బెంగపడ్డ పద్యం

             1
బడిలో బంతుల్లా ఎగిరే
పిల్లలు ఇళ్ళలో బందీ అయ్యారు
బడిగంటలా గణగణా మోగాలని
కాలం గ్రీన్ సిగ్నల్ కోసం కాచుకున్నా
             2
పిల్లలు లేరని
బడి తోటలోకి పక్షులు రావట్లేదట
గాలి బిక్కబోయిందని
రాత్రి కలలో చెట్లు చెప్పాయి
              3
మా అపార్ట్ మెంటు ప్లే ఏరియాలో
కొన్ని చిట్టి నీడలే ఆడుకుంటున్నాయి
జారుడు బల్ల మీద గాలి బంతి
           4
మా కారిడార్ లో పిచ్చుకలు
ఉదయమే గాల్లో స్కేటింగ్ చేస్తాయి
సాయంత్రం పిల్లలు
బుజ్జి బుజ్జి సైకిళ్ళతో రేసింగ్ చేస్తారు
వచ్చీపోయే సాయంకాలాలు
ఇప్పుడు సందడే లేదని నొచ్చుకుంటున్నాయి
ఖాళీ కారిడార్ లో
నా కళ్ళకు చీకటి గుచ్చుకుంటోంది
             5
పక్కింటి చిక్కీకి..ద్వితీకి
నేనే పర్మనెంటు తాతను
నాతో వాళ్ళు దొంగా పోలీసు ఆడతారు
నన్ను పోలీసును చేసి వాళ్ళెక్కడ నక్కారో
దొంగలు ఎంతకీ దొరకడం లేదు
           6
ఎక్కడైనా పిల్లలు కనిపిస్తారేమో అని
నగరంలో కొన్ని ఆటస్థలాలు వెదికాను
శూన్యంలో ఆటల మేస్టారి
విజిల్ వినిపించింది
                  7
తాతా కత చెప్పవా అని
ఒకటే సతాయించేది పక్కింటి పాప
ఇప్పుడది రావటం లేదుగా
ఎవరికి చెప్తున్నావు కథలు?
నిద్రట్లో లేపి మరీ అడుగుతుంది తను
                8
పిల్లలతో ఆడుకున్న తర్వాతే
మా గోల్డీ (పెట్ డాగ్ )
అన్నం తినేది
పిల్లలు రావట్లేదుగా
నేనే పిల్ల వేషాలేవో వేస్తున్నా
              9
తాతా బర్డ్స్ మాస్కు పెట్టుకోవా?
పిట్టలు కదమ్మా
కరోనాకి దొరక్కుండా ఎగిరిపోతాయి
అయితే మనం కూడా ఎగిరిపోదామా తాతా?
ఎక్కడికే ?
మా బడిలో పేద్ద నెస్టుంది తాతా
నోరింత చేసింది
దాని నోట్లో ఏదో గోళంలాంటి గూడు
                10
నేనో పెద్ద చిత్రకారుడినై పోయాను
నాకు తెలిసిన పిల్లల బొమ్మలన్నీ
 ఊహల కాన్వాసు మీద చిత్రిస్తున్నాను
నా సహచరి వేళాకోళం నవ్వులతో
రంగులు పూస్తుంది
                11
ఈ కాలానికి కవిత్వం రాదని
పద్యం బెంగ పడింది.
*

ప్రసాద మూర్తి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పిల్లలు బడికొస్తారు… పిట్టలు మాట్లాడతాయి
    పిల్లలు బడికొస్తారు…మొక్కలు నవ్వుతాయి
    పిల్లలు బడికొస్తారు… కాలం కవిత్వమౌతుంది

    …. ఆశ పడదాం సార్. రేపటి కోసం. మీ పద్యమంటే పడి పడి వెతుకుతా. ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు