సుప్రసిద్ధ రచయిత్రి, బహుముఖ ప్రతిభామూర్తి డాక్టర్ భానుమతీ రామకృష్ణ పుట్టినరోజు సెప్టెంబర్ 7,1924. అంటే ఇవాళ్టికి ఆమె శత జయంతి పూర్తయింది. ఆమె శతజయంతిని పురస్కరించుకొని చెదురుమదురుగా ఒకట్రెండు సభలు జరిగాయి. ఒకట్రెండు వ్యాసాలు కూడా పత్రికల్లో వచ్చాయి. సాధారణంగా వందవ సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు ఆ ఏడాది అంతా సభలు, వ్యాసాల ద్వారా స్మరించుకొంటారు.ఆ లెక్కలో చూస్తే ఇవాళ్టితో భానుమతి శత జయంతి పూర్తయింది. వాస్తవానికి ఆమె పుట్టిన సంవత్సరం 1924 అయితే భానుమతి గారి అబ్బాయి భరణి 1925 గా పత్రికల్లో ఇవాళ ప్రకటనలిచ్చారు. ఆమె స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూల ప్రకారం ఆమె పుట్టింది 1924 అని సినిమా చరిత్రకారులు నిర్ధారణ చేశారు. భానుమతికి ఇప్పుడు వందేళ్ళా?నూటొకటా అన్నది ప్రశ్న కాదిక్కడ.ఈ సందర్భంగా ఆమె రచనలను చదివి చర్చించుకోవటం ముఖ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో భానుమతి స్థానం గుర్తుంచుకోవటం ముఖ్యం.
ఈ ఏడాది నలుగురు రచయితల శత జయంతులు జరుపుకుంటున్నట్లు తెలిసిందే. స్త్రీలు సాహిత్య లోకంలో తమ స్థానం గురించి ప్రత్యేక స్పృహతో, ఎరుకతో మాట్లాడటం మొదలు పెట్టిన ఈ మూడున్నర, నాలుగు దశాబ్దాల్లో రచయిత్రుల శతజయంతులు ఎన్ని జరుపుకున్నామని ఆలోచిస్తే…రచయిత్రి కాకపోయినా,వైద్యురాలు, ప్రసూతి -శిశు పోషణ పుస్తకం రాసి స్త్రీలలో శరీర ఆరోగ్య స్పృహను పెంచిన కొమర్రాజు అచ్చమాంబ గారి శత జయంతి ఓల్గా, తదితరుల ఆధ్వర్యం లో ఘనంగా జరుపుకున్నాం. ఆమెను పాత్రగా చేసి “ చరిత్ర స్వరాలు” అనే రూపకాన్ని ప్రదర్శించారు. ప్రముఖ రచయిత్రి ఇల్లిందల సరస్వతి దేవి గారి శత జయంతిని కూడా స్మరించుకున్నట్లు గుర్తు .ఈ ఏడాది మరొకరి శత జయంతి వస్తోంది. ఆమె ప్రముఖ రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మీ( సెప్టెంబర్ 17,1925)
ఈ శత జయంతులు జరుపుకోవాలంటే కుటుంబమో లేదా సాహిత్య లోకమో పూనుకోవాలి. కుటుంబ అండదండలు, వాళ్ళ పూనిక లేకపోతే ఈ శతజయంతులు జరగవు. స్త్రీల విషయంలో సాహిత్య లోకమే వారికి పెద్ద కుటుంబం.
సారంగ తరఫున ఇంతకు ముందు కొండవీటి కోటేశ్వరమ్మ గారి శత జయంతి స్మరణోత్సవ సంచికను తీసుకొచ్చాం. ఈ ఏడాది భానుమతీ రామకృష్ణ, శివరాజు సుబ్బలక్ష్మిల సాహిత్యాన్ని గురించి మాట్లాడుకుంటే బావుంటుంది. అందుకు సారంగ పత్రిక, సారంగ యూట్యూబ్ ఛానెల్ మీకు తోడుగా ఉంటాయి. మీ రచనలు, వీడియోలు editor@saarangabooks.com కి పంపించండి.
Add comment