నేత్రి ఇంత బువ్వ తిని భుజం మీదేస్కున్న తువ్వాలతోని శేతులు, మూతి తుడ్సుకోని ‘హమ్మయ్య! దేవుడా బగమంతా అల్లా’ అని మూల్గుకుంట, లేద్దానికి శేతగాకున్నా ఓ చేయిని భూమిని అసరగ చేసుకోని గోడకున్న చేతికర్రను అందుకుండు గురుపాదం.
“ఓ కౌలమ్మా! గా దీగూడు పక్కనున్న శిల్కొయ్యకు మందు గోళీల సంచి ఉంటది. ఇటు పట్కరా!” అని వాల్చున్న నవ్వార మంచంకెలి కదిలిండు. కొడుకులిద్దరూ బతుకుపోరాటానికి పట్నం వట్టిండ్రు. ఉన్నొక్క బిడ్డను పొర్గూరికి ఇత్తే మంచిగనే బత్కుతుంది.
“ఆ మంచంకాన్నే పెట్టుకుంటేంది? ఉన్నయే నాలుగు రకాల గోళీలు గనీ నాలుగు దిక్కుల పెడ్తవ్” మందు బిల్లలు ఇచ్చుకుంట అన్నది కౌలమ్మ. కౌలమ్మ గూడ పెద్దమన్శే. ఆమెకూ కాళ్ల నొప్పులతోని ఇదివరకు లెక్క శాతనైతలేదు.
“అట్నే బుడిశెంబుల ఇన్ని నీళ్లుదెచ్చి ఈ మంచం కింద వెట్టు. గోళీలు ఏస్కుంట! మజ్జనేత్రి దూపైతే తాగొచ్చు” పెండ్లానికి శెప్పి చేతి కర్రను మంచం కింద పెట్టి ‘హమ్మ…’ అన్కుంటనే ఆయాసంగా రెండుసార్లు దగ్గి మంచంలోకి వొర్గిండు. సలికాలమని మొఖం నిండుగా రగ్గుకప్పుకుని చిన్నగా నిద్రలోకి జారుకుండు.
* **
ఢంఢం ఢం.. ఢంఢం ఢం..
చిర్ర, చిటికె చేతబట్టి హుషారెమ్మటి కొడ్తున్న డప్పు సప్పుడు ఐతంది. ఆ సప్పుడుకు దగ్గరిపట్ల ఉన్న పిల్లలు సంబురంతోటి ఆడ్కి వచ్చిండ్రు. పెద్దోల్లు బజార్ల నిలవడి సూస్తున్నరు. అన్వర్ సాబు చేతిలున్న పెద్ద తాంబాలంల ఊదుశిప్ప, అందుల ఎర్రగ కణకణలాడే బొగ్గులు. ఆ శిప్పల సామ్రాన్ పోసి పేపర్ అట్టతోని ఇస్రుతుండు అన్వర్. ఆ సామ్రాని పొగ కమ్మని వాసనొత్తంది. అక్కడ్కి పిల్లజెల్ల బాగనే వచ్చిండ్రు. పిల్లలు ఆ సప్పుడుకు హుషారుగ ఎగురుతున్నరు. డప్పు సప్పుడు చేసుకుంట పీరీల కొట్టంకాడ్కి రానే వచ్చిండ్రు.
అన్వర్ మంత్రం చదివిన నీళ్లు జల్లి కొబ్బరికాయ కొట్టిండు. ఆ పెట్టెకు దన్నం పెట్టుకొని తాళం తీసిండు గురుపాదం. యేడాది కింద లోపల పెట్న పీరీలు. కిరీటాలు నల్లగ ఇకారంగ ఉన్నయ్. అందుల చెయ్యి గుర్తు, నక్షత్రం, చందమామ నక్షత్రం, గుర్రం, అర్ధచంద్రకారం.. ఇట్ల తీరొక్క కిరీటాలున్నాయి. ఈ యేడు పెట్టాల్సిన ఓ ఆరిట్ని పెట్టెలోంచి బైటికి తీసిండు గురుపాదం. శుభ్రం చేయడానికి అన్నిట్నీ ఇంకో తాంబాలంల పెట్టి డప్పుల సప్పుడు జేసుకుంట అవుసలి దానయ్య ఇంటికి కదిలిండ్రు అన్వర్, గురుపాదం, వాళ్ల యెంటున్న పిల్లలు.
“ఓ గురుపాదం బావా! నాత్రి తొమ్మిదింటెన్కల ఏదో డప్పు సప్పుడైంది ఏందే?” ముల్లుగర్ర అందుకొని పొద్దుగాల పొలం కాడ్కి పొతున్న గౌండ్ల రాజేశం అప్పుడే బైటకిపోయి ఇంటికొత్తున్న గురుపాదాన్ని అడిగిండు.
“ఔ బామ్మర్దీ! మేం జేసిన సప్పుడే అది” అన్నడు గురుపాదం.
“ఓర్నీ! అంత రేత్రి ఏందే బావా? ఎవలన్న దేవునికాడ్కిగట్ట పోయిండ్రా ఏంది?” రాజేశం అడిగిండు.
“ఎటులేదు. పీరీల పండుగ దగ్గర్కొచ్చింది కదా! ఆ సప్పుడుతోనే నిన్న రాత్రి పెట్టె కదిలించింది” అని చెప్పిండు.
***
“ఓ ఎల్లయ్యా! ఆ ఎర్రెర్రగున్న గా సాదాదస్తీ(దట్టీ ) అందుకో” పీరీకర్రకు చెక్కబద్దెలు అడ్డంగ కట్టి, రింగు తొడ్గి, పీరీని చేసుకుంట అడిగిండు అన్వర్.
“ఓ అన్వర్ మామా! ఇప్పుడే మీ ఇంటికిపోయ్యొత్తన్న. నువ్వు ఇటే వచ్చినవ్ అంటే మల్ల ఇక్కడికి వచ్చిన” చెప్పులు ఇడ్సి తువ్వాల నడ్ముకు కట్టుకుంట పీరీల కొట్టంలకు వచ్చిండు గురుపాదం.
“పనిగల్లోనివే పో!” అప్పట్కే చీరలు, దస్తీలు కట్టి ముద్దుగా తాయరుచేశ్న రెండు పీరీలను సూసుకుంట అన్నడు గురుపాదం.
“గురుపాదం బాబాయ్! ఆ బుట్టాల సవారి నువ్వే జేయ్యాల్నే ఎప్పటిసందో నీ చేతుల్లనే తయరైతుంది. ఇంకొకలు చేస్తే దాని రూపకం, శక్తి రాదు. ఇన్నేండ్ల సంది చేస్తున్నం కదా! ఆ పీరీనీ, నిన్ను యేరు చేయలేము” మాట్లడుకుంట అర్ధనక్షత్రం పీరీని చేసుడు ఐపోగొట్టిండ్రు ఎల్లయ్య, అన్వర్.
“ఆ సోమయ్య, రాజయ్య, వీరేశం యేరి? అప్పటిసంది ఈ సుట్టుతకన్న రానట్టుందిగా? ఎవ్వలు మాకేంది అనుకుంటున్నారా? ఎప్పట్కి నేను బతికే ఉంటనా ఏంది?” బుట్టాల పీరీ సామానంతా పెట్టెలోంచి తీసుకుంట అడిగిండు గురుపాదం.
“హే! ఊకో బాబాయ్. ఏం మాటలు?” పీరీకి తుదిమెరుగులు దిద్దుతుండు అన్వర్.
“ఈ యాల్లప్పుడన్నా అట్టొచ్చిపోతేంది?” కర్రకు బుట్టాలున్న నక్షత్ర కిరీటం పెట్టుకుంట రానోళ్ల గురించి అంటుండు గురుపాదం. మాట్లాడుకుంటనే మొత్తానికి ముద్దుగ బుట్టాల పీరీ తయారు చేసిండు. అయినా ఏదో యేల్తు అవుపడుతంది.
“ఎల్లయ్యా! ఇట్ల పట్టుకోరా! కొంచెం బైటికి పోయి సూస్తా” అని బైటికి పొయ్యి “ఆ యాదికొచ్చింది రా! ఎల్లిగా.. ఈ పీరీ దస్తీలన్నీ ఓపాలి తీయ్యురా” లోపలికి వచ్చుకుంట అన్నడు గురుపాదం.
అట్నే పెట్టెను మల్లోపాలి సద్రేసరికి బద్రంగా కట్టగట్టి పెట్టిన ఓ దస్తీల మూట కన్పించింది. అందులోని దస్తీలన్నీ బైటకి తీస్తుండు గురుపాదం. ఓ పులి, గుర్రం, అర్ధచంద్రకారం గుర్తులతో బంగారు రంగు మెరుపులున్న ఓ దస్తీ కనిపించింది.
“అమ్మా! దొరికిందిరా ఎల్లయ్యా! అప్పటిసంది ఏదో ఎల్తుకొడ్తున్నా ఏం సమజ్ కాట్లే! గిదేరా ఆ దస్తీ. దీన్ని ఎవ్వలో కట్టిండ్రు” అన్నడు గురుపాదం.
“ఎవలే మామా?” పాత దస్తీలను సద్రుకుంట అడ్గిండు అన్వర్.
“గదే! గా కాపోల్ల చంద్రయ్య భార్య సత్తెమ్మ. వాళ్లకున్న ఒక్కగానొక్కబిడ్డ. పెండ్లై ఐదారేండ్లు అయినా సంతానం లేకపాయే! మంచికి చెడుకు ఎన్నో చోట్లకు పోయ్నా, ఆస్పత్రులకు చెప్పులర్గేలా తిరిగినా ఏం లేదు అంటున్నరంట. కానీ కడుపుల ఇంత నలుసన్న పడకపోయే! గప్పుడు మాటల్ల మాటొచ్చి గీ ముచ్చట చెప్పుకుంట శానా బాధవడ్డడు చంద్రయ్య పటేల్. నేనే రేపొచ్చే మొహర్రం పండ్గకి బిడ్డను తీస్కొచ్చి నేను చెప్పినట్టు చేయ్, ఆ ఆల్ల దయతోని సంతానం కలుగొచ్చని చెప్పిన. రెండు రోజుల్ల పీరీలు చెర్లపడుతాయనంగా తీస్కొంచ్చిండు. ఆ రోజు పొద్దుగాల ఊళ్లెకు పోతే వాళ్ల ఇంటికాడ ఆగి అమె తల మీదుగ నిండుకుండ నీళ్లు పోయించి, దేవుడూగుకుంట అరికట్టంతోని కొట్టి, కొంగుపట్టిచ్చిన. ఆ ఊదు విభూదితోటి బొట్టుపెట్టి, పీరీ కొంగు కట్టించిన. కడుపు పండితే దస్తీ కడుతా అని మొక్కుకుంటె ఏడాది తీర్గేకల్ల ఓ పిల్లగాడు పుట్టిండు. పోయిన యాడాది పట్నం నుంచి మంచి ధరగల్ల ఈ దస్తీ కట్టి, ఓ ఐదు వందల కాయితం పీరీకి కట్టిండు” ఆ ముచ్చట చెప్పుకుంట దస్తీ కళ్లకు అద్దుకొని మురుస్తుండు గురుపాదం.
“అవును బాబాయ్! ఈ బుట్టాల్ల పీరీని నువ్వే జెయ్యాలే”
“అయిపోయిందా బాబాయ్ పీరీలు చేసుడు…”
“అయ్యిందయ్యింది..” కొత్త దస్తీ కట్టి ఓ కాడ అటు పాయ, ఇటు పాయను గుంజివట్టి సూది దారంతో చిన్న టాకేసిండు గురుపాదం.
***
తెల్లారితె పీరీలు చెర్లేసుడు.
“ఓ రాజయ్యా! వున్నవా? రేపు పీరీలు చెర్లేసుడు ఎర్కేగా? బాయికాడ ఏమైనా పనుంటే జల్దిన చేసుకొని మూడుగంటల వర్కు రా! ఆ రాజేశం నేను రాకతల్గే పొలం కాడ్కి పోయిండట. ఇయ్యాల ఆకరి సరిగత్తనే పొద్దుగాల పోయొత్తని పొయిండని వాని పెండ్లం చెప్పింది” గోళెం కాడ మొఖం కడ్గుతున్న రాజయ్యకు చెప్పిండు గురుపాదం.
“అట్నే మామా! నాకు మాఎర్కే. ఇయ్యాల పొద్దుగాల్నే వత్తాం, మట్కిలు కూడ చేసుడాయే” అన్నడు రాజయ్య.
గురుపాదం పీరీల కొట్టం వైపు కదిలిండు.
***
“ఓర్నీయవ్వా! ఈ మొద్దు సల్లగుండా! ఇంత బరువుందేందిరా అయ్యా?” మొసపోసుకుంట అడిగిండు రాజేశం.
“ఏమనుకున్నవ్ మరి? సరిగత్తు ఊకనే అయితదా ఏంది?” అదే మొద్దు పట్టుకున్న ఎల్లయ్య అన్నడు.
ఆడ ఈడ దేవులాడి పాత కందిపొర్క, ఎండిపోయిన తాటికమ్మలు, శిన్నశిత్క మొద్దుల తీస్కాచ్చి మొత్తం మీద గుండం కనబడకుంట కర్రలు, మొద్దులతోని నింపిండ్రు.
రాత్రి అయింది. డప్పులు మోగుతున్నాయి. ఆ సప్పుడిని పిల్లలు, ముసలివాళ్లు, వయసోల్లు, పీరీల కొట్టంకాడ్కి ఒక్కరొక్కరు వస్తున్నరు ఆరోజు ఆకరి సరిగత్తని.
అన్వర్ ఊదు శిప్పల సామ్రాన్ వేసుడుతోని గురుపాదం ఇల్లు మొత్తం ఊదుపొగతో నిండిపోయింది. డప్పు సప్పుల్లు అవుతున్నాయి. గురుపాదం కాళ్లకు కట్టుకున్న గజ్జెల సప్పుడు గల్లుగల్లుమంటోంది. తలకు దస్తీ కట్టుకుంటే, కౌలమ్మ కొంగును నెత్తిమీద వేసుకుంది. రెండు శేతులల్ల మట్కిలను(బెల్లం శాక కలిపిన కుండలు) పట్టుకుండు గురుపాదం. కౌలమ్మ తాంబాలంల బెల్లం, సైదాకు, పూల దండలు, సామ్రాన్ పొట్లాలు పెట్టుకోని గురుపాదంతోపాటు నడుసుకుంట పీరీల కొట్టంకాడ్కి కదిలింది.
పిల్లలు, పెద్దలు ‘దూల… దూల.. హసైదుల’ అంట కేరింతలు కొడుతుండ్రు. గురుపాదాన్ని మూడు బజార్లున్నకాడ నిలబెట్టి మిగత మట్కిలను తీసుకొచ్చి అందరూ ఒక్కతాన్కి చేరుకోంగనే ‘దూల… దూల..దులో…దూలా’ అని పిల్లలు, పెద్దలు అంటాంటె ఆ డప్పు సప్పుడు, పిల్లల అరుపుతోని ఊరు మార్మోగుతుంది. అన్వరు ఆ నిప్పు కణికలు ఆరిపోకుంట అట్టముక్కతోటి విసురుకుంట గుండం కాడ్కి చేరుకున్నడు.
అన్వర్ మంత్రాలు చదువుతూ ఆ ఊదు శిప్పలకెల్లి రెండు కణికలు తీసి గుండంలో మంట అంటించిండు. ఆ కణికలతోటి నిప్పు రగులుకొని, మంట ఎగిసిపడుతుంటే అగ్నిగుండం చుట్టు మూడు సుట్లు తిరిగి ఆ మట్కిలను పీరీల కొట్టంల పెట్టిండ్రు. వాళ్లు తెచ్చిన సైదాకు, పూలదండలు పీరీల మీద ఏసి మట్కిలల్ల తెచ్చిన బెల్లం శాకను పీరీలకు సమర్పిచ్చిండు ముజువారి అన్వర్. తర్వాత అక్కడున్నోల్లందరికీ ఆ పానకాన్ని ఎవల్ది వాళ్లు పంచుతుండ్రు.
డప్పు సప్పుడుతోని ‘దూల… దూల.. అసైదూల’ అనుకుంట గుండం చుట్టూ ఒకలిచేతులు ఒకలు జంట పట్టుకోని తిరుగుతుండ్రు. ఊళ్లె జనమంత ఆ గుండంకాన్నే ఉన్నరు. పెద్దోళ్లు చిన్న పిల్లలను భుజాల మీద ఎత్తుకోని ఆ గుండం చుట్టు తిరిగేటోళ్లను సుపిత్తాండ్రు. కొందరు పిల్లల్ని ఎత్తుకొని గుండం చుట్టు తిరుగుతాండ్రు. వయసు మీదపడిన ఆడోళ్లు తలకాయకు అరికట్టం కట్టుకోని వచ్చిండ్రు. కొందరు పీరీల దగ్గరున్న అన్వర్ దగ్గరికి వచ్చి బొట్టు పెట్టించుకోని వీపున కొట్టించుకుంటాండ్రు. నడి వయసు పోరగాళ్లు వస్తే నడీపున సర్సుతాంటే ‘అమ్మా’ అని వీపు రుద్దుకుంటాండ్రు. అది సూశి అక్కడున్న అమ్మాయిలు ముసిముసిగ నవ్వుతుండ్రు.
‘హో….హో… దుల..దుల…’ ఒక్కసారే పెద్ద శబ్దం చేశిర్రు గుండం చుట్టు ఎగురుతున్నోళ్లు. అక్కడ్కి కొందరు యేశమేసుకోని వచ్చిండ్రు. ఆడేశం, ఎరుకలేశం, గౌండ్లేశం, పులేశం, పాతగుడ్డలు కట్టుకొని శీపురు, సాట పట్టుకొని తీరొక్క వేషం వేసుకోనొచ్చి గుండం చుట్టు తిరుగుకుంట ఎగురుతున్నరు. ఆ వేషాలను చూసి పిల్లలు మస్తు సంబురపడుతున్నరు. కొందరు ఆడోళ్లు కొంగు అడ్డం పెట్టుకొని నవ్వుతున్నరు. ‘దూల… దూలా…’ అనుకుంట వాళ్లు ఆ సప్పుడుకు అనుగుణంగ అడుగుల అడుగేస్తూ ఎలుగుతున్న పెద్ద మంట సుట్టు ఎగురుతున్నరు.
ఒక్కపాలే డప్పుల సప్పుడు ఆగిపోయి, వీపులు పలిగే మోతలు వినిసిస్తున్నాయి. ఒగల్ని ఒగలు ఎత్తుకోని వేశగాళ్లతోని కొట్టించుకుంటున్నరు. దెబ్బలు తలుగుతున్నా అది ఒక గమ్మతైన అనుభూతి. ఆ దేవుని కాడ వేశగాళ్లతోని కొట్టించుకుంటే మంచిదని ముసలోల్లు ముతకోల్లు అందరూ వచ్చి అడిగిమరీ శిపురుకట్ట, సాటతోని కొట్టించుకుంట చిన్న పిల్లలని కూడ చిన్నగ కొట్టిస్తుండ్రు. అరుపులు, కేకలతోటి ఆ నేతిరంత సందడిగ గడిచింది. మంట దగ్గరపడటంతోటి ఒక్కొక్కలు ఇంటికి జారుకుంట్రుండు. ఆ రాత్రి మహసంబురంగా సరిగత్తు ముగిసింది.
పొద్దుగాల కోడి కూత కంటె ముందు లేశొచ్చి డప్పుసప్పుల్లు చేస్తాండ్రు. గురుపాదానికి దేవుడచ్చి కాళ్ల గజ్జెలు గల్లుగల్లుమంటుంటే బుట్టాల పీరెత్తుకోని గుండంలున్న కణకణలాడే ఎర్రని నిప్పులల్ల అటు ఇటు మూడుసార్లు దూకిండు. అట్ల పొద్దుజాము ఊరు తిరుగొచ్చి తాడుకట్టి పీరీలను దానికి ఒర్గిచ్చి, గుండంల చిన్నగుర్గిల పాలుపొంగించి గుండాన్ని బుడ్పి, దాన్మీద దానిమ్మ కొమ్మవెట్టి గుండం పక్కన కుండ బోర్లిచ్చి ఊల్లెకు కదిలిండ్రు.
సాయంత్రమైతుంది. మళ్లీ డప్పు సప్పుళ్లు షురువైనయి. అన్వర్ పీరీల ముంగల మంత్రం చదివి మేకపోతును అలాల్ చేసిండు. ఎల్లయ్య, రాజయ్య, వీరేంశ నపరోక పీరీ ఎత్తుకున్నరు, గురుపాదం మాత్రం తనకు ఇష్టమైన బుట్టాల పీరీని ఎత్తుకోని ఎగురుతుండు, దుంకుతుండు. చూస్తాంటె ఆ దేవుడే వాళ్ల కళ్లముందుకు వచ్చినట్టు ఉంది.
పతొక్కరి ఇళ్లు తప్పియ్యకుంట పీరీలు పోతున్నాయి. ప్రతి ఇంటికాడ పీరీలకు నిండుకుండల నీళ్లు అరబోసి, ఒక కుడక కట్టి, ఇంత బెల్లం లేక చక్కెర, కానికగా డబ్బులు కూడా పెడుతుండ్రు. అన్వర్ చేత ఊదు బొట్టు పెట్టించుకుంటున్నరు. కొందరు మంచి జరగాలని బుట్టాల పీరీ ఉన్న గురుపాదంతో అరికట్టంతో కొట్టించుకుంటున్నరు. ఊరు మొత్తం తిరిగిండ్రు. జనాలు కట్టిన కుడకల బరువు పీరీ బరువుకంటే మూడింతలు ఎక్కువైంది. అయినా అలసటన్నదే లేకుండ ఆ బుట్టాల పీరీ ఎత్తుకొని గంతులేస్తుండు, ఇంత సుత ఆయాసం ఆలుపు అన్నది లేదన్నట్టుగా గురుపాదం.
ఊరు మొత్తం తిరిగిండ్రు. ఆకర్కి ఆ ఊరి చెరువుకట్ట కాడ్కి చేరుకున్నరు. అప్పట్కే తెల్లారే యాల్ల అయింది. చెరువు కట్టమీద పీరీలు నిలేశి, నిండు కుండల నీళ్లతో అన్వర్ మంత్రం చదివి పీరీల మీద సల్లిండు. దాంతో పీరీల పానం పోతుందని వాళ్ల నమ్మకం. ఎవలి పీరీకి వున్న కుడకలు వాళ్లు తీసి ఒక్కకాడ్నే యేసి, పీరీలకున్న గుడ్డలు, కిరీటాలు తీసి ఓ మూట కట్టిండ్రు. కుడకలు, జనాలు ఇచ్చిన బెల్లాన్ని తలా ఇంత తీస్కొని మూటలు నెత్తిమీద పెట్టుకున్నరు. ఆ పలారం నములుకుంటా ‘అల్విదా…ఓ అల్విదా… జాకాసుల్తా అల్విదా’ అంటు పాడుతూ పీరీల కొట్టం తొవ్వ పట్టిండ్రు.
కోళ్లు కూస్తున్నయ్..
అప్పుడే తెల్లారిందా అన్కుంట అటు ఇటు చూసిండు గురుపాదం. తాను ఇంక మంచంలనే పండుకొని ఉన్నడు. కప్పుకున్న రగ్గు అట్లనే ఉంది. ఇదంతా కల అని దిగాలువడ్డడు. తనకు శేతకాకుండ అయినకాంచి నాలుగేండ్ల పొద్దు పీరీలు చేసుడే బందు అయ్యింది. బతుకు పోరాటానికి పట్నం వట్టిండ్రు ఇది వరకు చేసినోళ్లు. మల్ల పీరీల పండక్కి ఎన్నడు ఆ వైభవం వస్తదో? ఈ పదిరోజులు వచ్చిపోతేందో? కండ్ల నీరు తనకు తెల్వకుండనే లోపట్కి పోయిన చెంపల మీద్కి కారింది.
ఆ బరువైన గుండెతో గొంతు నుంచి మాట సరిగ్గా రాకున్న గూడ “ఓ కౌలమ్మా! లేవ్.. లేవ్. కోళ్లు కూస్తున్నాయి” అని మంచం కిందున్న బుడిశెంబుల నీళ్లు తాగి “లేవ్ కౌలమ్మా! లేవ్” అన్కుంట ఆ అల్లాను మదినిండ తల్సుకున్నడు. కిందున్న చేతి కర్రను అందుకొని ఇంటివైపు నడిశిండు.
*
మాండలికంలోనే రాయాలనుంది
* హాయ్ గణేశ్! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది ఉమ్మడి వరంగల్(ప్రస్తుతం మహబూబాబాద్) జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల. జర్నలిజంలో పీజీ చేసి ప్రస్తుతం ఓ టీవీ ఛానల్‌లో సోషల్ మీడియా అసోసియేట్‌గా పని చేస్తున్నాను.
* కథలు రాయాలన్న ఆసక్తి ఎలా కలిగింది?
ఉద్యోగం చేయడం మొదలుపెట్టాకే కథలు రాయాలన్న ఆలోచన వచ్చింది. అప్పటిదాకా పత్రికల్లో వచ్చే కథలు చదవడం తప్ప, కథలు రాయాలన్న ఆలోచన లేదు. 2019లో ఉద్యోగంలో చేరాక ‘దావత్’ అనే పుస్తకం చదివాను. 2017లో సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్‌గార్ల సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ కథల సంకలనం అది. అది చదివాకే తెలంగాణ కథలంటే ఏమిటని అర్థమైంది. అదే సమయంలో తెలంగాణ మాండలికంలో ఉన్న మరికొన్ని కథల పుస్తకాలూ చదివాను. అప్పుడే నేనూ కథ రాయొచ్చని అనిపించింది.
* తొలి కథ ఎప్పుడు రాశారు?
తెలంగాణ మాండలికంలో ఉన్న కథలు చదవడం మొదలుపెట్టాక అవి చాలా నచ్చాయి. అందులోని మాటలన్నీ మా ఊళ్ళో మాట్లాడే మాటలే! నేనూ నాకు వచ్చిన యాసలో ‘నాటు కైకిలి’ అనే కథ రాశాను. అది రాయడానికి రెండు నెలలు పడితే, ఎడిట్ చేయడానికి ఒక నెల రోజులు తీసుకున్నాను. 2021 మార్చిలో వెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం ‘దర్వాజ’లో ప్రచురితమైంది. ఇప్పటికి ఏడు కథలు రాశాను.
* తెలంగాణ మాండలికంలోనే కథలు రాయాలని ఎందుకు అనిపించింది?
కథల కోసం నేపథ్యాన్ని వెతుక్కునే అవసరం లేకుండా, మా ఊరి సంగతులే నా కథలయ్యాయి. వాటిని తెలంగాణ మాండలికంలో రాయడమే బాగుంటుందని అనిపించింది. ఇప్పటిదాకా రాసిన కథలన్నీ అవే!
* మీరు రాసిన ఓ కథ విని మీ అమ్మ ఏడ్చారట?
నేను మూడో తరగతిలో ఉన్నప్పటి అనుభవాన్ని ‘వానలో కన్నీరు’ అనే కథగా రాశాను. అది ‘తంగేడు’ పత్రికలో ప్రచురితమైంది. అది మా తమ్ముడు చదివి మా అమ్మకు చెప్తే కన్నీళ్లు పెట్టుకుంది.
* మీకు నచ్చిన రచయితలు?
తెలంగాణ మాండలికంలో కథలు రాసిన రచయితలందరూ ఇష్టమే. పెద్దింటి అశోక్ కుమార్, పసునూరి రవీందర్, భూతం ముత్యాలు లాంటివారి కథలు చాలా నచ్చుతాయి. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’, కేశవరెడ్డి గారి ‘చివరి గుడిసె’, ‘మూగవాని పిల్లనగ్రోవి’ నవలలూ చాలా ఇష్టంగా చదివాను.
* ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది?
రాయాల్సిన కథలు ఉన్నాయి. మాండలికంలోనే వాటిని మరింత ప్రభావవంతంగా రాయాలని ఉంది.
*
మాండలికంలో ఉన్న తీపితనం ఇంకొక విధంగా రాదు, రప్పించలేం. బాగా రాశారు.
కథ బాగుంది. భాష చక్కగా ఉంది. శుభాకాంక్షలు.