పార్కులో గాలి-

సిగలు ముడిచిన చెట్ల జూలు దులిపి,

నీరెండ సోకిన పచ్చనాకుల సోయగాల్ని రెపరెపలాడిస్తూ-

పూలను విప్పార్చి

                                                    పరిమళ భాషను పరివ్యాప్తం చేస్తూ-

ఆడుతున్న పిల్లలతో కలిసి

తనిన్ని గెంతులు వేస్తూ-

ఇంటి ముందర గాలి-

కిటికీ రెక్కల్ని దడదడ బాది

ఇంట్లో చేరి,ఇంటి మనిషి లా మసలుతూ-

 

టేబుల్ మీది గ్రంధం పేజీలను

పరపరా తిప్పేస్తూ-

వెలిగించిన క్యాండిల్ ని టప్ మని ఊది,

గర్భానల కీలల మరుగుతున్న,అనంత దుఃఖాల నేవో

నిబిడాశ్చర్యాల వెనక్కి నెట్టేస్తూ-

 

నా చెంతన గాలి-

మనసు చెరసాల మూలల్లోకి పాకి,

దేహానికదో కొత్త ఒరవడిని నేర్పిస్తూ-

ముక్కు పుటాలలోదూరి

ప్రాణ స్పందనలకి ఆయువు పోస్తూ-

రోడ్డు మీద గాలి –

నడుస్తున్న నన్ను పడదోసి,

రివ్వున రువ్వడిగా పరిగెత్తుతూ-

 

నేను లేస్తున్న-

దాన్ని దాటేయగలనా

ఎప్పటికైనా…!

 

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్