బీ సేఫ్!

కరోనా కహానీలు

“కరోనాతో కలిసి సహజీవనం చెయ్యాలి” భవిష్యత్తుని గురించి చెపుతూ మోటివేటర్ మాట పూర్తికాలేదు.

“మా ఆవిడ వొప్పుకోదు సార్” అన్నారెవరో వెనుకనించి. ఒక్కసారిగా క్లాసంతా నవ్వులు.

మోటివేటర్ కూడా నవ్వుతూ “మీకున్న అవకాశం మీ ఆవిడకు కూడా వుంటుంది, దెన్ నో ప్రాబ్లెమ్” అన్నాక నవ్వులు కొనసాగాయి.

“తప్పదు, మన లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి. అడ్జెస్ట్ అవ్వాలి. నేనెప్పుడూ ‘హౌ టు సర్వైవ్?’ అనే క్లాసులు చెపుతానని అనుకోలేదు. ఊహించను కూడా లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పుకుంటే చాలనుకున్నాను. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు యెవరికీ అక్కర్లేదు. పర్సన్ బతికుండాలంతే…” మాస్క్ మాటునుండి నిట్టూర్పు వదిలాడు మోటివేటర్.

క్లాసంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది!

మోటివేటర్ తేరుకుంటూ దీర్ఘశ్వాస విడుస్తూ “యిది యివాళో రేపో పోయే సమస్య కాదు” అని ఆగి “వాక్సిన్ వచ్చేవరకన్నా సర్వైవ్ కావాలి” అన్నాడు.

వింటున్న వాళ్ళందరిలో తెలియని భయం గూడుకట్టుకున్నట్టే వుంది.

“షార్ట్ లైఫ్. షార్ట్ గోల్స్. మునిపటిలా లాంగ్ గోల్స్ వొద్దు. క్వార్టర్లీ ప్లాన్స్ పెట్టుకోండి. ఇయర్లీ ప్లాన్స్ పెట్టుకోవడానికి లేదు, అంటే వీలు లేదు, యెందుకంటే యీ త్రీ మంత్సులో కండిషన్స్ మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాక్ టైం త్రీ టైమ్స్ ఎక్సుటెండ్ అయ్యింది. అంటే కండిషన్స్ మారుతున్నాయని ప్రూవయ్యింది. డేట్స్ చేంజ్ అవుతున్నాయి. నిజానికి లాక్ డౌన్ యెత్తేస్తే కరోనా లేనట్టు కాదు. మనం మరి బతకలేనట్టు…” మోటివేటర్ తను యిదివరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెపుతున్నప్పుడు మాట్లాడుతున్నదానికి యిప్పుడు మాట్లాడుతున్నదానికి విరుద్దంగా తనకే అనిపించిందేమో- వొక్క క్షణం అతని పెదాలపై వొక వైరాగ్యపు నవ్వు మెరిసి మాయమయ్యింది.

కాస్త దూరం దూరంగా కూర్చొని నిశ్శబ్దంగా వింటున్న వాళ్ళలో వివిధ వయసులవాళ్ళున్నారు. ఆడామగా వున్నారు. అందరి కామన్ పాయింట్ వొకటే. ఆ పాయింటుని టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతూ మోటివేటర్ మళ్ళీ అందుకున్నాడు.

“లాక్ డౌన్ పేరుతో యింట్లో కూర్చొని కరోనాని కొంతవరకు నియంత్రించొచ్చు. కాని ఆకలిని నియంత్రించలేం. ఆర్ధిక నియంత్రణ చేసుకోలేం. వరల్డ్ వైడ్ కరోనా మరణాల సంఖ్య దాదాపు మూడు లక్షలకు చేరువగా వుంది. కరోనా వైరస్ విజృంభణ యిదే విధంగా కంటిన్యూ అయితే రాబోయే మూడు నెలల్లో రోజుకే మూడు లక్షల మంది ఆకలితో చనిపోతారు. ఈ లెక్కన మొత్తం మూడుకోట్ల మంది వరకూ చనిపోవచ్చు. ఇవి నా మాటలు కావు. ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చీఫ్ డేవిడ్ బిస్లే చెప్పిన మాటలు…”

ధారాళంగా మాట్లాడే మోటివేటరుకు మాటలు రాలేదు. క్లాసులో అందరి ముఖాల్లోనూ భయం. వెంటనే అది గ్రహించిన మోటివేటర్ అభయం యిచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టాడు. “సో… మనం పనిలో పడాలి. ఐ మీన్ వుత్పత్తిలో భాగం కావాలి…” చెప్పబోతుంటే “సిచ్యువేషన్ ప్రాబ్లెమ్ కాదా?” అడిగారొకరు. “యు మస్ట్ ఫేసిట్. మన గవర్నమెంట్స్… సిస్టమ్స్ యివన్నీ ఆలోచించవా? చిస్తాయి. చించే సడలింపులూ. పాటే కొన్ని ఆంక్షలు. చెప్పాకదా… లైఫ్లో కరోనాని పార్టుగా చూడాలి. అప్పుడే సర్వైవ్ అవుతాం”

మోటివేటర్ మాటలకు యెలాంటి కామెంట్సూ రాలేదు. అందరి ఫేసులను రీడ్ చేసి డోస్ పెంచాలనుకున్న మోటివేటర్ “కాబట్టి చచ్చినోడు చస్తాడు. బతికినోడు బతుకుతాడు- అని లాక్ డౌన్ యెత్తేస్తున్నాయి గవర్నమెంట్స్…” అని గొంతు తగ్గించి “మనలో మన మాట… మన ఆర్ధిక వ్యవస్థ యెంత బలహీనమో కరోనా బయట పెట్టింది” అన్నాడు.

క్లాసులో వున్నవాళ్ళని యిన్వాల్వ్ చెయ్యాడానికన్నట్టు “పాపం మన డొల్లతనానికి కరోనా నిందలు పడుతోంది” అని నవ్వాడు. ఆ మాటకు కొందరే నవ్వినట్టు ముఖం పెట్టారు. లాభం లేదన్నట్టు తనే మళ్ళీ “మన భూమి యిరవై మూడున్నర డిగ్రీలు యెందుకు వొంగి వుంటుందో తెలుసా? కమాన్ టెల్మీ…” అడిగిన మోటివేటరుకు సమాధానం రాలేదు.

“భూమ్మీద మనుషులందరూ వొంగి వున్నప్పుడు భూమి మాత్రం యెందుకు వొంగి వుండదు?” అని ఆగి, యింకా అర్థం కాలేదేమోనని “వాళ్ళే. తిన్నగా నిలబడలేని వాళ్ళే. వొంగిన వాళ్ళే మనదేశాన్ని నిటారుగా నిలబెట్టే మూలస్థంభాలు. వారికి… ఆ తాగుబోతులకి మనందరి తరుపునా కృతజ్ఞతలు” మోటివేటర్ నవ్వుని అందుకొని అందరూ కాకపోయినా కొందరు నవ్వారు. “మీ కెపాసిటీని బట్టి మీరు దేశం బరువు బాధ్యతల్ని మోయొచ్చు, వొంగి…” మోటివేటరుకు మందుని తలచుకుంటేనే హుషారు వచ్చినట్టుంది.

“ఒంటిగా వచ్చాం. ఒంటిగానే పోతాం- అనేది వొంటబట్టించుకోవాలి. ఒంటరిగా వుండాలి. ఆత్మీయ ఆలింగానాలికి కూడా వొక రోజు వొస్తుంది” మోటివేటర్ మళ్ళీ తన టార్గెట్లోకి యెంటరయిపోతున్నాడు.

“మాస్క్ పెట్టుకున్న మొదట్లో మీకు యెలావుంది? బ్రీతింగ్. నార్మల్ గా లేదు. కొద్దిగా అనీజీగా వుంది. ఫ్రీగా లేదు. అలవాటయితే అంతా నార్మల్. ఇంకా కాలేదా? మాస్క్ లేకుండా వున్నప్పుడు తవుజెండ్ రుపీస్ ఫైన్ ని తలచుకోండి. మీరే తోవలోకి వస్తారు. కరోనా టైంలో తవుజెండ్ యీజే నాట్ స్మాల్ అమౌంట్” నవ్వాడు మోటివేటర్.

“మీరు గాలి యెలా పీలుస్తున్నారు? ముక్కుతో. కాదు. గాలి యెలా పీలుస్తున్నారు? మీకు తెలీకుండా పీలుస్తున్నారు. చేతులు కూడా అలానే కడుక్కోవాలి. అదొక అలవాటుగా కాదు. సహజంగా జరిగిపోవాలి. వ్యసనం కావాలి. అలానే మీ హేబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. మీరు యిక మీదట యెవరికైనా కానుకలు యివ్వాలంటే సానిటైజర్లూ మాస్కులే యివ్వాలి. కాస్ట్ తక్కువగా కనపడదు. కేర్ యెక్కువగా కనపడుతుంది”

మోటివేటర్ మాటలు పూర్తికాకముందే “కాన్ఫిడెన్సు లెవల్స్ పెంచుకోవాలంటే?” వో లేడీ అడిగింది.

“ఎందుకు కాన్ఫిడెన్సు లెవల్స్ పెంచుకోవడం? పక్కవాడు చనిపోతున్నా మనం బతికి వుంటామన్న కాన్ఫిడెన్సు దేనికి? అలా అయితే యెక్కడో చైనాలో వుడాన్. ప్రపంచమంతా పాకిందా లేదా? అలాంటిది పక్కనున్నవాడి నుండి మనకి రాదా? అసలు మనుషులకో నమ్మకం వుంటుంది. చావు దగ్గర అది రుజువవుతుంది. అందరూ చచ్చిపోతారు కాని మనం బతికి వుంటామన్నట్టు మన బిహేవియర్, థింకింగ్ వుంటుంది…”

మోటివేటర్ మాటలు యిదివరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల్లో చెప్పినదానికి విరుద్దంగా వున్నట్టు అక్కడ అదివరకే విన్న చాలా మందికి అనిపించింది. అందుకే “సినికల్” అన్న మాట వినిపించింది.

“నో. ఇట్స్ క్లినికల్” వెంటనే సమాధానం యిచ్చాడు మోటివేటర్. “జీవితంలో యెంతో కొంత వైరాగ్యం వుండాలి. వున్నట్టు వుంటాం. కాని లేం. నీటి బుడగ జీవితం అంటాం. కాని అది సిచ్యువేసన్ వస్తే తప్ప బోధ పడదు. పడినా ఆ యెలర్టునెస్ యెప్పుడూ వుండదు. ఇప్పుడు వుండాలి. ఇప్పుడు సిచ్యువేసన్ అలా డిమాండ్ చేస్తోంది” అని ఆగలేదు మోటివేటర్. చెప్పుకుపోతున్నాడు.

“ఇక మీదట జీతం కోత, జీతమేంటి జీవితమే కోత అనుకోవాలి. ఉద్యోగాల్లో కోత. మీ వుద్యోగమే వూడిపోవచ్చు. వుద్యోగం లేనప్పుడు యేమి చెయ్యాలి? సగం జీతంతో యెలా బతకాలి? అనేవి సపరేట్ అధ్యాయాలు. పిల్లలని ఆన్ లైన్ క్లాసెస్ కు యెలా అలావాటు చెయ్యాలి? మనమే యెలా ట్యూటర్లం కావాలి. మనమే సెల్ చూస్తూ పిల్లల్ని చూడొద్దు అని యెలా చెప్పాలి? జస్ట్ కిడ్డింగ్. వాళ్ళతో మనం యెలా పాట్లు పడాలో యివి కూడా వేరేగా చెప్పుకుందాం. మీ వర్క్ ఫ్రం హోం లాగే యెవ్విరిథింగ్ ఫ్రం హోం… యివన్నీ రాబోయే క్లాసెస్లో చెప్పుకుందాం. పార్టీలూ పబ్బులూ వాట్సప్ వీడియోల్లోనే చీర్సూ బార్సూ… వూ అన్నీ అన్నీ చెప్పుకుందాం”

అలసినట్టు ఆగిన మోటివేటర్ మళ్ళీ మొదలు పెట్టాడు.

“ఇది ప్రకృతి ఫలం. గ్రీన్ గా వుండే కాయ ఆరెంజ్ లోకి మారుతుంది. ఆరెంజులో పలుకుగా వున్న పండు పండి రెడ్ లోకి మారుతుంది. మనం వికృతిగా వున్నప్పుడు మన జోన్స్ కూడా అంతే. అలాగే మారుతాయి. ఇంకా చెప్పాలంటే యే జోనూ దానికదే ఆ జోన్లోనే వుండలేదు. మనకులాగే. సో మన కష్టాలూ శాశ్వతం కాదు. సుఖాలూ శాశ్వతం కాదు. అవి స్థిరంగా వుండవు. మారుతూ వుంటాయి. మారాలి. మారితేనే మనిషికి విలువ. జీవితానికి అర్థం”

ఒక్క క్షణం ఆగి మోటివేటర్ సెల్లో టైం చూసుకొని మళ్ళీ అందుకున్నాడు.

“ఇవాళ లెసన్ ముగించే ముందు నే చెప్పేది వొకటే. మీరు యెప్పుడు సేఫ్? మీ డ్రైవింగుని మీరు జాగ్రత్తగా చేస్తే సేఫా? మీ జర్నీ ముందుకెళుతుందా? వెళ్ళదు. మీ డెస్టినీ చేరుతారా? చేరరు. మీరు మీ పక్కవాడి అజాగ్రత్త నుండి తప్పించుకున్నప్పుడే అప్పుడు మాత్రమే మీ డ్రైవింగ్… మీ లైఫ్ డ్రైవింగ్… రెండూ సేఫ్. బీ హేపీ”

*

 

 

బమ్మిడి జగదీశ్వరరావు

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బజరా!మీ వ్యంగ్య వైభవం అద్భుతంగావుంది.ప్రారంభం నుంచీ మంచి సెటైర్లు..పేలాయి. భూమి ఒకవైపుకు ఎందుకు వాలివుందో…నాకిప్పటికిగానీ అర్ధం కాలేదు..భలే….అభినందనలు

  • బజరా కోటు తొడుక్కుని మోటివేటర్ గా కనపడుతున్నాడు. 🙂

  • నేటి పరిస్థితికి దర్పణం
    సూటిగా చెపితే ఎవరికి పట్టదు.. బజరా మార్గం మేలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు