బూబమ్మ కుటుంబం ఓ మల్లెపూల పందిరి

రంజాన్ లేదు.రంజాన్ చంద్రుడూలేడు.తీపిలేదు.వెన్నెలాలేదు.బూబమ్మె రంజాన్.బూబమ్మె చంద్రుడు.అవును బూబమ్మ దివ్యకాంతి మరి.

ముప్పయిళ్ళుంటాయేమో తురకలవి మావూళ్ళో మాబజారుకి ఆనుకొని.రొడ్డుకూడా అడ్డులేకుండా సాయిబుల ఇళ్లు కలిసిపోయి ఉంటాయి.బాబాయి అని పిలుస్తారు.అత్తయ్య అంటూ వరసలు కలుపుకుంటారు.జానీ బాబాయి,ఉస్నేల్లి మామయ్య,ఫిరోజు తమ్ముడు,అక్క,చెల్లి అనుకుంటూ మత స్పృహ లేకుండా బతుకుతున్న సాయిబుల వివాహాది శుభకార్యాలకు వేడుకలకు వెళ్ళిరావటం మూలాన వాళ్ళ జీవితాలు మాకు మాజీవితాలు వాళ్లకు దాపరికాలు లేకుండా తెలిసేవి.మమేకమవ్వటం,ఏకత్వం ఒకళ్ళతో మరొకళ్ళు ముడివేసుకుపోయి జీవించటం సాధారణ విషయం.

బూబమ్మ ఇప్పుడు వృద్ధురాలు.ఆరుగురు పిల్లల తల్లి.చిన్న వయసులోనే పెనిమిటిని కోల్పోయిన మహిళ.మా చిన్నప్పుడు బహుశా ఆరు నుండి పది వరకు చదివిన స్కూల్కి దగ్గరగా బూబమ్మకి ఒక ఎకర జామతోట ఉండేది.దానిలోని అరెకరంమేరా మల్లెతోట.వయసులో ఉన్నప్పుడు జామతోటలో పనితోపాటు మల్లెమొగ్గల్ని పండించింది.ఉదయమంతా జామకాయల్ని బుట్టనిండా నింపుకొని బజారు బజారుకి తిరిగి బూబమ్మ పెద్దకొడుకు కరిముల్లా వాటిని అమ్ముకొచ్చేవాడు.పెద్దకూతురు బూబమ్మ మల్లెల్ని మాలలుగా కట్టి మూరల లెక్కఅమ్మేవారు.ఒక్కోసారి గిద్దెలెక్క కూడా అమ్మేవారు.పెళ్ళిళ్ళకి పూలజడల్ని అల్లి పెట్టేవారు.విడిపూలని రాత్రికి మిగిలినవి ఇరుగుపొరుగుకి ఉరికేనే ఇచ్చేవారు.ఇదేవారి జీవనాధారం.జామతోట మల్లెతోట ఆ కుటుంబానికి బోలెడంత ఆసరా.

బూబమ్మ రెండో అబ్బాయి జాన్భాషా.అతనికి రెండు కళ్ళు కనిపించవు.పుట్టు గుడ్డి. బూబమ్మ అతడ్ని ఉదయాన్నే ఇంటినుండి కిలోమీటర్ దూరంలో ఉన్న జామతోటకి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చేది.చిటికెన వేలు పట్టుకొని ఆ మెటల్ రోడ్డు మీద వయసొచ్చిన బిడ్డతో బూబమ్మ నడిచివెళ్లటం చూస్తే మాకు ఎదో ఎక్కడో తగులుతుండేది.అర్థమయ్యేది కాదు.లోపలే కన్నీళ్లు నిలిచిపోయేయేమో?బురద రోడ్డుమీద మేకల మధ్యలో ఆవుల రద్దీలో కొడుకుని నడిపించుకుపోయేది.జామతోటకి చుట్టురా వెదురు చెట్లు పహారిలా దట్టంగా అల్లుకొని ఉండేవి.ఆవులు గేదెలు మేకలు కనీసం కోతులు కూడా ఆఎత్తయిన వెదురు కొమ్మల్ని దాటి వొచ్చేయి కాదు.తోటకి ముందర భాగాన రోడ్డుకి ఎదురుగా చిన్న మొత్త ఒకటి ఉండేది.మొత్త పైభాగం అంతా తీగెలు అల్లుకొని పచ్చగా ఉండేది.తీగకు అక్కడక్కడా వంగపువ్వు రంగులో చిన్నచిన్న పువ్వులుండేవి.అదో ప్రకృతి పందిరి.ఆ మొత్తలోనే బూబమ్మ తన బిడ్డ జాన్బాషాని కూర్చోబెట్టేది.తీగ పువ్వులు కొన్ని రాలి జాన్భాషా లుంగీ ఒడిలోని జామకాయల బుట్టలోనూ పడుండేవి.తన ముందు ఈతగంప నిండా పచ్చనివి పసుపు రంగువి కలగలిసిన జామకాయలు ఆబుట్ట నిండా ఉండేవి.ఎవరు వొచ్చినా ఇష్టమొచ్చిన కాయని తీసుకొని పావలానో పదిపైసలో ఇచ్చేవారు.అప్పట్లో ఐదుపైసల బిల్లలు పదిపైసల బిల్లలు పావల ఇరవై పైసల రూపాయి బిల్లలు ఉండేవి.అవన్నీ దాదాపుగా సిల్వర్ కాయిన్స్.ఏ కాయిన్ ఎంతో చాలా తేలికగా గుర్తుపట్టేవాడు జాన్బాషా ఆ కాయిన్స్ రూపాన్ని వాటి చివరన ఉండే ఒంపుని బట్టి.ఏకాయ కొనుక్కొని ఎంత ఇచ్చినా కాయిన్ని చేతిలోకి తీసుకొని వాటిని వేళ్లతో తడిమి ఆ కాయిన్ ఎంతో గుర్తించి సరిపడకపోతే అడిగేవాడుకాదు.వీలయితే తన ఒడిలో ఉన్న కాయిన్స్ తడిమి చూసి చిల్లర సరిపడా ఇచ్చేవాడు.అతని వేళ్ళకి కళ్ళుండేయేమో?మధ్య మధ్యలో బూబమ్మ ఇతడ్ని గమనిస్తూ ఉండేది.ఆకలేస్తే అన్నం తినిపిచ్చేది.ఒంటెలు పోసుకోడానికి చెట్టు చాటుకి తీసుక పోయేది.అన్నం తినిపించి మూతి తుడ్చేది.చేతులు కడిగేది.జాన్బాషాని ఏన్నేళ్లు మోసిందో పాపం.

పదకొండు గంటలకు ఒంటెలు బెల్లు మోగేది బడిలో.పరుగు పరుగున పిల్లలంతా గేటుముందున్న పీచు మిఠాయి సైకిల్ దగ్గరకో కరిముల్లా బాబాయి జామకాయల గంప దగ్గరికో పరుగెత్తి పోయేవారు.చిటికెలో అవన్నీ ఖాళీ అయిపోయేవి.చేతిలో పావలానో అర్దనో పట్టుకొని జామతోటకి పరుగెత్తి వొచ్చేవారు తొమ్మిది పది తరగతులు చదివే చాలామంది పిల్లలు.గుంపుగా వొచ్చి జామతోటలొకి దొంగ చాటుగా జాన్బాష బాబాయికి అనుమానం రాకుండా వెళ్ళేవారు కొందరు.బూబమ్మ లేకపోతే ఇంకా చాలా మంది లోపలికి పోయి జాంకాయలు తెంపుకొని నిక్కరకి ఇరువైపు జేబుల్నిండా పెట్టుకొని చేతుల్లో ఒకటిఅర పట్టుకొని ఎవరికి అనుమానం రాకుండా బయట పడేవారు.జామకాయల్ని దొంగిలించేవారు.ఇంకా కొందరు జాన్భాషా బాబాయికి తెలియకుండా గంపలో చెయ్యిపెట్టి తీసుకునేవారు.గంపలో కాయలు ఖాళీ అయ్యేవి తప్ప వాటికి సరిపడా డబ్బు వొచ్చేది కాదని అనేవాడు జాన్బాషా.తడిమి తడిమి చూసుకునేవాడు.

చిల్లర లెక్కేసుకుంటూ నవ్వేవాడు.’బాబు బేటా’అని నన్ను ఎంతో గౌరవంగా పిలిచేవాడు.”నేను కాపలా ఉండనా”బాబాయ్ అంటే నవ్వి “తిననీ బేటా కడుపుకేగా ఎంకాదులే”అనేవాడు.బెల్లు మోగేది అందరూ పరుపరుగునా ఎటోళ్లటు వెళ్లిపోయేవారు.ఒక్కోసారి బడి ఎగ్గొట్టి అక్కడే ఉండేవాడ్ని.నన్ను గద్దించి రెండు జామ కాయల్ని చేతులోపెట్టి “వెళ్లు బేట వెళ్లు.చదువుకోవాలి.బాగా చదువుకొని గవర్నమెంటు కొలువు తెచ్చుకోవాలి.మమ్మల్ని పలకరించాలి” అనేవాడు.”నాకే కళ్ళు చక్కగుంటే నేను చదువుకొని ఆఫీసర్ని అయ్యేవాడ్ని.వెళ్లు బేట వెళ్లు”అని నన్ను బడికి తోలేవాడు.ఆ రెండు జాంపళ్ళే నాకు ఆహారం.నా పేదరికం అంత విశాలమైనది.అప్పుడప్పుడూ బూబమ్మ అమ్మమ్మ మా తాత మానాన్న గురించి చెప్పేది.ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేది.నవ్వు ముఖం.పైగా గూని.ఒక చేతిలో కర్ర.మరో చేతిలో జాన్బాషా మునివేలు.రోడ్డుకి పక్కనే నడుచుకుంటూ అప్పుడప్పుడూ వెనక్కి చూసుకుంటూ ఇంటినుండి తోటకి తోటనుండి ఇంటికి నడిచేది.నడిపించేది.ఇంటికి వొచ్చి బోలెడు సంసారాన్ని నెట్టుకొచ్చేది.మల్లే మొగ్గలకి జాంపండ్లకి వొచ్చిన పావలా బేడాల్ని రాత్రిపూట కిరసనాయిల్ బుడ్డి కింద కూర్చోని లెక్కసుకుని సంతోషపడేవారు.అవసరానికి మించి ఉన్న పైసల్ని డబ్బులగురిగిలో దాచుకునేది.

ఆరుగురి బిడ్డల్లో నలుగురి ఆడపిల్లల నిఖా చేసింది.అల్లాసాక్షిగా బూబమ్మ కొడుకులిద్దరికి కాలనీ ఇల్లు కట్టించింది.కరీముల్లా గాజుల వ్యాపారం చేసేవాడు.మళ్ళీ అత్తరు బుడ్ల వ్యాపారం.కొన్నేళ్ళు బట్టల మూట.పెళ్లి చేసుకున్నాడు.అతని జీవితం హాయిగానే సాగింది.పిల్లలు,వాళ్ళ చదువులు.కొన్ని సంతోష రంజాన్లు మరికొన్ని దుఃఖాల రంజాన్లు.ఎప్పుడు నమాజు చేసినా అతను ఒకటే ఆడిగేవాడు.జాన్బాషా కి నిఖా జరిపించమని.అల్లా విన్నాడేమో ఆ ప్రార్ధన్ని.అనుకున్నట్టే నిఖా జరిగింది.

బూబమ్మ చేతిలో ఉన్న జాన్బాషా చేయి ఇప్పుడు భార్య హుస్సేన్బీ చేతుల్లోకి వెళ్ళింది.రెండు ముద్దల్లో ఒకముద్ద బాబాయికి మరో ముద్ద పిన్నికి.ఒంటెలు పోయిస్తుంది.మూతి తూడుస్తుంది.చేతులు కడుగుతుంది.లుంగీ చుడుతుంది.చొక్కాకి గుండీలు పెడుతుంది.మరో బూబమ్మ హుస్సేన్బీ.

లోక్డౌన్ మూలాన కొన్ని రోజుల్నుంచి ఊర్లోనే ఉంటున్నాను.నేను చదివిన బడిదగ్గరికి పోయాను ఒకరోజు.వొస్తూ వొస్తూ చూపు జామతోటవైపు మళ్లింది.అక్కడ పచ్చగా ఉండాల్చిన జామతోట లేదు.మల్లే మొగ్గలు లేవు.బూబమ్మ లేదు.జాన్బాషా లేడు.ఎదురు బొంగులు లేవు.అక్కడుంది కేవలం వాటి ఆనవాలు కూడా లేని ఒట్టి నల్లమట్టి.చిందర వందరగా నరికి పడేసిన ఎండిన జామ ఎదురు బొంగులు తప్ప మరేమీలేదు.

బూబమ్మ గుర్తొచ్చింది.జాన్బాషా బాబాయి గుర్తొచ్చాడు.నాచేతిలో రెండు జామకాయల్ని పెట్టిన ప్రేమచేతులు గుర్తొచ్చాయి.బాబు బేట అని నన్ను పిలిచిన మనుషులు గుర్తొచ్చారు.జామతోట మల్లె పువ్వులు ఎత్తయిన వెదురు బొంగులు అన్నీ గుర్తొచ్చాయి.తొందర తొందరగా వాళ్ళ ఇంటికి వొచ్చాను.చీకటి పడుతుంది.సూర్యుడు బిశానా సర్దుకొని ఎక్కడికో పోతున్నాడు.

మసకమసక చీకటి.జాన్బాషా బాబాయి ఇంటి మొత్తల్లో కూర్చొని బీడీ తాగుతున్నాడు.బాబాయ్ ఎలా ఉన్నారు?బాగున్నారా?ఆన్నాను.తాగుతున్న బీడిముక్కని కాలికింద వేసి నలుపుతూ..ఎవరూ అన్నాడు.నేను బాబు బేటా.అన్నాను.బేటా కైసయే?ఎలా ఉన్నావు?ఇన్నేళ్ళకి వొచ్చావా అని రెండు చేతులు పట్టుకున్నాడు.వాటిని ప్రేమగా ముద్దాడాడు.ఎదో కళ్ళలో దిగులు ఇద్దరికి.పిన్నిని పిలిచాడు.టీ ఇచ్చారు.నవ్వుకున్నాం.బాబాయి పిల్లలు దగ్గరికి వొచ్చారు.ప్రభుత్వ బడిలో ఏడు తొమ్మిది చదువుతున్నామని చెప్పారు.పిల్లలకి బాబు బేట మీకు భాయ్ అని చెప్పాడు బాబాయ్.ఆ సాయంకాలపు రాత్రి ఎంతో హాయిగా ఉంది.పోయిందేదో దోరికినప్పుడు కలిగే హాయేమో..?

బాబాయ్ బూబమ్మ అమ్మమ్మ ఎక్కడ?లోపలుందా?సంతోషంగా అడిగాను.కాసేపు నిశ్శబ్దం తరువాత పిన్ని మల్లెపూల దండతో గోడకు వేలాడుతున్న బూబమ్మ ఫోటోను చూయించింది. బాబాయి ఏమి మాట్లాడలేదు.నేను ఏమిమాట్లాడలేదు.పిన్ని మేమి మాట్లాడలేదు.పిల్లల సందడి మధ్య మృత్యువు చేరినట్టు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు.

చాలా సేపయ్యింది.అంతా మౌనం..నిశ్శబ్దం.ఎన్నేళ్ళయింది?రెండేళ్లు అన్నాడు

అమ్మ వెళ్లిపోయింది.అమ్మ వెళ్లిపోయింది.అమ్మతోపాటే మల్లెతోట జామతోట.తోట అమ్మేసాo.అప్పులు తీర్చాలిగా?మరి నువ్వుఎలా బతుకుతున్నావ్?పిల్లల్ని ఎలా పోసిస్తున్నావ్?అడిగాను..అమ్మ పెట్టిన గాజుల కొట్టు ఉందిగా..అని నవ్వి చెప్పాడు.

(పుట్టుమచ్చ కవి ఖాదర్ మొయుద్దీన్ గారికి ఇది అంకితం)

*

పెద్దన్న

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Iచదివాను. వాస్తవిక జీవనచిత్రాన్ని అక్షరీకరించారు.ఒక బ్రతుకు శకలాన్నిపట్టిచూపించారు.బూబమ్మ పై నేను రాసిన కవితను గుర్తుచేశారు. ఈ నేలపైన అందరు బూబమ్మల కథ ఇది.జీవితమేదయినా,బతుకు పోరులోయుద్ధక్షేత్రం.ఎక్కడినేలయినా ఏకాలమయినారెక్కలు రాల్చే చెమట చుక్కలది ఒకటేరంగు ఒకటేమతం.ఆరకమైన బతుకు జీవులందరూ ఒక గూటి పక్షుల్లానే కలిసుండేవాళ్ళు.వాళ్ళనుదగ్గరచేసిందీ అదే.ఇప్పుడు కళ్ళద్దాల రంగుమారింది.విచ్ఛిన్న రాజకీయ చూపులు మెదళ్ళపైసవారీచేస్తున్నాయి.ఒక కుట్రపూరితవిభజన రేఖలు గీయబడుతున్నాయి.పేదరికం ఉన్నా ఆప్యాయపలకరింపునుపొందాం.ఇపుడు పేదరికంపోలేదుగానీ అప్యాయతలను పోగొట్టుకన్నాం.నీకథ ఈ విషయాన్ని గుర్తుచేసింది.అయితే కథ సాదాసీదాగా నడిచింది. ఇంకొంత కల్పన,మెలోడ్రామా వుండాలనిపించింది.ఆరంభంలో మొదటి పేరాలోని విషయం చివరలో చెప్పాల్సింది.ఇలాంటి బ్రతుకు చిత్రాలను ధారావాహికంగారాయాలి.ఏమైనా ఒక దృశ్యాన్ని ఆవిష్కరించారు. అభినందనలు.
    ఆనందాచారి…ఖమ్మం

  • వెతుక్కోవాలి కానీ జీవితమొక కథ.కన్నీరు, యుద్ధం.
    అనేక సంఘటల్ని గుర్తుచేస్తూ సాధారణ వాక్యాల్లో కథని నడిపించడమే కథకి ఊపిరినిచ్చినట్లుగా ఉంది.
    బూబమ్మను ఆవిష్కరించిన తీస్తూ జీవన స్థితిగదులు …చాలా బాగున్నాయి ..ఇంకెన్నో ఇటువంటి విలువైన కథలు రావాలని కొరుకుంటూ..💐💐💐 congratulations anna💐

  • బూబమ్మ బతుకు చిత్రాన్ని గీసి నలుగురికి తెలియచేసిన పెద్దన్న గారికి అభినందనలు. ఈకథలో పుట్టుకతో అంధుడైనా జాన్ పాషా పాత్ర కూడా ప్రాముఖ్యమైనదే . జామ కాయలు అమ్ముతుండగా ఎవరైనా డబ్బులివ్వకుండా తీసుకున్న సంగతి తెలిసి కూడా ‘ఎవరైనా తినడానికే కదా, తిననీ’ అనే ఉదార స్వభావం చాలా గొప్పది.

  • “బూబమ్మ కుటుంబం…… ” కథ నిండా శ్రమైక సౌందర్యం, ప్రేమ ఆప్యాయతల ఔదార్యం. మీ కథలు
    మమ్మల్ని చిటికెనవేలు పట్టుకొని చిన్నతనంలోకి తీసుకెళ్తుంటాయి. కథ చదువుతుంటే మంచిగనిపించింది సార్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు