సుదూరం నుంచి స్వేద బిందువులు
అదను చూసి నేల మీద వాలాయి
అరగదీసిన గంధంలా
మట్టి పులకించి నవుజు అయి
మొలకల మైదానమైంది.
సేద్యపు క్రతువులో
కంటకాల మొనలు దాపురించాయి
సహస్ర అంగాలై కదలాడుతూ
సమస్యలు ఊరేగుతున్నాయి
తరతరాల పురా సేద్యం
నలిగి నలిగి పాతపడిపోయింది
చిరుగుల బతుకైంది
యాంత్రికతతో బాటు
రక్తనాడుల వేగమూ అనివార్యం
వలసొచ్చిన బెంగాలీలు
చక్కబెట్టి ఒబ్బిడి చేయడం
నడిచొచ్చే దారిలో కాంతి పుంజమైంది
వాళ్ళదంతా సైగల భాషణలు
పాదాల అంగలే కొలతలు
తీరైన చూపులే వరుసలు
బెంగాలీ ఊడ్పులో
ఒక్కో మనిషి ఒక్కో సైన్యం
ఆకుతీతా వాడే… నాట్లూ వాడే
అనాది ఆడమగ పనివిభజన
ఇపుడు చేతులు మారింది
బరి దాటడు నీటిలో జారడు
చుక్కలు కలిపి ముగ్గులేసినట్లు
నడుం వంచి అల్లుకుపోతాడంతే.
దిగుబడి పెరిగి
విత్తనాలూ సమయమూ కలిసొస్తుంది
మాగాణి పంట అనిపించుకుంటుంది
ఆరు వరుసల సమాంతరపు
అల్లికల ఉత్సవ సౌరభాల
అరుదైన నేర్పరితనాల బెంగాలీ ఊడ్పు
మడిచెక్క ఒక మహాకావ్యం
వేళ్ళ మధ్య తారాడే
అక్షరాలు మూనలు
జీవనోత్సాహం
సంపద సృష్టిలో ఉంది
( రైతు కడుపులు పండిస్తున్న బెంగాలీ వలస కూలీలకు …)
***
Add comment