ఉదయాస్తమయాల నడుమ
మలుపుమలుపులో
మంచుబిందువుల మృదుస్పర్శను
రవికిరణపుగోరువెచ్చదనాన్ని
హత్తుకుంటూ
అందమైన పూవునై వికసిస్తుంటాను
నువ్వు చీకట్ల సాగులో
తలమునకలవుతూ
రాత్రులను మోసుకు తిరుగుతుంటావు
చెక్కిన ఆకర్షణీయమైన అక్షరాలను
ఆనందంగా పోగేసుకుని
ఆయువు పోసుకుంటూ నేను
అనాగరికతతో అనాకారితనాన్ని
గుండెల నిండా నింపుకుంటూ నువ్వు
అదాటున
పుప్పొడో పరిమళమో
నిన్ను మెత్తని మేఘమై చుట్టేసినా
చలనం లేని నువ్వు
సీతాకోకతనాన్ని ఎప్పటికీ కలగనలేని
గొంగళిదేహమై నువ్వు
సున్నితపలుకుల
సిసలైన చిరునామాయై నేను
కటువైన కటికపదాలకు
అసలైన అర్ధమై నువ్వు
నీ సాంగత్యంలో
పూర్ణబింబాలు నెలవంకముక్కలై విరిగిపోతూ
ఇంద్రధనువులు రంగులు త్యజించి
విసిగిపోతూ
జీవితం
నలుపుతెలుపుల చిత్రమైపోయి
అసలు రుచిని కోల్పోతూ
ఇక ఒకే నడక దారిలో ఇమడలేని
భిన్నధృవాలమై మిగిలి
ఎప్పటికీ కలవని సమాంతరరేఖల్లా
వేర్వేరు దారుల వెతుకులాటలో
నువ్వూ నేనూ
ఎప్పట్లాగే
నిర్లిప్తంగా నడుస్తూ నువ్వు
ఉత్సాహంగా
మునుముందుకు ప్రవహిస్తూ నేను
ఎవరి జీవితేచ్ఛలను
వారు పూరించుకుంటూ.
*
చిత్రం: మమతా వేగుంట
మంచి అభివ్యక్తి…
ధన్యవాదాలు రావుగారు
జీవితేచ్ఛల మధ్య వైరుధ్యాన్ని బలంగా ఆవిష్కరించారు. అభినందనలు పద్మావతి గారు.
ధన్యవాదాలు రామిరెడ్డిగారు