సంకలనంగా సాహితీ విమర్శ మీద చెప్పుకోదగ్గ ఓ పుస్తకం వచ్చి చాలా చాలా కాలం అయింది. మొన్నటిదాకా విమర్శ అంటే ఆధిపత్య వర్గాల అంతిమ తీర్పు. ప్రజాస్వామ్య భావనలు లేని ఆ ఏక పక్ష గొంతులలో బహుజన, దళిత, ఆదివాసీయులకి స్వరం లేదు. మార్క్సిస్ట్ మేధావులు కూడా తమకు తెలియకుండానే బ్రాహ్మణీయ వర్గాల దురుసు పంథానే ఎంచుకున్నారు. బుజ్జగించడం, తెలియ చెప్పడం, ఇతరులని వినడం అనే ప్రాధమిక ప్రజాస్వామ్య సూత్రాలు పాటించిన జాడల్లేవు.
కాలాలు మారాయి. విమర్శకుల గొంతులూ పల్చబడ్డాయి. అనేకానేక భిన్న వర్గాల అస్తిత్వ పోరాటాలు, సాహితీ విప్లవాలు మొదలయ్యాయి. మేం ఫలానా వాళ్ళం, మాది ఈ మార్గం అంటూ అణగారిన వర్గాలు గర్వంగా తలెత్తుకు చెప్పడం మొదలుపెట్టాయి. వీటి తో పాటు సమాజం మీద ఆర్ధిక సంస్కరణలు, సాంకేతిక విప్లవాల ఉప్పెనలూ విరుచుకు పడ్డాయి. కొత్త దేవుళ్ళు వెలిశారు. మూడంచల మధ్య తరగతి ఉన్నత వర్గంగా రూపాంతరం చెంది, కొత్త జంఝాల మార్పిడి చేసుకొంటోంది. ధనికులు అపార కుబేరులుగా మారి పోతున్నారు. అభివృద్ధి కుప్పలుతెప్పలుగా పెరిగిపోతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
మరి వేల సంఖ్యలో ఈ ఆత్మ హత్యల మాటేమిటీ? మూస విద్యా విధానం లో మట్టికొట్టుకు పోతున్న ఈ విద్యార్ధుల సంగతేమిటీ? రెండు వేలు నెల పింఛను కోసం తడి కళ్ళతో రోజుల తరబడి యెదురు చూసే కోట్లాది పండుటాకు లెందుకున్నారూ? అన్నిటికీ మించి దూరాన్ని తగ్గించాల్సిన సాంకేతికత మనుషుల మధ్య అగాధాలని ఎందుకు సృష్టిస్తోంది? ఒక ఇంటి టెలిఫోన్ అయిదు సెల్ ఫోన్లు గా ఎందుకు ముక్కలైంది? దళిత, ఆదివాసీ, మైనారిటీల రక్తంతో చరిత్ర పుటలు తడిసి ముద్దై చివికి చిరిగి పోడానికి ఏ అనాగరిక శక్తుల ప్రాబల్యం పనిచేస్తోంది? ఇవన్నీ సాహిత్యం, కథ, కవిత యితర కళా రూపాల్లో ప్రతిబింబిస్తూనే ఉంది. అయితే అంతులేని అసహనం ఈ ఘోష నంతనీ ఒక చోట చేర్చడానికి అడ్డంకిగా మారింది. కాసేపు కూర్చుని, మాట్లాడుకొని, కొట్లాడుకున్నా ఓ చక్కటి ప్రేమ ఆలింగనంతో అల్విదాలు చెప్పుకొనే రోజులు రావా?
ఈ నేపధ్యం లోనుంచి వచ్చిందే “బహుళ” సంకలనం. ఓ పాతిక మంది వివిధ వర్గాల మేధావులు, వాళ్ళ అభిప్రాయాల్ని, సాహిత్యం మీద వాళ్ళ ఆలోచనల్ని ఏ.కె. ప్రభాకర్ సంపాదకత్వం లో ఓ సంకలనం గా తీసుకొచ్చారు. దీని మీద మాట్లాడుకోవడం యిక మన వంతు. మరిన్ని సంభాషణలు చేయడం, సంకలనాలు తేవడం మనందరి వంతు. ఎంతో శారీరక, ఆర్ధిక శ్రమ కోర్చి. ఆర్.కె.పరస్పెక్టివ్ ఆర్.కె. ముద్రించిన “బహుళ” ఆవిష్కరణ సభ 12 మే, శనివారం సాయంత్రం హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదారాబాద్ లో ప్రొఫెసర్ హర గోపాల్ గారి అధ్యక్షతన జరుగుతుంది. ఈ సందర్భం గా పబ్లిషర్ ఆర్.కె., సంపాదకుడు ఏ.కె.ప్రభాకర్ ల తో ఇంటర్వ్యూ ఈ కింది ఆడియో సంభాషణలో వినండి:
ఇంటర్వ్యూలు చాల బాగున్నాయి / ఒక గంట ప్రయాణం లో మొత్తం వినేసా .. అభినందనలు
మోహన్ బాబు గారూ సాహిత్య విమర్శలు సంకలనంగా రావడం ఇదే మొదటీసారనుకుంటా.మంచి ఆలోచన.భుజాలకెత్తుకోవడం,పాతాళానికి తొక్కెయ్యడం సాధ్య
పడదు. పక్క పేజీ వెక్కిరిస్తుందనే స్పృహ వుంటుంది.మంచిగా పరిచయం చేసారు.
సాహిత్యంలో ఇదే మొదటిసారి అనుకుంటా ఇలాంటి ప్రయోగం. అభినందనలు.
Wonderful thought.. much needed book for literary enthusiasts like me ☺
చాలా ఆసక్తికరమైన ఇంటర్వ్యూ. 1986లో సురా సంపాదకత్వంలో వెలువడిన ‘విభాత సంధ్యలు -తెలుగు సాహిత్యంలో సమాజం’ అనే ఉత్తమ ప్రయత్నం గుర్తుకొచ్చింది. (అప్పటికింకా సరళీకరణ, అస్తిత్వవాదనలు వేదికపైకి రాలేదు).
మిత్రులు ఆర్కే, ఏకేలకు, ఆయా వ్యాస రచయితలకు అభినందనలు. కృష్ణమోహన్ కి ధన్యవాదాలు. ‘బహుళ’ కోసం ఎదురుచూస్తూ –
ఆసక్తికరంగా ఉంది. సాహిత్య విమర్శలని సంకలనంగా తీసుకురావడం అనే ఆలోచన రావడం కొత్తకాదు కాని ఇంతమంది విమర్శలు ఒకే పుస్తకంలో రావాలన్న ఆలోచన చెప్పుకోదగ్గ విషయం. అభినందనలు.
మంచి ప్రయత్నం.
పూర్తిగా , ఆసక్తిగా విన్నాను.
ఆర్కే , ప్రభాకర్ గార్ల ఆలోచనలు సముచితం.
వాళ్ళిద్దరి మాటల వెనకున్న ఆవేదన అర్థవంతమైంది. ఆలోచనకు బీజం వేసేది.
“బహుళ”కు హృదయ పూర్వక స్వాగతం .