నిన్న సంతబొమ్మాళిలో నీలిమ తన భర్త నవీన్ కుమార్ పీక కోసేసింది. మొన్నామధ్య నాగర్ కర్నూల్ లో స్వాతి తన భర్త సుధాకర్ ని ప్రియుడి సహాయంతో హత్య చేసింది. అలాగే విజయనగరం జిల్లా దిట్టపువలసలో సరస్వతి తన భర్త యామక శంకర్రావుని కిరాయి హంతకుల్ని హైర్ చేసి మరీ లేపేయించింది. కొద్ది రోజుల క్రితం కడప జిల్లా రాజంపేటలో అరుణ తన భర్త శివని దారుణంగా హత్య చేయించింది. కాకినాడలో భానుచందు తన మొగుడైన రాయుడు హరిని ప్రియుడి సహాయంతో చంపేసింది. ఇలా ఎన్నో!
ఏమైందీ స్త్రీలకి?
దెబ్బకి దెబ్బ తీస్తున్నారా?
పురుషుడంత దుర్మార్గంగా మారుతున్నారా?
ఎందుకిలా తయారవుతున్నారు?
ఏమైనా కొత్త రక్తం ఎక్కించుకున్నారా?
మరక మంచిదే అన్నట్లు భయపెట్టడం కూడా మంచిదేనా?
***
స్త్రీని పురుషుడు కొట్టడం రివాజు. పురుషుడిని స్త్రీ తన్నటం వార్త. స్త్రీని పురుషుడు హత్య చేయటం మామూలు. పురుషుడిని స్త్రీ చంపటం మాత్రం కల్లోలం. స్త్రీని పురుషుడు మోసం చేయటం సంస్కృతి. పురుషుడిని స్త్రీ వంచించటం సంక్షోభం. అవునిప్పుడీ వార్తా కల్లోల సంక్షోభం పెరుగుతున్నది.
ఈ మధ్య కాలంలో భారతీయ సమాజంలో జరగరానివి అవునో కాదో కానీ ఇన్నాళ్ళు జరగనివి జరుగుతున్నాయి. స్త్రీలు పురుషుల్ని చంపుతున్నారు. సంఘటనల శాతం తక్కువ కావొచ్చేమో కానీ అచ్చం పురుషులు స్త్రీలను చంపుతున్నట్లే కొందరు స్త్రీలు పురుషుల్ని చంపేస్తున్నారు. “ప్రియుడి మోజులో పడ్డ భార్య కిరాతకం” అనో లేదా “అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తని హత్య చేసిన భార్య” అనో “నవ వధువు అఘాయిత్యం” అనో మీడియాకి సేలబుల్ వార్తలుగా కొంతమంది స్త్రీలు బైటపడుతున్నారు.
ఇలా ఎన్నో వింటున్నాం. ఇలాంటి దాదాపు ప్రతి కేసులోనూ మొగుడు తాగొచ్చి భార్యని హింసించటమో, ఇంటి బాధ్యతని పట్టించుకోక పోవటమో జరుగుతుంది. విసుగెత్తిన విద్యావంతులైన స్త్రీలు చాలా డెస్పరేట్ గా నేరానికి పాల్పడటం ద్వారా అయినా సరే హింస నుండి బైటపడి కొత్త జీవితం కోసం మూర్ఖంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. దుర్మార్గుడైన భర్త చస్తే తమకు జీవితంలో శాంతి దక్కుతుందని అనుకుంటున్నారు.
నేరం పురుషుల స్వభావమని, స్త్రీలు కోమలులనే సూత్రీకరణలు తప్పని నిరూపితమౌతున్నాయి. మానవస్వభావంలోని నేర ప్రవృత్తికి స్త్రీ మాత్రం అతీతం కాదా? స్త్రీల స్వభావం చుట్టూ అల్లిన కండిషనింగ్ కరిగిపోతున్నదా? స్త్రీల స్వభావ ఔన్నత్యానికి సంబంధించి “కార్యేషు దాసీ…” వంటి వ్యూహాత్మక కీర్తనలు తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయా? ఇవే కాదు. స్త్రీలను హంతకులుగా, నేరస్థులుగా నిలబెడుతున్న నేరపూరిత సంఘటనలు విలువలకి సంబంధించిన అనేక ప్రశ్నలను కూడా రేకెత్తిస్తున్నాయి.
***
భారతదేశంలో స్త్రీ పురుష సంబంధాలన్నీ ప్రధానంగా దంపతీ సంబంధాలుగా చూడబడతాయి. దంపతీ సంబంధాల బైటనున్న సంబంధాలకి గౌరవం లేదు. సమసమాజ స్థాపనకు నడుం బిగించిన పురోగమివాదులు కూడా అటువంటి సంబంధాల్ని “అక్రమ సంబంధాలు” అని కసిగా పళ్ళు నూరటం కద్దు. ప్రేమ, తృప్తి, గౌరవం, అనురాగం వంటి మానవీయానుభూతులు, సహజ భావోద్వేగాలన్నీ ఆయా వ్యక్తుల కుటుంబ చట్రం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే దక్కుదల! మరో రకంగా పాపులర్ వ్యక్తీకరణలో చెప్పాలంటే “ఎవరికి ఎంత రాసిపెట్టుంటే అంతే దక్కుతుంది” నిజం చెప్పాలంటే కుటుంబం స్త్రీ పురుషులు ఒక యూనిట్ గా సౌకర్యంగా, ప్రజాస్వామికంగా బతికే ఒక సామాజిక నిర్మాణంగా కాక నిర్వచిత ఆధిపత్య విలువల ప్రాతిపదికన నిర్దేశించబడిన పరిధిలోని నిర్దిష్ఠ కదలికల కేంద్రంగా భారతీయ సమాజంలో రూపుదిద్దుకుంది. ఆ కుటుంబ విలువల్లో ఆధిపత్య భావనలు తక్కువగా వుంటే ఆ మేరకు సుఖంగా, శాంతిగా బతకొచ్చు. అలా కాకుండా ఆ పని చేసి తీరాలి, ఈ పని చేయకూడదు, ఇలా కూర్చోవాలి, ఇలా నుంచోవాలి, నాతో నువ్విలా వుండాలి, నీతో నేను ఇలా మాత్రమే వుంటాను, నువ్వది చేయాలి, నేనిది చేయాల్సిన పనిలేదు, ఈ డబ్బు నాది, ఈ బాధ్యత నీది, నాకీ స్వేఛ్ఛ వుంది, నీకీ కట్టడి వుంది వంటి జడత్వ భావనలన్నీ కుటుంబంలోని సభ్యుల హెచ్చుతగ్గుల స్థానాల్ని తెలుపుతుంటాయి. మన కుటుంబ వ్యవస్థలోని జడత్వాన్నే మనం పటిష్ఠతగా భావించి మురిసిపోతుంటాం. ఏ మాత్రం సడలింపు లేకుండా వ్యవహరించటాన్ని సంస్కృతిగా భావించి చప్పట్లు కొట్టుకుంటాం. మానవ స్వభావంలోని వైవిధ్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేని కారణంగా ఒక భిన్నాభిరుచిని, ఒక విరుద్ధ అభిప్రాయాన్ని సహించలేనితనాన్ని క్రమశిక్షణగా కీర్తించుకుంటాం. మూస బతుకుల్లో సృజనాత్మకతకు తావుండదు, ఒక్క ఉక్కపోత తనమే తప్ప! ఉక్కపోతతనం కలిగించే అసంతృప్తి, నిస్పృహ తప్ప.
***
విద్య హక్కుల గురించి ఎంతో కొంత జ్ఞానం ఇస్తుంది
జ్ఞానం స్వీయ అస్తిత్వ చైతన్యాన్నిస్తుంది.
అస్తిత్వ చైతన్యం తన ఇష్టాయిష్టాలకు విలువనిచ్చే ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తుంది.
ఆత్మ గౌరవం తాననుకున్నది పొందాలనే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.
ఇవాళ అసూర్యంపశ్యలంటూ ఎవరూ లేరు. ఎండ కన్నెరగని లలనామణులు, కోమలత్వ లాలసులూ లేరు. తల బైటకిపెట్టడమే కాదు, పురుషుడితో పాటు సమానంగా జీవితంలో పరిగెడుతున్నది స్త్రీ. చదువుకున్నది. ఉద్యోగాలు చేస్తున్నది. సిటీ బస్సులెంట పరిగెడుతున్నది. షేరింగ్ ఆటోల్లో పురుషుల పక్కన కూర్చుంటున్నది. కార్యస్థానమైనా, తిరిగి ఇల్లైనా గమ్యం చేరటం పురుషుడికెంత ముఖ్యమో ఆమెకూ అంతే ముఖ్యం. పురుషుడికి తన భవిష్యత్తు పట్ల ఎంతటి ఆతురత, ఆసక్తి వుంటుందో ఆమెకీ అంతే వుంటున్నది. నేటి స్త్రీ తన విలువ తాను బాగానే తెలుసుకుంటున్నది. తనకేం కావాలో నిర్ణయించుకుంటున్నది. ట్రాన్సిషన్లో ఒక కీలకమైన దశలో వుంది. తన ట్రాన్సిషన్ పట్ల ఆమెకున్న అవగాహన పురుషుడికి కొరవడుతున్నది. అక్కడే వైరుధ్యం అంకురిస్తున్నది.
ఇప్పుడు ముప్ఫై, నలభై ఏళ్ళున్న నేటి పురుషుడికి తన స్త్రీ తనలాగే అన్నీ చేయగలిగుండాలి. స్త్రీ చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. ఏదో చేసి సంపాదించాలి. కుటుంబ భావి ప్రణాళికల్లో ఆమె సంపాదనకి ఎంతో ప్రాముఖ్యముంటుంది. కానీ చివరాఖరికి తన చిటికెల సవ్వడికి ఆమె తలొగ్గాలి. తన పాద ఘాతానికి ఆమె కంపించాలి. తనకి మద్యపానం, ధూమపానం, క్లబ్బుల జీవితం ఒక హోదానో, ఒక సహజ హక్కో లేదా ఆభరణమైతే ఆమె విషయంలో మాత్రం అవి చేయకూడని పనులు, పతనమౌతున్న సంస్కృతికి ప్రతీకలు, తిరోగమిస్తున్న సమాజానికి చిహ్నాలు!!!
స్త్రీలు కూడా పురుషుడంత మొరటుగా తయారవటానికి దారి తీసే పరిస్తితులున్నాయని, ఖండన ముండనలకు పూనుకోకుండా ఇది నిజంగా అర్ధం చేసుకోవాల్సిన సందర్భమని నాబోటోడు అనగానే ఇక్కడే ఉదారవాదులు కూడా ఏ మాత్రం తడబాటు లేకుండా వెంటనే సంధించే ప్రశ్నలు కొన్నున్నాయి.
సమానత్వమంటే ఇదేనా?
ఇదేనా స్త్రీల అభ్యున్నతి అంటే?
స్త్రీలు కూడా నేరస్తులైతే ఈ సమాజం మరింత నాశనమవ్వదా?
స్త్రీలు కూడా పతనమైతే భావి తరాల సంగతేమిటి?
ఈ ప్రశ్నల్లో కొంత అపరిపక్వత, మరికొంత అమాయకత్వమూ, ఇంకొంచెం అవగాహనారాహిత్యం వున్నాయి. ఈ రకం ప్రశ్నలు నిజానికి సంస్కృతి పరిరక్షణా బాధ్యత నుండి, సామాజిక శాంతి నిర్వహణ నుండి, కుటుంబ పటిష్ఠతా బాధ్యత నుండి పురుషుడికి ఒక సేఫ్ పాసేజ్ ని ఇస్తాయి. ఒక వీటో పవర్ ని ఇస్తాయి. అంటే సగం సమాజానికి అనైతికంగా బతకటానికి ప్రత్యక్ష ఆమోదం ఇవ్వకపోయినా పరోక్షంగా మినహాయింపు ఇస్తున్నట్లే. వీటన్నింటికంటే ముఖ్యంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. అదేంటంటే “అసలు స్త్రీ అయినా, పురుషుడైనా…ఎవరైనా నేరపూరితంగా తయారవకుండా వుండాలంటే ఏం చేయాలి?” ఈ ప్రశ్నకి సమాధానం అనేక అనుబంధ ప్రశ్నలకి సమాధానంగా దొరుకుతుంది.
****
అసలు మనం నాలుగు నీతి కబుర్లు చెప్పటం మినహా ఎప్పుడైనా మన కుటుంబ బంధాలు ఎంత ప్రజాస్వామికంగా వుంటున్నాయో ఆలోచిస్తామా? అన్నింటికీ నివ్వెర పోవటమే తప్ప మన మానవ సంబంధాల్లోని హింస మనుషుల్ని ఎంత పతనం చేస్తుందో ఆలోచిస్తున్నామా? ఆధ్యాత్మికంగా, మతపరంగా ఇద్దరినీ సాంప్రదాయబద్ధంగా ఏకం చేయటం తప్ప ఆ పెళ్ళి సంబంధంలోని ప్రేమరాహిత్యం, ఉక్కపోతతనం కలిగించే అశాంతి ఏమిటో, అదెలా పరిణమిస్తుందో పట్టించుకుంటామా? ఎంతసేపటికీ కట్టి పడేస్తే సరి అనుకోవటం తప్ప మనిషి స్వభావంలోని స్వేఛ్ఛా కాంక్ష, స్వాతంత్ర్య ప్రీతి ఎంత బలమైనవో ఆలోచిస్తామా? విలువల పేరుతో బ్లాక్మెయిల్ చేయటం తప్ప ప్రేమగా, బాధ్యతగా మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తామా?
మనకు నిందలు మోపి తిట్టి పోయటమే తప్ప, బుగ్గలు నొక్కుకోవటం తప్ప, నైతిక తీర్పులివ్వటం తప్ప, మోరల్ పోలీసింగ్ తప్ప ఆలోచించటం చేతకాదు. కార్యకారణ సంబంధ విశ్లేషణలకు పూనుకోం. మనిళ్ళల్లోని వాతావరణంలో ఎంత సున్నితత్వం వుందో, మనం మానసికంగా ఎంత నెత్తురోడుతామో పట్టించుకోం. పక్కిళ్ళ గురించి తీర్పులిస్తాం. అన్నీ ద్వంద్వ ప్రమాణాలు.
***
ప్రేమ ప్రేమని ప్రేమగా ప్రేమించి ప్రేమగా జయించకపోతే హింస హింసని హింసాత్మకంగా హింసించి హింసపై హింస గెలుస్తుంది.
ఎనీ డౌట్స్?
*
మన కుటుంబ వ్యవస్థలోని జడత్వాన్నే “మనం పటిష్ఠతగా భావించి మురిసిపోతుంటాం. ఏ మాత్రం సడలింపు లేకుండా వ్యవహరించటాన్ని సంస్కృతిగా భావించి చప్పట్లు కొట్టుకుంటాం. మానవ స్వభావంలోని వైవిధ్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేని కారణంగా ఒక భిన్నాభిరుచిని, ఒక విరుద్ధ అభిప్రాయాన్ని సహించలేనితనాన్ని క్రమశిక్షణగా కీర్తించుకుంటాం”-
ఇన్ టోటల్ agreement సర్!!!
Thank you Kalyani garu!
నిజమే సార్. ఇప్పటికైనా ఒక్కసారి …. మన ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించాలి.
ఐతే ఈ మధ్య వరుసగా మీడియాలో వెలుగు చూసిన ఘటనలు… కుటుంబ హింస కన్నా ఇతర కారణాలున్నాయి.
విజయనగరం ఘటనలో PHD చేసిన మహిళ తనకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేకపోయింది. కానీ హత్య చేయడానికి సిద్ధపడింది. ఆమె చదువు కనీస విచక్షణ ఇవ్వలేక పోయింది.
మహబూబ్ నగర్ లో ఓ మహిళ తన భర్త ను చంపి ప్రియునికి ఫేస్ మార్పిడి చికిత్స చేయించింది. అంటే సైన్స్ పట్ల అవగాహన ఉన్న మనిషికి …మానవ సంబంధాల పట్ల, చట్టం పట్ల స్పృహ లేదు. ఇక్కడ టీవీ సీరియల్స్ ప్రభావం చూపాయి.
నా అభిప్రాయం ఏమంటే స్త్రీ, పురుషుడని కాదు. అసలు మనిషికి మనిషికి మధ్య ఉండే రిలేషన్ ధ్వంసం అవుతోంది. సామాజిక స్పృహ లోపిస్తోంది. వ్యక్తి కేంద్రం గా ఆలోచనలు, వ్యక్తి ఆనందమే గమ్యం గా…క్షణిక ప్రయోజనాలు, సంతృప్తులే పరమార్థం గా ప్రచారం సాగుతోంది.
అదే అన్ని సంబంధాలనూ ధ్వంసం చేస్తోంది.
మీరు కోట్ చేసిన ఘటనలోని స్త్రీల సామర్ధ్యాలను మీరు ఎక్కువగా అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. విజయనగరం ఉదంతంలో ఆమె పెళ్ళిని తల్లిదండ్రులు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగానే జరిపించారు. అది తెలిసి బహుశః ఆమె భర్త ఆమెని హ్యుమిలియేట్ చేసుండొచ్చు. బైక్ మీద వెళ్తున్నవాడి పీక కోసి పారిపోయినమ్మాయికి ముందస్తు ప్రణాళికలేముంటాయి? నాగర్ కర్నూల్ స్వాతికి నిజంగా అవగాహన లేకనే అలా చేయించింది. కిఎరోసిన్ పోసి ప్రియుడి ముఖం మీద గాయాలు చేస్తే ముఖం మారిపోతుందనుకుంది. ఆమెకేమాత్రం సైన్స్ పట్ల అవగాహన వున్నా అలా చేయదు. ఇక్కడ వీరు దెస్పరేట్ గా ఏదో చేసి మొగుళ్ళ పీడ వదిలించుకోవాలన్న తాపత్రయంలోనే వున్నారు. మీరన్నట్లు మనిషికి మనిషికీ మధ్య సంబంధాలే హింసాత్మకంగా వున్నాయి. అందునా స్త్రీ-పురుష సంబంధాల్లో మరీనూ. సమాజంలో శాంతి అనేది స్త్రీ పురుష సంబంధాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సమాజంలో అన్ని రంగాల్లో పురుషుడంత వేగంగా స్త్రీ కూడా కదులుతూ పాలు పంచుకుంటున్నప్పుడు పురుషుడి మీద పడే ప్రభావాలన్నీ స్త్రీ మీద కూడా పడతాయి. దీనికితోడు అదనంగా వున్న సమస్యేంటంటే ఇంతకాలం పాటు తన శారీరిక, కుటుంబ అవసరాలు మాత్రమే తీర్చిన స్త్రీ నుండి పురుషుడు ఇప్పుడు కుటుంబ పురోగతి నిమిత్తం ఆమె నుండి సంపాదన కూడా ఆశిస్తున్నాడే కానీ ఆమె మళ్ళీ తన ఆధిపత్యాన్ని అంగీకరించే పాత తరం స్త్రీలానే వుండాలనుకుంటాడు. ట్రాన్సిషన్లో మారుతున్న స్త్రీ పాత్రని అప్రీషియేట్ చేయలేకపోతున్నాడు. ఇక్కడే గోలొస్తున్నది. స్త్రీకి అవకాశాలు పెరగటంతో పాటు ఆలోచనలు కూడా విస్తరిస్తున్నాయి. మగాడు అర్ధం చేసుకోవాల్సిన ఆ ఆలోచనలెలాంటివంటే తనతో ఆమెకు ఏ మాత్రం కుదరక పోయినా ఆమె ఏ మాత్రమూ అభద్రత ఫీల్ అవ్వదని, ఆమెకి ప్రత్యామ్నాయాలుంటాయని అతను అర్ధం చేసుకొని కన్సిడరేట్ గా వుండాల్సిందే. మానసికంగా ఆమె కూడా ఒక పురుషుడంత స్వేఛ్ఛా జీవని అర్ధం చేసుకోవాలి. ఇందుకు సన్నద్ధం కావాలంటే అతను తన మనసులో తిష్ఠ వేసుక్కూర్చున్న అనేక విలువల్ని వెళ్ళగొట్టాల్సిందే. ఇద్దరూ హెచ్చుతగ్గుల్లేని పొజిషన్లో వుంటేనే శాంతి సాధ్యం. ఇంక టీవీ సీరియళ్ళు మాత్రమే ఆడవాళ్ళను చెడగొడుతున్నాయంటే నేనొప్పుకోను. అవి స్త్రీల వ్యక్తిత్వాల్ని కించపరుస్తున్నాయి. స్త్రీలను వక్రీకరిస్తున్నాయి. అందుకు అసహ్యించుకోవాలి.
విజయనగరం ఉదంతంలో ఆమె పెళ్ళిని తల్లిదండ్రులు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగానే జరిపించారు. అది తెలిసి బహుశః ఆమె భర్త ఆమెని హ్యుమిలియేట్ చేసుండొచ్చు. బైక్ మీద వెళ్తున్నవాడి పీక కోసి పారిపోయినమ్మాయికి ముందస్తు ప్రణాళికలేముంటాయి?
బహుశః తో వూహించి సత్యం చెప్పేసరు. కవ్త్వనికి వూహ సరిపొతుంది కాని వస్తవానికి వూహలు సరిపొవు. తులసి గరు కూడా వూహించి ఆమె ఫ్డ్ తో వూహించి సత్యం చెప్పేసరు. కవ్త్వనికి వూహ సరిపొతుంది కాని వస్తవానికి వూహలు సరిపొవు. తులసి గారు కూడా వూహించి ఆమె ఫ్ద్ అని చెప్పేసారు
చక్కని వాస్తవిక విశ్లేషణ చేసిన అరణ్య కృష్ణ గారికి ధన్యవాదాలు. అభ్యుదయ కుటుంబాలు గా పిలవబడే కుటుంబాలలో కూడా ప్రజాస్వామ్య లక్షణాలు లేకుండా ఆదిపత్వ ధోరణులు కనిపించడం నేను చూశాను.
ప్రత్యేకించి స్త్రీలు హత్యలు చేయడం,కేవలం తరతరాలుగా అప్రజాస్వామికంగా అణిచివేత కు గురికావడం వల్ల మాత్రమే కాక.వర్తమాన సమాజిక వ్యవస్థ ,విలువలు లేని విద్యా వ్యవస్థ ,స్త్రీ లకు అండగా నిలబడే ఉద్యమ వాతావరణం లేకపోవడం కూడా కారణలుగా నిలుస్థాయి అని అనిపిస్తుంది.
శతాబ్దాలుగా అణిచివేత ఉన్నా కూడా, పురుషాధిక్యత వ్యతిరేకించిన స్త్రీలు ఉన్నతవిద్యావంతులై, వారు స్వతంత్ర గా, అభ్యుదయం గా జీవించారు తప్ప నేరస్థులు గా మారలేదు. కారణం అప్పటి సమాజిక ఉద్యమాలు వారి కి అండగా నిలబడి పోరాడే ధైర్యాన్ని, శక్తి ని ఇచ్చాయి.
అప్పటి విద్యా సంస్థలు, చైతన్యాన్ని నింపే వనరులుగా ఉండేవి.
మార్కెట్ ఆర్థిక వ్యవస్థ విద్యాను, మీడియా ,ఏకంగా రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకుని, సంస్క్రతి ని విద్యసం చేస్తూ,పురాతన కాలంలో కి వేగంగా తిరోగమనం లో వున్న ఈ సమాజిక పరిస్థితి కూడా ఒక కారణం.
ధన్యవాదాలు సార్! ఛైతన్యం కుటుంబ సంబంధాల నుండి కుడా మొదలవ్వొచ్చు అని నా అభిప్రాయం.
మీరన్నట్లు సమస్యకు కారణంగా .. అప్రజాస్వామికంగా, పురుషాధిక్య ధోరణితో అణచివేయడంవల్ల స్త్రీలలో హింసాత్మక ధోరణి ప్రభలుతున్నదన్న మీ వాదన పాక్షిక సత్యం మాత్రమే. వాస్తవ సంఘటనలను సామాజికార్థిక కోణంలో విశ్లేషిస్తే, మానవ సంబంధాల్లో, వల్లమాలిన వినియోగ సంస్కృతీ, విపణీ ఆర్ధిక వ్యవస్థలే మానవుల ఆలోచనలను ప్రభావితం చేసి, మానవీయ విలువలను ధ్వంసం చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ప్రజాస్వామిక, మానవీయ విలువలతో, తన హేతువాద, సామ్యవాద, భావాలను కుటుంబంపై రుద్దకుండా ఓపికగా మార్చడానికి ప్రయత్నించి, విఫలుర్తె అల్లాడే వాళ్ళను చూశాను.తనకు గల ఆర్ధిక ఆధిపత్య నియంత్రణను కుటుంబంపై అధికారం నెరపడానికి ఉపయోగించుకుని విజయవంతంగా తనగాడిన పెట్టుకున్న వాళ్ళనూ (కత్తి పద్మారావు లాంటివారు) చూశాను. మార్కెట్ ఎకానమీ మెదళ్లను శాసించి జనం శ్వాసగా మారుతోంది.
ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మిత్రులకు కూడా నా ఉద్దేశ్యాన్ని వివరించి చెప్పాను. తెలంగాణలో ఈ మధ్య జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే-4 (నేషనల్ హెల్త్ అండ్ ఫామిలీ సర్వే-4) ప్రకారం తేలిదేమిటంటే స్త్రీలు ఎదుర్కొంటున్న భౌతిక/లైంగిక హింసలో 85.6 శాతం భర్త నుండే వస్తున్నది. ఇందులో 23 శాతం మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఇది పాక్షిక సత్యమా లేక ప్రధాన సత్యమా? 17 శాతం మంది గర్భిణీ స్త్రీలు కూడా భౌతిక హింసకి గురవుతున్నారు. 74 శాతం మంది ఎవరి సాయమూ కోరకుండా మౌనంగా వుండగా కేవలం 2 శాతమే పోలిస్సు ఫిర్యాదులు చేస్తున్నారు. పదేళ్ళకు పైగా వైవాహిక జీవితం గడుపుతున్న స్త్రీలలో 50.1 శాతం మంది భౌతిక, భావొద్వేగ, లైంగిక హింసకి పాల్పడుతున్నారు. 36 శాతం మంది భర్త చేతిలో చెంప దెబ్బలు తింటుండగా 26 శాతం మంది నెట్టివేతకి గురయ్యారు. 11 నుండి 16 శాతం మంది మహిళల్ని కాళ్ళతో తన్నడం, చేతుల్ని మెలిపెట్టడం, జుట్టు పట్టుకొని ఈడ్చటం వంటివి చేయగా 2 శాతం మందిపై గొంతు నులమడం, కాల్చడం, చంపుతానని బెదిరించడం వంటి హింస అమలౌతున్నది. ఇంకా పాక్షిక సత్యమే అంటారా? వినిమయ సంస్కృతి, మీడియా ప్రభావాలు అన్నీ వున్నాయి. కాదనను. వాటి గురించి కూడా ప్రస్తావించాను. కానీ వాటిని మాత్రమే హైలైట్ చేసి వూరుకుంటే ఎలా? వ్యక్తుల నుండి మొదలవ్వాల్సిన చైతన్యం సంగతి కూడా పట్టిచుకోవాలి కదా! అన్నీ ఆలోచించటానికే ఈ చర్చ. మీ స్పందనకి ధన్యవాదాలు సార్!
సంప్రదాయాలమీద అధిపత్యాలమీద పురుషాధిక్యత మీద కృత్రిమత్వాన్ని చేదించేదిశగా స్త్రీ వేసే అడుగులు కావచ్చు ఇందులో స్త్రీ అనుభవిస్తున్న వేదన ఆవేశంగా మారిన క్రమం విశ్లేషించారు
నైస్ మంచి విశ్లేషణ
ఇది మారుతున్న సామజిక చిత్రం ,అనుకుంటా .పురుషులు ,స్త్రీలు ఇద్దరు స్ట్రెస్ని ఎదుర్కొంటున్నారు .స్త్రీ అయినా పురుషుడు అయినా బేసిక్ గా మనుషులమే .మానసికంగా ,శారీరకంగా కొద్దీ మార్పులున్నా సమస్య తీవ్రత మారదు .అయితే చూసే దృష్టి కోణం ,మారుతుండవచ్చు ,ప్రస్తుత సమయంలో .అందుకే ఈ వింత మార్పు కనిపిస్తూ ఉండొచ్చు . స్త్రీ కూడా జాబ్ ,వర్క్ లలో ఎంగేజ్ అవడం ,డబ్బు విషయాలలో ఇన్వొల్వె అవడం .స్ట్రెస్ తీసుకోవడం -మొత్తం మీద మార్పు ఉంది స్త్రీ సైకాలజీలో .అది పురుషులు
guర్తించక పోవడం .మూస ధోరణిలో ఆలోచించడం కారణం కావచ్చు భార్యాభర్తలు పరస్పరం అవగాహనా చేసుకోవడం ,మిత్రుత్వం తో మెలగడం లాంటి పద్ధతులు అవలంబించాలి ..స్త్రీలు కొత్త సమాజానికి అలవాటు పడడానికి మిత్రుల ,సైకాలజిస్ట్ల ల సహాయ ,sahakaralu తీసుకోవడం మంచిది .అదే విధంగా పురుషులు కూడా .
నైస్ మంచి విశ్లేషణ ధన్యవాదాలు
**
ప్రేమ ప్రేమని ప్రేమగా ప్రేమించి ప్రేమగా జయించకపోతే హింస హింసని హింసాత్మకంగా హింసించి హింసపై హింస గెలుస్తుంది.
ఎనీ డౌట్స్?
No doubts
నిజం కదా
అరణ్యకృష్ణ గారూ వ్యక్తిగత సందేశం పెట్టారు. చదివాను. నా అభిప్రాయం బహుశా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చేమో.. కొందరు స్త్రీల నేరాలు అనేవి అసాధారణ ఘటనలు. పురుషుల సాధారణ ప్రవర్తనలో, చింతనలో మార్పు కోరటం అనేది ఆవశ్యక అంశం. ఆ అంశంపై మీ విశ్లేషణ చెప్పటానికి ఆ నేరాల వార్తలనుంచి ప్రేరణ పొందటం వరకూ ఫరవాలేదు. కాని నేరాలు అనేవి విశ్లేషించవలసిన విధానం వేరు. వాటి సంఖ్య పెరిగిందా పురుషులతో సమానంగా చేస్తున్నారా స్వయంగా చేస్తున్నారా చెయిస్తున్నారా .. ఇలాంటి ప్రశ్నలు వేసుకుని స్త్రీలలో పరిణామం పరిశీలించవలసిన అంశం. సమాజంలో హింసా ప్రవృత్తి పెరుగుతోందా డెమోన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఉందా మీడియా పాత్ర ఏమిటి మానవుడి నేరాల గురించి వినాలన్న మనస్తత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ఇలాంటి ప్రశ్నలతో సామాజిక పరిణామాన్ని అవగతం చేసుకొనే ప్రయత్నం చెయ్యవచ్చు. వీటికి భిన్నంగా స్త్రీల నేరాల ఆధారంగా కౌటుంబిక సంబంధాలలో స్త్రీల పై జరిగే అణచివేతనీ అమలు చేసే వివక్షని ఎదుర్కోవటం బలహీనమైన కర్రతో బలమైన పాముని కొట్టడం వంటింది. అది ఒక్కోమారు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. ఇది శీర్షిక గనక కొంత యాదృఛ్చికత ఉంటుంది కాని లోతుగా ఆలోచిస్తే మీకు అందని విషయాలు కావు. ఇంకో విషయం భార్యలు వస్తున్నారు జాగ్రత్త అనటం కన్న స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త అంటే ఇంకొంచెం భయపెడుతుందేమో (జోగ్గా). ఏమైనా తప్పుగా మాచలాడితే మన్నించండి.
వివిన మూర్తి గారూ! మీ స్పందనకి ధన్యవాదాలు. స్త్రీ అయినా, పురుషుడైనా సంఘజీవులే. ఇద్దరూ సంఘ ప్రభావంలో బతికేవారే. సందేహం లేదు. ఉమ్మడి సాఘీక జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు కుటుంబ జీవితమ్మీద ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ వ్యాసంలో నేను ఆ విషయం ప్రస్తావించినప్పటికీ నా ప్రధాన ఫోకస్ మాత్రం కుటుంబ పరిధిలోని స్త్రీ పురుష సంబంధాలే. ఎందుకంటే ఈ వ్యా ఉద్దేశ్యం నేర విశ్లేషణ కాదు. దీన్ని ఫోరెన్సిక్ యాంగిల్ నుండి చూడలేదు. ఈ వ్యాసం చదివే పురుష పాఠకుల్లో ఒక ఆలోచన రేకెత్తించటం, సాటి స్త్రీలని గిల్టీగా చూసే స్త్రీలకి అప్పీల్ చేయటం ఈ వ్యాస ప్రధాన వుద్దేశ్యం. ఈ సంఘటనల పట్ల పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా స్పందిస్తున్నారని నాకనిపిస్తున్నది. స్త్రీ కూడా పురుషుడంత బైటకి వెళుతున్నదని, ఆమె కదలికలు కూడా పురుషుడంత వేగంగా,అంతే ఇంటెన్సిఫైడ్ గా వున్నాయని, ఆమెకీ తన భవిష్యత్తు పట్ల ఆసక్తి, ఆతురుత వున్నాయని, ఆమెకీ ప్రత్యామ్నాయాలు చూసుకునే అవకాశాలున్నాయని చెప్పాను. పురుష హింస వ్యవస్థీకృతమైనది. స్త్రీలు ఇప్పుడిప్పుడు చేస్తున్నది ప్రతిహింస అనేదే నా అభిప్రాయం. ఇది నేరాన్ని వెనకేసుకు రావటం కాదు. నేరాల్ని సమర్ధించటమో లేక వ్యతిరేకించటమో ఆత్మాశ్రయ ధోరణే కానీ వాస్తవిక దృక్పధం కాదు. మొత్తం మీద ఈ వ్యాసం ప్రధానంగా తమ కుటుంబ పరిధిలో ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడాల్సిన అవసరముందని పురుషుల సెన్సిబిలిటీస్ ని ఉద్దేశించి రాసినది. సంపూర్ణంగా రాయాలంటే వినిమయ సంస్కృతి, మీడియా పాత్ర, సినిమాలు, పోలీసులు…ఇలా చాలా చెప్పాల్సొస్తుంది. (మీరు తప్పుగా మాటలాడితే మన్నించమన్నారు. మీ స్పందనలో మీరు తప్పుగా మాటలాడింది ఇదొక్కటే మరి. ఎందుకంటే మీ అభిప్రాయాలు మరింత క్లారిటీకి అవకాశం ఇస్తాయి. వ్యక్తిగత సందేశం పెట్టడం వెనుక వుద్దేశ్యం మీబోటి వివేచనవంతుల దృష్ఠికి చర్చిస్తున్న అంశాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని చర్చలో భాగస్వామిని చేయటమే. నా కవిత్వానికైతే ఆ పని చేయను.)
‘భార్యలు వస్తున్నారు జాగ్రత్త ‘ శీర్షిక మగవాళ్లకు హెచ్చరికగా మీరు చేస్తున్న హింస వారు నేర్చుకుంటున్నారు జాగ్రత్తగా ఉండర్రా అనడం వరకు బాగానే ఉంది. అదేదో స్ర్తీలు ప్రగతి దారిలో పయనిస్తున్నారు అన్న భావం కలిగించడం బాగా లేదు. స్త్రీల నేరాలను సానుభూతి తో అర్ధం చేసుకోవడం ఎండుకంటే తరాలుగా పురుష దురహంకార దాష్టీకాన్ని బలైతున్నారు కాబట్టి. స్త్రీలు నేరం చేయడం కొత్త కాదు కానీ రేర్ . అందు వల్ల అది ఉనికి లోకి రాలేదు. ఈ నాడు అతిగా చిత్రించడం మీడియా కారణము. కాక పొతే జనాభా పెరుగుదల, గ్లోబలైజేషన్, మార్కెటైజేషన్ నేరాల సంఖ్యను పెంచుతుంది. స్త్రీలు ఏమి మగవారికి తీసిపోయి డిఫరెంట్ గా ఆలోచించడం లేదు. వాళ్ళను నడిపేది మార్కటైజేషన్, వస్తువ్యామోహమే. వారి ఉనికిని పెట్టుబడి దారి భావజాలంతోనే గుర్తిస్తున్నారు. మగ అహంకారం లాగానే స్త్రీ అహంకారులు తయారవుతున్నారు. అంటే వ్యవస్థ అలానే కోరుకుంటుంది గనుక వారి చదువులు, వారి ప్రవర్తన అలాగే ఉంటుంది.
చాలా బాగా రాసారు వివరంగా. భార్యలు వస్తున్నారు జాగ్రత్త ….భర్తలున్నారు భయపడండి. ఇవి చదువుతాము మర్చిపోతాము చాలా మటుకు. కానీ జాగ్రత్తలు అయినా…భయపడడాలు అయినా మనిషి మరో మనిషిని చూసి. ఇది ఎన్నో తరాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏ ఒక్క జెండర్ గురించో కాదు. సాటి మనిషిని చూసి మరో మనిషి ఎప్పుడైతే భయపడడం మొదలు పెట్టాడో అప్పుడే మనిషిలోని మానవత్వం పతనం అవ్వడం మొదలైంది. ఈ crimes gender భేదం లేకుండా జరుగుతూనే ఉన్నాయి. కాకపొతే ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ పెరగడం వల్ల అందరికీ ఎక్కువగా reach అవుతోంది. ఒక విధంగా ఆ క్రైమ్ sense ఆడవాళ్లకు ఎక్కువగా తెలిసేలా చేసింది…మరింత మృగాళ్ళు గా మారిపోతున్న మగవాళ్ళే.మనిషి మనిషిని ప్రేమించే తత్వం వదిలేశాక ఇదంతా సామాన్యం కదా.
ఇది ప్రధానంగా పురుషులనుద్దేశించి రాసిన వ్యాసం .ప్రతి ఒక్కరు మనం ఎలా వున్నాం మనం మారాల్సిందేమైనా ఉందా ? అని ఆలోచిస్తే బాగానే ఉంటుంది.అయితే అవగాహన లో మార్పు లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుమ్ది.మీరు లేవనెత్తిన విషయాలు ముఖ్యమయినవి.
రామారావు
ధన్యవాదాలు రామారావు గారు! ఈ వ్యాసం పురుషులను ఉద్దేశించి రాసినదే.
Haha..Nice conclusion andi..Inkem doubts untaayi..Andari tarapunaa meere finalize chesaaru..Kudos ????
అరణ్య కృష్ణగారు మీచివరి వాక్యాలు నేను పూర్తిగాఅంగీకరిస్తుా మెరుగయిన జీవితం కోం ఎంత పోటీ అయినా పడొచ్చు ఆ హ్కుల సాధనలో ఎంతకయినా తెగించవచ్చు ఈహింసాదృక్పధం ఇలాపేరగడానికి కారణాఉండవచ్చు ఈ సంఘటనలవెనుక ఉన్నపూర్వప రాలు ఆరోగ్యవంతమైనవికావు నేను కోర్ట్ లో ఫామిలీ వెల్ఫేర్ కమిటి మెంబర్ని 498Acasulu వస్తూ oటాయి చాల మంది ఆడపిల్లలు ీరు చె్పిన ఉక్క పోతనుండి బయటపడాలని చూస్తున్నారనించింది మనం గొప్పగా చెప్పుకొనే కుటుంబ వ్యవస్థ చాల మొరటుగా ఉన్నదనిపిస్తోంది ఇక్కడ సున్నితమైన భావాలకు తావే లేదు లైనఁగిక సంబంధాల విషయం అయితే మన kutumbsvyvasthalo భయంకరమైన ఆధిపత్య ధోరణి యాంత్రి కతా ఉన్నాయి భార్య భర్తలిరువురూ తమ ఆరోగ్యాలను ఫిట్నెస్స్ని కాపాడుకొని ఎంతో అందమైన ఆ అనుభూతిని కాపాడుకొందామనుకోరు నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అదొక చర్చించరాణి విషయంగా దాటేస్తారు కానీ ఈరోజు ఈవిషయమే ఎక్కువ కుటుంబ వ్యవస్థని బలహీన పరుస్తుందని అవగాహనలేదు అభ్యుదయవాదులు అనుకున్న అన్ని కుల మతాల్లో ఇది సర్వసాధారణంగా ఉంది కులమత ఆచారాలతో పాటు ఇప్పుడు కొత్తగా అభ్యుదయవాదాచారాలు కొన్ని వచ్చాయి అవికూడా స్త్రీ కొక న్యాయం పురుషుడికొక న్యాయం చెబుతున్నాయి దుస్సాంప్రదాయాల chatrlaఇరుసులనుండి బయట పడగలిగితే అది ఒక్క మతం కులం కాదు అన్ని..అన్ని…ఈరోజు కుటుంబసవ్యవస్థ చట్రాన్ని మరింత తమకు అను కూలమైన వాదాలతో వివక్షస్ధతో బిగిస్తున్న ఛాందసాన్ని బద్దలు కొట్టగలిగేదేదో రాగలిగితే ప్రేమ ప్రేమను హింసించదు..చాలామంచి విశ్లేషణ
ఎప్పటిలాగే విలువైన ఫీడ్ బ్యాక్ అందించినందుకు ధన్యవాదాలు అరుణగారూ! సామాజిక పార్శ్వాలన్నింటి మీద మీకున్న అవగాహన గొప్పది.