భవిష్యత్తు పై విశ్వాసం అతని శ్వాస

ఊపిరాడనివ్వని నీ నిర్బంధం, ఉక్కుహస్తం

నన్ను ఉక్కు మనిషిగా మారుస్తున్నాయి

నేను నడిచి వచ్చిన బాటలో

నేను మొదటివాణ్ణీ కాను చివరివాణ్ణీ కాను

కలల్ని బోనెక్కించి నేరారోపణ చేస్తున్నావు నువ్వు

                                        నవ్వుతున్నాను నేను       (వి వి : స్వేచ్ఛ ; జైలు కవితలు)

 

నిత్య నిర్బంధాల మధ్య నిఘా వలయాల్లో జైలుగోడల్లోపలా పోటెత్తిన ప్రజా సమూహాల్లో … ముఖమ్మీద చెరగని చిరునవ్వు – బిగిసిన ఉక్కు పిడికిలి – కళ్ళలో కారుణ్యం; ఆరు దశాబ్దాల కల్లోల దందహ్యమాన సామాజిక చరిత్రనూ వర్తమాన ప్రత్యామ్నాయ రాజకీయ స్వప్నాలనూ కవిత్వంలోకి తర్జుమా చేసి విప్లవోద్యమానికి చిరునామా అయిన వరవరరావును తలచుకోగానే గుర్తొచ్చే రూపం యిది.

1979 తిరుపతి విరసం మహాసభల్లో వేదిక మీద అల్లం రాజయ్య మార్పు కథ చెబుతున్నాడు. ఆబోతులాంటి దొర ఊరి ప్రజల బహిష్కరణకి గురైన సంఘటన వచ్చేసరికి శ్రోతల్ని ఉత్తేజ పరుస్తూ వొక గొంతు ‘కరీంనగర్ రైతాంగ పోరాటాలు వర్ధిల్లాలి’ అంటూ ఫెటిల్లున నినాదం యిచ్చింది (ఉపన్యాసాల మధ్య వుద్యమ స్ఫూర్తితో యిలా నినాదాలు అందుకునే సంప్రదాయం యిప్పుడు యెందుకో తగ్గుముఖం పట్టింది). గొంతు నరాలు తెగేలా ఆ నినాదం యిచ్చిన వ్యక్తి వరవరరావు. నేనదే మొదటిసారిగా అతణ్ణి చూడటం. పాతికేళ్ళు కూడా నిండని నాకు రష్యన్ నవలల్లో చదివిన దృశ్యం కళ్ళముందు సాక్షాత్కారమై యెందుకో బలంగా మెదడు పొరల్లో ముద్రితమైపోయింది. వరవరరావు రూపం కూడా.

తర్వాత 1982 లో వివి మీద యేదో కుట్రకేసు బనాయించడానికి, యిప్పట్లానే, రాజ్యం కుట్ర పన్నుతుందని తెలిసి ‘వేయికుట్రల మండపం పాడుగుడిని పడగొడదాం’ అని కవిత రాస్తే (నేను కవిత్వం రాస్తానన్న సంగతి నేనే మర్చిపోయా) అరుణతార మొదటి పేజీలో వచ్చింది. నాకప్పుడు కర్ణాటకలో వుద్యోగం. తెలుగు సాహిత్య ప్రపంచంతో ప్రత్యక్ష పరిచయాల్లేవు. అదే వేసవి సెలవలకి వరంగల్ లో వి వి ఇంటికి వెళ్ళా. అప్పుడు ఆయన చూపిన అభిమానానికి యెల్లలు లేవు. అదే అభిమానం అదే ఆత్మీయత యిప్పటికీ. ఎందుకో తెలీదు, ఆయన నన్ను చేతుల్లోకి పొదువుకోడు. కడుపులోకి తీసుకుంటాడు.

1990లో దాదాపు మూడేళ్ల జైలు జీవితం అనుభవించి వరంగల్లులో వుండలేని పరిస్థితి యేర్పడి హైదరాబాదు బాగ్ లింగంపల్లిలో వొక చాపా రెండు వంటపాత్రలతో కాపురం పెట్టినప్పుడు కలిస్తే – నేలమీద కూర్చొని రాత్రి భోజనం చేస్తూ ‘తిందురు గాని రండి’ అని ఆదరంగా పిల్చిన పిలుపు నా యెదలో మోగుతూనే వుంది. నగరి బాబయ్య కన్నడంలో రాసిన కటిక చీకటి కారాగార అనుభవాల పుస్తకం చదవమని యిచ్చారు (నాకు కొద్దో గొప్పో కన్నడ వచ్చని యెనిమిదేళ్ళ తర్వాత కూడా ఆయన గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్యమే). అంత కష్టకాలంలో సైతం హేమక్క కళ్ళలో ఎక్కడా దైన్యం జాడ కనిపించేది కాదు. మంది మధ్య వున్నామన్న దీము యిద్దరిలోనూ. కవిత్వం తోడుగా వుందన్న ధైర్యం కావచ్చు.

విప్లవోద్యమానికి ‘ఆయుధాగారం’ లాంటి వి వి కేవలం కవి మాత్రమే కాడు; అధ్యాపకుడూ పరిశోధకుడూ అనువాదకుడూ పత్రికాసంపాదకుడూ రాజకీయ వ్యాఖ్యాతా వక్తా హక్కుల కార్యకర్త కూడా. బహుముఖీనమైన ఆయన యీ మేధోరంగ కృషి చాలుకదా రాజ్యం ఆయన్ని జైలుపాలు చెయ్యడానికి! ఇప్పుడు ఆయన లోపలి జైల్లో మనం బయటి జైల్లో.

***

అవును వీవీ !

మీరక్కడ క్షేమంగా వున్నారా అని అడగలేం. మేమిక్కడ క్షేమంగా వున్నామని చెప్పి నటించలేం. అన్ని అనారోగ్యాలతో సాయిబాబా, వయస్సు తెచ్చిన అలసటతో మీరూ, మనుషుల్ని మనుషులుగా చూడమన్నందుకూ పౌరుల్ని పౌరులుగా గుర్తించమన్నందుకూ మీలా మరెందరో, చావో బతుకో తేల్చుకునే పోరాటంలో కనీసం గుర్తింపుకు కూడా నోచుకోని వేలాది మంది దుర్భర పరిస్థితుల్లో జైలు గోడల మధ్య మగ్గుతుంటే మేం యిక్కడ సోడియం హైపో క్లోరైట్ స్ప్రే చేసిన సొంత గూళ్ళలో బొజ్జొని సామాజిక మాధ్యమాల్లో ట్వీటుతూ కామెంటుతూ మెసేజించుతూ వర్చువల్ ఛాయాయుద్ధాలు చేస్తూ… ఫేసుబుక్కు గోడలమీద వ్యర్థ మిధ్యా కలహాల్లో కాలహననం చేస్తూ… సబ్బుతో కడిగిన చేతులే పదే పదే కడుక్కుంటూ… ఇంతకుముందేదో ముసుగులు లేకుండా సంచరించినట్టు యిప్పుడు కొత్తగా తొడుక్కున్న మాస్కుల్లో వూపిరాడనట్టు నటిస్తూ… బంధు మిత్రుల గడపలు కూడా తొక్కకుండా సమస్త ‘మానవ దూరాలు’ నిష్టగా పాటిస్తూ… దొంగ బతుకు బతుకుతున్నాం.

మీ విడుదల కోసం ఎక్కడెక్కడివాళ్ళో దేశ విదేశాల్లో కవులూ కళాకారులూ ప్రపంచవ్యాప్తంగా మేధావులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వాలెలానూ పట్టించుకోవు సరే రచయితల సమాజం కూడా కుంటి సాకులతో స్వార్థంతో ద్వేషంతో అసూయతో ముఖం చాటేయడమే విషాదం. శ్రీ శ్రీ మీద దొంగాదాడిలో పాల్గొన్న తిలక్ చనిపోతే అన్నీ మర్చిపోయి శ్రీ శ్రీ కవీ రవీ పవీ అని కలవరించాడు. మీరు నడిచే దారులు వేరు కావొచ్చు ఆశయం మాత్రం అందరిదే కదా! అందివచ్చే పదవులు అవార్డులు సన్మానాలు దూరమవుతాయని భయమో, సింహాసనాల కాళ్ళ దగ్గర బిరుదు తోకలు వూపుకుంటూ తిరిగే అవకాశాలు కోల్పోతామని సందేహమో, దొరల గడీ గోడలని కవిత్వం వెల్లతో దేదీప్యమానం చేసే వూడిగం పోతుందని సంకోచమో… కారణాలేవైనా   భద్ర జీవితాల పట్టుగూళ్ళు శాశ్వతమని భ్రమించి మౌనాన్ని ఆశ్రయించడం మీరన్నట్టు నేరమే కదా!

మీరిక్కడ మా మధ్య లేనప్పుడు దొంగల రాజ్యంలో నిశ్శబ్దంగా చాలా జరిగిపోతున్నాయి. దేశంలో అప్రకటిత యమర్జెన్సీ అమలవుతుంది. ఉపా చట్టం కొత్తకోరలు పెంచుకుంది. ప్రశ్నించే బుద్ధి జీవుల్ని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పట్టుకుపోతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్ళని ఆసుపత్రి బెడ్ మీద నుంచే యెత్తుకు పోతున్నారు. ఎన్కౌంటర్ చేయడానికి లానే అరెస్ట్ చేయడానికి అర్థం మారిపోయింది. ఏ ‘బ్రాహ్మీ ముహూర్తంలోనో’ బందిపోట్లులాగా యిళ్ళమీద దాడి చేసి తలుపులు పగలగొట్టి ఆడా మగా తేడా లేకుండా బుద్ధిజీవుల్ని బలవంతంగా లాక్కుపోతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే యూనివర్సిటీ విద్యార్థుల మీద పట్టపగలు కాల్పులు జరిపిన మతవాది అచ్చోసిన ఆబోతులా బోర విరుచుకు తిరుగుతున్నాడు. రాజ్యాంగ పరిరక్షణ కోరినవాళ్ళు వుగ్రవాదులైపోతున్నారు. కడుపులో బిడ్డ కూడా తల్లితో పాటు దేశద్రోహి అవుతుంది.

ఆదివాసీని అడవినుంచి తొలగించడం, బయటివాళ్ళకి అడవిలోకి చొరబడే దుర్మార్గ చట్టాలకి న్యాయ సమ్మతి సాధించడం, ఈ నేలకన్న బిడ్డల్ని తల్లి వొడికి దూరం చేయడం వంటి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కరోనా కార్పెట్ కింద కార్పోరేట్ పాములు కనపడకుండా గుడ్లు పెడుతున్నాయి. వలస కార్మికుల నెత్తుటి పాదాల స్పర్శతో నెర్రెలిచ్చిన నేల యే సామాజిక శాస్త్రజ్ఞులూ రెక్టర్ స్కేలు మీద కొలవలేనంత తీవ్రంగా కంపిస్తుంది.

నువ్విక్కడ లేకుండానే అనేక ఆంక్షల మధ్య విరసం యాభై ఏళ్ళ మహాసభలు జరిగాయి. బెదిరిస్తున్నట్టు బతిమాలి మమ అనిపించుకున్నాం. నువ్వు ఎప్పుడూ చెప్పినట్టే అందర్నీ కలుపుకుపోయే పేరుమీద విభిన్న విరుద్ధ భావాలకి ధిక్కార వేదిక నెక్కే అవకాశం కల్పించారు. నిన్ను అన్యాయంగా చెరబట్టినవాణ్ణే విడుదల చేయమని దీనంగా దేబిరించడమే విషాదాల్లోకెల్లా గొప్ప విషాదం.

ఫెడరల్ విలువల్ని తుంగలో తొక్కే జాతీయవాదానికి రాష్ట్రాధిపతులు దాసోహం అయ్యారు. కాగల కార్యం ఎన్ ఐ ఏ గంధర్వులు తీర్చుతున్నందుకు సంతోషిస్తున్నారు లేదా వాళ్ళకి అవసరమైన వుప్పందించి వుద్యమ కార్యకర్తల్ని అప్పగించి చేతులకు రక్తం అంటకుండా పనిగావించుకుని సబ్ ఠీక్ హై అని నమ్మబలుకుతున్నారు. కిరాయి హంతకులకు దేశభక్త లైసెన్సుల అచ్చోసి అర్బన్ నక్సల్స్ మీదకి వదులుతున్నారు. మునుపు కోవర్టులు యెక్కడో వొక చోట దొరికిపోయేవారు. ఇప్పుడు వాళ్ళు ముసుగుల్లేకుండా కరోనాలా మనతో సహజీవనం చేస్తూ రోగనిరోధక శక్తిని హరించివేస్తున్నారు. మన వేలితో మన కన్నే పొడుచకునేలా చేసే వ్యూహాలు అమలవుతున్నాయి.

ఇన్ని వుపద్రవాల మధ్య షాహిన్ భాగ్ స్త్రీల పోరాట స్ఫూర్తి గుండె నిబ్బరాన్ని పెంచుతుంది. భవిష్యత్తు పట్ల భరోసానిస్తుంది. ఆచరణలో నిలడడానికి గొప్ప దన్ను కలిగిస్తుంది. ఇప్పుడిక్కడ యీ నేల మీద నిలబడి స్వేచ్ఛగా బతకడానికి పోరాటం వొక్కటే మార్గమని మరోసారి రుజువైంది. అందుకు జైలు గోడలు అడ్డంకి కానే కావు. పోరాడేవారికి చెరసాల పాఠశాల.

***

అసత్య ఆరోపణలు కుట్ర కేసులు జైలు వి వి కి కొత్త కాదు. ప్రతి జైలు అనుభవం ఆయన్ని కవిగా మరింత శక్తిమంతుణ్ణి చేసింది. జైల్లో వొంటరితనంతో ఆయన హృదయం కరుణప్లావితమైంది. అమితమైన సున్నితత్వాన్ని సంతరించుకుంది. అంతర్ముఖీనుడైనకొద్దీ ఆయన కవిత్వ వ్యక్తీకరణ సాంద్రమైంది.(ముక్తకంఠం). వచనం తేటపడింది(సహచరులు). ఆచరణ పదునెక్కింది. రాజకీయ తాత్త్వికత రాటుదేలింది. స్వేచ్చని విరచించే జీవితాన్ని కోరుకునే క్రమంలో మనందరి కలల్నీ ఆయన తనవి చేసుకున్నాడు. సముద్ర స్వరాన్ని నిర్విరామంగా వినిపిస్తూనే వున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెబుతూనే వున్నాడు. భవిష్యత్తు పై విశ్వాసాన్ని శ్వాసిస్తూనే వున్నాడు. సడలని ఆచరణలోనే జీవిస్తున్నాడు.

కవులు నిజం చెప్తారు, నియంతలు భయపడతారు. ఇది పాతమాట. కవులు ప్రశ్నిస్తారు, పాలకులు అణచివేస్తారు. కవులు గొంతెత్తి నినదిస్తారు, ఫాసిస్టు రాజ్యం పీకనొక్కే సిద్ధాంతం అమలు చేస్తుంది. కవులు కలలు కంటారు, అధినాయకులు అసహనానికి లోనై చిదిమేస్తారు. ఇది సరికొత్త విధానం.

ప్రజల్ని ప్రేమించే కవులు యెప్పటికీ ప్రజల మధ్యే జీవిస్తారు. ప్రజాద్రోహులైన యేలికలు ప్రజల క్రోధానికి గురై మరణిస్తారు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. తథ్యం.

లొంగిపోనంత వరకూ

ఓడిపోనట్లే

జీవితేచ్ఛతో పోరాడినంతకాలం

అది నిన్నటి జ్ఞాపకం కాజాలదు

ఇవ్వాళ్టి ఆచరణే అవుతుంది (వి వి: జీవితేచ్ఛ )

( నరక కూపాల్లాంటి జైళ్ళలో అకారణ శిక్ష అనుభవిస్తున్న రాజకీయ ఖైదీలందరినీ తక్షణం విడుదలచేయాలని కోరుతూ …)

*

ఏ.కె. ప్రభాకర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వి వి అంటే భవిష్యత్తు పై’ రెండింత’ల విశ్వాసం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు