కథకు ఎలాంటి వస్తువు ఎంచుకోవాలి? కథకు అనుకూలంగా దాన్ని ఎలా మార్చుకోవాలి? కథ ఎలా మొదలు పెట్టాలి? ఎలా ముగించాలి? ఎన్ని పాత్రలు ఉండాలి? ఏం మాట్లాడించాలి? వాటి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి? కథను ఏవిధంగా చెప్పాలి? ఎవరి దృష్టికోణం నుంచి మాట్లాడాలి? ఏ భాషలో రాయాలి? పాత్రోచిత భాష ఏమేరకు వాడాలి? కథా సన్నివేశాలు, వర్ణనలు, సంఘర్షణలు… ఎలా గుదిగుచ్చాలి? ఇలాంటివాటన్నింటిపై సమగ్ర అవగాహన ఉన్నా, లేకపోయినా బలమైన భావావేశం కథకుడిచేత కథను రాయించొచ్చు. కానీ ఇవన్నీ సమగ్రంగా కుదిరినప్పుడే కథ పాఠకుల మనస్సుకు హత్తుకుంటుంది. తట్టిలేపుతుంది. అలాగని కథ ఇలాగే రాయాలి? ఈ వస్తువునే ఎంచుకోవాలి? వంటి నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. అది కథకుడి ఇష్టాయిష్టాల మీద, ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లే కథ ఎప్పుడూ ప్రయోగాలతో పురిటినెప్పులు పడుతూ కొత్త సృష్టిని స్ఫురింపజేస్తూ ఉంది.
బోడపాటి హరితాదేవి, రాధిక పేరుతో కథలు రాస్తున్నారు. రాసిన కథలు తక్కువైనా ప్రతి కథా వైవిధ్యభరితం. సమాజాన్ని పరిశీలనాత్మక దృష్టితో చూస్తూ, చీకటి మూలాలను బద్దలు కొట్టే కథలు అందిస్తున్నారు. వీరి కథలు ఆర్ద్రమైన తడితో ముంచేస్తాయి. వ్యక్తులను వాళ్ల దృష్టితోనే ఎలా చూడాలో తెలియజేస్తాయి. అలాంటిదే ‘భీష్మా… నాతో పోరాడు!’ కథ. కథా నేపథ్యం, పాత్రలు, సన్నివేశాలు మహాభారతంలోనివి. కానీ రాధిక ఈ కథ ద్వారా సమకాలీన మనుషుల ప్రవర్తనలోని లోపాలపై కూడా ఫెటిళ్లమని చెంపదెబ్బకొట్టారు. ఒక సామాజిక పరివర్తనకై ఈ కథ మనిషిని సంసిద్ధం చేస్తుంది. మహాభారతంలోని ఓ పాత్రను తీసుకొని, ఆ పాత్ర స్వభావాన్ని, అంతఃసంఘర్షణనను, వేదనాభరితమైన జీవితాన్ని, ఓటమిని, ఒంటరితనాన్ని, సంక్షోభిత కల్లోలమైన ఆ పాత్ర హృదయాన్ని, మరణాన్ని అద్భుతంగా చిత్రించారు. అందుకు ఫ్లాష్ బ్యాక్ కథనాన్ని, ఉత్తమ పురుష దృష్టికోణాన్ని చక్కగా, చిక్కగా, సన్నటి ధారగా వాడుకున్నారు.
ఎత్తుగడ, ముగింపుల నిర్మాణబంధంతో కథను చూస్తే కథ ప్రధానపాత్రైన శిఖండి స్థితిని, చుట్టూ ఉన్న పరిస్థితిని వర్ణించడంతో ప్రారంభమవుతుంది. మహాభారతయుద్ధం జరుగుతున్న కాలమది. సూర్యుడు అస్తమించేసరికి యుద్ధం ఆగిపోతుంది. ఆ భీభత్స, భయానక వాతావరణంలో కొన ఊపిరితో శిఖండి ఉంటుంది. తన గురించి తనే…
“నా సర్వశక్తులూ కూడదీసుకుని కళ్ళు తెరిచి చుట్టూ పరికించాను. … … చుట్టూ యుద్ధం చేసిన భీభత్సం. తెగిపడిన తలలు. చెల్లా చెదురైన మొండాలు, ధారలుగా పారి గడ్డకట్టిన రక్తం. విరిగిపోయిన రథాలు. కూలిపోయిన ఏనుగులు, గుర్రాలి, పృథ్వి ఇంతవరకు చూడని యుద్ధం. ఎవరినీ విజేతలుగా గాని పరాజితులుగా గాని నిలపని యుద్ధం” అంటూ మరణం అంచున నిలబడి మాట్లాడుతుంది. ముగింపులో “నా మరణం సంపూర్ణమైంది” అని చెప్తుంది ఆ పాత్రే. ఈ ప్రారంభం, ముగింపుల మధ్య ఆపాత్ర మనసుకు, లౌకిక జీవితానికి మధ్య జరిగిన సంఘర్షణలను సన్నివేశాలుగా, సంఘటనలుగా అద్భుతంగా గుదిగుచ్చారు కథకురాలు. వాటిలో పురుషుడిగా పుట్టిన శిఖండి తనలోని స్త్రీత్వాన్ని చెప్తుంది. ఆ రెండింటి మధ్య ఎలా నలిగిపోయింది? తల్లిదండ్రులు, చుట్టు ఉన్న వాళ్లు ఎలా అవహేళన చేసింది? వివరిస్తుంది.
సన్నివేశాల అల్లిక పరంగా కథను గమనిస్తే… స్నానం చేసిన శిఖండి తను ధరించడానికి స్త్రీలు వేసుకునే వస్త్రాలు కావాలని పట్టుబడితే, దాసి కుమార్తెను వివస్త్రను చేసి చూపించి. “చూడు, బాలిక అంటే ఇలా వుంటారు. నువ్వు వున్నావా? బాలికని తెలియజెప్పే ఒక్క అంగమైనా నీకు ఉందా. వుంటే చెప్పే నిన్ను బాలికగానే పెంచుతాము. సరిగ్గా చూసి చెప్పు” అని తండ్రి కోప్పడతాడు. శిఖండి స్త్రీయో, పురుషుడో నిర్ణయించేది శారీరక అంగాలతోనా? మనసు, హృదయ స్పందనలతోనా అని ఈ సన్నివేశంలో శిఖండి వేసిన ప్రశ్న మనకూ సూటిగా తాకుతుంది.
మరో సన్నివేశం ఆమె వివాహనికి సంబంధించింది. పెళ్లికూతురు శోభనం రోజు మూర్ఛపోతుంది. శిఖండిని మళ్లీ పరీక్షకు గురిచేస్తారు. మగ అంగాలుండడంతో మగవాడనే తేలుస్తారు. నడక, మాట, కదలికలు స్త్రీని తలపిస్తున్నా, ఆమె తండ్రి బలాన్ని, బలగాన్ని చూసి దశార్ణవరాజు ఎదురుచెప్పలేక మూగబోతాడు. అంటే నిజం అధికారం ముందు, బలం ముందు ఎలా తలొగ్గుతాయో చెప్పడానికి ఈ సన్నివేశాన్ని బలంగా వాడుకున్నారు రచయిత. అలాగే బలైన పెళ్లికూతురు జీవితాన్ని శిఖండికోణం నుంచి వివరించారు.
ఇంకో సన్నివేశం యుద్ధఘట్టం. శిఖండికి మొదటి నుంచి బీష్ముడి ముందు తన యుద్ధనైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నదే కోరిక. ఆయన మీదున్న గురుభక్తి తర్వాత ఆరాధనా భావంగా మారుతుంది. యుద్ధంలో భీష్ముడిపై శిఖండి బాణాన్ని ఎక్కుపెడుతుంది. కానీ భీష్ముడు “పేడితో యుద్ధం చెయ్యను” అని ఆయుధం వదిలేస్తాడు. శక్తి సామర్థ్యాలను గుర్తించక, ఆమె సహజ స్వభావాన్ని అంగీకరించక… అవమానించడం వల్లే శిఖండి మరణించిందని ఈ సన్నివేశంలో తేల్చేస్తారు కథకురాలు.
ప్రతి సన్నివేశాన్ని శిఖండి అనుభవాలకు జోడించి, ఆమె పడిన తీవ్ర మానసిక క్షోభను, ద్వైదీభావంతో అల్లాడిన మనసును హృద్యంగా చిత్రించారు రచయిత్రి. పుట్టుక నుంచి మరణం వరకు ఉన్న శిఖండి జీవితాన్ని సన్నివేశాల మధ్య ఏకవాక్యంగా… బిగువుతో, సడలని భావావేశంతో పాఠకులకు చూపించగలిగారు.
లక్ష్యం – ఓటమి – మరణాల గురించి ఆలోచిస్తే పాత్ర లక్ష్యాన్ని ఆమె పుట్టుకతోనే ముడిపెట్టారు రచయిత్రి. తన ప్రతిభను భీష్ముడి ముందు ప్రదర్శించడంకోసమే శిఖండి జీవించింది. యుద్ధం మొదలైన తొమ్మిదోరోజు ఆ అవకాశం వచ్చినా లక్ష్యం నెరవేరలేదు. తన ప్రమేయం లేకుండానే లక్ష్యం ముందు ఆగిపోయింది. మానసికంగా క్రుంగిపోయింది. తనను మనిషిగా గుర్తించని భీష్ముడి స్వభావాన్ని ఎత్తిచూపింది. “నేను స్త్రీనో, పురుషుడినో కానందుకు నన్ను నిరాకరించాడు. మానవత్వంతో, బుద్ధితో, శక్తి సామర్ధ్యాలలో అక్కడ యుద్ధం చేస్తున్న ఎవరికీ తీసుపోనని గొంతెత్తి అరవాలని వుంది. గొంతు తెగిపోయేలా ఏడవాలని వుంది” అని బాధతో అల్లాడింది. సరిగ్గా ఇక్కడే రచయిత్రి ఆమె అస్తిత్వాన్ని గుర్తించని మనుషుల బుద్ధిని ప్రశ్నించారు. మరణం అంటే శారీరకమా? మానసికమా? లక్ష్యాన్ని సాధించలేకపోవడమా? తన అస్తిత్వాన్ని నిరూపించుకోలేకపోవడమా? వంటి ప్రశ్నలకు సమాధానమే శిఖండి మరణం అని చెప్పకనే చెప్పారు.
శిఖండిని ఆమె తండ్రికోణం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. అతడు రాజు. భీష్ముడ్ని జయించే కొడుకు కావాలనుకున్నాడు. శిఖండి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించినా ఆమెలోని స్త్రీత్వాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ఎక్కడ తన అధికారం, పరువు, ప్రతిష్టల చట్రం బద్ధలవుతుందోనని భయపడ్డాడు. అందుకే ఆమెను అమెలా పెరగనీయలేదు. ఈ కథలో శిఖండితో పాటు మరో రెండు స్త్రీ పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి కుంతి. రెండు ద్రౌపది. కుంతి యుద్ధాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉన్నా ఆపలేకపోవడానికి, చిన్నప్పుడే కొడుక్కు దూరమై చనుబాల బాధను భరించడానికి, కొడుకులకు రాజ్యాన్ని కట్టబెట్టాలన్న బలమైన ఆమె కోరికకు వెనక రాచ మర్యాద, మాతృత్వపు మమకారం దాగి ఉన్నదని స్పష్టం చేస్తారు కథకురాలు. ఇక ద్రౌపది అర్జునుడ్ని ప్రేమించినా, ప్రమేయం లేకుండానే ఐదుగురితో శరీరాన్ని పంచుకోవడాన్ని, శిఖండి సహజ స్వభావాన్ని తక్కువచేయడాన్ని… కప్పిపుచ్చడానికి కల్పిత కథలు అల్లారని చెప్తారు రచయిత్రి. అంతేకాదు ఆ కథల వెనక అధికారం, సమాజంలో బూజుపట్టిన విలువలు ఉన్నాయని తేటతెల్లం చేస్తారు. ద్రౌపది హృదయవేదనను “అన్నా జంతువులైనా తమకు నచ్చిన వాటితో జత కట్టడానికి ముందు మచ్చిక చేసుకుంటాయే, నా బ్రతుకు జంతువుకన్నా హీనం అయింది.” అన్న వాక్యంలో చెప్పి, పాఠకుల గుండెలు బరువెక్కేలా చేశారు.
ప్రతి సమాజం ఒక విలువల చట్రంలో బింగించబడి ఉంటుంది. ఆ విలువలు మనుషులను, వారి మనసులను శాసిస్తుంటాయి. ఆ బలమైన ముద్రల్లోంచే చాలామంది వ్యక్తులు త చుట్టు ఉన్న వాళ్లను గమనిస్తూ, తూస్తూ, అంచనా వేస్తూ ఉంటారు. అది మహాభారత కాలం కానీ, నేటి అత్యాధునిక సాంకేతిక సైబర్ కాలం కానీ. అందుకే ఈ కథ మహాభారత నేపథ్యంతో ఉన్నా, నేటి సమాజంతో పోరాడుతున్న శిఖండులకూ వర్తిస్తుంది. తమను తాముగా గుర్తించమని హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూ, అనుభవాల ముళ్లపై నడుస్తూ, అవహేళనలు, అవమానాలు ఎదుర్కుంటున్న వాళ్లది కూడా ఈ కథ. ఇదో అద్భుతమైన టెక్నిక్. ఆధునిక దృష్టితో పురాణ పాత్రలను, కథలను చూడ్డం సాహిత్యంలో కనిపిస్తుంది. మ్యాజిక్ రియలిజం లాంటి నిర్మాణపద్ధతులూ ఉన్నాయి. కానీ ఇక్కడ కథకురాలు నేరుగా భారతకథలోని శిఖండి పాత్రనే కొంత కల్పితంగా చెప్పినా, సమకాలీన సమస్యను పూర్తిగా దానిలో ప్రతిబింబింప చేశారు. శిఖండి చేత ఉత్తమ పురుషలో చెప్పించిన అనేక వేధనలు, నేటి సమాజంలోని అలాంటి వ్యక్తులవే…
“నేను ఎదుగుతున్నకొద్దీ తెలియని బాధ నన్ను దహించివేసేది. నేను మిగతా వాళ్ళకు భిన్నంగా వున్నాను అన్న ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనిచ్చేది కాదు. లోపల అగ్నిపర్వతం పేలుతున్నట్లుగా, నాలో ఇంకెవరో వుండి నన్ను నియంత్రిస్తున్నట్లు తోచేది.”, “నా హృదయం ఒక స్త్రీది… నా స్పందనలు, వాంఛలు, కోరికలు ఆలోచనలు అన్ని కేవలం స్త్రీవి మాత్రమే. కానీ నా శరీరంతో నన్ను గుర్తిస్తూ నా మనసును గుర్తించటానికి నినరాకరించే వీరికి నేను స్త్రీనని ఎలా నిరూపించగలను?”. నేడు మనకళ్ల ముందు కనిపించే ఎందరో శిఖండుల హృదయ ఘోష ఇది. అందుకే అటు టెక్నిక్ పరంగా, ఇటు ఇతివృత్తపరంగా ఒక కథకురాలిగా రాధిక పాఠకులపై బలమైన ముద్రవేసిందనే చెప్పొచ్చు.
*
భీష్మా నాతో పోరాడు
–చుట్టూ యుద్ధ చేసిన భీభత్సం. తెగిపడిన తలలు, చెల్లాచెదురైన మొండాలు,ధారాలుగా పారి గడ్డ కట్టిన రక్తం. విరిగిపోయిన రథాలు. కూలిపోయిన ఏనుగులు, గుర్రాలు. పృథ్వి ఇంతవరకు చూడని యుద్ధం. ఎన్ని జీవితాలు,ఎన్ని జీవాలు ఈ యుద్ధం ముగుసే లోపు అంతమవుతాయో.
చుట్టూ పరికించాను. ఎవరిదో మూలుగు వినపడుతుంది. కాసేపటిలో రాబోయే చావు కళ్ళముందు కనబడుతున్నట్టుంది. పాపం భార్యా పిల్లలు గుర్తు వచ్చి వుంటారు.వాళ్ళ కోసం ప్రాణం కొట్టుకుంటున్నట్టు వుంది .
నేను మరణిస్తే నన్ను గుర్తు చేసుకునే వారు గాని నా కోసం ధుఖించే వారు గాని ఎవరూ లేరు.త్వరలోఈ యుద్ధంలో నేనూ మరణిస్తాను. .. .. అది నా భౌతిక మరణం మాత్రమే. నేను ఎవరో మొదటి సారి గుర్తించిననాటి నుంచి నన్ను తుదికంటా నరికి వెయ్యటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో గాయాలు నన్ను బాధించినాయి. అన్నింటినీ తట్టుకుని ఈ రోజు కోసం…. నా జీవేచ్చని నిలుపుకుంటూ ప్రాణాన్ని నిలబెట్టుకున్నాను. ఈ రోజుతో నాలో ఆ ఇచ్ఛ అంతరించింది.
ఇన్ని నాళ్ళు నాదికాని శరీరం లో నాదైన జీవితం గడపటానికి ప్రతి క్షణం పోరాడాను.ఇక ఈ జీవితం చాలు. నా జీవితం, నా అనుభవాలూ, నేను ఎదుర్కొన్న అవమానాలు నా కళ్ళముందు దృశ్యాలుగా తిరుగుతున్నాయి.
****
నా పుట్టుక నా తల్లిదండ్రులకు పరమానందాన్ని ఇచ్చింది. తొలి చూలు లోనే మగపిల్లవాడు పుట్టటం వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేసింది. నన్ను భీష్ముడిని మించిన యోధుడను చెయ్యాలని యుద్ధం జరిగితే భీష్ముడిని నేనే ఓడించాలని నా తండ్రి కలలు కనేవాడు.
విలువిద్యలో ఆరితేరి , ఒంటి చేత్తో వెయ్యిమంది వీరులనైనా ఓడించగలిగే భీష్ముడి గురించి వింటుంటే నాకు ఒడలు పులకరించేవి. సుదూరం నుంచి ప్రయోగించే ఆయుధాలు అప్పుడప్ప్పుడే వాడుకలోకి వస్తున్న కాలం అది. అప్పటి వరకు వాడుకలో వున్న ద్వంద్వయుద్ధాలలో శారీరిక శక్తి ప్రధాన పాత్ర వహించింది. కాని విలువిద్యలో నైపుణ్యం, శక్తియుక్తులు ,ఏకాగ్రత ఎంతో ముఖ్యం. అది అందరికి సాధ్యం కాదు. అందుకే విలువిద్యలో నిపుణుడైన భీష్ముడంటే రాజులందరూ భయపడే వారు.
నా తండ్రి నాకు చిన్నప్పటి నుంచి భీష్ముడి పరాక్రమాల గురించి చెప్పటం వలన నా మనసులో భీష్ముడంటే గురుభావం కలిగింది. ఎప్పటికైనా యుద్ధం జరిగితే, భీష్ముడు ఎదురైతే, భీష్ముడుని మెప్పించటమే లక్ష్యంగా విలువిద్య నేర్చుకున్నాను.
విలువిద్యలో నా నైపుణ్యం చూసి నా తండ్రి ఎంతో సంతోషించే వాడు. అతని ప్రార్దన మన్నించి పరమేశ్వరుడు భీష్ముడంతటి వీరుడిని కుమారుడిగా ప్రసాదించాడు అని చెప్పుకునే వాడు.
కాని నేను ఎదుగుతున్న కొద్ది తెలియని బాధ నన్ను దహించి వేసేది. నేను మిగతా వాళ్ళకి భిన్నంగా వున్నాను అన్న ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనిచ్చేదికాదు. లోపల అగ్ని పర్వతం పేలుతున్నట్టుగా , నాలోఇంకెవరోవుండినన్నునియంత్రిస్తున్నట్టుగాతోచేది.లోపలవున్నవారినితరిమికొట్టి, అందరివలెవుండటానికిశతవిధాలప్రయత్నంచేసాను.నాకుఅదిసాధ్యంకాలేదు.
దాసీ పిల్లల దగ్గ్గర తీసుకున్న దుస్తులు ధరించే దాన్ని, పువ్వులు, పూసలతో ఆడపిల్ల వలె అలంకరించుకునే దాన్ని. నాతోటి బాలికలతో కలిసి ఆటలు ఆడే దాన్ని.
నా తల్లి దండ్రులు నా ప్రవర్తననిపసితనంగా భావించి నన్ను మందలించే వారు . నా స్వభావం పసితనం కాదు ,సహజమైనది అని వారికి తెలియటానికి ఎంతో కాలం పట్టలేదు.
ఒక రోజు స్నానం ముగించుకొని వచ్చాను. నా సేవకుడు నా దుస్తుల్ని సిద్దంగా ఉంచాడు. ఆ దుస్తులు చూసి నేను “అవి బాలురు వేసుకునే దుస్తులు,నేను బాలికను. నాకు బాలికలు వేసుకునే దుస్తులు కావాలి.వెళ్లి తీసుకొనిరా””
అని పురంమాయించాను.
అతడు స్థాణువయ్యాడు. నాకు నచ్చ చెప్పటానికి పయత్నం చేసాడు.ఆ దుస్తులు ధరించాలనే ఆలోచనే నాకు దుర్భరంగా తోచింది. అతడి మాట వినలేదు. అతడు వెళ్లి నా తల్లిని తీసుకొని వచ్చాడు.ఎప్పటి లాగే అది పెంకి తనం గా భావించిన నా తల్లి నాకు నచ్చ చెప్పటానికి పయత్నం చేసింది.
“అమ్మా నేను బాలికను. నాకు బాలికలువేసుకునే దుస్తులే కావాలి. నాకు అవిధరించాలనే అనిపిస్తుంది. అవి తెప్పించు.” నేను చాలా స్ఠిరంగా చెప్పాను.
బహుశా నేను నేనుగా ఉండటానికి మొదలు పెట్టిన మొదటి యుద్ధం అది. యుద్ధంలో కొంతమందైనా మన తరపున ఆయుధం పట్టేవాళ్ళు వుంటారు. కాని నేను చేసే యుద్ధంలో నేను ఒంటరిని. నేను ఒంటరినని తెలియటానికి ఎంతో కాలం పట్ట లేదు.
నాది మొండితనంగాభావించిన నా తల్లి, నా తండ్రిని పిలవమని సేవకుడికి పురమాయించింది. నాపై ఎంతో ఆశలు పెట్టుకుని, నన్ను ఎంతో ప్రేమించే నా తండ్రి, విషయం తెలిసి ఆందోళనతో వచ్చాడు. నాకు సర్ది చెప్పటానికి ఇద్దరూ చాలాప్రయత్నం చేసారు. నేను బాలుడనని ,యువరాజు నని , నా ప్రవర్తన అలా వుంటే నలుగురూ నవ్వుతారని నన్ను బుజ్జగించారు, భయపెట్టారు ,చివరి అస్త్రంగా నన్ను దండించారు. కాని నేను వారి మాట వినిపించుకోలేదు.
నా పట్టుదలతో విసిగి పోయిన వాళ్ళు ఒక దాసీ కుమార్తెను పిలవనంపారు. ఆమెను వివస్త్రను కమ్మని ఆదేశించారు. ఆ పిల్ల నా తండ్రి అదేశాన్ని పాటించి తన వంటిపై దుస్తులను తొలగించింది.
“చూడు, బాలిక అంటే ఇలా వుంటారు. నువ్వు వున్నావా?. ……బాలికనని తెలియచెప్పే ఒక్క అంగమైన నీకు ఉందా. వుంటే చెప్పు నిన్ను బాలికగానే పెంచుతాము. నీకు కావలసిన దుస్తులు,పూసలు. పువ్వులతో నిన్ను ఆలంకరించమని ఆదేశిస్తాం. సరిగ్గా చూసి చెప్పు”. నా తండ్రి కోపం తో చెప్పాడు.
నేను అవమానంతో క్రుంగి పోయాను. స్త్రీయో పురుషుడో ఎలా నిర్ణయిస్తారు. శారీరిక అంగాలతో నా ?,మనసు,హృదయ స్పందనలతోనా.?
నా హృదయం ఒక స్త్రీది.. నా స్పందనలు,వాంఛలు, కోరికలు అలోచనలు అన్ని కేవలంస్త్రీ వి మాత్రమే.కాని నా శరీరంతో నన్ను గుర్తిస్తూ నా మనసుని గుర్తించటానికి నిరాకరించే వీరికి నేను స్త్రీనని ఎలా నిరుపించగలను ? నన్ను అక్కున చేర్చుకోవలసిన నా తల్లిదండ్రులే నన్ను గుర్తించ నిరాకరిస్తే లోకానికి నన్ను నేను ఎలా ప్రదర్శించుకోగలను.
నేను కుప్పకూలి పోయాను. నన్ను ఆ స్థితిలో వదిలి అందరు వెళ్ళిపోయారు. నా కళ్ళముందు ఆ దాసీ నగ్న శరీరం నిలబడివుంది. నువ్వు బాలికవు కావు అని నన్ను వెక్కిరిస్తున్నట్టుగా వుంది.
నా దుస్తులను తొలగించి నన్ను నేను చూసుకున్నాను. నా అవయువాలని పరికించి చూసుకున్నాను. నాకు పట్టరాని దుఖం వచ్చింది. నేనెందుకు ఈ శరీరంలో వున్నాను. నాది కాని శరీరం. నాకు సంబంధం లేని అవయువాలు………నన్ను నేను గోళ్ళతో రక్కుకున్నాను. నాది కాకపోయినా నన్ను అంటి పెట్టుకున్న ఈ శరీరాన్ని నాశనం చెయ్యాలని, హింసించాలని ప్రయత్నించాను. శస్త్ర విద్యలు నేర్చుకునేటప్పుడు చిన్న గాయానికే తల్లడిల్లే నా తల్లి దండ్రులు మనసంతా గాయాలతో ఆసరా కోసం ఎదురు చూస్తున్న నన్ను అనాధలా వదిలివేశారు. నన్ను నన్నుగా స్వీకరించటానికి సిద్ధపడలేదు.
ఈ శరీరంలో ఇమడలేక ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిచాను. అప్పటికే నేను భిష్ముడంతడి వాడినని లోకమంతా చాటించిన,అనుభవజ్ఞుడైన నా తండ్రిఅతని ప్రతిష్ట కోసం నేను ఎటూ పారిపోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా నాకు కాపలా పెట్టాడు. నా ప్రయత్నాలన్నీ విఫలమైయ్యాయి.
నన్ను స్త్రీగా నిరూపించుకోవటం కోసం అనుక్షణం నేను ప్రయత్నించేదాన్ని. నాకు అందుబాటులో ఉన్న దుస్తులు,అలంకరణ సామాగ్రితో వీలైనంత వరకు బాలిక వలె అలంకరించుకునేదాన్ని. నేను కంట పడగానే ,నేను మానవుని కానట్టూ, విచిత్ర ప్రాణినైనట్టూ అందరి చూపూలూ నన్ను శోధించేవి, సేవకులు నావెనుక నవ్వుకునే వారు.ఆ నవ్వులు నా గుండెల్లో గుచ్చుకునేవి. అయినానేనుయుద్ధం ఆపలేదు.
ఈ స్ఠితిలో కూడా నేను ఎంతో ఆసక్తితో విలువిద్య నేర్చుకునేదాన్ని. నేను స్త్రీ గా మారిన తరువాత భీష్ముడిని నేను ఆరాధిస్తున్నానని నాకు తెలిసింది. భీష్ముడిని చేరే మార్గం కేవలం విలువిద్య మాత్రమే. నన్ను నేను మరిచిపోవటానికి, భీష్ముడిని చేరటానికి నాకు విలువిద్య ఆసరా అయింది. పురుషుడి శరీరానికి కుండే శారీరక బలం, స్త్రీ సహజ సిద్ధమైన నైపూణ్యం, రెండూ నాకు వుండటం వల్ల విలువిద్యలో నేను పరిణితి సాధించాను.
నాది ఉన్మత్తతో లేక ఏదైనా మాయ నన్ను ఆవరించిందో అని భావించిన నా తండ్రి గొప్ప వైద్యులను పిలిపించి నాకు తగిన వైద్యం చెయ్యమని ఆదేశించాడు.వారి వైద్యం నాలో ఎలాంటి మార్పు కలిగించ లేకపోయింది.
నాలాంటి సమూహానికి నాయకత్వం వహిస్తున్న వారిని పిలిపించాడు. నన్ను మామూలు మనిషిని చేస్తే ఎన్నో బహుమతులు యిస్తానని ఆశ పెట్టాడు.
“ సామి, మేము శివుడి రూపాలం. మా దీవెన మీకు విజయం కలిగిస్తుంది.అర్థనారీశ్వరులం. మనసు పార్వతి దేవిది అయితే శరీరం శివుడిది.మనసు శివుడిది అయితే శరీరం పార్వతిది. శివుడే మీ ఇంట పుట్టాడనుకోండి.” ఆ నాయకుడు వినయంగా చెప్పాడు.
నా గురించి అందరికీ తెలియకుండా ఎలా దాచిపెట్టాలో నా తండ్రికి అర్ధం కాలేదు.ఆంతరంగికులని ,జ్యోతిష్కులని పిలిచి తన పరువు కాపడేదారి వెతకమని ఆదేశించాడు..
అంతా కలిసి ప్రపంచాన్ని నమ్మించే ఒక కథని అల్లారు.నేను పూర్వ జన్మలో అంబ నని, భీష్ముడిని చంపాలని ప్రతిజ్ఞ చేసి ప్రాణాలు తీసుకొని పురుషుడి శరీరంలో చేరి నా తండ్రికి ఈ జన్మలో పుట్టానని ప్రపంచానికి చాటారు.
కొన్నాళ్ళకు నా తల్లి కవల పిల్లలకు జన్మ నిచ్చింది. ఒక బాలుడు. ఒక బాలిక జన్మించారు.బాలికను ద్రౌపది అని పిలిచేవారు. నాతొ విసిగిపోయిన నా తండ్రి వారిని అల్లారుముద్దుగా పెంచాడు.చిన్న నాటినుంచే ద్రౌపదిని అర్జనుడికి భార్యను చెయ్యాలని కోరుకునేవాడు.
ద్రౌపది అందానికి ప్రతిరూపం. నల్లటి కళ్ళతో మెరిసే వంటితో చూపరులను మైమరిపించేది. ద్రౌపదిని చూసి నాలో నేనే ముడుచుకుపోయేదాన్ని. ఆడవాళ్ళు కుడా మోహించే ద్రౌపది సౌందర్యాన్ని,రోమాంచితం అయి ,మొద్దుబారి వున్న నా శరీరంతో పోల్చుకుని క్రుంగి పోయేదాన్ని.నా శరీరాన్ని హింసించే దాన్ని. నా శరీరానికుండే పురుష అవయువాలను తొలగించుకోవాలనేప్రయత్నంలో చాలా సార్లు చావు అంచు వరకు వెళ్లి వచ్చాను.
***
నాకు వివాహం చెయ్యాలని నా తండ్రి నిర్ణయించాడు. వివాహంతప్పించుకోవటానికిఎన్నోప్రయత్నాలుచేసాను.ప్రాధేయపడ్డాను,బ్రతిమాలాను,బెదిరించాను.కాని నా మాట వినకుండా వివాహం జరిగితే నేను సరౌతానని , బంధుత్వంతో రాజ్యం పఠిష్టమౌతుందని భావించి,నన్ను బంధించి దశార్ణదేశపు రాజు కూతురితో వివాహం జరిపించారు.
నేను స్త్రీనై మరొక స్త్రీని వివాహమాడవలసి రావడం నేను తట్టుకోలేక పోయాను. కాని నాకు పారిపోవటానికి గాని,ఆత్మహత్య చేసుకోవటానికి గాని దారిలేక ఆ అమాయకురాలి జీవితం అన్యాయం చేసాను.
మొదటి రాత్రి నన్ను,నా వస్త్ర ధారణనీ చూసిన ఆ పసిపిల్ల మూర్చ పోయింది. నేను పురుషుడని కానని ఒక స్త్రీని అని అందరికి చెప్పి, తన తండ్రికి కబురంపింది.
ఆమెతండ్రి మోసపోయినందుకు నాతండ్రిని నిలదీసాడు. అతని వాదనని నాతండ్రి వినిపించుకోలేదు. నన్ను పరీక్షించుకొమ్మాన్నాడు. నా శరీరం పరీక్షక గురైంది. మగ అంగాలున్న నన్ను మగవాడిననే తేల్చారు. నా నడక,నా మాట , నా కదలికలు స్త్రీ ని తలపిస్తున్నా,నా తండ్రి బలాన్ని,బలగాన్ని చూసి ఎదురాడలేక ఆ అమాయకురాలిని అన్య్యాయం చేసి దశార్ణదేశపు రాజు వెళ్ళిపోయాడు. ఆమె గోడు పట్టించుకున్న వారు లేక చెప్పుకునే నాధుడు లేక ఆ పసి ప్రాణం కొట్టుకులాడింది.
ఇంత కఠినమైన మనుషుల మధ్య , యిన్ని అవమానాలు పొందుతూ ఉండలేక దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. నా వారసత్వ హక్కుని ఆసరాగా చేసుకుని నా తండ్రిని రాజ్యంలో ఏదైనా ప్రాంతానికి నన్ను రాజుని చెయ్యమని అర్ధించాను. నేను స్వతహాగా యోధురాలిని కావడంతో ద్రుపద రాజ్యానికి సుదూరంగావున్న ఒక చిన్న ప్రాంతాన్ని నాకు అప్పగించాడు. నేను, నాకు భార్యని చేసిన ఆ పిల్లని తీసుకోని ఆ రాజ్యానికి చేరాను.
ఈ అమరికతో నా తండ్రికి,నాకు, నా భార్యకు స్వాంతన దొరికింది. నేను రాజుని కనుక నాకు నచ్చిన విధంగా వుండే అవకాశం దొరకినది. నన్ను నేనుగా గుర్తించుకున్న నాటినుంచి కొంతైనా నాలాగ బతకటానికి దొరికిన అవకాశం ఇది.నా మనసుకు కొంత స్వాంతన దొరికింది.
***
మత్స్య యంత్రాన్ని అర్జనుడు పడగొట్టాడని విని సంతోషపడ్డాను. ద్రౌపది చిన్న నాటినుంచి అర్జనుడినే భర్తగా భావించి ఆ తలపులతోనే జీవించింది. అర్జనుడి భార్య అవుతున్నందుకు ద్రౌపది పొందే ఆనందాన్ని తలచుకున్నాను.
కుంతి తన కుమారులను సంస్కారవంతులుగా పెంచింది. దాసీలను తాకబోమని వారితో వట్టు వేయించుకుంది. తతిమా నలుగురు బ్రహ్మచారులుగా వుండగా, అర్జనుడు ఒక్కడే సంసార సుఖాన్ని అనుభవిస్తుంటే తన కుమారుల మధ్య అసూయ తలెత్తుతుందని భావించిన కుంతి ద్రౌపదిని ఐదుగురికి భార్యను చేసింది. కాని అయిదుగురి తో శరీరాన్ని పంచుకోవటం ఎంత నరకమో,…..
ఎలావుందో నా సోదరి.నా మనసు ద్రౌపదిని చూడాలని తహతహ లాడింది.
తన వారినందరిని వదిలి ఒక్క రోజులో తన జీవితం లో జరిగిన పెనుమార్పులకు చిగురుటాకులా వణికిపోతుంది ద్రౌపది.
నన్ను చూసి కంటతడి పెట్టింది.
“”అన్నా, జంతువులైనా తమకు నచ్చిన వాటితో జత కట్టటానికి ముందు మచ్చిక చేసుకుంటాయే,నా బతుకు జంతువు కన్నా హీనం అయింది. అర్జనుడే నా భర్త అని నా మనసంతా నింపుకున్నాను. ఐదుగురితో సంసారం ఎలా చెయ్యాలి.నన్ను గురించి లోకం ఏమనుకుంటుంది.” అని హృదయ విదారకంగా విలపించింది.
“ బాధ పడకు తల్లి.కాలం, అనుభవాలు అన్నింటినీ ఎదుర్కొనే శక్తిని యిస్తాయి. లోకం గురించి చింతించకు. ఐదుగురు భర్తలున్న నీ గురించి కూడా లోకం మన్నించే ఒక కథ అల్లుతారు.నిన్ను లోకం ఆదరిస్తుంది”.అని ఓదార్చాను.
చాలా కాలం ద్రౌపది కన్నీరు నన్ను వెంటాడింది.
***
దుర్యోధనుడు రాజ్యంలో భాగం యివ్వటానికి నిరాకరించటంతో యుద్ధం అనివార్యం అయింది. నేను పాండవుల సర్వాసేనానికి తోబుట్టువునవడంతో నేను కుడా యుద్ధరంగంలో అడుగుపెట్టాను. నా చిరకాల స్వప్నం అయిన భీష్ముడితో తలపడి ,నా విలువిద్యా నైపుణ్యంతో భీష్ముడి మనసును గెలుచుకొని లోకానికి నన్ను నిరూపించుకునే ఒక వరంగా ఈ యుద్ధం నా ముందు నిలిచింది.
సైనికులు నా వస్త్రధారణనీ,నా హావభావాలు చూసి నన్ను గేలి చెయ్యటం, వెకిలి నవ్వులు నవ్వటం నా దృష్టిని దాటిపోలేదు. ఇలాంటి అవమానాలు ఎన్ని సార్లు ఎదుర్కొన్నా ప్రతిసారి గాయం లోతుకు దిగుతూనే వుంటుంది. కాని నా ముందున్న లక్ష్యాన్ని తలుచుకుని మనసు దిటవు చేసుకున్నాను.
నా యుద్ధ రంగం ప్రధాన యుద్ధ రంగానికి దూరంగా వుండటం వలన నాకు భీష్ముడు తటస్తపడలేదు. రోజులు గడిచేకొద్దీ భీష్ముడిని ఎదుర్కొనే అవకాశం రాదేమోనన్న నిరాశ మొదలైంది. నిరాశను తరిమి ఓర్పుగా ఎదురుచూడ సాగాను.నేను కోరుకున్న రోజు వచ్చింది.
యుద్ధం మొదలైన తొమ్మిదవరోజు రాత్రి నా సోదరుడు నా దగ్గరకు వచ్చి తర్వాత రోజు జరగ బోయే యుద్ధంలో భీష్ముడిని ముఖాముఖి ఎదుర్కొన బోయేది నేనే నని, నాకు రక్షణగా అర్జనుడు కుడా నా రధం మీదనే ఉంటాడని చెప్పి వెళ్ళాడు.
నాకు ఆ రాత్రి నిదుర కరువైంది. చిన్న నాటి నుంచి నేను ఎదురు చుసిన క్షణం నా ముందుకు నడచి వచ్చింది. నేను ఆరాధించి, గురువుగా భావించిన భీష్ముడి దగ్గర నా విద్యని ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఈ యుద్ధంలో నేను మరణించినా నేను బాధపడను.
భీష్ముడిని ఎదుర్కునే క్షణం కోసం ఆత్రుతతో ఎదురుచూడసాగాను.
****
ఇరువైపులా సైనికులు మొహరించి వున్నారు. నేను, అర్జనుడు ఓకే రథాన్ని అధిరోహించి వున్నాం. యుద్ధం మొదలైంది. కృష్ణుడు రథాన్ని భీష్ముడి రథానికి అభిముఖంగా తీసుకువెళ్ళాడు. నా చుట్టూ వున్న వాళ్ళు నన్ను ఉత్సాహపరుస్తున్నారు. భీష్ముడిని చంపటానికే పుట్టావు.ఈ రోజు ఆ కార్యం పూర్తి చేయ్యమని పలురకాల కేకలు వినిపిస్తున్నాయి.
“అదుగో భీష్ముడు.“నా చెవిలో అర్జనుడి మాటలు ప్రతిధ్వనించాయి. అర్జనుడు చూపించిన వైపు చూసాను. ఒక యోగి లాగా జీవితాన్ని గడిపి ,కనీసం దాసిని కుడా తాకని పరమ నిష్టా గరిష్టుడైన భీష్ముడు నా కళ్ళముందున్నాడు. ఆయుధం ప్రయోగించమని అర్జనుడు తొందరపెట్టాడు. వింటి నారిని సవరించి అమ్ములపొదినుంచి బాణాన్ని తీసి భీష్ముడు వైపు ఎక్కుపెట్టాను.
ఉద్వేగం తో నా శరీరం కంపిస్తుంది. నా గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. స్వేదం నా శరీరాన్ని తడిపివేస్తుంది.
ఇంతలో ఏదో గందరగోళం చెలరేగింది.’ భీష్ముడు యుద్ధం చెయ్యడంట’ అన్న సైనికుల అరుపులు లీలగా వినిపించాయి. నెమ్మదిగా తేరుకుని భీష్ముని వైపు చూసాను.
భీష్ముడు ఎదురుగావున్న నన్ను చూసి “పేడితో యుద్ధం చెయ్యను” అని ఆయుధం విసర్జించాడు.
అప్పుడు నేను పూర్తిగా మరణించాను. నేను కొలిచిన భీష్ముడు నన్ను మనిషిగా గుర్తించక,నాతో యుద్ధాన్ని నిరాకరించాడు. యుద్ధంలో ఎన్నో గుర్రాలను,ఏనుగుల్ని చంపివుండవచ్చు. నన్ను అలా చంపినా నేను తృప్తిపొందేదాన్ని.
నన్ను ఒక ప్రాణిగా గుర్తించ నిరాకరించిన భీష్ముడు, ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి, కుంతి మాతృత్వాన్ని అవమానించి, ఎన్నో అన్యాయాలు చేసిన వారివైపు నిలబడి యుద్ధం చేస్తున్నాడు. నేను వారి పాటి చెయ్యనా?ఇదేనా న్యాయం?
నా నైపుణ్యంతో, నా బుద్ధి వికాసంతో నన్ను గుర్తించకుండా నేను స్త్రీనో, పురుషుడినో కానందుకు నన్ను నిరాకరించాడు. భీష్ముడినుంచి ఆ నిరాకరణని ,ఏహ్యభావాన్ని నా మనసు తట్టుకోలేకపోయింది.
నేను విలువిద్యలో తనకు సరిసమానం అని, నన్ను మనిషిగా గుర్తించి నాతొ యుద్ధం చెయ్యమని భీష్ముడిని వేడుకోవాలని వుంది. మానవత్వంలో,బుద్ధిలో, శక్తీ సామర్ధ్యాలలో అక్కడ యుద్ధం చేస్తున్న ఎవరికీ తీసిపోనని గొంతెత్తి అరవాలని వుంది…………………గొంతుతెగిపోయేలాఏడవాలనివుంది.కాని నా నోరు పెగలలేదు.నాహృదయంఘనీభవించింది. నాలో జీవేచ్చ మరణించింది. అచేతనంగా వున్న నన్ను చూసిన అర్జనుడు అదను చూసి భీష్ముడిపై బాణాలు సంధించాడు.
***
నా మరణం సంపూర్ణమైంది.
*
రవీంద్ర గారు చాలా బాగా వుంది మీ విశ్లేషణ.కథ కంటే మీ విశ్లేషణే బాగున్నట్టుంది. థాంక్ూ. అఫసర్ గారు వేసుకున్నందుకు మీకు, సజెస్ట చేసినందుకు గొరుసు గారు మీక్కూడా బోలెడు థాంక్యూలు
రవీంద్ర సర్… మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. కథలోని మీరు విశ్లేషించిన అంశాలు చదువుతున్నంతసేపు నేటి సమాజంలో ఇంకా జరుగుతున్న ఎన్నో సంఘటనలు కట్టముందు మెదిలాల చేసాయి.. మీరు విశ్లేషించిన సంఘటనలు వ్రాసిన విధానం నన్ను లోతైన ఆలోచన వైపు తీసుకెళ్ళాయి ..సగటు మనిషిలోని ఆలోచనలను తట్టిలేపేలా ..మీ విశ్లేషణ స్ఫూర్తిదాయకంగా అనిపించింది…. థాంక్స్ యు సర్…..
‘స్త్రీయో, పురుషుడో నిర్ణయించేది శారీరక అంగాలతోనా? మనసు, హృదయ స్పందనలతోనా? అని శిఖండి తన తండ్రికి వేసిన ప్రశ్న ఈ కథకి ఆయువు పట్టు. సమకాలీన జీవితాలకు అలనాటి పురాణ పాత్రలని మార్మికంగా ప్రతిక్షేపించి పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తించారు రాధిక. కథలోని సారాన్ని అద్దంలో చూపిన కొండలా బాగా విశ్లేషించావు రవీంద్రా. అభినందనలు.
ఏం కధ!
ప్రతి అక్షరమూ ప్రతి వాక్యమూ ప్రాణం పోసుకుని గుండెల్లో కొలువుదీరి మనతోనే ఉండిపోయే కధ.
ఇతిహాసం లోని పాత్రలని తీసుకుని వర్తమాన చర్చలను ప్రతిఫలించేలా..
పాఠకుల హృదయవైశాల్యాన్ని పెంచేలా..
వస్తువూ శిల్పమూ పోటుపడినట్టుగా కుదిరిన కధ..
ఇంత మంచి కధ రాసినందుకు రచయిత్రికి అభినందనలు, చదువరులందరి తరఫున ధన్యవాదాలు.
కధను గురించి చాలా బాగా చెప్పిన రవీంద్ర గారికి ధన్యవాదాలు..