భాష నుంచి డయాస్పోరా దాకా….

అట్లాంటాలో జరిగిన ఆటా సాహిత్య సదస్సు ప్రారంభ ప్రసంగాల్లో వొకటి.

1

“తెలుగు నేర్చుకో నేర్చుకో—అని అమ్మనాన్నా యెన్నిసార్లు చెప్పారో లెక్కలేదు. యెప్పుడూ వాళ్ళ మాట వినలేదు. యెందుకంటే తెలుగు నేర్చుకోడం చాలా అంటే చాలా కష్టమని చాలా సార్లు అనుభవమైంది. పోయిన ఎండాకాలం తాతయ్యకి ఆరోగ్యం బాగాలేక హైదరబాద్ వెళ్ళాం. ఆయన ఆరోగ్యం కుదురుకోలేదు. వారం రోజుల్లో ఆయన పోయారు. తాతయ్య చివరి క్షణాల్లో నేను ఆయన పక్కనే వున్నా. తాతయ్య కళ్ళల్లోకి చూస్తూ, వొక్క చిన్న మాట తెలుగులో చెప్పాలని యెంత ప్రయత్నించానో! నేనేదైనా అనే లోపే తాతయ్య కన్నుమూశారు. ఇది నేను మరచిపోలేను. ఆ యెండాకాలం అమెరికా వచ్చాక, యెట్లా అయినా తెలుగు నేర్చుకోవాలని పట్టుబట్టి, మొదలు పెట్టాను. కనీసం తాతయ్య గురించి పది వాక్యాలు రాసే తెలుగు నేర్చుకోవాలని అనుకున్నా.”

ఇది వొక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి నాకు ఇంగ్లీషు లిపిలో రాసిన తెలుగు ఉత్తరం. మా యూనివర్సిటీలో తెలుగు కోర్సులో చేరడానికి వచ్చే విద్యార్థులకు మొదట వొక సర్వే పంపిస్తాను. ఆ సర్వే చివర  తెలుగు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? అనే ప్రశ్న వుంటుంది. అక్కడ స్థల పరిమితి వల్ల ఆ విద్యార్థి నాకు విడిగా ఇంగ్లీషు అక్షరాల్లో రాసిన తెలుగు ఉత్తరం అది. క్లాసులు మొదలయ్యే ముందు ఆ విద్యార్థి నా ఆఫీసుకి వచ్చి అడిగిన మొదటి ప్రశ్న:

“ప్రొఫెసర్! మీకు ఇంగ్లీషు అక్షరాల్లో రాసిన తెలుగు ఉత్తరం పూర్తిగా తెలుగు లిపిలో రాయడానికి నాకు ఎంత సమయం పడుతుంది?”

“వొక నెల” అని నేను జవాబిచ్చినప్పుడు ఆ విద్యార్థి నా ముఖంలోకి అపనమ్మకంగా చూశాడు. కానీ, నెలరోజుల్లో ఆ విద్యార్థి కచ్చితంగా అదే ఉత్తరాన్ని నాకు తెలుగులో రాసి చూపించాడు. ఆ ఉత్తరాన్ని పదేపదే చూసుకొని, “ఇది నేనే రాశానా?!” అని వొకటికి పదిసార్లు అతను తనని తానూ, తిరిగి నన్నూ అడుగుతూనే వున్నాడు.

యిలాంటి అనుభవాలు గత ఇరవై యేళ్ళల్లో నాకు చాలానే వున్నాయి. విస్కాన్సిన్ నుంచి ఫిలడేల్ఫియా దాకా సాగిన యీ భాషాయాత్రలో యెన్నో చెప్పవచ్చు. కేవలం నాలుగు తెలుగు వాక్యాలు నేర్పించానన్న కృతజ్ఞతతో యెప్పుడో ఇరవై యేళ్ళ కింద చదువుకున్న విద్యార్థులు కూడా ఇప్పటికీ వాళ్ళ కుటుంబాలతో సహా నన్ను కలవడానికి వస్తారు. వాళ్ళ వూళ్ళు వెళ్లినప్పుడు నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లి, వాళ్ళ కొత్త కుటుంబాల్ని కూడా పరిచయం చేస్తారు. ఇది వ్యక్తిగతంగా నాకు గొప్ప తృప్తినిచ్చే అనుభవమే. కానీ, భాష పట్ల పెరుగుతున్న యీ ప్రేమ మాత్రం అమెరికాలోని తెలుగు వాళ్ళంతా కొంచెం గట్టిగా పట్టించుకోవాల్సిన విషయం.

చాలా సందర్భాల్లో నాకేమనిపిస్తుందంటే- అసలు తల్లిదండ్రుల కంటే యీ పిల్లల్లోనే తెలుగు అన్నా, తెలుగు సంస్కృతి అన్నా పట్టింపు, పట్టుదలా పెరుగుతోందని ముఖ్యంగా యీ పదేళ్లుగా నాకు అనిపిస్తోంది.

2

మెరికాలోని తెలుగువాళ్లు నల్లవాళ్లతో యెంత సఖ్యతతో వుంటారన్న విషయం పక్కన పెడితే, బ్లాక్ లైవ్స్ మాటర్ అనే నల్ల వుద్యమం యిక్కడి తెలుగు విద్యార్థుల్ని బాగా కదిలించిన మాట వాస్తవం. 2012 లోనే యీ వుద్యమం మొదలైనా, గత పదేళ్ళలో దాని తీవ్రత పెరిగింది. దాన్ని మొట్టమొదట గ్రహించిన వాళ్ళు అమెరికా తెలుగు విద్యార్థులు. తక్షణ వాస్తవికతలో వుండే ఉనికి సంక్షోభం తెలుగు పట్ల ఆసక్తిని పెంచుతోందని నా అభిప్రాయం. ఆర్థిక పరిస్థితులు వేర్వేరే అయినప్పటికీ, సామాజికంగా యెదుర్కొంటున్న సవాళ్ళల్లో కొన్ని పోలికలున్నాయి, రంగుతో సహా!

“సామాజికంగా మనం అదే స్థితిలోకి వెళ్లడానికి యెంతో కాలం పట్టదు,” అని యిద్దరు ముగ్గురు తెలుగు విద్యార్థులు నాతో అన్నారు. యింకో వైపు నుంచి తెలుగు సాహిత్యమూ, సాంస్కృతిక అంశాలు వుండే దక్షిణాసియా కోర్సులలో తెలుగు విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతోంది. టెక్సాస్ లో నేను దక్షిణాసియా కోర్సులు చెప్తే, అక్కడ యెక్కువ మంది అమెరికన్లే వుండేవాళ్లు. యిప్పుడు ఇరవై మంది విద్యార్థుల్లో కనీసం యెనిమిది మంది తెలుగు వాళ్ళు. వొక విధంగా చెప్పాలంటే బయట తెలుగు సాహిత్య సమావేశాలతో పోల్చినప్పుడు యిది పెద్ద పెరుగుదల.

నిజానికి అమెరికన్ తెలుగు సాహిత్య సమూహాల్లో కూడా యిదే చలనం వుండి వుండాలి. కేవలం నాస్తాల్జియా రాస్తే సరిపోదని అంటున్న అమెరికన్ తెలుగు రచయితలు కచ్చితంగా యిదే మాట అంటున్నట్టు లెక్క. విద్యార్థి సమూహాల్లో వస్తున్న యీ మార్పుని సాహిత్యలోకంలోకి తర్జుమా చేసుకోవాల్సిన అవసరం యిప్పటి అమెరికన్ తెలుగు రచయితలకు వుంది.

అమెరికాలో తెలుగు ప్రయాణం యెట్లా మొదలయిందో, అంతకంటే యెక్కువగా యీ పదేళ్ళలో కొత్త సవాళ్ళు యెదురయ్యాయి. వుద్యోగ రంగంలోనూ నిలకడ తప్పింది. ఆర్థికంగా వొడిదుడుకులు మొదలయ్యాయి. అదేవిధంగా అనేకరకల అవినీతి మనవాళ్ళల్లో పెరిగింది. లింగ వివక్షా, గృహ హింసా పెరిగింది. అంతర్గతంగా అమెరికాలోనే వొక ప్రాంతం నుంచి యింకో ప్రాంతానికి వలసలు పెరిగాయి. చదువుల భారం రెట్టింపయింది. భాష వునికి ప్రమాదంలో పడింది. సంప్రదాయాల పునరుద్ధరణతో పాటు వాటి లోపలి సంఘర్షణలూ కొత్తరూపం యెత్తుకున్నాయి. ముఖ్యంగా అమెరికా తెలుగు వాళ్ళల్లో కూడా ప్రాంతీయ, కుల, మత సమస్యలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. వేరే వేరే సంఘాలు పెట్టుకోవడంతో పాటు వాటి మధ్య పోటీ తత్వమూ వుంది. యివి కొన్ని వుదాహరణలు మాత్రమే! రోజు వారీ బతుకు పోరాటం చేస్తున్న వాళ్ళు యింకా అనేకానేక సంగతులు చెప్తారు. అవన్నీ మనం సాహిత్యంలో డాక్యుమెంట్ చేయలేకపోవచ్చు. కానీ, కనీస ప్రయత్నం చేయవచ్చు.

బహుశా, అదే అమెరికా తెలుగు సాహిత్యానికి యింకో దశగా మారవచ్చు. మనం మన పిల్లల నుంచి నేర్చుకోవాల్సిన పాఠమూ అదే! యీ పాఠం విలువైందీ, జీవితానికి అవసరమైందీ!

*

అఫ్సర్

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Good morning to everyone
    I am interested in establishing a
    Endowed professorship in telugu
    In a university
    I will appreciate any suggestions
    Thanks
    Lakshmana Rao

  • భాష అవసరాన్ని గుర్తు చేస్తూ వారి మూలాలను మర్చిపోకుండా సాగే మీ ఉపాధ్యాయ బాధ్యత వలన తెలుగు వర్ధిక్కుతున్నందుకు అభినందనలు సర్.

    • మరో భాగం త్వరలో రాస్తాను! థాంక్ యు!

  • బాగుంది అఫ్సర్. కాకపోతే ఏదో ప్రసాదం పెట్టినట్టు మరీ కొంచెమే పెట్టావు. దాన్నే కళ్ళకద్దుకొని తినమంటే చేయగలిగేదేం లేదు.

    • మరో భాగం త్వరలో రాస్తాను! థాంక్ యు!

  • ఛాలా అవసరమైన విషయం. ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఈ కోర్స్ మీరు ఆన్లైన ఫ్లోట్ చేస్తే చాలా బాగుంటుంది. నేనే మీకు విద్యార్థులని సమకూర్చగలను. సీరియస్ గానే చెపఱతున్మాను ఈ సలహా.

    • మరో భాగం త్వరలో రాస్తాను! థాంక్ యు!

  • చాలా బాగుంది అఫ్సర్ గారు. ఐతే ఇంకా చదవాలి అనిపించేలా రాశారు, మరీ చిన్నగా. ఈసారి ఎక్కువ విషయాలు రాయండి

    • మరో భాగం త్వరలో రాస్తాను! థాంక్ యు!

  • చాలా ఆసక్తికరమైన పరిణామాలను నమోదు చేసిన వ్యాసం. రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

  • బాగుంది సార్, అక్కడి పరిస్థితులు,యువత ఆలోచనలు,కొత్తతరంలో భాష వ్యాప్తికి మీరు చేస్తున్న కృషి మొదలయిన విషయాలు చిన్న వ్యాసములో తెలియజేశారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు