బ్లాక్ పెయింటింగ్స్

వాట్సాప్ గ్రూప్ యాక్టివిటీ రాబర్ట్‌లో విపరీత కదలిక తెచ్చింది. అతను క్రమంగా చర్చికి వెళ్లే సమయం తగ్గించాడు.

గుడిసె ముందు ఎండుకర్రల మంట వెలుగుతూనే ఉంది. తృప్తిగా చూసి లోనికెళ్లాడతను. ఎత్తైన కొండ మీద తరచూ రాత్రుళ్లు ఆ మంట, ఆ వెలుగులో గుడిసె.. లోతట్టు టౌన్లోని వాళ్లకు ఓ విస్మయ దృశ్యం. ఏదో పెయింటింగ్ కేన్వాస్‌ను చూసినట్టుంటుంది. కొందరైతే ఆ విషయాన్ని కథలు కథలుగా చెపుతారు. కొందరు మాత్రం “ఏం చేసుకుంటాడీ ముసలోడు కర్రల్ని, మంట మండించిన బొగ్గుల్ని?” అంటుంటారు. చాలామందికి మాత్రం ఆ బొగ్గులెందుకో తెలుసు. కొందరు అతన్ని చూశారు. ఇంకొందరు అతను ఆ బొగ్గులతో ఏం చేస్తాడో చూశారు. అతనూ నల్లగా పొగచూరినట్టుంటాడు. నడిచే బొగ్గులా అనిపిస్తాడు.‌ పిల్లలైతే ‘శివపుత్రుడు సినిమాలో పిచ్చివిక్రంలా ఉంటాడురా’ అంటూ స్కూళ్లల్లో తమ స్నేహితులకు ఆ కథలను మరింత విస్తృత పరుస్తారు. అతనూ అంతే! ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. ఎప్పుడన్నా నోరు విప్పితే ఏదేదో అంటుంటాడు. ‘పడిపోతోంది పడిపోతోందీ’ అని హడలగొడతాడు. ‘ఏంటీ?’ అని కంగారుగా ప్రశ్నిస్తే “ఇహీహీ.. ప్రజాస్వామ్యం రేటు” అంటాడు. దానికర్థం ఏంటో ఎవరికీ బోధపడదు. ఆ దారిన ఆవు నడిచిన ఆనవాళ్లు కనపడితే భయపడుతుంటాడు, హడలిపోతుంటాడు. ఆ గిట్టల్ని చూస్తూ ”అమ్మో పంజా గుర్తులు! పారిపోండి. పారిపోండి” అని కేకలేస్తుంటాడు.

”ష్.. చప్పుడు చేసుకోకు. అదిప్పుడే మెతుకుల వాసన చూసెళ్లింది. నువ్విలాగే గప్‌చుప్‌గా ఉంటే వస్తుంది. ఏమో నీ ఇష్టం! నేనైతే దుప్పటి కప్పుకుంటున్నా” అంటూ ఆవులించాడతను గుడిసెలోనికొస్తూనే. చెవులు చాటల్లా మార్చుకొని గుడిసెలో ఆ మాటలు వింటున్న నల్లపిల్లి కుడిచెవి దురద పెడుతున్నా గోక్కుందామన్న ఆలోచన అణిచేసుకుంటోంది. మిట్టమీదున్న ఒంటిగుడిసె అది. తలుపు, కిటికీ లేని ఆ ఇంట్లోకి గాలి పగలూ, రాత్రి తేడా లేక స్వతంత్రంగా వస్తుంది. చెదిరిన పైకప్పు నుంచి సూర్యచంద్రులూ అంతే స్వేచ్ఛ కలిగి ఉంటారు. మట్టిగోడల గుడిసెలో చీకటిగా ఉంది. మంచానికి దగ్గర్లో మూడు రాళ్ల పొయ్యి ఇంకా వెచ్చగా ఉంది. నివురు ఆవరించినా నిప్పుగుణమింకా‌ ఉంది.

”ఉపా, నల్లచట్టం, అక్రమ కేసులు, నేను దేశద్రోహిని కాదు‌. నా గొంతు మీద కాలు తీయండి, నాకు ఊపిరాడట్లేదూ” అంటూ ఏదో పిచ్చిపిచ్చిగా కలవరిస్తూ అతనప్పుడప్పుడూ నిద్రలో ఉలికిపడుతూ వణికిపోతున్నాడు. నన్ను నిశ్శబ్దాన ఉండమని వీడు చప్పుడు చేస్తాడేంటని పిల్లి అతను కలవరిస్తున్నప్పుడల్లా విసుక్కుంటోంది. క్వార్టర్ బాటిల్‌లో బుడ్దిదీపం మత్తుగా వెలుగుతోంది. బాటిల్ మీద ఓల్డ్ మంక్ స్టిక్కర్. ముసలి సాధువు బొమ్మ. కొన్ని ఖాళీ చేసి ఇంకొన్ని పావు, అరా ఖాళీ చేసి ఇంకా చాలా సీసాలు గుడిసె నిండా ఉన్నాయ్. ఆ ముసలి సాధువు బొమ్మ మంచం మీద పడుకున్నతనికి దగ్గరదగ్గరగా ఉంది. అతనిప్పటికీ ఇంగ్లీష్ దొరలా ఉంటాడు. అదుగో నిద్రపోతున్నా సరే ఆ జీన్ ప్యాంటు, జర్కిన్ విడవడు. వాస్తవానికది హంటర్ బ్లూజీన్స్. ఏళ్ల తరబడి ఒంటిపై మాసిమాసి ఏ రంగో తెలీకుండా అయ్యింది.

గాలి బలంగా తోసుకొచ్చింది. దీపం చప్పున ఆరిపోగానే కిరసనాయిలో, ఆల్కహాలో, మూత్రమో, గొడ్డు తునకల కమురో తెలియని గబ్బు పొగవాసన అలుముకుంది.‌ ఇప్పుడు పిల్లికళ్లు రేడియం స్టిక్కర్లలా మెరిసిపోతున్నాయి. ఆ వెలుగు పసిగట్టి మెల్లగా లోనికొస్తున్న కుక్కను చూసి చప్పున చూరెక్కింది పిల్లి. సరిగ్గా అప్పుడే మెతుకులేరుకు తినేందుకు కలుగు నుండి బయటకు రాబోతున్న ఎలుక ఆ కాస్త అలికిడికే తల చప్పున వెనక్కు‌ లాక్కుంది.

అప్పుడప్పుడూ లేస్తూ గుడిసె ముందుకొచ్చి ఒంటేలు పోసుకుంటున్నాడతను. గుడిసెలో దోమలూ, బొద్దింకలూ, బల్లుల చప్పుడు అధికమయ్యింది. ఆ గుడిసెలో వాటి స్వేచ్ఛకూ అడ్డేం లేదు. తెల్లారే దాకా అన్నీ అలా స్వతంత్రంగా సంచరిస్తుంటాయ్. ఎత్తు పారకపోవటంతో విసుక్కుంటోంది పిల్లి. మ్యావ్ మంటూ తన అసహనం చాటుతోంది. కుక్కా అంతే, ఆకలి తీరనందుకు అరిచి అరిచి యాగీ చేస్తోంది. ఏదో తిట్టు తిడుతోందన్నట్టుగా మొరిగి అక్కడి నుంచి బయటకు కదలగానే పిల్లి ఒక్క ఉదుటున మంచంపైకి దూకింది. అప్పటికే దోమలు అతని చెవిలో ఏదో రొద పెడుతూనే ఉన్నాయి. ఈ కాస్త అదనులోనే ఎప్పుడొచ్చిందో ఎలుక చప్పున మెతుకులు‌ ఏరుకుపోతోంది.

కిచకిచమంటూ పిచుకలు సూర్యుడ్ని మోసుకురాగానే గుడిసెలో వెలుగు అలుముకుంది. అతను బద్దకంగా ఒళ్లు విరుచుకుంటూ లేచాడు. మందుబాటిల్ నోట్లోకి ఒంపుకొని పుక్కిలించి మింగేశాడు. బయటకొచ్చి సర్రుమనే చప్పుడుతో  ప్యాంట్ జిప్పు తీసి పోసుకుంటున్నాడు.

”ముసలోడా! ఆ గుడిసె నెత్తిన గడ్డన్నా కప్పించరాదా? వానాకాలం కదా! నువ్వు తడుస్తున్నా పట్టించుకోవు సరే. ఎండేసే ఆ పెద్ద మాంసం కండలన్నా తడవకుండా ఉంటాయ్‌గా” అని అక్కడికీ పెద్దగానే అరుస్తున్నాడు కూలి పనులు చేసే డేవిడ్ ఖాళీ చేసుకొస్తున్న చెంబులో అడుగుచుక్కల్ని విసురుకుంటూ. అయినా అతనికి అవేవీ వినిపించనంత చెవుడు.

‘యాక్ థూ’ అని ఉమ్మేస్తూ ప్లాస్టిక్ బకెట్ వైపు చూశాడు. ఎన్ని రోజుల కిందటివో అడుగున మట్టి, చెత్త చెదారం చేరింది. ఆ నీళ్లతోనే ముఖం కడుక్కున్నాడు. అలికిడవ్వగానే అప్పటిదాకా కప్పల వేట సాగించిన పాము జరజరా పాక్కుంటూ రాళ్లసందుల్లోకి వెళ్లిపోయింది. రాత్రి విడిచిన షూస్ తగిలించుకోబోతుండగా వాటిల్లోంచి తేళ్లు రెండు చటుక్కున దూకాయి. అతనదేం పట్టిచ్చుకోకుండానే షూస్ తొడుక్కొని, ప్లాస్టిక్ లోటా బకెట్లో ముంచగానే బొడబొడ చప్పుడుతో  నీళ్లు నిండాయి. చెట్ల పొదల వైపు నడుస్తుండగా అప్పటికే ఆ పొదల వెనుక చేరిన ఎవరెవరో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు. కానీ అతనికవేవీ వినిపించనంత చెవుడు.

వెలుగులో ఇప్పుడు స్పష్టంగా కనపడుతోంది. గుడిసె ముందు నేల కూడా నల్లగా మారింది. ఎలుక మట్టి తోడిన కలుగులో రెండో మూడో అన్నం మెతుకులను చీమలు లాక్కుపోతున్నాయ్. పిల్లి, కుక్క,ఎలుక అలికిడి లేవు. దోమలూ ఎటో పోయాయ్. ఎత్తైన ఎర్రమొరం కొండ మీద చతురస్రాకారంగా నిర్మించి ఉందది. లోపలి వైపు మాత్రమే ఎర్రమట్టితో అలికి ఉంది. బయటవైపు రాళ్లు కనిపిస్తూనే ఉన్నాయ్. అలుకుగోడపై తెల్లసుద్దతో అంబేద్కర్, ఏసుక్రీస్తు, బుద్ధుడి బొమ్మలు అక్కడక్కడా చిత్రించి ఉన్నాయ్. పాతకాలపు చెక్కకుర్చీ విరిగిపోయి శిథిల స్థితిలో ఉంది. దాని మీద కూజా, ఇంకో బల్ల మీద ట్రంకుపెట్టె ఉంది. తాడుతో దండెం కట్టి ఉంది. దాని మీద బట్టలు, తువ్వాళ్లు ఏవేవో! ఇంకో దండెమ్మీద తునకలు. అన్నీ దుమ్ముపట్టి పోయాయ్. ట్రంకు పెట్టె తెరవగానే అందులో మూడు రంగుల జెండా ఏ దుమ్మూ సోకకుండా ఉంది.

పడుకున్న నులకమంచం పైకెత్తగానే దాని కిందున్న కేషియో కనపడింది. మెల్లగా నేలమీద కూర్చోని మెట్లమీద దుమ్ము ‘ఉఫ్.. ఉఫ్’ అని ఊది ఎలుక, బొద్దింకల‌‌ పెంట తుడిచి‌, వేళ్లనాడిస్తుంటే ‘సారే జహాసే అచ్ఛా’ గీతం ధ్వనించింది.‌ ఆ తరువాత తనకిష్టమైన క్రీస్తుస్తుతి అందుకున్నాడు. ముసలోడు ఎప్పుడు కేషియోపై కూర్చున్నా ముందుగా

ఇవే‌ గీతాలు ఆలాపిస్తాడు. ఆ తరువాత అటు నుంచి అటు అన్నట్టుగా హిందీ పాటలందుకుంటాడు.

తన వయస్సు నలభైకి కాస్త అటు ఇటు ఉంటుంది. గుబురు గడ్డం తెల్లబడిందనో, ఎప్పుడూ ఓల్డ్ మంక్ సీసాతో కనిపిస్తాడనేమో అతన్ని ముసలోడంటారు కానీ, అతని పేరు రాబర్ట్. తనది ముంబయ్. ఉన్నత విద్యావంతుడు. అమెరికా ఉద్యోగమొచ్చినా మేరా భారత్ మహాన్ అనుకున్నవాడు. పుస్తకాలు విపరీతంగా చదువుతాడు. అన్నీ మెదడును నిప్పుల కొలిమిలా మండించే రచనలే! తన గదుల నిండా అభ్యుదయ, మేధోవికాస పుస్తకాలే ఉండేవి. అనాథ మిషనరీ స్కూళ్ళలో చదివాడు. చర్చిలో కేషియో ప్లేయర్‌గా చేరాడు. అతని సంగీతం, పాటల కోసమే హాజరయ్యే భక్త అభిమానులూ ఉన్నారు.

”మత్తయి సువార్త పన్నెండో వచనమున ఇట్లనెనూ” అని చెపుతుండగా, ”కాదు ఫాదర్! అది లూకా సువార్త పదహైదో వచనం” అంటూ సరిచేసేవాడు రాబర్ట్. ఏదో ఆలోచనల్లో ఫాదర్ పొరబడితే వెంటనే దాన్ని గుర్తిస్తాడు. అతను గొప్ప చిత్రకారుడు కూడా. అతను గీసిన చిత్రాలు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఆ ప్రతిభకు ముగ్ధురాలయ్యింది మహాశ్వేత. “వాహ్! ఎంతద్భుతంగా ఉన్నాయ్ ఈ చిత్రాలు? నిజంగా కళాఖండాలు” కళ్లార్పకుండా ఆ పెయింటింగ్స్‌నే చూస్తూ అంది. ”ఆశ్చర్యం! మాట్లాడే అందం మాట్లాడని అందాన్ని పొగడుతుండటం” అన్నాడు రాబర్ట్ ఆమెనూ అంత ఆరాధనగా చూస్తూ. అలా ఆమెతో పరిచయం ఏర్పడిందతనికి. తను రుద్రాక్ష్ పండిట్ ఒక్కగానొక్క కూతురు. ఆయన నగర కార్పొరేటర్. తన మతబలంతో మరింత రాజకీయ భవిష్యత్తు కలలు కంటున్నాడు.

మైనారిటీ వాడల్లో తెల్లపశువు రంకె వినబడుతోన్న సమయమది. కొన్ని ప్రార్థనల్లో మాకు శాంతిని, స్వేచ్ఛను అనుగ్రహించు అనే పాట కూడా ఉండేది. అన్ని పుస్తకాలు ఇంట్లో ఉన్నా రాబర్ట్ గ్రంథాలయాన్ని సందర్శించేవాడు. అక్కడ చదువరులైన తనలాంటి యువతీయువకులు ఇంకెందరో పరిచయమయ్యారు. తనలాంటి చైతన్యవంతులతో ‘లైక్ మైండెడ్’ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. మహాశ్వేత ఆ దారినే కాలేజీకి వెళ్లేది. ఆమె చూపులు అతన్ని తాకేవి.

వాట్సాప్ గ్రూప్ యాక్టివిటీ రాబర్ట్‌లో విపరీత కదలిక తెచ్చింది. అతను క్రమంగా చర్చికి వెళ్లే సమయం తగ్గించాడు. తోటి యువకులతో కలిసి అన్యాయాల అణిచివేత, మతవిద్వేషాలు, దోపిడీపాలన, పీడనపై చర్చించేవాడు, ఉపన్యసించేవాడు. ఒకరోజు కవిత్వమై, ఇంకోరోజు జ్వలనగీతమయ్యేవాడు. ఆ సమయంలో ఒక చారిత్రక సినిమాపై ఒక మత సంస్థ జారీ చేసిన ఫత్వాను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ చిత్ర కథానాయకురాలిపై జారీచేసిన హుకుంను బాహాటంగా ఖండించటమే కాదు, భావప్రకటన స్వాతంత్రానికి మద్దతుగా ప్రదర్శనలు జరపటంతో అతని వైఖరి ఆ మతసంస్థకు కంటగింపయ్యింది. అతని కదలికలు కనిపెట్టే బాధ్యత తమ పార్టీ నగర నేత, స్థానిక కార్పొరేటరైన రుద్రాక్ష్‌కి అప్పగించబడింది.

ఒకరోజు మహాశ్వేత అడుగులు లైబ్రరీ వైపు నడిచాయి. అలా అతనితో మరోసారి పరిచయం సంపాదించింది. ”మీ అభిరుచి చెప్పండి. మీకిష్టమైన పుస్తకం వెతికి పెడతాను” ఏ పుస్తకం తీసుకోవాలో సందిగ్ధపడుతున్న మహాశ్వేత చెవి దగ్గరకొచ్చి అన్నాడు రాబర్ట్. అది మొదలు, అక్కడే తరచూ కలుస్తూ పుస్తకాలు, భావాలు ఇచ్చిపుచ్చుకునేవారు. రాబర్ట్ కదలికలపై నిఘా‌ పెట్టించిన రుద్రాక్ష్‌కు ఆ సమాచారం చేరింది. కోపంతో రగిలిపోయాడు. తన మత సంస్థ పగ కన్నా తన వ్యక్తిగత కసి అతనిలో బుసలు కొట్టింది.

మహాశ్వేత ఒకరోజు అకస్మాత్తుగా బహుమతితో అతనింటికెళ్లింది. ”ఓహ్! మీకెలా తెలుసు?” ఆమె ఇస్తున్న బహుమతి అందుకుంటూనే అడిగాడతను. ”ఇష్టమైన వాళ్ల ఇష్టాయిష్టాలు, అభిరుచులు అడిగి తెలుసుకోవటం కాదు. అడగకనే తెలుసుకోవాలి” అందామె తను తీసుకొచ్చిన ప్రసాదం కుంకుమ కవర్‌లోనుంచి బయటకుతీస్తూ. ”ఏంటవి?” అతనడుగుతుండగా, ”ఉదయాన్నే రాముడి గుడికెళ్లి మీ పేరున అర్చన చేయించా” అని అందివ్వబోతూనే ముక్కును ఎగరేస్తూ..

”ఏంటది? మీ వంటింట్లో నుంచేదో వాసనొస్తోంది” అంది.

”ఓహ్ అదా? ఇవాళ పుట్తినరోజు కదా! కేజీ బీఫ్ మటన్ తెచ్చాను”

”యు మీన్..?”

”పెద్ద మాంసం” అని అతను నిర్ధారించగానే అక్కడి నుంచి సర్రున కదిలింది. ఆపే యత్నం చేయగానే సీరియస్‌గా అతని వైపు తిరుగుతూ ”పాపం కదా!” అంది. అతను ”మా ఆహారం కదా” అన్నాడు. ”పూజించాల్సిన జంతువును చంపటం ఘోరం” అందామె. ”అలా అనుకుంటే కూరగాయలు కోయటం, ఆకుకూరలు తెంపటం కూడా” అని అతనేదో చెప్పబోతున్నాడు. మహాశ్వేత అప్పటికే ఇంట్లో నుంచి వీధిలోకెళ్లింది.

మరుసటి రోజు ఏదో ఆలోచనలతో నడుస్తున్నాడు రాబర్ట్. వీధిలో గొడవ జరుగుతోంది. పెద్దగా ఏడుస్తూ రెండు చేతులెత్తి దండం పెడుతున్నాడు అజరయ్య. ”మా తాత తండ్రుల తరం కాడ్నుంచి ఇదే వృత్తిలో ఉన్నాం బాబూ! మీరొచ్చి ఇలా నా బతుకుతెరువు నాశనం చేశారు. ఇక నన్నెట్టా బతకమంటారయ్యా?” అంటూ ఏడుస్తుండగా ”ఇప్పుడు నీ దుకాణమే కూల్చేశాం. ఇంకోసారి ఆవుల్ని వధిస్తే మీ కాలనీనే నామరూపాల్లేకుండా చేస్తాం” అని హెచ్చరిక స్వరం వినపడుతుండగా, అక్కడికొచ్చిన రాబర్ట్ అడ్దుకున్నాడు. హెచ్చరిక చేస్తున్నతని చేతుల్లో ఉన్న అజరయ్య దుకాణం కత్తుల్ని, ఇతర సామగ్రిని బలవంతాన లాక్కున్నాడు. ఈ పరిణామానికి షాక్‌కు గురయ్యాడు రుద్రాక్ష్. ”ఎవడ్రా నువ్వు?” అంటూ రాబర్ట్ మీదకు వెళ్లబోతుండగా, అతని అనుచరుడు చెవిలో ఏదో చెప్పగానే ”సరిగ్గా ఇన్నాళ్లకు దొరికావురా” అంటూ తన కండల చేతుల్ని ముందుకు సాచాడు. రాబర్ట్ ఆ దాడి నుంచి తప్పించుకునే యత్నం చేస్తుండగానే రుద్రాక్ష్ అరచేతులతో రాబర్ట్ చెవులపై బలంగా మోదాడు. ఆ దెబ్బకు చెవుల్లో కీచుమనే శబ్దంతోపాటు చుట్టూ చీకటి ఆవరించి కళ్లు తిరిగి కిందపడిపోయాడు. కోపం తగ్గని రుద్రాక్ష్ తనవెంట తెచ్చిన దుంగతో రాబర్ట్ తలపై బలంగా మోదాడు. ఆదే రాత్రే అతనింట్లోకి విప్లవ సాహిత్యమూ, మరికొన్ని మారణాయుధాలు చేర్చారు. ఇదంతా గతం!

అతను యథాప్రకారం కొండ దిగువలోని టౌన్‌కు చేరుకున్నాడు. శివార్లలోని పాడుబడిన బంగళాలోకి ఎప్పటిలాగే ప్రవేశించాడు. లోనికి వెళ్లగానే అతనికి జైలు గుర్తుకు రాసాగింది. ఉన్నట్టుండి బ్యారక్‌ల నుంచి బయటకు పరుగెత్తుకొస్తున్న ఖైదీలు కళ్లముందు కదిలారు. వాళ్ల ఆక్రందనలకు చిత్రరూపమిచ్చేందుకు వెంట తెచ్చుకున్న బొగ్గుముక్కలతో గోడల మీద నిరసన చిత్రాలు గీయటంలో నిమగ్నమయ్యాడు. ఆ గోడలు రోజూ అతను గీస్తున్న చిత్రాలతో నిండిపోయాయి. ఆ చిత్రాల్లో ప్రశ్నించే వేళ్లను తెగ్గోయబడుతున్న వాళ్లు, నిలదీత గొంతుల్ని నులిమేయబడుతున్నవాళ్లు, తినే తిండికి దూరం చేయబడుతున్నవాళ్లు, నిఘాచూపులకు గురవుతున్నవాళ్లు, నిందలకు బలవుతున్నవాళ్లు, తెగ్గోయబడుతున్న పాటలు, ముక్కలవుతున్న కవిత్వాలు, కోల్పోతున్న పౌరహక్కులు, మానవహక్కుల ఉల్లంఘనలకు గురవుతున్న బాధితుల చిత్రాలతో ఆ గదుల గోడలు నిండిపోయాయి.

తనూ వాళ్లలా దేశద్రోహి నిందకు గురై శిక్ష బిగుసుకున్నవాడు. జైలు జీవితంలో అతనికి మతిభ్రమణం అధికం కావటంతోపాటు అతనిపై మోపిన కేసులు నిరూపణ కాకపోవటంతో ఇటీవలే విడుదలయ్యాడు. ఆరోజే మళ్లీ అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈసారి అతను తనకెదురుగా ఎవరున్నారో కూడా గుర్తించలేకపోయాడు. స్పృహ తప్పేదాకా కొట్టి నదిలో విసిరేశారు. అలా అతను ఆ రాష్ట్రం దాటి ఈ ఒడ్డుకు కొట్టుకొచ్చాడు.

రాత్రయ్యింది. గుడిసెలో మరింత చీకటి అలుముకుంది. అతని ఉలికిపాటు, నిద్ర, గురక సాగుతోంది. యథాప్రకారం పిల్లి, ఎలుక, కుక్క, దోమ, బల్లి, నల్లి, బొద్దింక పాము, తేళ్ల థిల్లానా సాగుతోంది.

ఆదివారం షర్ట్ టక్ చేసుకొని, జర్కిన్ తొడుక్కొని ఆఖరు చుక్కలు నోట్లో ఒంపుకొని బయల్దేరాడు.

”వీడికి అన్నలతో సంబంధాలున్నాయట కదరా”

”కాదెహే! వీడే నచ్చలైటంట”

”మరే! జైలుక్కూడా పోయొచ్చాడంట”

”కానీ ఇప్పుడు మతి తప్పిందంటరా”

”అందుకే ఇడిచిపెట్టారంట కదా?”

”ఎవుళ్లు పోలీసోళ్లా, నచ్చలైట్లా? హాహా”

దారిపొడవునా అక్కడక్కడా అతన్ని చూసి ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు. అతనికి అవేవీ వినిపించనంత చెవుడు.

ఆ రోజు చర్చిలో ప్రార్థన గీతాలకు కేషియో సంగీతం సమకూర్చాడు. డబ్బు పొందాడు. సంపాదనలో పదోవంతు గుడ్డి బిచ్చగాళ్లకు పంచాడు. సోమవారం తార్రోడ్లపై వర్ణ చిత్రాలు గీశాడు. నజరానా పోగేశాడు. ఆదాయాన్ని కొంత అభాగ్యులకిచ్చాడు.

ఎగువ కొండపైకి భుజాన మూట, చేతిసంచితో ఆయాసంగా ఎక్కుతున్నాడు. పలుచని గోనె బస్తాల్లోనుంచి అన్నీ ఓల్డ్ మంక్ ముఖాలు, సంచిలో పెద్ద తునకలు. దూరంగా పొదల వెనుక నుంచి ఎవరెవరో నవ్వుతున్నారు. అతనికి అవన్నీ వినపడని చెవుడు.

రాత్రయ్యిందీ, తెల్లారింది. నల్లుల మంచం బయటేసుక్కూచ్చున్నాడు. మిట్ట పైనుంచి లోతట్టున టౌన్ కనపడుతోంది. తను రోజూ చిత్రాలు నింపే ఆ పాడుబడ్డ బంగళా కనపడుతోంది. గోడలపై తన చిత్రాలు, కొత్తగా జైళ్లు నిండుతున్న వాటి తాలూకు మనుషులు గుర్తొస్తున్నారు.

బాటిల్ పైకెత్తి గుడగుడ నోట్లో పోసుకున్నాడు. పుక్కిలిస్తుండగా దూరంగా ఏదో దృశ్యం కనపడింది. అరచేతిని కళ్లపై పెట్టుకొని చూపుల్ని ప్రసరించాడు. ప్రభుత్వ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుక జరుగుతోంది. దేశ స్వాతంత్ర విశిష్టత, సమగ్రత, సౌభ్రాతృత్వం గురించి నాయకుడు ప్రసంగిస్తున్నాడు. ఏంటో విందామని అరచేయి చెవికి ఆనించి వినే యత్నం చేస్తున్నాడు. అయినా అతనికి అవేవీ వినపడని చెవుడు. నోట్లో పుక్కిలిస్తున్న నీళ్లను ఆ రోజెందుకో తుపుక్కున ఊసాడు.

హడావిడిగా కొండదిగుతున్నాడు. వరిగడ్డి మోపు నెత్తిన పెట్టుకొని ఎదురొస్తున్న డేవిడ్‌ను గమనించకుండా ముందుకెళ్తుండటంతో ”ఓయ్ ముసలాయనా! పాపం పోనీలే అని గడ్డి కప్పుదామని నేనొస్తంటే నువ్వెటో పోతున్నావే? నువ్వు లేకుండా ఎలాగ? ఏ పురుగులు ఏ పుట్రలున్నాయో నీ ఇంట్లో” అని ఏదో అంటున్నాడు. కానీ అతనికవేవీ వినిపించనంత చెవుడు.

పాడుబడ్డ బంగళా చేరుకొని తన ఒంటిపై జర్కిన్ విడిచాడు. లోపల చిరుగులు పడ్డ నల్లచొక్కా విప్పి గాల్లోకి గిరగిరా తిప్పి పైకి ఎగరేయగానే అది పోయి బంగళా మీద ఉన్న జెండా కర్రకు చిక్కుకుంది. అతని కళ్లల్లో, కళ్లముందు దృశ్యాలన్నీ నల్లగా, నల్లనల్లగా. ఆత్రంగా ఏదో చిత్రం గీస్తున్నాడు. తను విసిరేసిన‌ నల్లచొక్కా గాలి వీచినప్పుడల్లా నిరసన జెండాలా రెపరెపలాడుతోంది. గోడల మీద బొగ్గు చిత్రాల్లోని నల్లని‌ మనుషులు చప్పట్లతో హర్షం‌ వ్యక్తం చేస్తున్నారు. కానీ అతనికవేవీ వినిపించనంత చెవుడు.

*

నిలిచిపోయే పాత్రల్ని సృష్టించాలని నా ఆశ

* ఇటీవల కాలంలో విరివిగా కథలు రాస్తున్నారు. మీ రచనా వ్యాసంగం ఎలా మొదలైంది?

మాది ఖమ్మం పక్కన చిన్న పల్లెటూరు. మూడేళ్ల వయసులో నాన్న చనిపోవడంతో అమ్మతోపాటు జిల్లా కేంద్రంలో ఉన్న అమ్మమ్మ వాళ్లింటికి వచ్చేశాను. అక్కడే పెరిగాను. మా మావయ్య పాల్వంచలో సారా దుకాణం నడిపేవారు. అక్కడ పని చేస్తూ చదువుకునేవాణ్ని. దానికి ఎదురుగా నవలలు, వార, మాసపత్రికలు అద్దెకిచ్చే దుకాణం ఉండేది. వాళ్లతో పరిచయం వల్ల అక్కడున్న పుస్తకాలన్నీ ఉచితంగా చదివేవాణ్ని. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మధుబాబు గారి షాడో నవలలు పరిచయమయ్యాయి. వాటిని విపరీతంగా చదువుతున్నానని మావయ్య చేతిలో దెబ్బలు కూడా తిన్నాను.

* ఆ సమయంలో ఏం రాశారు?

నేను చాలా కాలం పాటు పాఠకుడిగానే ఉండిపోయాను. రాయాలన్న ఆసక్తి, రాయగలనన్న నమ్మకం ఉండేవి కావు. నేను ఇంటర్ చదువుతున్న టైంలో ఆంధ్రజ్యోతి పత్రికలో ‘కొత్త కలాలు’ అనే శీర్షిక వచ్చేది. చిన్న చిన్న కవితలు రాసి దానికి పంపితే వేసేవారు. అప్పుడే ‘ప్రేమించు.. కానీ ప్రే’మించకు’ అని ఒక వ్యాసం రాసి పంపితే ప్రచురించారు. దాంతో నేను రాయగలనన్న నమ్మకం కుదిరింది.

* కథలు రాయాలన్న ఆలోచన ఎప్పుడు కలిగింది?

కథ రాయడం పెద్ద ప్రహసనం అనే భావన ఉండటం వల్ల, ముందుగా నా దృష్టి కవిత్వం మీద పడింది. ఖమ్మంలో ‘సాహితీ స్రవంతి’ అనే సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతూ ఉండేవాణ్ని. దాని ద్వారా కవులు, వారు రాసిన కవిత్వం పరిచయమైంది. ఫేస్‌బుక్‌లో ‘కవిసంగమం’ గ్రూప్‌లో చేరి కవితలు రాయడం మొదలుపెట్టాను. కథలు రాసింది మాత్రం 2020 లాక్‌డౌన్ కాలంలోనే!

* తొలి కథ రాసినప్పటి అనుభవాలు..?

లాక్‌డౌన్‌లో నవతెలంగాణ బుక్‌హౌస్‌కు వెళ్లినప్పుడు చెహోవ్, గోర్కీ, షాలహోవ్ వంటి రచయితల అనువాదాలు తీసుకున్నాను. అవి చదివాక కథల గురించి కొంత అవగాహన వచ్చింది. ఆ తర్వాత స్థానికంగా నాకు పరిచయమున్న రచయితలు సమ్మెట ఉమాదేవి, రాచమల్లు ఉపేందర్, దేవయ్య, సునంద లాంటివారు రాసిన కథలు చదివాను. ఆ సమయంలోనే లాక్‌డౌన్ వల్ల వినాయక విగ్రహాల తయారీదారులు పడుతున్న ఇబ్బందులపై ఒక వ్యాసం రాసేందుకు వారి జీవితాలను గమనించాను. ఆ స్ఫూర్తితో ‘ఎప్పటికి వెలుస్తుందో ఈ వాన’ అనే కథ రాశాను. 2020 ఆగస్టులో నవతెలంగాణ పత్రిక ఆదివారం అనుబంధం ‘సోపతి’లో అచ్చయ్యింది. ఇప్పటికి పది కథలు ప్రచురితమయ్యాయి.

* జర్నలిజంలో ఉన్నారు కదా! కథలు రాసేందుకు అది ఎంత మేరకు తోడ్పడింది?

జర్నలిజంలో ఉండటం వల్ల సామాజిక అంశాలను, వివిధ సమస్యలను గుర్తించే వీలు కలిగింది. ప్రస్తుతం కథలతో పాటు కొన్ని పత్రికల్లో సంపాదకీయ వ్యాసాలు రాస్తున్నాను. ‘నవతెలంగాణ’ పత్రికలో వారం వారం ‘బాత్ కహానీ’ పేరిట వ్యంగ్య వ్యాసాలు రాస్తున్నాను.

* ఎలాంటి కథలు రాయాలని ఉంది?

రాసే కొన్ని కథలైనా అందరూ గుర్తుంచుకోదగ్గవి రాయాలని ఉంది. పాఠకుల్ని నిరంతరం వెంటాడి, వారి మనసుల్లో నిలిచిపోయే పాత్రల్ని సృష్టించాలని నా ఆశ.

*

శ్రీనివాస్ సూఫీ

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది. వర్తమాన భీభత్సాన్ని కళ్ళకు చూపింది. థాంక్యూ శ్రీనివాస్ గారూ

  • ఈమధ్య కాలంలో చదివిన మంచి కథల్లో ఇదొకటి . కథా వస్తువు ,శిల్పం రెండూ బాగుండే కథలు అరుదు .దీనిలో రెండూ చక్కగా అమిరాయి .చెముడుని ప్రతీకగా వాడుకోవడం కథావస్తువు గాఢతని పెంచింది . ‘తను ‘ప్రయోగం ఒక్కమారు సరిచూసుకోండి అంటే అపార్థం చేసుకోరు కదా?థ్యాంక్యూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు