భయాలు, అనుమానాలు – ఇవే మధ్యతరగతి జీవితాలు

క్రిందటిసారి మొదటి సంపుటి లోని  శాస్త్రి గారి కథలలో తాత్విక ధోరణి పరిశీలించాం. ఈసారి మధ్యతరగతిలోని  భయాలు, సందేహాలు, సంశయాలు,  అనుమానాల తో పాటు ఏవిధమైన నిర్ణయాలు తీసుకోలేని అశక్త స్థితిని చూపించిన విధానం పరిశీలిద్దాం. ఈ కోవకు చెందిన కథలు ‘శత్రుసర్పం’, ‘దూరెన్ పాము’, ‘రుబ్బురోలు’,  ‘టై’, ‘వడ్ల చిలకలు’ ముఖ్యంగా చెప్పుకోవచ్చు.

‘శత్రుసర్పం’, ‘దూరెన్ పాము’ రెండిటిలో ముఖ్యపాత్ర తాచుపాముదే. ఇక్కడ తాచుపాము అంటే ఒక పెద్ద సమస్యకి ప్రతీక. శత్రుసర్పం కథలో పిల్లలు రోడ్డుమీద ఆడుకుంటుండగా ఒక పాము ఇంట్లో దూరడం చూస్తారు. అక్కడినుంచి హడావుడి మొదలవుతుంది. కాలనీవాళ్ళందరూ పోగవుతారు. ఇంటి యజమాని భయంతో తలుపులు బిడాయించుకుని కూర్చుంటాడు. ఇంకా తర్కాన్ని కోల్పోని పిల్లలు పాములు మనల్నేమి చేయవు, లోపలి వెళ్లి చూద్దాం అంటారు. అబ్బే, పెద్దమనిషి ఒప్పుకుంటేగా. చర్చల మీద చర్చలు. ఎవరి విశ్లేషణ వాళ్ళది. ఎవరి జాగ్రత్తలు వాళ్ళవి. ఏ పాములవాడైన దొరుకుతాడేమో అని వెతికారు. చివరికి ఎవరూ దొరక్కపోగా సర్ప సంహారం ఎలా చేయాలని చర్చలతో గడిపేశారు. సమస్య సమస్యలాగే వుంది. చర్చలు కొనసాగుతూనే వున్నాయి.

ఇంక ‘దూరెన్ పాము’ విషయానికి వస్తే సత్యంగారింట్లో పాము దూరడం, సైకిలేసుకుని ఆఫీస్ నుంచి వస్తున్న శ్రీనివాసరావు చూసాడు. సత్యంగారికి చెప్పాలా వద్దా అనే సందేహంతోటి గంటలు గడిచిపోయాయి, రోజు దొర్లిపోయింది. పాము మెత్తగా నీటిధారలా ఇంటిలోకి వెళ్లిపోయిందేమో అని శ్రీనివాసరావు అనుమానం. ఇంక రోజూ అది కరిచి ఎవరైనా పోయారేమో అని భయం. ఏక్షణంలో నైనా సత్యం  గారింట్లోంచి, ఏ వార్త వినవలసి వస్తుందో అని ఆందోళన. చివరికి సరుకుల కోసం భార్య ఫోన్ చేసినా, సత్యంగారింట్లోంచి చావు గురించి  కబురేమో అని గుండె దడ. ఆవిధంగా ఆ సమస్య పామై తన మెడకు చుట్టుకుని పశ్చాత్తాపానికి గురి చేస్తుంటే, అక్కడి ఇల్లు ఖాళీ చేసి సత్యంగారింటినుంచి దూరంగా వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు.

***

విశ్వనాథం ఇల్లుమారాడు. ఓ ఇంటివెనుక భాగంలో చిన్న గజమున్నర కొంపలోనుంచి మరో గజం  కొంపకు మారాడు. గది లుంగీ అంత, వంటిల్లు తువ్వాలంత. జీవితం అంటే అతి భయం వున్న విశ్వనాథం అంటే పెళ్ళానికి లోకువ. అడుగడుగునా విశ్వనాథాన్ని ఏదోరకంగా ఎత్తి పొడుస్తుండేది, అది అతని జీవితంలో న్యూనతగా మారి ఒక పెద్ద బరువైపోయింది. పెళ్ళైన తరువాత భార్యతోపాటు ఇంటికొచ్చిన రుబ్బురోలుని కదిలించడం అంటే, విశ్వనాధానికి జీవితాన్ని పెకిలించిన సమస్య అయిపోయింది. పాత ఇంటినుంచి కొత్త ఇంటికి రుబ్బురోలు ఎలా కదిలించాలా అన్నది జీవిత సమస్యగా మారిపోయింది. పాత ఇంటి యజమాని వాళ్ళ పనివాడి చేత కొత్త ఇంటికి రుబ్బురోలు పంపించాడు. ఇంటి మెట్టుమీద సగం సగం పెట్టబడ్డ రుబ్బురోలు కదిలించబోతే అతని కాలుమీద పడి, జీవితంలా దెబ్బతీసింది.  రుబ్బురోళ్ళు యాభై రూపాయలకి వూరు చివర అమ్ముతారనే  విషయాన్ని సేకరించి, తన రుబ్బురోలు అమ్మడానికి బయలు దేరాడు. తనంటే కాస్త దయా దాక్షిణ్యం వున్న ఓ వాడుక రిక్షావాడు దీన్ని మీరేం ఎత్తగలరు, నేను తీసుకువస్తా అని అలవోక దాన్ని ఎత్తిపెట్టి విశ్వనాథం చెప్పిన చోటికి తీసులుకువెళ్ళాడు. చిత్రంగా వాళ్ళు రోళ్ళు అమ్ముతాము అన్నారు కానీ కొనుక్కోమంటే పిచ్చివాడి కింద  జమవేశారు, ఉసూరుమంటూ విశ్వనాథం ఆ బరువుని  తన జీవితంలోకి తెచుకోక తప్పలేదు.  ఇది ‘రుబ్బురోలు’ కథ.

***

మెడికల్ రిప్రెసెంటివ్  కృష్ణమూర్తి టక్ చేసుకుని టై కట్టుకుని  బావగారికి  బుజ్జగించడానికి బయలు దేరాడు.   ఎన్నోసార్లు తనకు చేతనైన  మందు శాంపిళ్ల తోటి, మంచి మాటలతోటి బావగారికి మచ్చిక చేసుకునే  చిట్కాలేవీ పనిచేయలేదు. డబ్బుకోసం చెల్లిని హింసించడం, కన్నీళ్ళెట్టుకుంటూ తండ్రి ఉత్తరం రాయడం షరా మామూలైపోయింది. ఇరుకు జీవితం బతిమాలడం తప్ప చేయగలిగింది ఏముంది. గట్టిగా చెప్పాలంటే గొంతుక్కి కట్టేసిన టై లా ఎవరికీ చెప్పుకోలేని బాధ. బావగారి వూరువెళ్లే ఏక్సప్రెస్ రైలు తప్పిపోయింది, ప్యాసింజర్ రైలు ఎక్కాడు. ఎదురుగా నలుగురు పల్లెటూరి మనుషులు కూర్చున్నారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అవే సమస్యలు తనకున్న సమస్యలే. ” పెళ్ళాం మీద చేయి చేసుకునే పెనిమిటి ఎదవ అనుకోండి, మొగుడైతే సంపాదించాలి గాని, ఆడదాన్ని కొట్టి సంపే బుద్ధి ఏంటండీ” అంటూ అరమరికలు లేకుండా గట్టిగా మాట్లాడుకుంటున్నారు.  చెల్లెలు బాధపడుతుంది అని తెలిసినా  దురలవాట్ల మేనల్లుడు ని ఎలా దూరం పెట్టారో  చెప్పుకుంటున్నారు. కష్టాలు, సుఖాలు పంచుకుంటున్నారు. సమస్యలని ఎలా ఎదుర్కోవచ్చో కూడా గట్టి గట్టిగా భేషజాలు లేకుండా మాట్లాడుకుంటున్నారు. బిర్ర బిగుసుకు పోయి ఎదురుకుండా కూర్చున్న కృష్ణ మూర్తి పరువు మర్యాదల ముడిని కొంచెం లూస్ చేసి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అదే ‘టై’ కథ.

***

I  remain  your  most  obidient  servant అంటూ అప్లికేషన్ మీద సంతకం పెట్టాడు. దాన్ని తీసుకుని తండ్రి  చెప్పినట్లుగా కలెక్టర్ ఆఫీస్ లో టెంపరరీ ఉద్యోగం కోసం, కలెక్టర్ని కలవడానికి వెళ్ళాడు, డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న విశ్వనాథం. అయితే చక్కగా చదువుకుని బాస్కెట్బాల్ లో ఛాంపియన్ షిప్ సంపాదించి పొందిగ్గా ఉన్న విశ్వనాథాన్ని, బెంగాలీ కుర్ర కలెక్టరమ్మ సలహా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇలాంటి చిన్న ఉద్యోగాల బదులు, సెంట్రల్ సర్వీసెస్ కి ప్రయత్నించవచ్చు, కాస్త కావలసిందల్లా చొరవ ఆంబిషన్ అన్నమాటలు విశ్వనాథాన్ని ఎక్కడికో తీసుకువెళ్లిపోయాయి. అంతే కాదు ఎవరో కుర్రాళ్ళు కేరళ నుంచి మోటార్ సైకిళ్ళ మీద దేశ యాత్ర చేస్తున్నారని, వాళ్ళతో చేరతానంటే బండి డబ్బు సమకూరుస్తానన్న సలహా అతన్ని కొండమీద నిలబెట్టేసింది.

అయితే ఈ సలహాకు  విశ్వనాథం  తండ్రి కుంగిపోయాడు. ఎదో ఎదురుగా ఉండి గుమస్తా ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకుని  కాసిన్ని డబ్బులు పోగేస్తాడనుకున్న కొడుక్కి ఈ సలహా నచ్చడం    అస్సలు నచ్చలేదు.  పరమ లౌక్యుడైన పెదనాన్న కల్పించుకుని బల్లమీద వెళ్లి ఏ ప్రమాదంలోనైనా పొతే, ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుంటే తల్లితండ్రులు ఏమైపోతారో ఆలోచించుకోమన్నాడు. ఐఏఎస్ లు అవీ అవ్వడం ఊహించుకోడమే కానీ మనకు అందవని చెప్పాడు. ప్రాణంలాంటి తండ్రిని కష్ట పెట్టడం తప్పుకదా అని చెప్పి కళ్ళమ్మట నీళ్ళెట్టించేసాడు.

పూర్వం ఊళ్ళల్లో ధాన్యపు గాదుల గోడలకి  తెల్లటి రెక్కల పురుగులుండేవి వాటినే ‘వడ్ల చిలకలు’ అనేవారు. అవి ఆ గాదె దాటి బయటకు వస్తే ఆ వెలుగుకి అవి చచ్చిపోతాయి.  తమ ఇల్లు దాటి ఆలోచించలేని మధ్యతరగతి జీవితాలు కూడా  అంతే.

అన్నట్లుగానే విశ్వనాథం ఉద్యోగంలో చేరాడు, స్థలం కొన్నాడు. కొంచెం పొట్ట వచ్చింది. అన్నవరం వెళ్లి గుండు గీయించుకున్నాడు. ఇప్పుడతను మెల్లగా నడుస్తాడు, ఆఫీస్ పనులు మెల్లి మెల్లిగా చేస్తాడు.  ఆడవాళ్ళ గురించి వెకిలి గాసిప్పులు మొదలుపెట్టాడు.

*

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కథల పరిచయం కూడా కథాంరీతిలో ఉండి, ఆ కథలు తప్పకుండా చదవాలి ఆనిపించేలా ఉంది. కథ శైలి చెడకుండా కథ పరిచయం చెయ్యడం. తప్పక చదవాల్సిన వ్యాసం.

  • పతంజలి శాస్త్రి గారి కధలు బాగా విశ్లేషించి పరిచయం చేస్తున్నారు. మోహనబాబు గారికి అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు