధుడు అనుసరించాడు . ఆమెతో పాటు తానూ పుష్పసంచయనం చేసి ఆమె సజ్జలో ఉంచాడు. ఇద్దరూ కలిసి చేసిన ఆ పనిలో ఉన్న సౌందర్య రహస్యాన్ని గ్రహించినట్లు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు.”
ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం పుస్తకాన్నే ఇక్కడ రాయవలసి వస్తుంది. వారి ప్రేమ పరిచయాన్ని ఓల్గా ఎంత మధురంగా చెప్పారో కదా!.
యశోదరను సహచరిగా పొందడానికి ఆమె తండ్రి, సిద్ధార్ధుడు విలువిద్యలో గెలవాలని షరతు పెట్టినప్పుడు కూడా, యశోధర, సిద్ధార్ధుడు ఉమ్మడిగా తమ ఆలోచనలను పంచుకున్న రీతిని కూడా ఓల్గా గారు చెప్పిన పద్ధతిలో స్త్రీ-పురుష సంబందాలలో నిర్ణయం తీసుకొనేముందు అలా ఆలోచనలు పంచుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. కొంచెం ఎక్కువయినా అవి ఇక్కడ ఉదహరిస్తున్నాను.
“నిన్ను పొందాలనే కోరిక ఉన్నవారందరితోనూ పోటీపడి నిన్ను గెలుచుకోవడమనేది నా మనసుకి హితవుగా లేదు యశోదరా! మనం కలిసి జీవించడమనేది మనిద్దరికీ సంబందించిన విషయం. …… మీ తండ్రి గారు నిన్నో , మన కుటుంబాన్ని, పరివరాన్ని, గ్రామాన్ని రక్షించగలననే నమ్మకాన్ని నానుంచి ఆశిస్తున్నారు, రక్షణ అంటే ఏమిటి?: ఎవరినుంచి రక్షణ? శత్రువులనుంచా? ఎవరా శత్రువులు? ఎందుకా శతృత్వం? మనుషుల మనసుల్లో ద్వేషం, కోపం, ఇతర మనుషులపై ఎందుకు కలగాలి ? అలా కలిగిన మనుషులను రక్షించాలి గానీ – …. ఇది చిన్న పిల్లల వినోదం కాదు . పరిణతి పొందిన ఇద్దరు వ్యక్తుల పరిణయం . యశోధరను గెల్చుకోవటానికి ఆమె రాజ్యం కాదు, భూమి కాదు, నదీజలం కాదు. పరస్పర అంగీకారంతో ప్రవేశించవలసిన బంధం.”
ఈ మాటలకు యశోధర ఎంత బాగా స్పందించిందో గమనించండి.” సిద్ధార్ధా – బాధ్యత నాదే – నేను గెల్చుకోవలసిన వస్తువునో బహుమతినో కాదని నిరూపించుకోవలసింది నేనే. మీరు నిరూపిస్తే నేను మళ్ళీ ఆ స్థితిలోకి జారిపోతాను. అందువల్ల దీనికి మీరు దూరంగా ఉండండి. ఇందులో మీ ప్రమేయం వద్దు. నియమమో, నిబంధనో విధించిన వారు దానిని ఉపసంహరించుకున్నామని మీకు చెప్పిన తర్వాతనే మనం మాట్లాడుకుందాం. “
ఇద్దరి ఆలోచనలూ ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి.
యశోధర తన ధృడ నిశ్చయాన్ని తండ్రితో ఎలా చెప్పిందో చూడండి. “ నామీద నాకున్న గౌరవం గురించి మాట్లాడానికీ , మీకు తెలియచెప్పటానికీ వచ్చాను తండ్రీ! నేను ఎట్టిపరిస్థితుల లోనూ ఎవరో ఒక క్షత్రియ పురుషుడు గెలుచుకు పోయేందుకు సిద్ధంగా ఉన్న వస్తువుని (గమనించండి) కాదు. మీ కుమార్తెను. మీరెంతో ప్రేమతో పెంచిన పుత్రికను. అది మీరు పట్టించుకోకుండా క్షత్రియ ధర్మాలే కావాలనుకుంటే నేను మీ కుమార్తెను కాకుండా పోతాను.”
కుల వ్యవస్థలో లోపాలు, ముఖ్యంగా అగ్రవర్ణాలవి, సిద్ధార్ధుడు చేత ఓల్గా గారు ఎలా చెప్పించేరో, అది ఇప్పుడు మన దేశం లో జరుగుతున్న బ్రాహ్మణిక వాదం ఎదుర్కోవడానికి ఎలా అన్వయించుకోవచ్చో గమనించండి. .” మీరు చెప్పింది ధర్మమని నాకు తోచడం లేదు. నేను బ్రాహ్మిణ, క్షత్రియ ఆధిక్యతలను అంగీకరించను గదా – వారు వారిష్టమొచ్చినట్లు శాస్త్రాలు సృష్టించి, జ్జ్ఞానాన్ని నిర్దేశించి పరిధులలో బంధిస్తున్నారనీ, దాని వలన తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటున్నారని నా అభిప్రాయం. ప్రతీ సమూహమూ ఏదో ఒక బలహీన సమూహంపై ఆధిక్యత నిలపెట్టుకుంటున్నదా?” ఇప్పటి మన దేశ పరిస్తితి ఇంచు మించు ఇలాగే ఉంది.
అతనింక ఇలా అంటాడు “ భగవంతుడనేవాడుంటే ఆయన మానవులకూ తనకూ మధ్య తనకూ మధ్య ఈ స్వార్ధ పరులను మధ్యవర్తులుగా ఉంచుతాడా?”
తన వివాహం తండ్రి ఒప్పుకున్నాక యశోదర తల్లితో (తోటి స్త్రీ) స్త్రీ స్వాతంత్రం గురించి చెప్పింది” అమ్మా – నా వివాహ విషయంలో సమస్త అధికారమూ తండ్రి గారిదేనని చెప్పేదానివి. కానీ నా ఇష్టమే నెగ్గలేదా? అధికారం మనకూ ఉంటుందమ్మా ఉందని మనం తెలుసుకోవాలి…..”
ఈ నవలలో ప్రస్తుత సమకాలిన విషయాలు, ముఖ్యంగా మతం, బ్రాహ్మణికం . ఇది చూడండి ~అనేక విషయాలు అలాగే చెల్లుబాటవుతూ వస్తున్నాయి. మానవులను వర్ణ బేధాలతో విభజించడం కొందరిని హీనంగా చూడడం కూడా అవివేకమే కదా. అది ధర్మం కాదని చెప్పినా ఎవరూ ఒప్పుకోరు, సత్యాన్ని చూడాలనుకోరు”. “పూజారులు మనకు దేవతలకూ నడుమ మధ్యవర్తులు అవడం నాకు చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది.”
ఇప్పటి మన దేశ మత రాజకీయాలలో విరివిగా వాడుతున్న ఆధ్యాత్మిక చింతన గురించి ఓల్గా ఎంత బాగా చెప్పారో గమనించండి ”దురదృష్టవశాత్తూ అధ్యాత్మిక చింతన అంటే దైవారాధన అనో, వ్యక్తిగత మోక్షసాధనా యోచన అనో అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. తోటి జీవులపట్ల మనలో కలిగే అనుకంపను, కరుణను, ప్రేమను మనసులో పెరగనివ్వడం, తోటి ప్రాణులపట్ల ఓరిమితో, సహనంతో మెలగటమే ఆధ్యాత్మిక వర్తన అని నాకు తోస్తున్నది.” అంటే ముఖ్యంగా ఓల్గా గారు చెప్పినది, మనలో ఒక మానవత్వ దృక్పధం ఉండాలని.
యుద్ధం గురించి కూడా సిద్ధార్ధుడు చేత బాగా చెప్పించారు ఓల్గా గారు . “ మానవుల అంతరంగం నిరంతరం యుద్ధక్షేత్రంలా రక్తపిపాస వంటి లేదా అంతకంత ప్రమాదకరమయిన పిపాసలతో నిండి ఉందని నాకు తోస్తున్నది . తమా తోటి మనుషులను కులము జాతి పేరుతో హీనంగా చూడడడం, బానిసలుగా చేసుకోవటం, అసత్యం కపటత్వం, హింసలో ఆనందాన్ని అనుభవించడం , ఎదుటి వారిపట్ల క్రూరంగా ప్రవర్తించడం, నేనింత ధనవంతుడను అని అహంకారం, ధనమొక్కటే విలువగలదని తలచే మూర్ఖత్వం, లోభం, ఇవన్నీ మానవ అంతరంగాన్ని వశపరుచుకొని నిత్యం తన పరిసర ప్రాణులతో యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఈ యుద్ధం గురించి ఆలోచించాలి యశోధరా! దానిని నివారించే మార్గాన్ని కనుక్కోవాలి.”
దళితుల మీద, హిందూ మతేతరాల మీద, అడవులను దోచుకోవడం కోసం ఆదివాసుల మీద ఇప్పుడు జరుగుతున్న దౌర్జ్యన్యపూరిత దాడులను ఎలా అడ్డుకోవాలో, మానవత్వ శక్తులన్నీ ఆలోచించవలసిన సమయమిది. ఇది చెప్పడం చాలా అవసరమని నాకు తోచింది. మన దేశాల్లో, పుష్కరాలు , కుంభ మేళాలు, ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఇప్పుడు కేరళ లో జరిగిన విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో దయతో 500 కోట్ల రూపాయలు ఇస్తానంది. కానీ ఈ మత యజ్ఞాలకు ఇంతకు ఎన్నో రెట్లు, కేంద్రం, రాష్ట్రాలు ఖర్చు పెడతాయి.
సిద్ధార్దుంటాడు “ ఉదయం నుంచీ నేను యజ్ఞాలను ఆపటం గురించి ఆలోచిస్తున్నాను. యుద్ధం ఆపటం తేలిక కానీ యజ్ఞం ఆపటం కష్టం . యజ్ఞం ఫలం గురించిన ఆశ విశ్వాసం మీద ఆధారపడింది. అది చెదరదు. యుద్ధఫలితంగా కలిగే మరణాన్ని కాదనలేరు. అది ప్రత్యక్షంగా కనపడుతుంది, యజ్జ్ఞ ఫలితం ప్రత్యక్షంగా కనిపించేది కాదు. మానవులు మానసికంగా కల్పించుకునే భ్రమ. భ్రమల్లో బతుకున్నవారిని బైటపడేయడం మాటలు కాదు. అది భద్త్రతనిస్తున్నట్టుగా భ్రమ గొలుపుతుంది. ఆపదలనుంఛీ వ్యాధులనుంచీ, అకాల వర్షాల నుంచీ మానవులు భద్రత కోరుకుంటారు. దానికి ఋజుమార్గం, సత్యమార్ధం వారికి తెలియదు. చెప్పే వారు లేరు, వెతికే వారు లేరు. ఆ మార్గం కనిపించేంత వరకూ వారిది చేస్తూనే ఉంటారు”
ప్రస్తుతం మతపరమయిన వాదనలు పెరిగిపోవడంతో ఈ భ్రమలు కూడా పెరిగిపోతున్నాయి. బాగా చదువుకున్న మధ్య తరగతిలో ఈ భ్రమలు ఎక్కువగా ఉండడం విషాదకరమయిన విషయమే. ఇంకో సారి కేరళ వర్షాల బీభత్సంలోకి వెడితే అక్కడ కూడా, అయ్యప్పను అవమానపరచడం , ఆవు మాంసం తినడం వల్లే ఈ బీభత్సం వచ్చిందని తప్పుడు వాదనలు ప్రచారం చేస్తున్నారు.
తెలుగు సాహిత్య ప్రియులందరూ తప్పక చదవవలసిన నవల యశోబుద్ధ .
*
సమకాలీన అంశాలను ఉటంకిస్తూ రాసిన మంచి విశ్లేషణ…మీరు రాస్తూనే ఉండాలి సుబ్బు సార్ 🙂
With apt quotations from the novelette you have given a gist of the work.
Will definitely serve as an appetizer.
‘ఆమె రాజ్యం కాదు, భూమి కాదు, నదీజలం కాదు. పరస్పర అంగీకారంతో ప్రవేశించవలసిన బంధం’.సిద్దార్థుడు, యశోధర మనసుల్లో ప్రవేశించి ఓల్గా చేసిన మరో గొప్ప రచనపై సుబ్రహ్మణ్యం గారి సమీక్ష పాఠకుల మనసుల్లో భావాలకు అక్షరరూపం. అభినందనలు.
నా వ్యాసం పై మంచిగా స్పందించిన ముగ్గురు మిత్రులకూ ధన్యవాదాలు /
swathi maasapatrikaku anubandhamgaa vachina ee novel naakoo ento ishtamainadandi..mee visleshana chaalaa baagundi. abhinandanalu
thanks