పురాతన తవ్వకాల్లో
బయటపడ్డ నాగరికతలా
ఉంటుంది మా ఊరు
పేరెందుకు లెండి
తెలంగాణలో ఏ పల్లె ను
చూసిన ఒకేలా ఉంటుంది
అభివృద్ధికి దూరంగా
అర్ధాకలికి దగ్గరగా
ఇప్పటికీ ఊరికి ఆమడ దూరంలో
విసిరివేయబడ్డ పాలపుంత
మా ఊరు.
మా ఊరికి ప్రతి ఆదివారం
మాకు ప్రాణమైన
మా జీవన సంస్కృతి అయిన
పెద్దకూరను పట్టుకు వస్తాడు
సలీమ్ మియా
వచ్చి రావడంతోనే
ఇంటింటికి తిరుగుతూ
కూరమ్మ పెద్దకూర అని
గట్టిగా చెవుల్లో దుమ్ము
పారిపోయేలా అరుస్తాడు.
ఊరోళ్లందరూ సలీమ్ మియా
చుట్టూ చేరి నల్లి బొక్కలు
మంచి కొవ్వు పట్టిన ముక్కలు
ఎవరికి నచ్చింది వాళ్లు తీసుకొని
తిరుపతిలో దేవుడు దర్శనమైతే
ఎంత ఆనందిస్తారో
మా వాళ్లు అంతకంటే ఎక్కువగా సంతోషపడతారు.
కానీ నాకు మాత్రం
బొంతల కూర అంటేనే ఇష్టం
దీని అమ్మ ఈ కూర ముందు
ప్రపంచంలో ఉన్న అన్ని గుడుల్లో
అమ్మే ప్రసాదం కంటే
దీని రుచి స్వర్గానికి తీసుకెళ్తుంది.
అవ్వ అయ్యలను తొందరపెట్టి
కూర తొందరగా చేయమంటాను
కూర ఉడికేదాకా ఆగడు పట్టిన
వాడిలాగా మట్టి కుండలో
కుత కుత లాడుతున్న ఆ కూరను
చూస్తూ నాగులో నాగుల అంటూ
జనపదాలను పాడుకుంటాను.
కూర ఉడుకుతున్న వాసన
ఆ బ్రహ్మ దేవుడికి కృతజ్ఞతలు
కమ్మటి బొంతల కూర తింటుంటే
రాముడు కృష్ణుడు కూడా ఎందుకు
వదల లేదో నాకు ఇప్పుడు బాగా
అర్థమైంది.
బొంతలకూర
దళితుల శ్రమ శక్తికి నిదర్శనం
వారి తరతరాల ఉత్పత్తికి నిర్వచనం
వివిధ వృత్తి పరిముట్లు చేసే వారి
జ్ఞానానికి మూలం.
మా అవ్వ అంటది కదా
ఇంకొంచెం వేసుకో బిడ్డ
అమెరికాలో అందరూ ఈ పెద్దకూరను
తిని మనం వాడే ప్రతి ఒక్కటి కనిపెట్టారు
కాబట్టి బిడ్డ నీవు కూడా ఈ కూర తిని
ఏదో ఒకటి కనిపెట్టి గొప్పవాడు కావాలి
అంటూ మరిన్ని ముక్కలు నా
నా కంచంలో వేసి తినమంటుంది.
*
ఏదో ఒకటి త్వరగా కనిపెట్టు. బావుంది
అదే పనిలో ఉన్నాను సార్…