బోగం వీధి సుగుణ…

పోలీసులు…. పోలీసులు… పోలీసులు..
పోలీసుల కళ్లలో అనుమానపు జనాలు…
అనుమానపు జనాల్లో తెలియని బాధలు…
బాధల గుండెల్లో ఆక్రోశపు భయాలు…
భయాల నీడల్లో ఇరుకిరుకు సందులు…
ఇరుకిరుకు సందుల్లో సలసల కాగే శరీరపు అమ్మకాలు…
అమ్మకాల శరీరాల్లో సహృదయపు సుగుణలు….
* * *                * * *                           *  *    *
గడియార స్థంభం నుంచి అగ్రహారానికి వెళ్లే ప్రధాన రోడ్డులో ముందుగా కనిపించేది డీలక్స్  థియేటర్. అక్కడి నుంచే అగ్రహారం ప్రారంభం అవుతుంది. ఆ డీలక్స్ థియేటర్ ముందు కర్రలతో కట్టిన నిలువెత్తు దేవత సినిమా పోస్టర్. ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు నటించిన  దేవత సినిమా విడుదల. ఇసుకేస్తే రాలుతుంది. ఎందుకంటే అది రాలనంత సీన్ శోభన్ బాబుకి లేదు.  మొదటి రోజు తక్కువ మందే ప్రేక్షకులు. అది కూడా శోభన్ బాబు అందానికే తప్ప నటనకు ముగ్దులైన అభిమానులు కాదు. సినిమా విడుదలైన వారం తర్వాత టాక్ ని బట్టి ప్రేక్షకులు వస్తారు. ప్రేక్షకులంటే ఆడోళ్లే. కుటుంబాలే. సింగిల్ మగాళ్లు… స్నేహితుల్నేసుకుని వచ్చే కుర్రాళ్లు శోభనోడి సినిమాకి రారు. ఆళ్లంతా సూపర్ స్టార్ కృష్ణ సినిమాకో…. ఎన్టీవోడి సినిమాకో వెళ్తారు. అలాంటి శోభన్ బాబు  సినిమా దేవత పోస్టర్ కి  అభిమాన సంఘం నాయకురాలు బంతి పూల మాల వేయిస్తోంది.
‘‘కుడి పక్కకు కూసింత బంతి పూలు వచ్చేలా సూడు. మొత్తవన్నీ ఎడం పక్కనే కట్టేత్తున్నారు’’ ఆ అమ్మాయి పురమాయింపు.
అంతే కాదు…‘‘ఒరేయ్ ఎర్రినా…. గురుడి ముకం కనపడకుండా పూలొచ్చేత్తున్నాయిరా… అసలు గురుడంటేనే నవ్వుతున్న ముకంరా… ముకం మీద పడుతున్న జట్టుని కుడిసేత్తో వెనక్కి గిరాటేసే అందంరా…మీ యమ్మా.. సూసుకొని కట్టండిరా….’’  మళ్లీ ఆ అమ్మాయే.
ఐదారుగురు మాత్రమే శోభన్ బాబు అభిమానులున్న ఆ సంఘంలో 26 ఏళ్ల ఆ అమ్మాయి సెక్రట్రీనో…. ట్రెజరరో. ఆ సంఘంలో సభ్యులు తక్కువే… అందరికీ అన్ని పోస్టులూ ఉంటాయి. అలాంటి నాయకత్వ పోస్టుల్లో ఓ నాయకమణి ఆ అమ్మాయి. శోభన్ బాబు సినిమా విడుదలైందంటే అక్కడ హడావుడి అంతా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయే సుగుణ.
ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల గులాబీ రేకల గుట్ట. కళ్లు చారెడున్నర. మంచినీళ్లు తాగుతూంటే గోదారి ఏ పాయ నుంచి వచ్చిన నీళ్లు గొంతులోకి దిగుతున్నాయో తెలిసిపోద్ది. వెన్నెల వెనుక అమావాస్య తెరతెరలుగా ఉన్నట్టు భ్రమించే జుట్టు. ఆలాంటి నల్లటి జట్టుకి ఉరేసుకుని చచ్చిపోతే అందమైన ఆత్మహత్య అవుతుంది. నవ్వితే బుగ్గలు సొట్టలు పడవు. హాయిగా పెదాలు రెండూ సాయం సంధ్యలో కొబ్బరాకుల మధ్య కమలా పండు రంగులో విచ్చుకుంటున్న సూర్యుడిలా ఉంటాయి. ముఖాన కుంకుమ బొట్టు. ఆ బొట్టు మీద సోమవారం నాడు శివుని విభూధి, మంగళవారం నాడైతే  ఆంజనేయస్వామి సింధూరం అడ్డంగా రాసుకునేది. ఇవన్నీ అ వయసులో నాకు తెలిసిన సుగుణ రూపురేఖా విలాసాలు కాదు. ఇప్పుడు నేను కళ్లు మూసుకుంటే నా కళ్ల ముందు కదలాడే ఆనాటి సుగుణ రూపం.
*

సుగుణది మా అగ్రహారానికి కిలోమీటరు దూరంలో ఉండే బోగం వీధి. వారమ్మాయి. అదే వృత్తి.

*

శోభన్ బాబంటే నాకస్సలు పడదు. అయినా డీలక్స్ థియేటర్ పక్క మేడలో ఉండే నా స్నేహితుడు జొన్నలగడ్డ ప్రసాదు గాడింటికి వెళ్లి ఆ పక్కనే దేవత పోస్టర్ కి దండలు  కట్టిస్తున్న సుగుణని చూసాను. ప్రేమ అనే మాట తప్ప ఆ తర్వాత  ఇంకేం చేయాలో తెలియని యవ్వన బాల్యం. లేదూ బాల్య యవ్వనం. సినిమా తెర మీద చూసిన అందం కంటే ఎక్కువ అందం కనపడడంతో అలా చూస్తూ ఉండి పోయాను. దగ్గరకు వెళ్లి నవ్వాను. సుగుణ నవ్వలేదు. చాలా ఎటకారంగా చూసింది. రెండడుగులు ముందుకి వేసి ‘‘దండేత్తున్నారా’’ అన్నాను.
‘‘కళ్లు దెం….యా… దండేత్తున్నానో…. దండవెడుతున్నానో కనిపించడం లేదా…. ఎల్లెల్లు’’ అని ముఖం మీద పడుతున్న ఎండని కుడి చేయిని శాల్యూట్ చేస్తున్నట్లుగా మార్చుకుని కళ్లకి అడ్డంగా పెట్టుకుని బంతిపూల దండ కడుతున్న వాళ్లకేసి చూసింది.
*
కుంకాల కోట్లకు ఎదురుగా కర్పూరం అరటి పళ్లు అమ్మే కొట్ల పక్క సందులోంచి ఓ దారి…. గడియార స్థంభం నుంచి కొంచెం ముందుకు వెళ్తే పువ్వులమ్మే కొట్ల పక్కన ఉన్న చిన్న సందు ఇంకో దారి. ఈ రెండూ బోగం వారి వీధికి వెళ్లేందుకు ఉపకరించే వీధులు. రెండు దారుల నుంచి కాసింత దూరం నడిచో…., సైకిల్ మీదో వెళ్లాలే తప్ప మోటారు సైకిళ్లు, కార్లు వెళ్ల లేవు. అలా నడుచుకుంటూనో… సైకిల్ మీదో వెళ్తే రెండు దారులూ రోడ్డుకి అడ్డంగా నడి మధ్యలో కట్టిన సుబ్బాలమ్మ గుడి దగ్గర కలుస్తాయి. నిమ్మకాయల దండతో…. ఆ తల్లి కాళ్ల దగ్గర ఉన్న రాక్షసుడి గుండెలపై ఎడమ కాలు పెట్టి…. వాడి మెడపై శూలం దించుతూ… నాలుక బైటకి పెట్టిన సుబ్బాలమ్మ ఉగ్రరూపంతో ఉంటుంది. ఆ గుడికి కుడి ఎడమల చాంతాడుతో కట్టిన అరటి పళ్ల గెలలు, ఎర్ర గాజులు, పసుపు, కుంకుమ, ఎర్ర జాకెట్టు ముక్కలు అమ్మే కొట్లు ఉంటాయి. ఆ గుడి కుడి వైపు నుంచి కాని, ఎడమ వైపు నుంచి కాని నడుచుకుంటూ పది నుంచి పదిహేను అడుగులు వేస్తే కుడి వైపు చిన్న సందు. మనిషి మాత్రమే… లేదూ ఓ కాలు కింద పెట్టి మరో కాలు ఫెడల్ మీద పెట్టి సైకిల్ ని ముందుకు నడిపించ గలిగితే… ముందుకు వెళ్లే చిన్న సందు మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచే బోగం వారి సందు ప్రారంభం.
*
సందులు… సందులు… సందులు…
సందుల్లో… శరీరాన్ని అంగడి చేసుకున్న అతివలు…
అతివల కళ్లల్లో…. ఆకలి కేకల చూపులు…
చూపుల్లో…  రారమ్మని పిలుపులు…
పిలుపుల్లో…. వస్తారో… రారో  సందేహాలు…
సందేహాల్లో…. పోలీసుల బూట్ల చప్పుళ్లు…
చప్పుళ్లలో…. మామూళ్ల మత్తు నిప్పులు…
నిప్పుల్లో… కాలిపోతున్న బతుకులు….
బతుకుల్లో….. మంచి రోజుల ఎదురు చూపులు…
*
మొదటిసారి ఆ వీధిలో అడుగు పెట్టాను. భయం భయంగా… నా గుండె కొట్టుకుంటున్న శబ్దం నాకే వినిపిస్తూండగా… వీధికి అటూ ఇటూ ఉన్న ఇళ్లని గమనిస్తూ నడుస్తున్నాను. ప్రతి ఇంటి ముందు ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు కూర్చుని కళ్లతోనే కవ్విస్తున్నారు. “ఏటీ కూతకొచ్చేశావేటి. వత్తావా… అవలాపురవేనా..” ఓ నడీడు  మహిళ గట్టిగా అరుస్తున్నట్లుగా అంటోంది. నేనేం మాట్లాడలేదు.
“నిక్కరు బ్యాచీ. ప్యాంటు ఏసుకుని ఈదిలోకి వచ్చేశాడు. వద్దు ఎల్లిపో. ఎవరేనా సూత్తే బావుండదు” కుడివైపు ఉన్న ఇంటి గుమ్మం ముందు కూర్చున్న మరో అమ్మాయి.
ఆ మాటలు వింటూనే ముందుకి నడుచుకుంటూ వెళ్లాను. నాలుగైదు ఇళ్లు, ఏడెనిమిది ఎటకారాలు దాటుకుని ముందుకి వెళ్తే కుడేపు ఓ చిన్న డాబా. వెల్డింగ్ చేసిన నెమలి బొమ్మల కటకటాల ఇల్లు. లోపలున్న హాలుకి, కటకటాల గదికి మధ్యలో గడప పక్కన మోకాలు కంటే కాసింత చిన్నదైన ముక్కాలి పీట మీద కూర్చుంది సుగుణ. కాటన్ చీర కట్టుకుని, అదే రంగు జాకెట్టుతో ఎడమ మోకాలు మీద ఎడం మోచేయి ఆనించి గుప్పిటని గడ్డం కింద పెట్టుకుని వీధిలోకి చూస్తూ కూర్చుంది. ముఖాన తిలకం తప్ప దేవుడి బొట్లు ఏం లేవు. సుగుణకి ఎదురుగా ఓ నలభై ఐదేళ్ల మధ్య వయస్కురాలు వైరుతో అల్లిన కుర్చీలో కూర్చుంది. ఆ కుర్చీకి  చేతులు పెట్టుకునే చోట తెలుపు వైరు ఒక చేతి దగ్గరా, పసుపు, నీలం వైర్లు మరో చేయి పెట్టుకునే దగ్గర తెగిపోయి నేల మీదకి వెళ్లాడుతున్నాయి. అంతే కాదు ఆమె కూర్చున్న కూర్చీ కింద భాగంలో కూడా కొన్ని వైర్లు తెగిపోయి నేల చూపులు చూస్తున్నాయి.
“బాగున్నారా… నేను మొన్న డీలక్స్ దగ్గర కలిసాను. శోభన్ బాబుకి మీరు పూలు కట్టిత్తున్నారు” అన్నాను.
“ఆ.. నువ్వా. ఏటీ ఇలాగొచ్చావ్.  మొదలెట్టేశావా”
“మిమ్మల్ని చూద్దావనే వచ్చా. ఊరికే”

“అమ్మా సుగుణా.. ఎవరే ఈ కుర్రాడు. సూత్తూంటే బామ్మర్లలా ఉన్నాడు” అని ఆ పక్కన కూర్చున్న పెద్దావిడ కల్పించుకుంది.

“ఆ… బామ్మర్లే అయి ఉంటది. మొన్న దేవత సినిమా కాడ కనిపించాడు. ఇప్పుడు ఎతుక్కుంటూ వచ్చేశాడు” సుగణ సమాధానం చెప్పి నా కేసి చూసి “ఎందుకొచ్చావ్. ఎల్లిపో. ఇక్కడికి రాకూడదు. సిన్న పిల్లోడివి…” అంది.

“సూడాలనిపించి వచ్చా. అంతే” అన్నాను.
“సర్లే ఎల్లిపో. మల్లీ రాకు. ఈ వీధిలో ఎవరైనా సూత్తే నీ పని అంతే ” అని అదో గొంతుతో మందలించింది.
ఏం మాట్లాడాలో తెలియక వెనక్కి వచ్చేసాను.
*
మూడు రోజులైంది సుగుణని చూసి. లోపల దిగులు మేఘం కమ్ముకుంది. వెళ్తే తిడుతుందేమోననే భయం… వెళ్లకపోతే ఉండలేని ఖాళీతనం. తిడితే తిడుతుంది. అయినా ఓసారి చూసినట్లు ఉంటుందని సుగుణ ఇంటికి బయలుదేరాను. ఆ రోజు సోమవారం. వట్టి చేతులతో వెళ్లకుండా ఏదైనా పట్టుకెళ్తే కోపం కాస్త తగ్గుతుందనిపించింది. ఇంట్లో చేసిన గారెల్ని ఎవ్వరూ చూడకుండా ఓ అరటి ఆకులో చుట్టుకుని సుగుణ ఇంటికి వెళ్లాను. సుగుణ ఇంటి ముందు నే చూసిన పీట లేదు. ఆ పక్కనే వైరు కుర్చీ ఉంది కాని అది కూడా ఖాళీగానే ఉంది. కటకటాల తలుపులు వేసే ఉన్నాయి. సింహద్వారం మాత్రం తెరిచే ఉంది. కాసింత ధైర్యం చేసుకుని కటకటాల తలుపులు కొట్టాను. రెండు మూడు సార్లు కొట్టిన తర్వాత లోపలి నుంచి ‘‘ఇయాల సోవారం. బేరాల్లేవు. రేపూ ఉండవు. బుదోరం రండి’’ అని మనిషి కనిపించకుండా మాటలు మాత్రమే వినిపించాయి. కొంతసేపు తటపటాయించాక మళ్లీ తలుపులు కొట్టాను. ‘‘ఏటి సెవుడా. సెప్పా కదా… బేరాల్లేవని. ఓ… తలుపులు బాదేత్తారేటీ’’ మళ్లీ ఆ గొంతే.
ఇలా కాదనుకుని….. ‘‘నేను వచ్చాను. డీలక్స్ కుర్రోణ్ని’’ అని కాసింత గట్టిగానే పిలిచాను.
ఓ రెండు నిమిషాలకి సుగుణ వాళ్లమ్మ వచ్చింది. ‘‘నువ్వా. మళ్లొచ్చావేటీ. రావద్దని సెప్పింది కదా’’ అంటూండగానే లోపల నుంచి సుగుణ వచ్చింది.
‘‘ఏటి మల్లొచ్చావ్. సెప్పాను కదా. ఈ ఈదికి రావద్దని’’ అంది
‘‘ఊరికే చూద్దామని’’ అంటూ చేతిలో ఉన్న అరిటాకు పొట్లం తనకి కనపడేలా పట్టుకున్నా.

‘‘ఏదో తెచ్చాడే’’ అంటూ సుగుణ వాళ్ల అమ్మ కటకటాల తలుపులు గడియ తీసింది.

‘‘ఏటి తెచ్చావ్. లోపల కురిసీలో కూసో’’ అంటూ సుగుణ చిన్న ముక్కాలి పీటని తెచ్చుకుని కటకటాల్లో నా ముందు కూర్చుంది.
నా చేతిలో ఉన్న అరిటాక పొట్లం సుగుణకిచ్చాను. దాన్నందుకుని ‘‘ఏటి గారెలా’’ అంటూ ఓ గారె నోట్లో పెట్టుకుంది. చేతిలో ఉన్న అరిటాకుని తన పక్కనే నేల మీద పెట్టింది.

కటకటాల్లోంచి వస్తున్న సూర్య కిరణాలు అరిటాకు పీల్చుకున్న నూనె మీద పడి తెలుపు, ఆకుపచ్చ రంగులు కలబోసిన మంచి ముత్యంలా మెరిసిపోతోంది. ఆ మెరుపులు సుగుణ ముఖం మీద కూడా పడుతూండడంతో ఆమె మరింత అందంగా కనిపించింది. గారెలతో ఉన్న అరిటాకు పొట్లం ప‌ట్టుకోవ‌డంతో నా కుడి చేయి వేళ్ల‌కి కూడా నూనె అంటుకుని వేళ్లు జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. ఆ వేళ్ల‌ని నా బెల్ బాటం ప్యాంటు పాదాల ద‌గ్గ‌ర తుడుచుకుంటూ సుగుణ‌ని చూస్తున్నాను.
‘‘ఏటి పెద్దలకెట్టారా’’ గారె తింటూ అడిగింది సుగుణ.
‘‘అంటే’’ అన్నాన్నేను.
‘‘అదే పెద్దల తిధి ’’ అని వివరణ ఇచ్చింది.
‘‘అవును. మా తాతగారి ఆబ్దీకం. నీకెలా తెలిసింది’’ అడిగా.
‘‘పండగ నాడు సేసిన గారెలకి, పెద్దలకి సేసిన గారెల రుసికి తేడా తెలిసి పోతుంది. పైగా బామ్మర్ల ఇంట్లో అయితే మరీనూ’’ అంది.
నా చదువు, కుటుంబంతో పాటు చిన్న చిన్న వివరాలు అడిగింది. ఇలా ఇక్కడికి రాకూడదంటూ మరోసారి మందలించింది.
‘‘మిమ్మల్ని చూడాలనిపించి వచ్చా. మీరు బాగుంటారు’’ అన్నాను.
ఆ మాటకి అదోలాంటి నవ్వు నవ్వుతూ ‘‘20 రూపాయలు సేతిలో పెట్టే పతోడూ ఇలాగే సెప్తాడు’’ అంది.
‘‘కాదు. నేను చెప్పేది నిజం’’
‘‘సర్లే ఇక్కడికొచ్చి సెడిపోకు. నీకు సూడాలనిపిత్తే ప్రతి సోమారం, మంగళారం రా. ఆ రోజు నేను బేరాలు సేయను. ఓ సిటం కూసుని ఎల్లిపోదువు గాని. ఈదిలో ఆళ్లూ, ఇళ్లూ పిలిత్తే ఎల్లకు. ఇంటికెల్లిపో’’ అంది. అలా చెప్తూనే లోపలికి తొంగి చూస్తూ ‘‘ అమ్మా.. అక్కడ అరటి పళ్లు ఉన్నాయి. రెండు పట్రా. పంతులు గారికిద్దాం’’ అని అరుపులాంటి పిలుపుతో వాళ్లమ్మకి వినిపించేలా చెప్పింది.
‘‘నేను పతి మంగళారం మీ అగ్గురోరంలో ఉన్న ఆంజనేయసావి గుడికొత్తా. సూడాలనిపిత్తే అక్కడ సూడు’’ అంటూ వాళ్లమ్మ తెచ్చిన అరటి పళ్లు నా చేతిలో పెట్టింది.
మ‌ళ్లీ త‌నే  ‘‘బొంబాయి నూక ఉప్మా సేసాం కాని మీకెట్టకూడదు. అందుకే పళ్లిచ్చా’’ అంది.
ఆకుపచ్చ అంచున్న పచ్చటి ఆ చక్కెర కేళీ పళ్లలో ఒకటి తింటూ ఆ ఈదిలోంచి బయటకొచ్చేశా.
*
మంగళవారం నాడు అగ్రహారంలో ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గరా… అప్పుడప్పుడు వాళ్లింటి దగ్గరకి వెళ్లి సుగుణని చూసే వాడ్ని. తను కూడా నే కనపడగానే శోభన్ బాబు అందం గురించి, ఆయన నటించిన సినిమాల గురించి చెప్పేది.  పనిలో పనిగా కృష్ణకి నటన రాదని, అస్సలు బాగోడని, కృష్ణంరాజు పొడుగు తప్ప ఇంకేమి లేదని చెప్పేది. ఓ మంగళవారం నాడు ఉదయం 7 గంటలకు ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న పి.ఎస్.రాజు గారి ఆసుపత్రి పక్కన సైకిల్ సగం నేల మీదకు వంచి దాని కడ్డీ మీద చాలా స్టైల్ గా కూర్చున్నా. ఉదయం ఎనిమిదిన్నరకు సుగుణ ఆంజనేయ స్వామి గుడికి వచ్చింది. నన్ను చూసింది. నవ్వింది.
*
నవ్వులు… నవ్వులు.. నవ్వులు…
నవ్వుల స్నేహ‌పు జల్లులు…
జల్లుల్లో ఆనందపు తుళ్లింతలు…
తుళ్లింతల్లో వొళ్లు మరిచిపోయే కేరింతలు…
కేరింతల్లో దాగిన నాలుగు కళ్ల దోబూచులాటలు…
*
ఆరు నెలలు ఇట్టే గడిచి పోయింది. ఇన్నాళ్లలో తను గుడికొచ్చిన ప్రతిసారి నేను కలిసే వాడ్ని. ఒక్కో సోమవారం నాడు ఇంటికి వెళ్లి అరగంట కబుర్లు చెప్పుకుని వచ్చేసే వాడ్ని. సుగుణ వాళ్లమ్మే కాదు వీధిలో మిగిలిన ఆడవాళ్లు కూడా నే కనపడగానే నవ్వేవారు. వెటకారాల్లేవు. వెక్కిరింతల్లేవు. ఆ అద్భుత‌ వేళల్లో ఓ కుదుపు. మా అమ్మ చనిపోయింది. ఓ పదిహేను రోజులు నేను ఇల్లు కదలలేదు. ఏకధాటిగా కన్నీరు. దిక్కులు మూసుకుపోయాయని భయం. ఇంటినిండా అందరూ ఉన్నా వెంటాడిన ఒంటరితనం. నా చుట్టూ తిరుగుతున్న శ్మశానం.
*
ఆ తర్వాత ఓ రోజు మళ్లీ సుగుణ వాళ్లింటికి వెళ్లాను. నన్ను చూసిన సుగుణ కళ్లు ఎందుకో భలే మెరిసాయి. మళ్లీ వెంటనే కాంతి విహీనంగా మారిపోయాయి.
‘‘ఏమైంది. ఆ గుండేటి. పిలకేటి. ఏమైంది’’ ఆత్రుతగా అడిగింది.
‘‘మా అమ్మ…..’’ కన్నీళ్లు ఆగలేదు. అలా పది నిమిషాలు ఏడుస్తూనే కూర్చున్నా.
సుగుణ తల నేల వాల్చి మౌనంగా కూర్చుండి పోయింది.
సుగుణ వాళ్లమ్మ కూడా వచ్చి దూరంగా కూర్చుంది.
కొంత సేపటికి సుగుణే ముందు తేరుకుని నా చేయిని తన చేతిలోకి తీసుకుంది.
తన ముఖంలోకి చూస్తే కంటి చివర నేల మీద రాలడానికి సిద్ధంగా రెండు కన్నీటి బొట్లు.
‘‘ఏడకు. ఏం సేత్తాం. అయినా మా అమ్మ ఉందిలే. నాలాగే నీకూనూ’’ అంది.
సుగుణ వాళ్లమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి కొంచెం సేపు కూర్చుని ఇంటికి వచ్చేశా. ఆ అరగంట ఇద్దరి మధ్య మాటల్లేవు. విషాదపు తెరలు తప్ప.
*
ఇది జరిగిన నెల రోజుల తర్వాత ఓ మంగళవారం ఉదయం పూట అగ్రహారంలో ఎవరో మాట్లాడుకుంటూండగా నా చెవిన పడింది. ‘‘నిన్న రాత్రి బోగం వీదిలో మర్డర్ జరిగిందట. అమ్మాయిని చంపేశారట’’
అంతే… గుండె ఆగినంత పనైంది.  పరుగు పరుగున ఆ వీధికి వెళ్లాను.
పోలీసులు, వీధిలో మనుషులు, ఊర్లో వాళ్లు చాలా మందే ఉన్నారు. అంతా విషాదంగా ఉంది. గుమిగూడిన వారందరిని తప్పించుకుని మెల్లిగా ముందుకు వెళ్లాను.
నా భయం నిజం అయ్యింది. సుగుణ వాళ్ల ఇంటి ముందు సుగుణ పడి ఉంది. పక్కనే వాళ్ల అమ్మ, మరికొందరు ఏడుస్తూ కూర్చున్నారు. పోలీసులు ఏదేదో రాసుకుంటున్నారు.
*
గులాబీ రేకల గుట్ట నేలపై రాలిపోయింది…
చారెడున్నర కళ్లు శాశ్వతంగా నిద్రపోయాయి…
అమావాస్యలాంటి జుట్టు చెల్లాచెదురైంది…
సొట్టలు పడని బుగ్గలు నిర్జీవమయ్యాయి…
లోపల ఏ పాయ నీళ్లో కనిపించే కఠంపై రక్తపు చారికలు…
కుంకుమ బొట్టుపై ఉన్న తెల్లటి విభూది రేక ఎర్రగా మారింది.
*
సోమవారం రాత్రి తాగేసొచ్చారు ఆ నీచులు. అప్పటికే తలుపులు వేసుకుని పడుకున్న సుగుణ బయటకు రావాలంటూ కేకలు పెట్టారు. రాత్రిళ్లు ఆ వీధి మగాళ్లు అక్కడ ఉండ‌ర‌ని వాళ్లకి ముందే తెలుసు. ఇంటి కటకటాలు బద్దలు కొట్టేంత పని చేశారు. వీధిలో మిగిలిన ఆడ‌వాళ్లు వచ్చి అల్లరి చేయద్దని వేడుకున్నా ఆ రాక్షసులు వినలేదు. సోమారం, మంగళారం బేరాలు చేయనని, బుదారం రండి అంటూ లోపల నుంచి సుగుణ, వాళ్లమ్మ ఎంత చెప్పినా వినలేదు. బతిమాలింది. బామాలింది. చివరికి కొంతసేపటికి ‘‘ఊరికే మాట్లాడి వెళ్లిపోతాం’’ అని నమ్మించారు.
మాట్లాడితే వెళ్లిపోతారులే అనుకుంది వెర్రిబాగుల్ది.
ఆవు- పులి కథ నిజం అనుకుంది అమాయకురాలు.
జింకను వేటాడేందుకు సింహం నాలుగడుగులు వెనక్కి వేస్తుందని కానుకోలేకపోయింది.
నమ్మకపు నవ్వుల వెనుక గొంతు కోసే కత్తి ఉందని తెలుసుకోలేకపోయింది.
తలుపు తీసింది. ఇయాల ఉపాసం అని గుర్తు చేసింది. బుదారం రండంటూ బతిమిలాడింది. నాలుగు జంతువులు ఆమెపై పడ్డాయి. బలవంతం చేయబోయాయి.
ప్రతిఘటించింది. పెనుగులాడింది. పోరాడింది.
పంతం నెరవేరదని ఆ రాక్షసులకి తెలిసిపోయింది.
కత్తులు తీసారు. ఎక్కడ పడితే అక్కడ పొడిచారు.  చచ్చిపోయిందని నమ్మాక పారిపోయారు. వీధిలో ఆడవాళ్లు చూస్తుండగానే ఇదంతా జరిగిపోయింది.
వీధిలో ఆడవాళ్ల ప్రాణ భయం ఆ దుర్మార్గుల్ని ఆపలేకపోయింది.
నా స్నేహితురాలు సుగుణ వెళ్లిపోయింది. నాకు తన ఆరు నెలల స్నేహాన్ని కానుకగా ఇచ్చి కనుమూసింది. అక్కడ ఉండలేక భోరున ఏడుస్తూ వెనక్కి వచ్చేశాను.
*
ఆనాటి నుంచి సుగుణ గుర్తుకు రాని రోజు లేదు. అలాంటి రోజుల్లో ఓ సోమవారం తెల్లవారుజామున ఓ కల వచ్చింది. నా పక్కన సుగుణ కూర్చుంది. కాటన్ చీర కట్టుకుని, అదే రంగు జాకెట్టుతో… అప్పుడే తలంటుకుని జట్టు ఆరడానికి తెల్లటి బొచ్చు తువ్వాలు పిడప చుట్టుకుంది. కుంకుం బొట్టు పైన శివుని విభూది పెట్టుకుంది.
‘‘ఏటి ఈ మధ్య చాలా సార్లు ఏడుతున్నావ్. నే గుర్తుకొస్తున్నానా?’’ అంది.
మళ్లీ తనే ‘‘ఏడకు. నేను నీతోనే ఉన్నాను’’ అని కూడా చెప్పింది.
అంతే కాదు…
‘‘నీకు సంతోషం కలిగిందనుకో…. మీ యావిడ కళ్ల‌ల్లోకి సూడు. నే కపడతా… ఎప్పుడైనా ఏడుపొచ్చిందనుకో నీ మణీపర్సులో మీ అమ్మ ఫుటో ఉంది కదా… అది తీసి సూడు. మళ్లీ నే కపడతా.
నీకు బయమేసిందనుకో నీ కూతురు సేయట్టుకో.  నీకు ధైర్యాన్నిస్తా’’ అంది.
చెమటలకు చల్లబడిన నేను దిగ్గున లేచి చూస్తే పక్కన సుగుణ లేదు. మాయం అయ్యింది.
*
తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయట. నాకవుతున్నాయి కూడా.
*

ముక్కామల చక్రధర్

28 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సుగుణని మాకు మనసుకు తాకేలాగా పరిచయం చేసావు. ముగింపులో మరచిపోలేకుండా గుర్తుకుండేలా మా హృదయాలలో ప్రతిష్టించావు.
    చాలా బాగుంది బుజ్జి.

  • సుబ్బాలమ్మ సందుపైగల ఆకర్షణ , ఆసందులో ప్రవేశించినప్పటి భయమూ ఆశక్తీ కలగలసిన అలనాటి ఒక స్థితి గుర్తుకొచ్చింది మీవలెనే..
    మిగిలిన అనుభవమంతామీకు మాత్రమే ప్రత్యేక మైనది..ఇన్నేళ్ళుగా వెంటాడుతున్న ఆ జ్ఞాపకం కథగా మమ్మల్నీ వెంటాడుతుంది..

  • కళ్ళకు కట్టినట్టుగా కథ రాసారు…
    బావుంది

  • కళ్ళకు కట్టినట్టుగా కథ రాసారు…
    బావుంది సార్

  • శభాష్ రా బుజ్జి నీ కథలు బాగుంటాయనుకుంటాను అంతే ! ఇంతగా బాగుంటాయని నేననుకోలేదు. కథ పూర్తిగా చదివిన తర్వాత నాకనుల నుండి జారిన రెండు కన్నీటి బొట్ల సాక్షిగా ‘బోగం వీధి సుగుణ’కు నివాళులతో …………

  • నీ కథనం సూపర్బ్ రా!
    చాలా బాగుంది.
    ముగింపు అద్భుతంగా వుంది.
    – బాలు మంత్రిప్రగడ

  • Super narration.Extraordinary writing,when reading it ,felt amazing.Once again your pen down skills have made it live…Thank u so much..

  • ఈ కధ చదువుతుంటే అమలాపురం వీధుల జ్ఞాపకాలు
    పొలమారాయి ! అభినందనలు

  • Thadi aariponi kadha.
    Muga Manasulalo jamuna
    Anthuleni Kadhalo jayaprada
    Guppedu Manasulo jayasudha
    Intlo Ramayyalo purnima
    Kalayana mantapamlo kanchana
    Malle Puuvulo lakshmi..
    Bujjigaari (bujjigaadi) kadhalo Suguna goppa characters. Bujjigaru, ippati daakaa chadivimchina kadhallo dheeniki agra thambuulam. Thambuulamante gurthukochimdi- maa chinnapudu bhogam melaalu chudataaniki velte.. Bhogam ammayilu kondariki mafyalo thaambulaalu ichevaru. Malaanti pillalaki ichevaaru kaadu. Ivvadamante consent. Maymu pillalam kadhaa.. So , chance ledannamaata.
    Ayyo Suguna.. Ventaade dhukkam

  • మన అమలాపురం లో ఇలాంటి సంఘటన జరిగిందని నాకు తెలియదు, ఒక కథలా కనిపించే నిజం. ఏ బంధం అన్నది ఇప్పుడు అప్రస్తుతం అయినా ఈ సంఘటన ఎంత కుదిపేసిందో మాత్రం అర్ధం అవుతోంది. పసలపూడి కధల్లా…. మా అమలాపురం అగ్రహారపు కధల్లా ఉన్నాయి. All the Best……రాము సరిపెల్ల

  • కృష్ణ కి నటన రాదు, కృష్ణంరాజు పొడుగు తప్ప ఏమీ లేదు… ఒక సామాన్య ప్రేక్షకురాలి నుంచి వచ్చిన నిజాలు. శోభన్ బాబుకి కూడా అందం తప్ప ఏమీలేదని చెప్పడానికి, వీరాభిమాని మాని కాబట్టి ఊరుకుంది.
    జీవితాన్ని ఒక పెన్సిల్ డ్రాయింగ్ లాగ రమణీయం గా చిత్రించావు. ఆయిల్ పెయింటింగ్ అనలేదు. అక్కడ అన్ని చూపించడం కుదరదు. ఏది వర్ణనో, ఏది వాస్తవ చిత్రీకరణో తెలియకుండా కలనేత చిక్కగా నేశావు. సుగుణ ఇంట్లో కుర్చీల పరిస్థితి నిజమే కనక అయితే, నీ జ్ఞాపక శక్తి కి జోహారు.
    ఆ కుటుంబాలలో పుట్టడం తప్ప ఆమె స్వయం కృతం ఏముంది.
    ఇలాంటి, జీవితాలు విషయం లో సాపేక్ష మే చూసేవాళ్ళు, నిరపేక్షం గ్రహించని వాళ్లు, ఒక దేముడిని ఊహించుకుని ఆయనని నిందించి ఊరుకుంటారు
    ఎప్పటి లాగే అద్భుత రచన
    అభినందనలు

  • Aakarshanaki Manusula kulalatho sambandham ledu ..Yuktha vayasul antharangam ..aa vayasulo vunde aakarshana ni baaga avishkarincharu…”అయినా మా అమ్మ ఉందిలే. నాలాగే నీకూనూ” anna Suguna maatalu aame chese pani edaina aame kunna manchi vyakthithvanni soochisthayi…Very Touching Story

    Malli Andarini Amalapuram Theesukellaru ….Thank you

  • కోన్నిజీవితాల దయనీయ పరిస్థితిని, వారిమనస్సుని చాలా దగ్గరగా ఆవిష్కరించావు. కధనం ,వాస్తవికతల కలబోత చాలాబాగుంది. ముగిమపు స్పుార్తిదాయకం. అభినందనలు–వెంకు

  • కోన్నిజీవితాల పరిస్థతిని,వారినిబద్దతని చాలా బాగా చెప్పావు. కధ,కదనం వాస్తవికతకి అద్దం పట్టింది.ముగింపు స్పుార్తిదాయకం…వెంకు

  • సార్‌….
    నీ కథలు బాగుంటున్న‌యి… నిజ‌మైన కథ పూర్తిగా చదివిన తర్వాత నాకనుల నుంచి జారిన కన్నీటి బొట్ల సాక్షిగా ‘బోగం వీధి సుగుణ’కు నివాళులర్పిస్తూ….

  • సూపర్ బుజ్జి చాలా బాగా రాసావ్. నిజంగా ఇంత బాగా కథలు నువ్వు రాస్థావని అనుకోలేదు. ముగింపు చాలా బాధనిపించింది.

  • బావుంది. చాలా బావుంది. నీ భావన , మధురాను భూతులు పంచావు. సహజత్వం ఉన్న ఓ దీను రాలి మంచి కధ. నీ మదిలో ఇప్పటికీ ఓ అగ్ని హోత్రుడు , ఓ సుగుణ లాంంటి నిజ పాత్రలు కదలాడు తున్నాయంటే నీ లేత వయసులో నీవింటా వారి బయటకు కానరాని బాధల వల్ల ఎంత చలించి పోయావో , నిన్ను వీరంతా ఎంత ప్రభావితం చేసారో…. వారంతా నిజంగా ధన్య జీవులు.
    శభాష్ బుజ్జి. నీవు ఇలాంటి కధలెన్నో అందరి మనసుకు హత్తుకో పోయేలా వ్రాయాలని కోరుకుంటూ నీకు అభినందనలు , శుభాస్సీసులు…

  • తేటగా పారుతున్న చల్లని గోదావరి నీళ్లను దోసిలిలో తీసుకుని కడుపారా తాాగినట్టుగా ఉంది. మీ అక్షరాలకు గోదావరి వయ్యారాలే ఉన్నాయనుకున్నా,, అవి బతుకు చిత్రాలను ఆవిష్కరించే కుంచెలు కూడా అని ఇప్పుడే తెలిసింది…అభినందనలు సర్

    • కథలో లీనమై రాశారు, వెరీ వెరీ హార్ట్ టచింగ్ స్టొరీ

  • Excellent chaala బాగుంది పూర్తి ఇన్వాల్వ్ అయి చదివేలా రాశాను..ఒక్క సారి గతం గిర్రున తిరిగింది…వెంటనే అమలాపురం వెళ్ళాలి అనేల వుంది

  • చాలా చాలా బాగా వ్రాశారు.

    నెమలి మేడ మాకూ గుర్తే లీలామాత్రంగా.

    గారెల్లో తేడా 👍😀👍

    హృదయ పూర్వక అభినందనలు.

  • ‘బోగం వీధి సుగుణ ‘ శీర్షిక పెట్టడంలో సగం విజయం సాధించారు. మీ కథనం తో పాఠకుడిని అమలాపురం వీధులన్నీ త్రిప్పారు. ఇది రచయిత స్వానుభవం అనేంత అపోహ కలిగేలా బ్రమింపజేసి కధలో పాఠకుడిని లీనం చేశారు. సుగుణ పాత్ర ని మర్చిపోలేని విధగా తీర్చిదిద్దారు..అభినందనలు చక్రధర్ గారు.

  • ఇది నిజంగా నేను పక్కనే ఉన్నప్పుడు జరిగినట్టు అనిపించింది.
    మీరు రాసిన తీరు చాలా బాగుంది. నేను S K B R College లో డిగ్రీ చదివిన రోజుల్లో అమలాపురం అంతా తిరిగేవాళ్ళం (కాలేజ్ వారం లో 3 రోజులు బంద్ , ధర్నా ల తో ఉండేది అప్పుడు టైం పాస్ కోసం, మా ఊరి బస్సు టైం అయ్యే వరకు కాలం గడవాలి కదా). మీ కధ చదువుతుంటే ఆ రోజులు మళ్లీ గుర్తు వచ్చాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు