కార్తీక రాజు ‘అలికిడి’ (2024) కవిత్వ సంపుటితో తెలుగు సాహిత్యంలోకి అడుగు పెట్టిండు. అంతకుముందు గానే గేయ రచయితగా, గాయకుడిగా సుపరిచితుడు. ప్రస్తుత హనుమకొండ జిల్లా, శాయంపేట మండలం, గట్లకానిపర్తి గ్రామానికి చెందిన కవి- కుటుంబ ఆర్థిక పరిస్థితులు వలస జీవులుగా మార్చి, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతం, అటు నుంచి తిరిగి హన్మకొండకు చేర్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ ఏ సాహిత్య సభ జరిగినా అది కార్తీక్ రాజు పాటతోనే ప్రారంభమయ్యేది. వరంగల్ లోని లబ్ద ప్రతిష్టులైన సాహిత్య కారుల నోళ్ళల్లో నిత్యం తన పేరు తిరుగాడుతూనే ఉండేది. సరళమైన వచనమే అయిన ఎంచుకున్న వస్తువు, అభివ్యక్తి తీరు కవిని సరికొత్తగా పరిచయం చేస్తుంది.
*
మహా విహారయాత్ర
తెల్లారిగట్లల్ల ఐదు గొట్టంగనే లేశి
రాత్రిపూట గట్టిపెట్టుకున్న సామాను మూటలను
తలొక్కటి పట్కొని
బయల్దేరేటోళ్ళం
టార్చి లైటున్న బాపు సైకిలు
పెద్ద పెద్ద మూటలను
దాని ఈపు మీదికెక్కిచ్చుకొని
మాతోని పాటిగె నడుస్తు
మాకు తొవ్వ జూపిచ్చుకుంట
మస్తు సాయం జేశేటిది
రాళ్ళూరప్పల నుంచి
పురుగూపుట్ర నుంచి
తప్పిచ్చుకుంట టకటక అడుగులేశేది మేం
జెల్ది శేరుకోవాలెగద మరి
తీర్తాల చోటు కాడికి
దూరమనుకున్న చోటు దగ్గరైతాన కొద్దీ
మనసుపిట్ట గిరికీలు గొట్టేది
నడిశే దారిలనే
ఊటశెలిమె నుంచి పారుకచ్చిన నీళ్ళు
మా పాదాలను కడిగేటియి
ఆ సల్లని తాకిడికి
కాలిఏళ్ళు నాట్యమాడేటియి
ఓ మంచి జాగ జూస్కున్నంక
ఆడ సామాను దిగేది
ఎండను మా మీద పడనియ్యకుంట
శెద్దరే టెంటు లెక్కయ్యేది
పచ్చని గడ్డిపర్కల మీద
జారకుండ నిల్సున్న మంచుబొట్లను
గప్పుడే పొడుసుకచ్చిన సూరీడు
మెల్లమెల్లగ తాగి మాయంజేశెటోడు
అప్పటిదాక బండ లెక్కనే ఉన్న బండ
మా ఊరోళ్ళ శెయ్యి పడ్డెంటనే
పసుపుబండార్లు తొడుక్కొని
అందరు మొక్కే దేవతయ్యేది
పొత్తుల కొన్న యాటపిల్ల
తెగి, పొతమయ్యి
పొయ్యి మీద కుతకుత ఉడికెదాక
మేమైతె బిందాస్ గ ఆటకు ఎగవడేది
పెద్ద పెద్ద పైసలబిళ్ళలు
రైలు పట్టాల మీదికెక్కేటియి
రేగు శెట్ల శిఖల మీద ఆలిన బంగారు పురుగులు
అగ్గిపెట్టెలపంజరాలల్ల ఇరుక్కపోయేటియి
మెత్తటి ఆరుద్ర పురుగులు
అరశేతుల్లల్ల ముద్దుగ పాకేటియి
తియ్యటి పరికి పండ్లు జేబుల్లల్ల జేరి
ఒక్కోటీ నోట్లె నాని కరిగిపోయేటియి
కోపుల్లల్లున్న నీలం రంగు నీళ్ళు
మా దూకుడుకు ఓ ఊపు ఊగేటియి
ఒక్కరోజుల ఎన్ని జరిగిపోయేటియో
కలిశికట్టుగ బంతిల కూసొని
మోదుగాకు ఇస్తార్లేసుకొని
ఒకళ్ళనొకలం అర్సుకుంట తినెటోళ్ళం
మెతుకు ఒదిలితె ఒట్టు
మనసు నిండిపొయ్యేది
మేమచ్చిన యాళ్ళకే అచ్చిన సూరీడు
మేం తిరిగిపొయ్యే యాళ్ళకే తిరిగిపొయ్యెటోడు
నడిమిట్ల మబ్బుజేస్తే ఆగమాగమయ్యెటోళ్ళం
వాన పడద్దని ప్రకృతికి మొక్కుకునేటోళ్ళం
శిన్నప్పుడు
అన్ని పండుగలల్ల
గా శెట్ల తీర్తాలంటేనే మస్తిష్టం
ఏ విహారయాత్రకు పొయ్యే స్తోమత లేని మాకు
గా శెట్ల తీర్తమేగదా
మహా విహారయాత్ర!!
*
పొద్దుగాల ఏదన్న పని ఉన్నదంటేనో, వేరే ఊరికి పభోజనానికి పోవాలనుకుంటేనో, తీర్థాలు పోవాలనుకుంటేనో, రాత్రిపూటనే సామాన్ అంత సదిరి పెట్టుకోవడం పరిపాటే. దాంతోపాటు వెనుకటి రోజుల్ల పనిని నపరింత పంచుకోరు ఉండేడిది. ఇప్పటికి సుత సమ్మక్క జాతర పోతానమంటే తలొక్క మూట పట్టుకపోవుడు, నెత్తి మీద పెట్టుకొని సంబురంగా ముందుకు అడుగేసుడు, కొమ్మాలతీర్థంకైతే ప్రభ బండ్లు కట్టుకొని పోవుడు కొంతలో కొంత బతికున్న గ్రామీణ సంస్కృతి తొణికిసలాడుతాంటది. చెట్ల తీర్థం పోవడం అంటే ‘పిక్నిక్'(picnic) లాంటిది. చిన్నపిల్లలకైతే ఆ జోష్ చెప్పనలివి గానిది. ‘శ్రమ విభజన’ భావన ఎత్తుగడలో కనిపిస్తుంది.
*
టార్చిలైట్ ఉన్న బాపు సైకిల్ తొవ్వచూపించుకుంట చేసే సాయంలో, ఊట చెలిమె నుంచి పారుకచ్చిన నీళ్లు పాదాలను కడగడంలో, పెద్ద పెద్ద పైసల బిల్లలు రైలు పట్టాల మీదికి ఎక్కడం లో, మరొక్క ఆటల్లో మానవ గుణారోపణ(personification) ద్వారా కవిత్వం చేసిన తీరు ముచ్చట గొలుపుతుంది.
*
శెద్దరే టెంటు లెక్కవ్వడంలో-ఉన్నంతలో సర్దుకునే మధ్యతరగతి మనస్తత్వం, పసుపు బండారు తొడుక్కున్న బండ అందరూ మొక్కే దేవత అవ్వడంలో- ముక్కోటి దేవతల పుట్టుక ఎలా జరిగిందో తెలిపే ఒక శాంపిల్ సర్వే, పొత్తుల కొన్న యాట పిల్ల పొయ్యి మీద కుతకుతమనడంలో సామూహిక వంటల నేపథ్యం, మోదుగాకు ఇస్తారు లేసుకొని ఒకళ్ళ నొకలు అరుసుకుంట తినడంలో బంతి బువ్వ ప్రాశస్త్యం; బంగారి పురుగులు ఆరుద్ర పురుగులు ఆటకు సోపతులవ్వడంలో ప్రకృతితో మనిషి సహజీవనం; ఆటల్లో భాగంగానే రేగు, పరికిపండ్లు చిన్నపిల్లల ‘స్నాక్ ఐటమ్స్’ఎలా అయ్యేవో; తీర్థాల చోటు దగ్గరైన కొద్దీ గిరికీలు కొట్టే మనసు పిట్ట గురించి కవి బాల్యం ఎంతగా తాదాత్మ్యం చెందిందో మనం అర్థం చేసుకోగలుగుతాం.
*
శెట్ల తీర్థం తతంగమంతా ఒక్కరోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిందని చెప్పడానికి ” మేము వచ్చిన యాళ్ళకే అచ్చిన సూరీడు మేం తిరిగి పోయే యాళ్ళకే తిరిగి పొయ్యేటోడు” అని కవిలోని గడుసు పోరడు చెప్పినట్టు అనిపిస్తది. గట్లనే మనకు సుత చెట్ల తీర్థం పోవాలనిపించేలా మస్తిష్టంగా మహావిహారయాత్రను నడిపిస్తాడు కవి.
*
చల్లని తాకిడికి కాలి వేళ్ళు నాట్యమాడటం; పచ్చని గడ్డిపరకల మీద జారకుండా నిల్చున్న మంచు బొట్లను గప్పుడే పొడుసుకొచ్చిన సూరీడు మెల్ల మెల్లగా తాగి మాయం చేయడం మొ.న దృశ్యావిష్కరణలు కనులకు పసందైన విందును బిందాస్ గా అందించడంలో కవి నేర్పరితనం బయటపడుతుంది.
*
చిన్నపాటి పిక్నిక్ ను “మహా విహారయాత్ర” అనటంలోని ఆంతర్యం బోధపడితే ‘బుద్ధుని అష్టాంగ మార్గం’ ఆచరణలో సులువు అవుతుందని బోధపడుతుంది. సంతృప్తికరమైన, అరమరికలు లేని జీవన విధానం ఎంతటి సౌఖ్యమో ‘మహా విహారయాత్ర’ కవిత మనకు నేర్పిస్తుంది.
*
మరిన్ని మంచి కవితలతో తెలుగు కవిత్వాన్ని పరిపుష్టం చేయాలని కోరుకుంటూ ‘కార్తీక రాజు’కు శుభాకాంక్షలు.
*
Add comment