యామిని నల్ల
- మీరు కథలు ఎప్పుడు రాయడం మొదలు పెట్టారు?
నాకు చిన్నప్పటి నుండి కథలు చదవడం, వినడం అన్నా చాలా ఇష్టం.. నేను విన్న చదివిన కథలను నా పద్దతిలో నాకు నచ్చిన పాత్రలతో కల్పించి స్నేహితులకు చెప్పేదాన్ని. ఎవరైనా ఎదైనా కథ చెప్పు అంటే అప్పటికప్పుడు స్వంతంగా క్రియేట్ చేసి చెప్పేదాన్ని.. రాయాలి అనే ఆలోచన అప్పుడు లేదు.. 2016 లో MA. Telugu లో జాయిన్ అయ్యాక సాహిత్యం మీద ఇంకా ఎక్కువ మక్కువ ఏర్పడింది. అప్పటినుండి రాయాలి అనే కోరిక ఏర్పడింది.. దానికి తోడు కవులు రచయితల పరిచయాలతో నేను కూడా రాయాలి అని అనుకున్నాను. ఖదీర్ బాబు గారి కథా కార్యశాల, తెరవే ఆధ్వర్యంలో కథా వర్క్ షాప్ ద్వారా కథలు రాయడంలో మెళకువలు తెలుసుకొని కథలు రాయడం మొదలు పెట్టాను. ఇప్పటి వరకు రెండు కథలు రాసాను.
- మీరు కథలు ఎందుకు రాస్తున్నారు?
నేను సమాజాన్ని మార్చుదామని కథలు రాస్తే సమాజం మారిపోతుంది అని కానీ.. సమాజాన్ని మార్చడానికి నేను కథలు రాయడం లేదు.. సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి.. స్పందనలు ప్రతిస్పందనలు ఉంటాయి కాబట్టి.. మనం ఎదైనా ఒక చెడు సంఘటన చూసినప్పుడు బాధేస్తుంది. కోపం వస్తుంది. అటువంటప్పుడు దర్మానుగ్రహం వ్యక్తం చేయడానికి ఒక ప్లాట్ఫార్మ్ కావాలనిపిస్తుంది.. దానిని నేను కథ ద్వారా ఆ విషయాన్ని చెప్తాను.. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఎంచుకుంటారు. కొందరు బొమ్మలు గీసి వ్యక్తపరుస్తారు, కొందరు కవిత్వం.. నేను కథ అనే ఆర్ట్ ఫాంని ఎంచుకున్నాను.. కథ ద్వారా విషయాన్ని సరిగ్గా చెప్పగలమని నేనుకుంటాను.
అక్కల చంద్రమౌళి
- మీరు కథలు ఎప్పటినుంచి రాస్తున్నారు?
ఒకవైపు సినిమాలకు పాటలు ముఖ్య వృత్తిగా గత ఎనిమిదేళ్లుగా రాస్తునే ఉన్నాను. నాకు సమయం దొరికినపుడల్లా కథలను వీపరితంగా చదివేవాడిని. ఆ చదవడమనేది కథలు రాయడానికి ఉపయోగపడింది. 2018 సంవత్సరం నుంచి కథలు కూడా రాస్తున్నాను. ఇప్పటివరకు ఐదు కథలను రాశాను.
- మీరు కథలు ఎందుకు రాస్తున్నారు?
అనేక భావోద్వేగాల అంతఃసంఘర్షణలు సమాజంలోని మనుషుల మధ్య ఉంటాయి. సమాజంలోని వివిధ వర్గాలు వాటి మధ్య సంబంధాలు, పరిస్థితులను వాటి భౌతిక, మానసిక రుపాలను అర్ధం చేసుకొని అధ్యయనం చేయడానికి కథలను రాస్తున్నాను అంతేగాకుండా వ్యక్తిగత అనుభవాలు, సామూహిక అనుభవంగా మారుతున్నపుడు సమస్యలు ఏర్పడుతాయి. వాటి పరిష్కారాలు కనుగొనడానికి అది అధ్యయనం చేయడంలో ఉపయోగపడటానికి మానవజీవితాలను కథలను రాయడానికి ఎంచుకున్నాను.
ఉప్పులేటి సదయ్య
- నేను వరంగల్ సి.కె.ఎం కాలేజీలో ఎం.ఏ తెలుగు చేస్తున్నప్పుడు సాహిత్యం మీద కొంత అవగాహన, ఆసక్తి పెరిగింది. అదేవిధంగా పాఠ్యాంశంలోని సాహిత్యం మాత్రమే కాకుండా ఇతర కవులు , రచయితలు రచించినటువంటి సాహిత్యం కూడ చదివాను. ఇలా చదువుతున్న క్రమంలో కథావస్తువులు నన్ను ఆశ్చర్యానికి గురి చేసినయి. ఇలాంటి సంఘటనలు నేను విన్నవి, కన్నవి ఉన్నాయి…. ఇలాంటి వస్తువు తీసుకుని కథగా రాస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతోని నేను కథలు రాయటం మొదలుపెట్టాను
- మీరు కథలు ఎందుకు రాస్తున్నారు?
మేధావులుగా మిగులుతామా లేదా అని నాకు తెలువది. కింది స్థాయి మనుష్యుల జీవితాల్లో జరిగిన సంఘటనలు చాల విషాదంతో కలగలిపి ఉంటాయి. ఒక్కొక్క సంఘటన తల్చుకుంటే ఇట్లకూడ జరుగుతదా అని రోమాలు నిక్కపొడిచే గాఢమైన బాధలు వారి జీవితన్ని అలుముకొని ఉంటాయి. ఐతే వాటిని కథలుగా ఎంచుకొని రాయటానికి ప్రధానమైన కారణం సమకాలీన సమాజంతోపాటు భవిష్యత్ తరాల వారు తెలుసుకుంటరు అని. చరిత్రలో అది లిఖించబడుతుందని ఒక స్వార్దపూరితమైన ఆలోచనతోని రాస్తున్నాను.
*
ఆహ్వానము
బుగులు తెలంగాణ కథ – 2020
ఆవిష్కరణ సభ తేది: 21 నవంబర్ 2021
సమయం: ఉదయం 10.30 గంటలకు
స్థలం: రవీంద్రభారతి, మినీ హాలు (మొదటి అంతస్తు), హైదరాబాద్
సభాధ్యక్షత: సంగిశెట్టి శ్రీనివాస్
ముఖ్య అతిథి & ఆవిష్కర్త: మంగారి రాజేందర్ (జింబో) ప్రముఖ కథకులు, TSPSC మాజీ సభ్యులు
గౌరవ అతిథులు: మామిడి హరికృష్ణ సంచాలకులు, తెలంగాణ భాష & సాంస్కృతికశాఖ
కాంచనపల్లి గోవర్ధనరాజు అసోషియేట్ ఎడిటర్, తంగేడు పక్షపత్రిక
ఆత్మీయ అతిథులు: పసునూరి రవీందర్ కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత
మెర్సీ మార్గరెట్ కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత
తొలిప్రతి స్వీకర్త: వేముల శ్రీనివాసులు ముల్కనూరు ప్రజాగ్రంథాలయం ముఖ్య సలహాదారులు
ఆహ్వానము: డా. వెల్దండి శ్రీధర్
సింగిడి తెలంగాణ రచయితల సంఘం హైదరాబాద్
Add comment