‘నేను మీ బ్రహ్మానందం’ అని అంటున్నారు ఆ ఆనంద హాస్య బ్రహ్మ. ఇదొక హాస్య గ్రంధం కాదు. అందులో ఏ ఘట్టమో లేక సినిమా రీల్ ఏదో కూడా కాదు. ఆయన జీవితంలో ఒక్కొక్కటి ఒక స్కంధం. ఈ మహాభారత బ్రతుకు సమరంలో ఒక్కో పర్వం. ‘బ్రహ్మ కడిగిన పాదములకు భక్తితో’ అని అంకితం చేసిన పుస్తకంలో ఎంతో అందమైన అర్థవంతమైన చిత్రాలు ఉన్నాయి. తాను స్వయంగా కళాచిత్రాలను బొమ్మలు గీయగలిగిన ఈ రచయిత, తన జీవన యానంలో ఘట్టాలను ప్రస్తావించే చిత్రాలను ప్రముఖ చిత్రకారుడు కీర్తిశేషులు బి కె ఎస్ వర్మగారు ప్రత్యేకంగా గీసారు. ఈ కళాకారుడి చిత్రాలతో సహా అనేక సంఘటనల ఫోటోలు ముద్రించారు.
తెలుసుకోవలసిన అంశం ఏమిటో ఈ ‘నేను’లో అందులో తెలియని ఒకరెవరో పాఠకులకు ‘నేను’ కనపడుతూ ఉంటాడు. పదండి ముందు పదండి ముందుకు అనే ఆరాటం, పోరాటాలు ఇందులో కావ్యం రూపం పూర్తైనట్టు కనిపిస్తాయి.
ఇందులో కొన్ని ఘట్టాలు దృశ్యకావ్యాలై సినిమాస్కోప్ తెరపై, కొన్ని పాటలై, నృత్యాలై సాక్షాత్కరిస్తాయి. ఒక అనిర్వచనీయ నిర్వచనీయాల అనుభూతిని పంచుతాయి, వారి మాటల్లో ‘నవ్వు… ఒకశబ్దం కాదు.. అదొక అనుభూతి’.
వందలాది సినిమాల్లో నవ్వి, నటించి కోట్లమందిని నవ్వించిన బ్రహ్మానందం, ఒక ప్రముఖ రచయిత. అమెజాన్ నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్ అయిన చరిత్ర సాధించారు. ఆయన నటించినవి వందలాది సినిమాలు ఉంటాయి, చూడొచ్చు కూడా. కాని ఒక చోట ఆ సినిమాలన్నిటికన్న విశిష్టమైన బ్రహ్మానందం ‘జీవిత చిత్రం’ అందులో కనబడుతుంది. దానివల్ల ఆ పుస్తకం శాశ్వతత్వాన్ని తెచ్చుకున్నది.
కల్లాకపటం లేని నవ్వు వెలిగించే ఇద్దరు చిన్నారి పాపల బొమ్మతో తన పుస్తకాన్నిఆరంభిస్తున్నారు. అదే ఒక సందేశం. మామూలుగా తెలుగుపదాల ద్వారా అంశాలు వివరిస్తూ, పద గాంభీర్యాల వెంట పడకుండా, అనవసరమైన సందర్భాలు ఇవ్వకుండా, సున్నితంగా విషయాలను ఉంటంకిస్తూ ఉన్నాయి. అదిగాక కథనం మరోచోట కఠినంగా కుండబద్దలు కొడుతూ ఉంటారు. ఆత్మకథే అయినా ‘నేను’ అది వచన కవిత్వమా అనుకుంటారు. చదువుతూ ఉంటే గొప్ప కావ్యమో అని కూడా చదివించగలదు. ప్రతీకాత్మక ప్రక్రియ ‘నేను’ ప్రతిదీ దృశ్యమై చూస్తున్నట్టు ఉంటాయి.
మొత్తం కథ బ్రహ్మానందానికి నాణేనికి ఒకవైపు మాత్రమే సుమా అని ‘నేను’ హెచ్చరిస్తూ ఉంటాయి. ‘అందులో మీరూ కావచ్చు… మీలో ఒకడినా కావొచ్చు’ అంటూ ఈ గ్రంధం ఒక కొత్త మలుపు ఈ ‘నేను’ గారు.
నవ్వు పుట్టడానికి ముందు పుట్టింది పేదరికం
నేను నవ్వు పుట్టడానికి ముందు నా ఇంట్లో ‘పేదరికం’ పుట్టిందంటూ, అప్పుడే తనకు ఆనాటి వయసుకే ‘పెద్దరికం’ అబ్బిందని చెప్పకుండా తన ఆత్మకథ వినిపిస్తున్నారు. ‘నా చిటికెన వేలు పట్టుకున్నదెవరు…’ ఆ బ్రహ్మానందం ఎవరు? కష్టపడు.. ఫలితాన్ని ఆశించకు అనే భగవద్గీతం చెప్పిందెవరు? (పాఠం 1)
ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెబుతున్నాడే కాని బోలెడు కష్టాలు ఏకరువు చేయడం లేదు. ఆ పనే చేస్తే రచయిత పుస్తకాలు మూడో నాలుగో సంపుటాల ఆత్మకథ సీరియల్ ప్రచురిస్తూ ఉండవలసి వచ్చేది. ‘నేను గడ్డిపరకను’ అని ‘నేను’ తన అహంకారాన్ని దగ్గరికి రానీయకుని జాగ్రత్త పడ్డారు. ‘ ఆ కన్యకను…’ ఈ కృతిని రచయిత ఇస్తున్నాను అని, పోతన్న పైకి అనకుండా ఒక్కో అధ్యాయంలో ధ్వనించారు, ప్రతిధ్వనించారు. మొదట తల్లి జ్యేష్టాదేవి తనను దీవించేవరం బదులు దారిద్ర్యం వచ్చిందనడం పెద్ద ధైర్యం తోబాటు, ఆత్మధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని రంగరించి సాహసిస్తున్నారు. అందులో తన పరబ్రహ్మను దర్శించిన విషయం సగర్వంగా సవినయంగా తన కావ్యాన్ని, ప్రతీకాత్మిక కవితాల కావ్యాన్ని చదివిస్తున్నారు.
నవ్వుపుట్టిన నక్షత్రం
మరో అధ్యాయంలో ‘నన్ను నవ్వించినట్టే అందరినీ నవ్యించు’ అని ప్రార్థిస్తున్నారు, నొసటి గీత రాస్తున్నారు. ఆ క్షణం నవ్వుపుట్టిన నక్షత్రం అది. (ఇది ఈ సమీక్షకుని ప్రతీక). మరో అధ్యాయంలో తన కన్నతల్లికి, పాలిచ్చిన తల్లినీ, తల్లిలందరికీ తల్లినికీ, జగన్మాతకు అర్థమేమిటో రచయిత వివరిస్తున్నారు. అందుకే ఇది వరసగా ప్రతీక ప్రతివాక్యంలో కనిపిస్తూ వస్తున్నందుల్ల అది దీర్ఘ భావకవితయై ఆవిష్కరిస్తున్నది.
ఒక జ్యోతిష్యఘనాపాటి మేనమామ చూసి భవిష్యత్తు ఊహిస్తూ ‘‘మన బ్రహ్మానందం పరమనికృష్టుడైనా అవుతాడు లేదా జాతి గర్వించే స్థాయికన్నా ఎదుగుతాడు’’ అన్నారట. భవిష్యత్తు సరే, ప్రస్తుతం రెండో భాగం అన్న వాస్తవం కనిపిస్తున్నది కదా.
‘‘చిరిగిన నిక్కరు కుట్టుకున్న నా పసితనం’’ శీర్షికలో ఓ నాలుగు పదాల మీద ఆధారపడి పూర్తికథ చెప్పినట్టుంది. పసితనం లోనే సర్దుకు పోవడం గురించి ప్రబోధించింది (పాఠం 2). ఆ పసితనమే మించిన పవిత్రమైన కాలం ఇంకొకటి ఉండదు’’, అన్న మాట వాస్తవమే. మొత్తం మీద పేదరికం, బీదరికం, పసితనం, గాంభీర్యం లక్షణాలు ఉంటాయి.
అటొక దీపం.. ఇటొక దీపం..
జీవిత కథలో ఇద్దరు అమ్మల గురించి చెప్పవలసిన అవసరం వచ్చినపుడు ‘‘అటొక దీపం.. ఇటొక దీపం.. అంతే అటు అమ్మ ఇటు నాన్నలాగ’’ అని, ముక్తసరిగా ‘ఇది దీపావళి పేదల పండుగ కాదు. అది దండగ ఖర్చు, దండిగా ఖర్చు’ అంటూ ఆ ‘పరిస్థితి’ మరో పాఠం అని ఆ అధ్యాయం తెలుపుతున్నది (పాఠం 3). భూస్వామి దీపావళి మతాబులు కొనిపెట్టిన నాన్నగారికి దయచూపడం ద్వారా కూడా మరొక పాఠం కనిపిస్తూనే ఉంది (పాఠం 4). డబ్బుంటే విలువ, డబ్బుంటే గౌరవం కూడా మరొకొన్ని పాఠాలు(పాఠం 5). తరువాత మరో ఖరీదైన పాఠం కూడా నేర్పారు. అయినా ‘బ్రహ్మానందం పాపం ఎన్ని పడ్డాడూ…అని జాలి తలపాలని కాదు పరీక్షలు ఎదుర్కొవడం నేర్పడానికే, మనకు పాఠకులకే కదా. చూసి నవ్వుకునేందుకు అది సినిమాకాదు. నిరాశకు లోనయిన వారిపై భవిషత్తుమీద ఆశలు కల్పించడమే ‘నా జీవిత చరిత్ర జీవితాశయం’ అని, తన జీవిత రథాయాత్ర భవితను నిర్దేశిస్తూ స్ఫూర్తినిస్తుందని బ్రహ్మానందం అని రాసారు. (పాఠం 6).
ఆకలి
ఆహారం లేకపోయినా 18రోజుల దాకా బతికే వీలుంది. ఆకలికోసం బాదపడడం ఎందుకు? 17 రోజులు ఓపిక పట్టుకోవాలి కదా అనే ఆత్మగౌరవాన్ని ఆకలిని జయించే పాఠం చెప్పాలిన వారు బ్రహ్మానందం పిన్ని గారు. అసలీ లోకమే ఆకలి మీద ఆధారపడి ఉంది. అందుకోసమే పోరాటాలు, మరో రోజు తినడానికి ప్రయత్నాలు, యుద్ధాలు, కొట్లాటలు, హత్యలు, ఆత్మహత్యలు, అందుకే ఆకలి లోకాన్ని నడిపిస్తున్నది. ఆకలే లేకపోతే పనిచేసే పనే లేదు. రాజకీయం అవసరం లేదు. కుట్రలు లేవు. జీవనమే లేదు, ఈ ప్రపంచమే, విశ్వమే అసలు ఏ ఉనికీ లేదు.
మరో అధ్యాయంలో ఓ కొంటె సంఘటన కాస్త కఠినమైన పాఠం చెప్పింది ఇది (పాఠం 7). తన లెక్కల మాష్టారు అల్లరిచేయడానికి ప్రయత్నించి బ్రహ్మానందం దెబ్బతిన్నారు. మాష్టారుగారు లెక్క అడగకముందే బ్రహ్మానందం ‘అది రాదండీ’ అన్నడం ఆయన వళ్లుమండింది. ‘శుంఠా, లెక్కచెప్పముందే లేదంటారేమి అంటాడమిరా అప్రాచ్యుడా’ అంటూనే పంచెఊడిపోయే కొంటె పని తెలిసి నాలుగు గట్టి తగిలించారు. తర్వాత ఇంటికివెళ్తే కొంచెం సానుభూతి ఇస్తారేమో అని ఆశించిన దశలో మరో నాలుగు గట్టి దెబ్బలు పట్టాయి. అప్పటి రోజుల్లో సాధారణమైతే ప్రతి బడిలో ఇంట్లో అదే కథ. విశేషమేమంటే ఆ జాతక పండితుడు చెప్పిన భవిష్యత్ నేపథ్యం సరిపోతుందని తెలుస్తుంది. ఈ బుడతడు అందరికీ ఏడిపించగలడూ నవ్వించబలడూ అని ఆ జీవిత ఘటనతో తేలిపోయింది.
ఎక్కడ ఆ పాదముద్రలు?
అనేకానేక కష్టాలు పడుతూ పైపడుతూ కిందపడుతూ ఉంటే తమ ఇసుకలో రెండుజతల పాదముద్రలు కొంత సేపు కనబడి, ఆ తరువాత నడుస్తున్నపుడు ఒక్క జత పాద ముద్రలు మాత్రమే ఉండడం అంటే శ్రీ వేంకటేశ్వరుడు నిన్నువదలిపెట్టడం కాదురా… ఆ కటిహస్తాన్ని .. వరదహస్తాన్ని..ఆ రెండు చేతులుజాపి ..సాచి నన్ను మోస్తూ నడిపించిన వాడు అని తెలిసి పరమాత్ముడైనాడని బ్రహ్మానందం కథ ఇది. దానికి ఆ బాలుడిని అక్కునకు హత్తుకుని రచయిత రాసిన ఆ వెంకన్న కథ ఆలోచనకు చాలా గొప్పది. ఈ కథ చాలామంది చదివి ఉండవచ్చు. ఇంత స్పష్టంగా మరింత సంక్షిప్తంగా చెప్పడం సాధ్యం కాదు. దానికి కారణం వారి అంకితభావన, భక్తిభావన, కట్టుబాటు, క్రమశిక్షణ, తల్లి తండ్రుల చెప్పినా కొట్టినా, అడుక్కు తెచ్చిన మతాబులు ఇచ్చినా, 17 రోజులు తిండిలేకపోయినా ఫరవాలేదు అని చెప్పే ఆత్మధైర్యం (పాఠం 8). అదీ పుస్తకంలో కీలకం. కథ కథనాలు దాని చుట్టూ అల్లుకున్నాయి.
ధనవంతులకు అర్థం కాదు
నేను మామూలు వీధి బడిలో చదువుకున్నాను (క్షమించండి..ఇది మధ్యలో నా చిన్న కథ). మొదటి మాకు ఎల్ కె జి అని తెలియదు. పలక బలపాలు కూడా లేవు. చెట్టుకింద పాఠం విని జ్ఞాపకం చేసుకుంటూ మరో తరగతికి ఎదిగాం. బి ఎస్సీ ఇందాకా వచ్చావు చాలు. మళ్లీ మూడేళ్ల లా ఎందుకు అని నాన్నఅంటే, నా గతి ఏమిటి? నేను లా ప్రొఫెసర్ కానేవాడు, తరువాత సెంట్రల్ ఇనఫర్మేషన్ కమిషన్ కావడం సాధ్యమా? ఎందుకు మాట ఎందుకంటే ప్రయివేట్ లక్షల రూపాయల పెట్టి ‘‘చదువు కొన లేను’’ అన్న కథ, బ్రహ్మానందం గారికి, నాకు, మరో కోట్లమందికీ అనుభవంతో తెలుసు. ధనవంతులకు అర్థం కాదు. హైస్కూల్ లో చేరడానికి ఆ తరువాత అర్థం కాదు. ఫీజు ఎవడిస్తాడు? టెన్నెట్ పిక్కర్స్ ద్వారా నెలకు అయిదురూపాయల జీతం దొరికితే మరో అవకాశం వచ్చేది, అన్నట్టు ఒక అద్భుతమైన జాతి గర్వించే నటుడు బ్రహ్మానందైనాడు, మరెందరో బ్రహ్మానందాలు కూడా అయ్యేవారు. ఆ అవకాశం దొరికినందుకు టెన్నెట్ పిక్కర్స్ సాధించి, తరువాత డిగ్రీ చదువు ‘కొనేవాడా’. అందరికీ సాధ్యమా? రాబోయే ఈ ప్రయివేట్ కాలేజీలు యూనివర్సిటీలలో చేరగలిగేవారెవరు? ఈ రోజుల్లో విద్య, వైద్యం కావాలంటే నావంటి వారికి ప్రయివేట్ ప్రపంచంలో జీతం, జీవితం ఇస్తారా?
బ్రహ్మానందం ప్రతి పుటలో ఈ పుటుక, పోరాటం ఉంది. ప్రతియువకుడు బ్రహ్మానందం ఎప్పుడవుతాడు, ఏమవుతాడు? రాబోయే రోజుల్లో ఎవరు చదువుకొంటారు? డిగ్రీలు ఊరికే దొరకుతాయా? మోసం చేసి డిగ్రీలున్నట్టు సృష్టించడం తప్ప ఏం చేస్తారు?
పై చదువుకు చదవాలంటే కాలేజీ సీట్ రావాలి. బ్రహ్మానందంకు అప్పుడు ‘చరిత్ర, రాజకీయశాస్త్రం, ఆర్థిక’ చదువుకోవడానికి డిగ్రీ సీట్ ఒకటే ఉందట. (ఒక మహానుభావుడు చరిత్ర ఎకనమిక్స్ వంటివన్నీ పనికిరావట, కేవలం కంప్యూటర్ చదువు చాలన్నాడట మరో నాయకుడు). కావలసిన సీటు రాక, బ్రహ్మానందం గారు దొరికిన సీటు సరేలే అనుకొని, ‘చరిత్ర, రాజకీయం, స్పెషల్ తెలుగు సీట్’ కు సంతోషించాడు. ఆవిధంగా దొరికినంతవరకు చాలని సర్దుకున్నారట. ‘దేవుడు చాన్స్ మాత్రం ఇస్తాడు. కాని ఛాయిస్ దొరకదు’ అని బ్రహ్మానందం జీవన పాఠం (పాఠం 9). అదృష్టం ఏమంటే తెలుగు అధ్యయనం చేసే ఈ తెలుగు సీమ పూర్వజన్మసుకృతం అని మనం సర్దుకోవాలి. (నామిత్రులు 73 రూపాయలు ఇవ్వడానికి సర్దుక పోతే లా చదివేవాడినే కాదు) ఆ సీట్ తో తోడుగా మిమిక్రీ జోడుగా నడిపి జోరుగా బ్రహ్మానందం గారిని తారాపథానికి నడిపారు. నవ్విస్తే ఎం ఏ సీటు ఎవరైనా చదువుకునే సీట్ ఇస్తారా? కాని బ్రహ్మానందంకే దొరికింది. మిమిక్రీ ద్వారా నవ్వించి అడ్మిషన్ పెద్దలను మెప్పించి ఉన్నత చదువులను సాధించడం గొప్పవిషయం కదా.
ఉదరం భగవద్గీత ఉపదేశం
అంతకుముందు, ఉద్యోగ వేటలో అప్లికేషన్ బాణాలు విసరడం, తగిలితే బతకడం. కనుక చివరకు మనందరికీ బ్రహ్మానందంగారికైనా ఉదరం భగవద్గీత ఉపదేశం చెబుతుంది. సీటే కాదు తరువాత తన కళ అనే మిమిక్రీం కూడా ‘ఎం ఏ’ చేయించింది. ‘అన్నం, అక్షరం రెండు పరబ్రహ్మస్వరూపాలే’ అని మనం నేర్చుకోవలసిన పాఠాలు. చివరకు లారీల్లో పెయింటెంగ్ డబ్బు సంపాదించేందుకు ఆనందంగా కష్టపడ్డారు బ్రహ్మానందం. ‘రంగస్థలం నటనా కుసుమం వికసించే పుణ్యస్థలం’ అది ఆయనకు. ఓ సారి గోదావరి బోటు ఆగితే, తనకు ఈతరాక, నారాయణుడే భవసాగరం దాటించింది ఆ సర్వాంతర్యామి. తరువాత తెలుగు పాఠం చెప్పే ఉద్యోగం. బ్రహ్మ నడిపిన పాదాలకు నమస్కరించాడు.
ఆవిష్కరించిన చరిత్ర
అప్పుడే హాస్యోదయానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీతాతావతారంతో సినీనటన చరిత్ర ఆవిష్కరించారు. చిరంజీవి షేక్ హ్యాండ్ తనను చిత్రయాత్రను నడిపింది. అత్తిలి కాలేజినుంచి హైదరాబాద్ కు కదిలారు. కాశీ విశ్వనాథుడిని గంగానదీ తీరంలో నైపథ్యంలో చిరంజీవి చిత్రంలో బ్రహ్మానందం అచ్చు వేద పండితుడి వేషంలో నటన అద్భుతం. ఆయన ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ సకుటుంబంగా, బ్రహ్మానందం ఇంటికి వచ్చి ఆశీస్సులు ఇవ్వడం గొప్ప విషయం. మరో మరిచిపోలేని జ్ఞాపకాలు జంధ్యాల సంస్కారం, వ్యక్తిత్వం, విద్వత్తు, (విద్వుత్తుకూడా), హాస్యరసోపనిషత్తు, హాస్య బ్రహ్మ అయిన వారికి సంస్మరించవలసిన మహానుభావుడని రెండోమూడొ పేజీలంత నివాళులు ఇచ్చారు బ్రహ్మానందంగారు. గొప్పనటుడు కోటా గారిని ఠపీన కొట్టే దృశ్యం చేయడానికి బ్రహ్మానందం గారు చాలా బాధపడ్డారు. అనేక సినీ చిత్రసందర్భాలలో దెబ్బలు తగిలే సీన్ లు చూడడం నాతో సహా, ప్రతి ప్రేక్షకులకు బాధగానే ఉంటుంది. (మంచివాడైన బ్రహ్మానందం గారిని గట్టిగా చెంపలపై కొట్టడమా అని కోపం కలిగేది.) ఈ ఇటువంటి సందర్భాలలో వారి అమ్మానాన్నా తదితరులు కొట్టడం గుర్తు రావడం సమంజసమే అనొచ్చు.
వైవిధ్యం
‘ఖాన్ తో గేమ్స్ ఆడుతున్నావా’ అంటూ బ్రహ్మానందం నటించిన (కాదు జీవించిన) అద్భుతమైన మలుపు. ఎవరూ ఊహించలేని ఘన విజయం అది. జన ప్రభంజనం. ఆంధ్రా చార్లీ చాప్లిన్ బిరుదు తెచ్చింది. వెంటనే వైవిధ్యం కూడా ఇచ్చింది. ఊహించని వైవిధ్యాలు, విచిత్ర చిత్రాలను తెచ్చింది. ప్రతి కొత్త సినిమాకీ ఒక కొత్త ఆలోచన, నటన, పాత్రలు వస్తూ రావడం, ఆయన అపూర్వమైన నటించిన వ్యక్తిగా ఎదిగివస్తూనే ఉన్నారు. చివరకు శవంగా నటించే పాత్రలో జీవించానట అని రాసిన బ్రహ్మానందం ఆ ప్రతిభ వందేళ్ల తరువాత కూడా మరిచిపోలేరు.
వారి జీవనాన్ని పంచుకున్న జ్ఞాపకాలలో బ్రహ్మానందం గారి శ్రీమతి గురించి రాసుకున్న మాటలు మంచి ప్రేమకు నిదర్శనం. వారి సంసారం, సంస్కారం ఎంత మంచిదో గొప్పదో ఏమిటో ఈ పుస్తకం వివరిస్తుంది. కనుక మస్తకాన్ని దులిపి ఆలోచింపజేసి పలకరించే సమగ్రమైన జీవన గ్రంధం ‘నేను’..మీ బ్రహ్మానందం.
ప్రతివ్యక్తి ‘నేను’లో ఒక వ్యక్తిత్వం, వారిలో ఒక్కో బ్రహ్మానందం
కావలసింది జ్ఞానదీపం. ముందడుగులే కాని తప్పటడుగులు లేవు వెనకడుగలు లేవని పూర్తి ఆత్మధైర్యంతో చెప్పారు బ్రహ్మానందం. ఎన్ని ఉన్నా ఒక్కటే వారికి అది ‘కాలికి గండ పెండేరం’. ఆయన పుస్తకంలో అద్భుతమైన అనేక ఘట్టాలు ఉండవచ్చు. సన్మానాలు ఎన్నెన్నో. వారి శ్రీమతిని, కుటుంబ సభ్యులను, అక్కగారిని చాలా ఆప్యాయంతో సంబోధించిన వారు. తన మేనేజర్ నాగశేషు పోలిశెట్టిగారిని ఎంతో ప్రేమగా ప్రశంసించారు. ఇటువంటి సంస్కారమే కనబడని బంగారం, ఎవరూ అలంకరించని, బంగారపు గండపెండేరం.
ఆయన సాహిత్య సుమాలను జ్ఞాన సరస్వతీదేవిని నమస్కరించుకున్నారు. శ్రీశ్రీ, కాళోజీ, గోరటి వెంకన్న, బమ్మెరపోతన్నగురించి చెప్పుకున్న మాటలు చెప్పుకోవలసినవే. రంగమార్తండ సినిమాను ప్రత్యేకంగా మరో గొప్ప భాగంఅని ప్రశంసించారు.
‘నా వృత్తియే నాకు అన్నం పెట్టేది దేవుడు, అది కోవెల, ఏది నీకు నీడనిస్తుందో నిత్యం సత్యం నేర్పుతుందో దాన్ని అనుసరించు, ధ్యానించు’ అని చెప్పారు బ్రహ్మానందం అది నిజమైన పాఠం (11). బ్రహ్మానందం ఒక జీవన సౌధం. అనేకానేక వ్యక్తిత్వాలకు వందలాది పాఠాలు (12) చెప్పే అధ్యాపకుడు. కావలసింది జ్ఞానదీపం వెలిగించే ఉపాధ్యాయుడు.
బ్రహ్మానందం కేవలం అదృష్టవంతుడు కాదు. అనుక్షణం ఆకలితో, అమ్మ ఒడిలో పాలిచ్చిన అమ్మతో, నాన్నతో, చుట్టూ ఉన్న వారితో, బడిలో, కాలేజిలో పోరాడి పోరాడి అలసి పోకుండా తలబడి, తడబడి నిలదొక్కుకుని నిలబడి బ్రహ్మానందం గారే చెప్పవలసిన, ఒక వ్యక్తిత్వ డెవలప్మెంట్ పాఠం ఆయన జీవనం. (పాఠం 10). ఎవరూ చెప్పకపోయినా అర్ధమయ్యే పాఠం ఇది. నిజజీవిత విశ్వవిద్యాలయంలో కూడా పద్మశ్రీ, ప్రొఫెసర్ బ్రహ్మానందం ఆయన.
కమెడియన్ కావడం తప్పేమీ కాదు. అది చాలా కష్టం కూడా. మరో క్షణంలో నవ్వుకొనడం అందరికీ సాధ్యం కాదు. అయినా బ్రహ్మానందం కమెడియన్ అనడం భయంకరమైన అన్యాయమనిపిస్తుంది. ఆయన గొప్ప బ్రహ్మాండమైన కారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్. సందర్భానికి తగిన నటనచేయగల సమర్థుడు. సమగ్రమైన నటుడు. నేరళ్ల వేణుమాధవ్ మొదటి ధ్వన్యనుకరణ తొలి సమ్రాట్ ఇచ్చిన స్ఫూర్తి లభించిన అదృష్టం అందరికీ దొరుకుతుందా? స్వయంకృషి చేసుకోకపోతే బ్రహ్మానందం మిమిక్రీ దారిలో ప్రముఖ నటుడయ్యే అవకాశం వచ్చేదా? కనుక అదృష్టం, తలిదండ్రుల ఆశీస్సులు, శ్రీవేంకటేశుని దీవెన వారివే అని ఆయన అంటున్నారు. (వరంగల్లులో వేణుమాధవ్ చూసి విని స్వయంగా మాట్లాడుకుండే నా వంటి వారికి అదృష్టం ఎందరికి వస్తుంది?)
‘నేను’ అని స్వర్ణాక్షరాలలో లిఖించశక్తి అని బ్రహ్మానందంకి ఇచ్చింది. ప్రతిజీవిలో కనపడే ‘నేను’ బ్రహ్మానందం. ఆకలిని ఆస్వాదించే శక్తి ఆయన. ఆత్మస్థైర్యానికి ప్రతీక.
(బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఆర్నెల్లు మరిచిపోయిన జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకోవడానికి బ్రహ్మానంద హాస్యచిత్ర చికిత్స ఇచ్చినందుకు కృతజ్ఞతలతో)
Add comment