ఎందుకో భయంగా వుంది.
నేనెంతో ధైర్యవంతురాలిననుకున్నానే
ఇదేమిటీ ఇంత బలహీనత
పురుగులా ఎప్పుడు నాలో చేరింది
ఎందుకో భయంగా వుంది
పుట్టిన దగ్గర్నుంచి అబలను చేసేందుకు
నా చుట్టూ ఎన్నెన్నో ప్రయత్నాలు
అయితేనేం
ఉక్కు సంకల్పంతో ఎదిరించానే
ఎందుకో భయంగానే వుంది
నేను నేను కాకుండా పోయేందుకు
నా మనసు చుట్టూ మరెన్ని వలలో
అయితేనేం
చిధ్రం చేసి ఛేదించి బయటపడ్డానే
ఎందుకో భయంగా వుంది
నాలోంచి నేను జారిపోయేందుకు
నా ఆశల చుట్టూ ఎన్ని జ్వాలలో
అయితేనేం
స్నేహాలతో శీతలీకరించుకున్నానే
ఏమిటో భయంగానే వుంది
నా బదులుగా నా పేరు తగిలించుకుని
కవనాలు అల్లేస్తుందనో
కట్టుకథలతో మాధ్యమాలు తిరిగేస్తుందనో
కవలసోదరై పుస్తకాల్తో వేదికలెక్కుతుందనో
ఎంతమాత్రమూ కానే కాదు
నా ముఖాన్ని కూడా నాది కాకుండా
ఏ సినీతారలాగో నా ముఖాన్ని చెక్కేసి
నా కంఠం నాది కాకుండా
ఏ మృదుభాషిణి గాత్రాన్నో ఇమిడ్చేసి
నా తెలివితేటల్ని దొంగిలించి
సామాజిక మాధ్యమాలనిండా ప్రదర్శించి
ఈ AI భూతం నిలువునా మింగేసి
నన్ను నేనే గుర్తు పట్టనీకుండా
నేనే నేను కాకుండా చేసేస్తుందేమోనని
భయంగానే వుంది
*
కవిత చాలా బాగుంది.
ఉక్కు సంకల్పంతో జీవనయానం సాగిస్తున్నా, ఎగసి పడుతున్న జ్వాలల్ని స్నేహాలతో శీతలీకరించుకుంటున్నా… భయపడి తీరక తప్పని సాంకేతిక భూతాల గురించి పదునైన హెచ్చరిక ఈ కవిత.
సుభద్రా దేవి గారికి అభినందనలు.
ఎమ్వీ రామిరెడ్డి
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ఎమ్వీ రామిరెడ్డి గారూ
చాలా బాగుంది. నాక్కూడా భయంగా వుంది.