బర్మా క్యాంప్ కొండ ప్రాంతం, కొండల మీద ఎక్కువ ఇళ్లు ఉంటాయి అరవై, ఎనభై , వంద గజాలలో ఇళ్లు. కొండల మీదకు ఆడాళ్లంతా కిందనుంచే నీళ్లు మోసుకు వెళతారు. పెద్ద పెద్ద ఇత్తడి బిందెలతో నీళ్లు మోసు కెళ్లి ఇంటి దగ్గర సిమెంటు కుండీలలో నింపుకుంటారు. వాటినే మరుసటి రోజు వరకూ జాగర్తగా వాడుకుంటారు.
నూకాలమ్మతల్లి గుడి ఎదురుగా బాదంచెట్టు కింద బోరింగ్ పంపు ఉంటుంది, నువు ఎగిరెగిరి ఎంత సేపు కొట్టినా అందులోంచి గాలే వస్తాది. మన శక్తి కొద్దీ కొట్టగా కొట్టగా మెల్లగా చిన్న దార వస్తాదంతే. బాదం చెట్టు కావడం వల్ల బోరింగు చుట్టూ బోలెడు కండ చీమలు ఉండేవి. పిల్లలంతా ఎర్రటి బాదం కాయలు కోసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే మా కండ పట్టుకోడానికి కండ చీమలు ప్రయత్నం చేసేవి. ఒక సారి నాతో పాటు ఉన్న వెంకటస్వామి కొడుకుని కాలికి ఓ పెద్ద కండ చీమ పట్టుకుంది అది ఎంతకీ వాడిని వదిలి రాదే, గట్టిగా లాగగా లాగగా దాని పీక వాడి కండకే ఉండిపోయింది, దాని శరీరం మాత్రం నా చేతిలో ఉండిపోయింది. కొండ ప్రాంతం ఏమో గుడి చుట్టూ చీమలు, చెట్ల కింద చీమలు, బారుల్లా చీమలు,కండ చీమలు బర్మా క్యాంప్ నిండా చీమలే. ఎక్కువ గా నల్లటివి కొన్ని ఎర్రటివి.
‘కేంపు’లో ఎక్కడా ఒక నుయ్యి కూడా కనపడేది కాదు, ప్రభుత్వం సరఫరా చేసే మున్సిపాలిటీ నీళ్లు లేదంటే బోరింగు నీళ్లు ఇవే ఆధారం. ఇదిగో ఆ బోరింగులు ఇలా మొరాయించేవి. నీళ్లు వస్తే వచ్చేవి లేదంటే లేదు. జనమంతా బోరింగుల నుంచి మున్సిపల్ కుళాయిల నుంచి నీళ్లు మోసుకుని కొండలెక్కేసేవారు . ఇంటికి కావలసిన అవసరాల కోసం పరుగులతో ఆడాళ్లు నీళ్లు మోసుకునేవారు. మా ఇంట్లో పనిచేసే సత్తమ్మ పెద్ద ఇత్తడి బిందెతో నీళ్లు చకచకా మోసేసి సిమెంటు గోళెం నింపేసేది. సత్తువున్నోళ్లకే నీళ్లు అన్నట్టుండేది ‘కేంపు’లో. మేమంతా ఆ గోళెం దగ్గర చేయి పెట్టి ఆడుకుంటుంటే ‘ఒరేయ్ గోళెం దగ్గర నీళ్లాటలాడకండి నీళ్లు తేడం ఎంత కష్టమో తెలుసా’ అనేది అమ్మ సత్తమ్మను సమర్ధిస్తూ.
బర్మా క్యాంప్ లో ఉన్నప్పుడు నేను కప్పరాడ పాఠశాలలో చదివేవాడిని దానికి ‘కప్పలబడి’ అని పేరు.మున్సిపల్ స్కూల్ కాబట్టి స్కూల్ కి కూడా అలా మారుపేరు పెట్టి కించపరచేవారనుకుంటా. స్కూల్ అయితే బాగనే వుండేది రేకులతో, ఒక పక్కా బిల్డింగుతో వెనకాతల మొక్కలతో ఎదర కొంచెం ఆటస్థలంతో. బర్మా క్యాంప్ నుంచి కిందకి దిగి నేషనల్ హైవే దాటి, ఐటిఐ జంక్షన్, తుమ్మడపాలెం దాటి నడుచుకుంటూ వెళ్లాలి ‘కప్పలబడికి’. అప్పుడపుడు నాన్న సైకిల్ మీద దిగబెట్టేవారు. ఈ కప్పరాడ స్కూల్ నిండా శ్రీను, ఎల్లాజీ, అవతారం, కనక మహాలక్ష్మి, సింహాచలం, అప్పలరాజు పేర్లున్న వాళ్లే ఎక్కువ వుండేవారు. స్కూల్ వెనకాతల బోరింగు ఉండేది, అది బాగానే పనిచేసేది. ఇంటర్వెల్ లో వరుసలో నిలబడి మనవంతు వచ్చాక నీరు తాగాలి, స్కూలంతటికీ ఒకటే బోరింగు దాంతోనే మొక్కలకు నీళ్లు, టీచర్లు గిన్నెలు కడుక్కోడం అన్నీను.
బోరింగు నీళ్లు కిలుం వాసన వేసేవి, తాగడానికి ఇబ్బంది అయిపోయేది. ఇప్పటిలా నీళ్లసీసాలు పట్టికెళ్లే అలవాటేమో లేదు. మా అమ్మేమో ఒక బాక్సులో అన్నం అందులోనే కొంచెం చేతితో నొక్కి గొయ్యిలా చేసి కూర వేసి కట్టేది. మధ్యాహ్నం లంచు బెల్ కి మహా అయితే ఓ పదిమందిమే మిగిలేవాళ్లం ఎక్కువ మంది స్కూల్ చుట్టు పక్కలనుంచే వచ్చేవారు , ఇంటికెళ్లి అన్నాలు తినేసి వచ్చేవాళ్లు. వున్న ఈ కొద్దిమందికీ అన్నాలు తినడానికి సరైన నీడ కూడా ఉండేది కాదు. రాళ్లతో కట్టిన స్కూల్ కాంపౌండ్ ఎక్కి అక్కడ కూర్చోని నేను అన్నం తినేవాడిని. కలుపుకోడానికి వీలుగా ఉంటాదని మా అమ్మ ఎక్కువగా ఉల్లిపాయల కోడిగుడ్డు కూర, బెండకాయ పులుసు, పప్పు ఆనపకాయ,ఆవకాయ ముక్క కట్టేది. బాక్సు కట్టి దాని చుట్టూ జేబురుమాలు ముడి వేసి ఇచ్చేది. అది సంచీలో వేసుకుని హవాయి చెప్పులతో రోడ్లన్నీ కొలుచుకుంటూ నడుచుకుంటూ స్కూలుకు వెళిపోయేవాడిని.
మా హెడ్ మాస్టర్ ‘లింగం మాస్టార్’ మధ్యాహ్నం బోరింగు దగ్గరకు పిల్లలు ఎవరినీ రానిచ్చేవాడు కాదు ఎంగిళ్లు వేసేస్తున్నారని దాంతో బాక్సు చాలా జాగర్తగా తినేసి చెయ్యి కడుక్కోవడం కోసం ఆకాశం వంక చూసేవాడిని, చూడగానే వర్షం రాదు కదా మన చెయ్యి కడగడానికి.
గోడమీదనుంచి జాగర్తగా కిందకు దిగి ‘ ఏవండీ కొంచెం మంచినీళ్లు ఇవ్వండి’ అని స్కూలుకి ఆనుకున్న వున్న వాళ్ల ఇంట్లో ఎవరో ఒకరిని అడిగేవాడిని. అప్పటికి విశాఖపట్నంలో మంచినీళ్లకు మహాకరవు, అయినా నా ముఖం చూసి ఎవల్లో బాగా వున్న వోళ్ల పిల్లాడు అనుకునేవారో ఏమో ఓ చిన్న చిన్న చెంబులతో నీళ్లిచ్చేవారు. చెయ్యికడిగేసుకుని కడుపునిండిపోయేలాగ ఆ నీళ్లన్నీ తాగేసే వాడిని ఒకేసారి నీళ్లన్నీ తాగడంతో ఆఖర్లో చొక్కా మీద పడిపోయేవి కొన్ని నీళ్లు.
ఆఖరి గుటకేస్తూ ‘చాలా థేంక్సండీ’ అని చెబితే పొంగిపోయేవారు వాళ్లు. ఇలా ఎన్ని రోజులని అడుగుతామని కప్పరాడ పాఠశాలను ఆనుకునే వున్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్కులోకి మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లి చేసేవాళ్లం ఇద్దరు ముగ్గురం. పార్కంటే దానికి పిట్టగోడా ఉండవు, పచ్చని పచ్చికా వుండవు, ఒక ఐదారు యూకలిప్టస్ చెట్లు, ఒక ఎండిపోయిన నీళ్లురాని ఫౌంటెన్ ఉండేవి. ఆ చెట్ల నీడలో కూర్చొని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తిరిగితే ఎక్కడో ఒక చోట నీళ్లు దొరికేవి అక్కడ బోరింగ్ కొట్టి బాక్సులు కడిగేసుకుని, కాళ్లు చేతులు కూడా శుభ్రంగా కడిగేసుకుని కోతి కొమ్మచ్చి ఆడేసి అప్పుడు తిరిగి కప్పలబడికి వెళిపోయేవాళ్లం.
స్కూల్లో నా నీటి కష్టాలు ఇలా వుంటే బర్మాకేంపులో మాత్రం ఆడాళ్ల నీటికష్టాలు ఇంకా ఎక్కువ వున్నాయి, ఆ పెద్ద పెద్ద బిందెలతో కొండపైకి ఎక్కలేక, బోరింగు కొడుతుంటే అందులోంచి నీళ్లు సరిగా రాక, మున్సిపల్ పంపులో నీళ్లు సరిపడా పట్టుకోలేక యాతన పడతానే వున్నారు. ఆడాళ్లకు నీళ్ల దగ్గర గొడవలొచ్చేస్తున్నాయి, నా జీవితంలో మొట్టమొదటి బూతులు విన్నది బర్మాకేంపు దగ్గరే. మామూలుగా అక్కా, వదినా అని కలిసిమెలిసి వుండే ఆడాళ్లు నీళ్ల దగ్గరకు వచ్చే సరికి ‘ఒలే..ఒసే..’ అనుకునేవారు. ఇంకొంచెం ఎక్కువ గొడవైతే ‘….జ,లమిడీకి’ అని కూడా తిట్టేసుకునేవారు, ఇంకా పెద్ద గొడవయితే ఆ బూతులు ఇంకా దారుణంగా వుండేవి. ఒక్కోసారి జుట్టు జుట్టు పట్టుకొని కొట్టేసుకొనేవారు. ఆ గొడవల్లో మగాళ్లు కూడా దూరిపోయేవారు కుటుంబ మొత్తం ఈ నీళ్ల గొడవల్లో మునిగిపోయేది,రోడ్డంతా ఒకటే కేకలు అరుపులు. బర్మా కాంపులో బిందెలు అన్నింటికీ పెద్ద పెద్ద సొట్టలు ఉండేవి.
నీళ్లకి ఇంత ఇబ్బందిగా వున్నా నూకాలమ్మ పండగకి వచ్చే భక్తులకోసం నీళ్లు, షరబత్, మజ్జిగ పంచడం బర్మాకేంపోళ్ల మంచితనం, శూలాలు వేసుకునే భక్తుల కాళ్లకి చెంబుతో పసుపునీళ్లు పోయడం ఆ నీళ్లు తలకు చల్లుకోవడం వాళ్ల స్వచ్చమయిన అమాయక భక్తికి నిదర్శనం. ఉగాదికి ముందు హొలీ కి దగ్గరలో ‘నీళ్ల పండగ’ అని ఒక పండగ చేసేవాళ్లు ఒకళ్లనొకళ్లు నీళ్లతో కొట్టుకుంటూ నీళ్లు జల్లుకుంటూ కుర్రాళ్ళేమో మూడు చక్రాల బేరింగు బండి మీద బర్మా క్యాంప్ రోడ్డు నుంచి కింద శ్మశానం ముందు వరకు దొర్లుతూ సందడిగా జరిగేదా పండగ ఆ రోజు మొత్తం.
బర్మా క్యాంపోళ్ల ఈ నీళ్ల దాహం ఇలా వుంటే ఊర్లో అధికార దాహం ఉన్న ఓ పెద్దాయన వెనకాల ఆయన నమస్కారం పెడుతోన్న బొమ్మతో ఓ నీళ్ల టాంకరు బర్మాకేంపులో తిప్పుతూ పార్లమెంటుకి ఎన్నికయిపోయాడు. ఆ తరువాత మరికొంతమంది అదే బాట పట్టారు .
ఇపుడు రాతినూతులు అసలు లేవు, కొండ ప్రాంతం కాబట్టి నందల నూతుల జాడే లేదు కేంపుకి, బోరింగులన్నీ మూలన పడిపోయాయి, పాడయిపోయిన బోరింగులకు పాత టయిర్లు చుట్టేసారు. మున్సిపాలటీ పబ్లిక్ కుళాయిలు తగ్గిపోయాయి. ఇప్పుడు కోర్పరేషన్ పైపులేసి కొండలమీదకు కూడా నీళ్లు సరఫరా చేస్తోంది, కానీ స్థలం లేక జనం ఇంకా కొండ మీదకు ఇళ్లు కట్టేసుకుంటున్నారు. అయినంత మేర సిమెంటు బాటలు, మెట్లు వేసారు. ఆడాళ్లు కిందనుంచి నీళ్లు మోసుకెళుతూనే వున్నారు. ఓపికున్నోళ్లు మున్సిపల్ కుళాయిలకు పన్నులు కడుతున్నారు, లేనోళ్లు పబ్లిక్ కుళాయిల దగ్గర గొడవలు పడుతున్నారు. బోరింగులు ఇప్పుడు మీకు దాదాపుగా కనపడవు, అవి కనుమరుగయిపోయాయి. కానీ అన్ని రాజకీయపార్టీల్లో దూరిపోయి జనానికి సేవ చేయాలనుకునే ‘బోరింగు’ రాజకీయనాయకులు మా ఇసాకపట్నం నిండా రామకృష్ణా బీచిలో గుప్పెడు ఇసుక తీసుకుంటే వున్నంత మంది వున్నారు. మేమలాగే భరిస్తున్నాం ఈ ‘బోరింగు’.
*
నీటి బాధలు చక్కగా వర్ణించారు. నీటిదాహం అడ్డంపెట్టుకుని, అధికార దాహం తీర్చుకున్న నాయకుడి(ల) ప్రస్తావన బాగుంది. బోరు కొట్టకుండా..బోరింగ్ గురించి బాగా చెప్పారు. 🙂 ☺
బోరింగ్ లేకుండా “బోరింగ్ ” కధ బాగా చెప్పారు. రచనా శైలి బాగుంది. బర్మా క్యాంప్ కళ్ళ ముందు కనపడింది .
మీ రచన, కథ, కధనం మరియు బొమ్మలు వెరసి మీ ‘బోరింగ్’ కథ మాంచి కలరింగ్ వచ్చింది.
Chela bagundi Hari garu
చాలా బాగుంది.. మీ మ్యాగజిన్… కొన సాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి -సైమన్, వైజాగ్
ఇది కథ కాని కథ. వేంకటరమణగారు గుండెలకు హత్తుకునేటట్లు చెప్పేరు. బడిలో పిల్లలు, అన్నం తిన్న తరవాత ఆకాశం వైపు చూడడం, ఆడవాళ్ళు బిందెలతో కొండలపైకి నీళ్ళు మోసుకెళ్ళడం – అబ్బా!
Anni kathallla routine ga kakundaa.. katha chadivincheylaga sulabha padalato vundi..ending kudaa vastavam to vundi..
హరి గారు కధ చాలా బాగుంది సార్ ,చాలా చక్కగా వివరించారు సార్ మీకు హృదయపూర్వక అభినందనలు 😊🤝💐🙏
హరివెంకట రమణ రచించిన బోరింగ్ కధ సులభశైలిలో చదివింప జేసింది. మధ్యతరగతి పేదలు నివసించే ప్రదేశాలలో అక్కడి వారి సమస్యలు కళ్ళకు కట్టినట్టు వివరించిన తీరు చాలా బాగుంది.రచయిత మరిన్ని ఇలాంటి రచనలు అందించాలని ఆశిస్తున్నాం.