ఒడియా మూలం : గౌర హరి దాసు
తెలుగు అనువాదం : వంశీకృష్ణ
శనివారం ఉదయం
ఇంటి ముందున్న ఆకుపచ్చటి పచ్చిక లో రెండు కుంకుమ రంగు ఆరుద్రపురుగులు ఒక దాని వెనుక మరొకటి పరుగులు తీస్తూ జయంతి కళ్ళ కి కనిపించాయి. వాటిని చూస్తూనే ఈ ప్రపంచం లో వున్న దుఃఖం తోనూ , బాధతోనూ , దేనితోనూ సంబంధం లేకుండా ఎలా నిర్వికారంగా, నిష్పూచీగా పరుగులు తీస్తున్నాయో అనుకుంది. వాటిని చూస్తూనే చెల్లెలికి కూడా చూపించాలని
” దామూ ! ఇలా రా ! ఒక్కసారి ? ఈ ఆరుద్ర పురుగులు ఎంత బావున్నాయో చూడు ” అంటూ కేకేసింది.
తనకై తాను తెచ్చిపెట్టుకున్న చలి,జ్వరం సాకుతో స్కూల్ కి బంక్ కొట్టాలని నిర్ణయించుకున్న దమయంతి అక్క పిలుపుకు స్పందించి ముసుగు తీసి బయటకు వచ్చి తండ్రికి దొరికిపోవడానికి ఇష్టపడలేదు. తండ్రి ఆఫీస్ కి వెళ్ళిందాకా ఆమె బెడ్ రూమ్ లో నుండి బయటకు రాదలచుకోలేదు. తండ్రి ఒక్క సారి బయటకు వెళితే తానిక ఇష్టం వచ్చినట్టు అక్కతో ఆటలాడవచ్చు అనుకుంది.
అందుకే ఆమె అక్క పిలుపుకు బదులు పలుకుతూ-
” నువ్వు వాటిని చూస్తూ వుండు. నేనిక్కడ శీతాకోక చిలుకలు నాట్యం చేయడాన్ని చూస్తున్నాను ” అని జవాబు చెప్పింది. కానీ ఆ వెంటనే ఆమెకు అక్క దగ్గరకు వెళ్లడమే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అక్క మాత్రమే “తను స్కూల్ కె వెళ్లకుండా ” తండ్రి దగ్గర మ్యానేజ్ చేయగలదు.
గత మూడురోజులుగా ఎడ తెరపి లేకుండా వాన కురుస్తున్నది. నేలంతా తడి తడిగా , బురదబురదగా ఉంది . ఇంట్లో ఉన్న అన్ని వస్తువులకూ చెమ్మ చేరుకుంది. మూడు రోజుల తరువాత మొదటి సారి సూర్యుడు ఆకాశాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. ఇంటి వెనుక పెరటి తోట లోని బెండ మొక్కలకు పూచిన పూల మీద శీతాకోక చిలుకలు వాలి కను విందు చేస్తున్నాయి. దమయంతి ఈ సంవత్సరం పదవతరగతి పరీక్షలకు కూచోవాలి. నిన్న తను వాన కారణంగా స్కూల్ కి వెళ్ళలేదు. ఇవాళ జ్వరం వచ్చింది. యివాళ మధ్యాహ్నం దమయంతి అభిమాన నటుడి సినిమా టి.వి. లో టెలి క్యాస్ట్ కాబోతుంది కనుక తనకు అనివార్యంగా జ్వరం వచ్చేసింది. పైగా శనివారం కావడం తో స్కూల్ కూడా హాఫ్ డే మాత్రమే ఉంటుంది. పెద్దగా ఇంపార్టెంట్ క్లాసులు కూడా ఏమీలేవు. మరి జ్వరం వచ్చిందంటే రాదా ?
ఆ కుట్రలో జయంతి కూడా పాలు పంచుకుంది.
ఆ ఇద్దరికీ ప్రియమైన నాన్న సంతోష్ కునార్ ఉదయం వార్తా పేపర్లు చదువుతూ బిజీగా వున్నప్పుడు జయంతి , దమయంతి నుదుటి మీద చెయ్యి పెట్టి చూసి –
” ఓహ్ కాలి పోతున్నది” అన్నది. సంతోష్ కి చిన్న కూతురంటే రవ్వంత ప్రేమ ఎక్కువ. అతడు కాస్త ముందుకు కదిలి దమయంతి చేయి పట్టుకుని చూడటానికి సిద్ధం కాగానే, అతడు అలా చేస్తే తమ నాటకం బయటపడుతుందని గ్రహించిన జయంతి ” బయట గాలిలో కూర్చోకు. లోపలకు వెళ్లి శాలువా తెచ్చుకో !” అన్నది.
చాలా బుద్ధిమంతురాలైన విద్యార్థిలాగా దమయంతి “నా కివాళ స్కూల్ ఉంది. పడుకుంటే ఎట్లా ?'” అన్నది.
వార్తా పత్రిక చదువుతూనే “ఇవాళ శనివారం కదా ! ఈ పూటకి స్కూల్ మానెయి. ఒక టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపు ఎలాగు ఆదివారం కదా ! సోమవారం నుండి స్కూల్ కి వెళ్లొచ్చు.” అన్నాడు తండ్రి.
అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఒకరి వంక ఒకరు చూసుకుని తండ్రి చూడకుండా థమ్స్ అప్ భంగిమ చెప్పుకున్నారు. ” ఓ కే ! ఇవాళ నువ్వు నాకు ఫేవర్ చేసావు కదా , సమయం వచ్చినప్పుడు నీకు నేను ఫేవర్ చేస్తాను ” అన్నది దమయంతి మెల్లగా అభివాదం చేస్తున్న భంగిమలో తలవంచి జయంతి తో
చిన్న కూతురు పెరట్లో శీతాకోక చిలుకల ను ,పెద్ద కూతురు ఇంటి ముందు పచ్చిక లో రంగురంగుల పురుగులను చూస్తూ వున్నప్పుడు సంతోష్ తనను కలవడానికి వచ్చిన తన పక్క ఇంట్లో వుండే మిత్రుడు నారాయణబాబు , కళింగ నగర్ నాగరిక కమిటీ సెక్రటరీ దుర్గాచరణ్ బాబు తో కాలనీ సమ్యల మీద మాట్లాడుతున్నాడు. సంతోష్ జిల్లా హై స్కూల్ లో టీచర్. ఇంగ్లిష్ బోధిస్తాడు. ఆ కాలనీ లోని వాళ్లంతా రిటైరయిన ఉద్యోగస్తులు. కొంతమంది ఇంజనీర్లు , మరికొంతమంది డాక్టర్లు.జిల్లా ప్రధాన కేంద్రానికి ఆ కాలనీ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
” మనిషి తనకోసం గుళ్ళు , గోపురాలు , చర్చ్ లూ కట్టుకున్నాడు. ధార్మిక, మత భావనలు పెంపొందించుకున్నాడు. చిత్రంగా ఆ మత భావనలే మనిషిని మనిషికి శత్రువుగా చేస్తున్నాయి.” అన్నాడు దుర్గాచరణ్.
వాళ్ళ ముందు ఆ రోజు వార్తాపత్రిక సగం తెరచి వుంది. రాజధాని నగరం లో బాంబు పేలుళ్లు, బీహార్ లో వరదలు , జార్ఖండ్ లో మావోయిస్టుల అకృత్యాలు, కంధమాల్ జిల్లాలో హిందువులకు , క్రైస్తవులకు మధ్య జరిగిన ఘర్షణలు ఆ రోజు వార్తాపత్రిక మోసుకొచ్చిన ప్రధాన వార్తలు. లోపలి పేజీలలో ఎక్కడో ఒక మూల అమర్నాథ్ యాత్రికుల మధ్య జరిగిన ఘర్షణ చిన్న అక్షరాలతో ఉంది.
దుర్గా చరణ్ కాఫీ మరొకసారి సిప్ చేసి ” మీ అభిప్రాయం ఏమిటి ?” అని ప్రశ్నించాడు
” దేవుడు మనిషి భయం లోనుండి ఊపిరి పోసుకున్నాడు. అతడు మనిషిని ఎలా కాపాడగలడు?” అన్నాడు సంతోష్
” మీరు మంచి మాట చెప్పారు. ఒక్క క్షణం ఆగండి. దేవుడు మనిషి భయాల లోనుండి ఊపిరి పోసుకున్నాడు. ఇదే కదా మీరు చెప్పేది”. సంతోష్ చెప్పిన దానినే మళ్ళీ రిపీట్ చేస్తూ అన్నాడు దుర్గాచరణ్.
” కాక మరేమిటి? మనిషి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించాడు. కాళీ, లక్ష్మీ, దుర్గా అలాగే మన ధరణిపేను. ఇదంతా మన ఊహల ఫలితమే.” మళ్ళీ స్థిరంగా అన్నాడు సంతోష్
“నువ్వు చాలా తర్కబద్దంగా మాట్లాడతావు సంతోష్ ! నిన్ను చూస్తే చాలా అసూయ కలుగుతుంది. ఇదంతా నువ్వెప్పుడు ఆలోచించావు ?” అన్నాడు నారాయణబాబు
” ఇదంతా నా సొంత జ్ఞానమేమీ కాదు. పుస్తకాలలో చదివిందే ! కనుక మీరు ఆశర్యపడవలసినది ఏదీ లేదు.” అన్నాడు సంతోష్
” మీరు పుస్తకాలు చదువుతారు. బొమ్మలు వేస్తారు. అద్భుతంగా పాడతారు. త్రీ ఇన్ వన్ అన్నమాట.” అన్నాడు దుర్గాచరణ్
“త్రీ ఇన్ వన్ కాదు. ఫోర్ ఇన్ వన్ అనండి. ఎందుకంటే తను అద్భుతంగా వేణువు ఊదుతాడు.” అన్నాడు నారాయణ బాబు
” అవునవును. రాత్రి కృష్ణా వాళ్ళ ఇంట్లో మీరు పాడిన రాగం ఎంత అద్భుతంగా వున్నదో ! ప్రతి ఒకళ్ళు ఆగి మీ రాగం విన్నారు.”
సంతోష్ నవ్వి ” అది రాగ బహార్ ! సరే మనమిక అసలు సమస్య లోకి వద్దాం.” అన్నాడు
” మీరొక డ్రాఫ్ట్ తయారు చేయండి. మేమందరమూ సంతకం పెడతాము. అందులో నేను చెప్పినవన్నీ ఉండాలి. వాళ్లొక కాలనీ కట్టారు. ఇళ్లన్నీ అమ్మేసారు. పది పదిహేనేళ్ళు అయినా కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఒక పోస్టాఫీస్ లేదు,ఒక హాస్పిటల్ లేదు, కనీసం ఒక బస్ షెల్టర్ కూడా లేదు. ఏ సౌకర్యమూ లేకుండా జనం ఎలా బతికేది? మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ?”
దుర్గాచరణ్ మాటలను మధ్యలోనే అడ్డుకుని ” కొన్నాళ్ల క్రితం నేను కలకత్తా వెళ్ళాను. వివేకానందుడి చికాగో ఉపన్యాసం శతాబ్ది సంబరాల కోసం. నాలాగా బయటనుండి వచ్చినవాళ్లు అరవై మంది వున్నారు. మాకు కొత్తగా కట్టిన ఒక కాలనీలో మాకు బస కల్పించారు. కాలనీ ఇళ్లలో ఇంకా గృహప్రవేశాలే జరగలేదు. ఇంటి యజమానులు ఎవరూ ఇళ్లల్లో లేరు. కానీ కాలనీ లో ఒక పార్క్ , పోస్టాఫీస్ , పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలం అన్నీ కల్పించారు. ఇక్కడ ఒడిశా లో కాలనీ కట్టి పదిహేనేళ్ళు అయినా పట్టించుకునే నాథుడు లేడు .” కొంచం ఆవేశం తో స్వరం పెంచి మాట్లాడాడు నారాయణబాబు దుర్గాచరణ్ కి మద్దతుగా
సంతోష్ వాతావరణాన్ని తేలిక చేస్తూ ” మనకు చాలా సమస్యలు వున్నాయి కనుకే కలిసి వున్నాము.” అన్నాడు
ముగ్గురూ నవ్వుకున్నారు
” నేను డ్రాఫ్ట్ రెడీ చేసి ఉంచుతాను. రేపు సాయంత్రానికల్లా మీరు సంతకాలు పెట్టేస్తే సరిపోతుంది. మనమిక ఇవాళ్టి కి ముగిద్దాం ” అన్నాడు సంతోష్
నారాయణబాబు , దుర్గాచరణ్ ఇద్దరూ తమ ఇళ్లకు మళ్లారు.
” ఈ సంతోష్ ను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఫాల్స్ ప్రిస్టేజి లేదు. మంచి నాలెడ్జ్ ఉంది. నోరు తెరచి మాట్లాడితే విన్న కొద్దీ వినబుద్ది వేసేలా ఉంటాయి అతడి మాటలు. అతడి చుట్టూ ఒక పూల పరిమళం ఏదో ఆవరించుకుని వున్నట్టే వుంటుంది. ట్రైబల్స్ లో కూడా ఇలాంటి మనుషులు వుంటారా ?” అనిపిస్తుంది అతడ్ని చూస్తుంటే ” అన్నాడు దుర్గాచరణ్ న నారాయణ బాబు తో
నారాయణబాబు తల ఊపి
” కానీ అతడికి ఒక్కటే లోటు. భార్య అకాల మరణం పొందినది. అతడు కావాలి అనుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు , కానీ ఇద్దరు పిల్లల కోసమని అలాగే వుండిపోయాడు. లేకపోతే 40/42 ఏమంత పెద్ద వయసు? ” అన్నాడు
వాళ్ళిద్దరి హృదయాలలో సంతోష్ పట్ల ప్రేమ పొంగి పొరలింది. గత ఏడు సంవత్సరాలుగా ఆ కాలనీ లో సంతోష్ దే ప్రధాన పాత్ర ఏ పండగైనా , పబ్బమైనా , మరే ఇతర వేడుక అయినా ! తన మీద కాలనీ వాసులు వేసిన ఏ బాధ్యత నుండీ ఎప్పుడూ అతడు తప్పించుకోలేదు. భార్య పోయిన తరువాత చాలా కాలం వరకు అతడా దుఃఖం నుండి తేరుకోలేక పోయాడు. కానీ శిశిరం లో ఆకులన్నీ రాల్చేసిన తరువు వసంతం లో కొత్త చివురులు తొడుక్కున్నట్టు అతడు తన పూర్వ ఉత్సాహవంతమైన రూపానికి వచ్చేసాడు.
పెద్ద కూతురు జయంతి చదువులో వజ్రం. కంప్యూటర్ ఇంజనీర్ కావాలన్నది ఆమె కోరిక. చిన్న కూతురు దమయంతి బద్ధకిస్టు. తక్కువ శ్రమ తో ఎక్కువ ఫలితాలు పొందాలి అనుకునే బాపతు. ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్ కానీ, గాయని కానీ కావాలి అనుకుంటున్నది. గాయని గా కెరీర్ లో ముందుకు పోవడం కష్టమనీ , ఫ్యాషన్ డిజైనర్ అనే వృత్తి ఒడిశా లో వేళ్లూనుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందనీ సంతోష్ చెవిన ఇల్లు కట్టుకుని నచ్చ్చచెప్పడం తో ఇప్పుడిప్పుడే ఆమె అక్క అడుగుజాడలలో నడచి ఇంజనీర్ కానీ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ చదవాలని అనుకుంటున్నది
నారాయణబాబు , దుర్గాచరణ్ వెళ్ళగానే సంతోష్ ఇంట్లోకి వస్తూ ” జయంతీ ! నాకు అన్నం పెట్టేసి దమయంతి కి ఒక సినారెస్ట్ టాబ్లెట్ ఇవ్వు” అని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళాడు. సంతోష్ ఆ మాటలు చెప్పినప్పుడు జయంతి దృష్టి పక్క ఇంటి మేడ మీద నుండి తన కొత్త క్యామెరా తో ఫోటోలు తీస్తున్న మనోజ్ పై ఉన్నది. మనోజ్ , జయంతి ఇద్దరూ సెయింట్ జేవియర్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు.
మనోజ్ భువనేశ్వర్ లో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్లి సెలవులకు ఇప్పుడు ఇంటికి వచ్చాడు. మనోజ్ మేడ మీద నుండి ఫోటోలు తీస్తున్న విధానం చూస్తే ” అతడికి ఫోటోలు తీయడం మీద కంటే కొత్త క్యామెరా ను ప్రదర్శించడం మీదే ఎక్కు శ్రద్ధ ఉన్నట్టు ” జయంతికి అనిపించింది
జయంతి నవ్వి గాలికి ముందుకు పడిన తన నుదుటి మీది ముంగురులు వెనక్కు నెట్టుకుంటూ, లోపలి కి సంతోష్ కి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి వెళుతూ గట్టిగా చెప్పింది మనోజ్ తో ” ఒక సాధారణ మామూలు క్యామెరా అటూ ఇటూ తిప్పినంత మాత్రాన వీడియో క్యామెరా గా మారుతుందా ?” అని. ఆ ప్రశ్న వేస్తూ ఆమె వెనక్కు తిరిగినప్పుడు ఆమె వీపు మీద నల్లని నాగుపాము లాంటి జడ ఆమె వెనక్కు తిరిగిన వేగానికి అటూ ఇటూ ఊగిసలాడింది.
2
సంతోష్ ఎలియాస్ సంతోష్ కునార్ సొంత వూరు పూల్భని ప్రాంతంలోని తుమిడిబంధ. 2008 వ సంవత్సరం లో అక్కడ పాన , కంద గిరిజన తెగల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. 13 జిల్లాలుగా విస్తరించి ఉన్న ఒడిషా రాష్ట్రం 1990 లో 30 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ పొందినప్పుడు బౌద్ -పూల్భని జిల్లా బౌద్ , కంధమాల్ జిల్లాలుగా విడిపోయింది.
సంతోష్ కునార్ బాల్యం అంతా పూల్బనీ దట్టమైన అరణ్యప్రాంతాలలో గడచింది. ఆ ప్రాంతం లో ఇప్పటికి కూడా మిట్టమధ్యాహ్నం చీకట్లు కమ్మినట్టు ఉంటుంది చెట్ల నీడ పరచుకోవడం తో!. అత్యంత పవిత్రమైన ధరణిపెను దేవత కారణంగా ప్రతి పన్నెండేళ్ళకి ఒకసారి కంద , పెన తెగల మధ్య ఘర్షణ జరుగుతుంది. చాలా చిన్న చిన్న విషయాలకే దుడ్డుకఱ్ఱలు అందుకుంటారు. ఒక గ్రామం లో మొదలైన ఘర్షణ రెప్ప మూసి తెరిచేంతలో మిగతా గ్రామాలకు కూడా వ్యాపిస్తుంది . తలలు పగిలి , చేతులు విరిగి రక్తమోడేలా కొట్టుకుంటారు.
సంతోష్ తన చిన్నప్పుడు అదంతా స్వయంగా చూశాడు. అలా చూసిన అనుభవం తోనే ” ఎక్కడెక్కడ అయితే దేవాలయాలు , చర్చులు వుంటాయో ఆ పవిత్రమైన ప్రదేశాలలోనే ఒక మతం మీద మరొక మతం ఆధిపత్యం వహించడానికి కుట్రలు వేళ్లూనుకుంటాయి. పగటిపూట ప్రేమ ,స్నేహం , సౌభ్రాతృత్వం బోధించే ప్రార్ధనా స్థలాలు రాత్రిపూట మతం మారడానికి ఇష్టపడని జనం మీద దాడులు చేయడానికి అవసరం అయితే హత్యలు చేయడానికి పథకాలు పన్నే కుట్ర స్థలాలుగా మారతాయి.” అంటాడు.
సంతోష్ తండ్రి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ లో డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆ ప్రాంత చరిత్ర ను యువ సంతోష్ కి సమయం దొరికినప్పుడల్లా చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ ప్రాంతమంతా కంద తెగ గిరిజనులదే !. వాళ్ళ భాష కుయి. కొన్నాళ్ళకు అక్కడకు దగ్గరనే వున్న గంజాం, నయగఢ్ జిల్ల్లాల నుండి వలస వచ్చిన పన తెగల ప్రజలు కూడా నివాసం ఏర్పరచుకున్నారు. పన తెగ గిరిజనులు మేకలు , గొర్రెలు పెంచుకుని జీవించేవాళ్ళు. మలేరియా లాంటి జబ్బులు ఏవైనా వస్తే దేవత అనుగ్రహం కోసం ఎదురుచూడటం తప్పిస్తే వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రి అంటూ ఆ ప్రాంతం లో లేనే లేదు. అప్పుడు మొట్టమొదట క్రిష్టియన్ మిషనరీలు వచ్చాయి. వాళ్ళు మెల్లమెల్లగా పన గిరిజనులను క్రిస్టియానిటీ లోకి మార్చడం మొదలుపెట్టారు. అలా మార్చడానికి వాళ్ళు వేసిన ఎర మద్యం. అంతేకాకుండా పన గిరిజనులు హిందూ మతం లో దిగువ స్థాయికి చెందిన వాళ్ళు కావడం తో అగ్ర వర్ణాల నుండి ఎదురయిన వివక్షనుండి తప్పించుకోవడానికి కూడా క్రిస్టియానిటీ ని స్వీకరించారు.
పన గిరిజనులను క్రిస్టియానిటీ లోకి మార్చినట్టే కంద గిరిజనులను కూడా క్రిస్టియానిటీ లోకి మార్చడానికి మిషనరీలు ప్రయత్నం చేసాయి. కానీ కంద గిరిజనులు మతం మారడానికి ఒప్పుకోలేదు. అందువల్ల పన , కంద తెగల మధ్య ఘర్షణ జరగడం నిత్యకృత్యం అయింది. కంద గిరిజన దేవత ధరణి పెను కు ప్రతి రూపంగా భావిస్తూ ఇంటి ముందు పాతిన గుంజలను పెన సమూహాలు కావాలని పీకి పారేసేవి. శివుడు , మంగళ , మేరీ మాత పేర్ల మీద తరచూ ఘర్షణలు జరిగేవి.
ఈ తెగల మధ్య ఉన్న ఘర్షణలు అంత తేలికగా సమసిపోవు అని సంతోష్ కి అర్ధం అయింది. క్రిస్టియానిటీ స్వీకరించిన పెన గిరిజనులకు విద్య , వైద్యం అంది హరిజనులుగా రూపాంతరం చెందారు. తరచూ కాషాయం కట్టుకున్న హిందూ బాబాలు , స్వాములు బలవంతంగా చేసే మత మార్పిడుల గురించి ఉపన్యాసాలు ఇస్తారు కానీ హిందూ మతాన్నే అంటిపెట్టుకుని వున్న కంద గిరిజనులకు వాళ్ళు చేసిందేమీ లేదు. ఇప్పటికే మిగిలిన ఇళ్లలో తొంభయ్ శాతం ఇళ్ల మీద శిలువ గుర్తు వేలాడసాగింది.
సంతోష్ తండ్రి పదేళ్ల క్రితం బెర్హంపూర్ లో కన్నుమూశాడు. అతడు చనిపోతూ సంతోష్ తో ఒక మాట చెప్పాడు.
” ఈ అడవిలో ప్రశాంతత అన్నదే లేదు. పెన , కంద ఘర్షణలు ఆగేవి కాదు. అడవిలో పులులు, సింహాలు అంతరించాయి కానీ వాటి ఆత్మలు ఈ అడవిలోని మనుషులలో ప్రవేశించి నెత్తుటి క్రీడలు సాగిస్తున్నాయి. నువ్వు చదువుకున్నావు. హాయిగా సిటీకి వెళ్లి బతుకు. ఈ అడవిని సొంత ఊరును మరచిపో!”
సంతోష్ అలాగే ప్రయత్నం చేశాడు. కానీ తన చిన్నప్పటి ఊరును, ఆ జ్ఞాపకాల దృశ్య పరంపరను అతడు ఎలా మరచిపోగలడు? ఊరు గుర్తొచ్చినప్పుడల్లా అతడికి చెప్పలేనంత అసహనం, కోపం ముంచుకొస్తాయి. కానీ ఎవరిమీద ఫిర్యాదు చేయగలడు? అతడు పుట్టింది ఆదివాసీగా ! చదువుకుంది మిషనరీ పాఠశాలలో! ఒక భారతీయుడు గా మిగిలినందుకు అతడికి గర్వం. తన వూళ్ళో కుయి భాష మాట్లాడతాడు. స్కూల్ లో ఆంగ్లం బోధిస్తాడు. నిత్య జీవన వ్యవహారాలకై సిటీలో ఒడియా మాట్లాడతాడు.
” అసలు దేవుడు, మతం అనేవి లేకపోతే జనం తమ సహజ స్వభావాలతో ఉండేవారేమో?” అనుకుంటాడు. అందుకే మతం , దేవుడు లాంటి విషయాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండటమో లేదా “ఊ ” “ఆ ” అంటూ ఏకాక్షర పదాలు పలకడమే చేస్తూవుంటాడు.
చూస్తూ ఉండగానే పాతికేళ్ళు గడచిపోయాయి టీచర్ గా వుద్యోగం లో చేరి. షెల్లీ , బైరన్ , కీట్స్ లను చెప్పడం లో తన ఆనందాన్ని అతడు వెతుక్కుంటున్నాడు
3
సంతోష్ స్కూల్ కి వెళ్ళగానే జయంతి ముందు గది తలుపు కి తాళం వేసి లోపలకు వచ్చింది. లోపల దమయంతి దుప్పటి పక్కకు నెట్టేసి డాన్స్ చేస్తోంది.టి వి అప్పటికే స్విచ్ ఆన్ చేసి వుంది
” ఇంతకూ శీతాకోక చిలుకను పట్టుకున్నావా ?” అని అడిగింది జయంతి
” లేదు రేపు పట్టుకుంటాను” అన్నది దమయంతి
” రేపా ? శీతాకోక చిలుకలు ఒక రోజు కంటే ఎక్కువ బతకవని నీకు త్తెలియదా ?”
జయంతి మాటలు పట్టించుకోకుండా దమయంతి టి వి రిమోట్ లో బటన్లు అటూ ఇటూ నొక్క సాగింది.
“లే ! లేచి స్నానం చేసిరా ! టి వి ముందు కూర్చుంటే నువ్వు లేవవు” అన్నది జయంతి
దమయంతి సోఫా మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని వొళ్ళో దిండు పెట్టుకుని టి వి రిమోట్ తో ఆటలాడుతూ
” నేను జ్వరం తో బాధపడుతున్నాను. స్కూల్ తో పాటు ఇవాళ స్నానానికి కూడా డుమ్మానే ” అన్నది
దమయంతి అలా చెప్పిన తీరుకు జయంతి ఫక్కుమని నవ్వింది
4
ఆదివారం ఉదయం
సంతోష్ షేవింగ్ చేసుకుంటుంటే దమయంతి గేటు ముందు పడేసి ఉన్న వార్తా పత్రిక అందుకుని తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చి
” పేపర్ ” అన్నది
” నీ జ్వరం తగ్గిందా ?’ అని దమయంతిని ప్రశ్నించాడు సంతోష్
అతడి ప్రశ్న పూర్తి కాకుండానే ఇంటి ముందు కి వచ్చి ఒక పోలీస్ జీపు ఆగింది. జీపు లో నుండి ఒక సబ్ ఇనస్పెక్టర్, ఒక కానిస్టేబుల్ దిగి, సంతోష్ ఇంటి గేట్ తట్టారు. పోలీసులు అలా తట్టగానే దమయంతి గబగబా ఇంట్లోకి వెళ్లి అక్కతో ” పోలీసులు వచ్చారు” అని చెప్పింది
ఇనస్పెక్టర్ మరోసారి తలుపు తడుతూ ” సంతోష్ కునార్ ఇంట్లో ఉన్నారా?” అని పెద్దగా అడిగాడు చుట్టూ కలియ చూస్తూ
సంతోష్ టవల్ తో మొహం తుడుచుకుంటూ తలుపు దగ్గరకు వచ్చి ” నేనే ! సంతోష్ కునార్ ” అన్నాడు
” మాతో పోలీస్ స్టేషన్ కి రండి ” అన్నాడుఇనస్పెక్టర్ అధికార దర్పం తో
సంతోష్ ఒక్క అడుగు వెనక్కు వేసాడు. తానెందుకు స్టేషన్ కి వెళ్ళాలి? తాను ఎవరికీ ష్యురీటీ ఏదీ పెట్టలేదే? ఏ కేసులోనూ కనీసం సాక్ష్యం కూడా కాదు కదా? తానెందుకు వెళ్ళాలి ?” ఆలోచిస్తూనే “ఎందుకు ?” అన్నాడు
” అదంతా పోలీస్ స్టేషన్ లో తెలుస్తుంది. మీమీద వారంట్ వుంది. మీ మొబైల్ ఫోన్ మాకు హ్యాండోవర్ చేయండి ” అన్నాడు ఇనస్పెక్టర్
సంతోష్ ఒక్కసారిగా కుంగిపోయాడు. అతడికి చిన్నప్పటినుండీ పోలీసులంటే భయం. సంతోష్ ఇంటికి ఎదురుగా ఉండే మహాపాత్ర , అతడి భార్య , పిల్లలు పోలీసులవంక తేరిపార చూస్తున్నారు. కుడివైపున వుండే నారాయణబాబు ఇంకా ఉదయపు నడక నుండి వచ్చినట్టులేదు. సంతోష్ ఇంటికి నాలుగిళ్ళ అవతల నివసించే జర్నలిస్ట్ రమేష్ రాత్రి ఎప్పుడో ఆలస్యంగా వచ్చి ఉంటాడు కనుక ఇంకా లేచి ఉండడు. సంతోష్ వెనక్కు తిరిగి ఇద్దరు పిల్లల వంక చూశాడు. జయంతి భయపడుతున్నది కానీ ఆ భయాన్ని బయటకు కనపడనీయడం లేదు. చిన్న కూతురు దమయంతి భయం తో వణికి పోతోంది.
” ఒక్కసారి మా హెడ్ మాస్టారికి ఫోన్ చేసుకోనివ్వండి” అన్నాడు సంతోష్ సబ్ ఇనస్పెక్టర్ తో.
” ముందు స్టేషన్ కి పదండి.” అన్నాడు కర్కశంగా సబ్ ఇనస్పెక్టర్
” నేను వెంటనే తిరిగి వస్తాను. మీరేం భయపడకండి.” అని సంతోష్ పిల్లల తో చెపుతూ ఉండగానే పోలీసులు ఆయన్ని దాదాపు లాక్కుని వెళ్లినంత పని చేసారు. సంతోష్ ను జీప్ వెనుక సీట్లోకి నెట్టేసి జీపు పెద్దగా చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పటికే సగం తెరచిన తలుపుల సందులనుండి, డాబా మెట్ల మీద నుండి, కిటికీల లో నుండి కాలనీ జనం సంతోష్ ఇంటివైపు కొంత ఉత్సుకత తోనూ , మరికొంత ఆరా తోనూ చూడసాగారు. ఉదయం పూట చాలా ప్రశాంతంగా వుండే ఆ కాలనీ సంతోష్ ఇంటికి పోలీసులు వచ్చారు అన్న వార్త తో కలవరపడి పోయింది. ప్రధాన రహదారి మీద, టీ బడ్డీ ల దగ్గరా గుసగుసలుగా మొదలైన సమాచార వ్యాప్తి కొద్దీ క్షణాల్లోనే కాలనీ అంతా పాకిపోయింది ” స్కూల్ మాస్టర్ సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేసారంటూ”
దమయంతి , జయంతి మధ్య గదిలో మూగబొమ్మలు లాగా కూర్చుండిపోయారు. చుట్టు పక్కల ఇళ్ల నుండి ఒక్కరు కూడా వచ్చి పలకరించి, అసలేమైందో తెలుసుకునే ప్రయత్నం కానీ వాళ్లకు ధైర్యం చెప్పే ఆలోచన కానీ చేయలేదు. ఇంటి ముందు నుండి యధావిధిగా వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. పాదచారులు ఒక్క క్షణం పాటు ఇంటి ముందు ఆగే మళ్ళీ తమ దోవన తాము వెళ్లిపోతున్నారు.
పిల్లలు ఇద్దరూ ఉదయం నుండి ఏమీ తినలేదు. వాళ్ళు ఆకలి కూడా మర్చిపోయారు. పెద్దమ్మాయి తల్లి ఫోటో దగ్గర చేతులు జోడించి కూర్చుండిపోయింది. ఆమె కాళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు వర్షిస్తున్నాయి. సహాయం కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలో వాళ్లకు అర్ధం కాలేదు. నారాయణబాబు ఉదయం సంతోష్ ఇంటి దగ్గర జరుగుతున్నది అంతా చూశారు. కనీసం ఆయన పలకరించను కూడా పలకరించలేదు.
జర్నలిస్ట్ రమేష్ అంకుల్ ఒక్కడే తమకు సహాయం చేయగలడు. ఇలా ఆలోచించుకుని
” దామూ ! నువ్వు ఇక్కడే టి వి చూస్తూ వుండు. నేను ప్రెస్ అంకుల్ దగ్గరకు వెళ్లి అసలు విషయం ఏమిటో కనుక్కోమని అడుగుతాను” అన్నది జయంతి
దమయంతి లేచి నిలబడి ” లేదు లేదు నేను ఒక్కదాన్నీ ఉండలేను. నేను కూడా నీతో వస్తాను.” అన్నది
“సరే ! ఇంటికి తాళం వేసి మనం వెళదాం !” అని ఇంటికి తాళం వేసి ఇద్దరూ బయలుదేరారు
రమేష్ సాహూ ! సత్యసంవాద్ అనే పత్రికకి స్థానిక విలేకరి. ఆ పత్రిక నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది. అయినా ఆ కాలనీ లో అతడి పట్టుకు ఢోకా లేదు. కానీ ఆ కాలనీ జనం ఆ గిరిజన టీచర్ కి ఇచ్చినంత గౌరవం తనకు ఇవ్వడం లేదు అని అతడికి అనుమానం లాంటి నమ్మకం వుంది. ఒక జర్నలిస్ట్ గా తనంటే భయం ఉంది కానీ గౌరవం లేదు. ఈ ఒక్క విషయం అతడిని తరచూ అసహనానికి , కోపానికి గురిచేస్తుంది. కానీ అతడెప్పుడూ బయటపడలేదు. అతడిలాగే జనం కూడా ” రమేష్ సాహూ కి ఒక అనాథ శరణాలయం తో సంబంధం ఉంది. చిన్న పిల్లలను అక్రమముగా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాడు” అని గుసగుసలు పోతారు తప్పిస్తే బహిరంగంగా బయట పడరు.
దమయంతి రమేష్ సాహూ ఇంటి తలుపు తట్టగానే, తానే తలుపు తీశాడు. పిల్లలని చూస్తూనే ” మీరెందుకు వచ్చారు ఇక్కడికి ?” అని ప్రశ్నించాడు
“అంకుల్ ! నాన్నను పోలీసులు పట్టుకుని వెళ్లారు” దమయంతి కళ్ల నిండా నీళ్లు.
” పట్టుకుని పోరా ? మీ నాన్న నక్సలైట్ల తో చేతులు కలిపాడు. అందుకే పోలీసులు తీసుకుని వెళ్లారు”
నక్సలైట్లు . జయంతి ఈ మాట చాలా సార్లు టెలివిజన్ ముఖతా విన్నది. దిన పత్రికలలో చాలా సార్లు చదివింది. ఆమెకు తెలిసినంత వరకూ నక్సలైట్లు అంటే క్రూరులు. తుపాకులు , కత్తులు పట్టుకుని తిరుగుతారు. నుదుటికి ఎర్ర బ్యాండ్ చుట్టుకుంటారు. ప్రజలని హిసించి చంపుతారు. కానీ తన తండ్రి దోమను చంపడానికి కూడా చేయి పై కెత్తడు కదా ! అతడెలా నక్సలైట్ కాగలడు ?
జయంతి చేతులకు చెమటలు పట్టాయి. ఆమె భయం తో వణికి పోయింది. గొంతు తడారిపోయింది. ఇంకా ఏదో అడగబోయేంతలో రమేష్ సాహూ వాళ్ళ మొహం మీదే తలుపులు వేసేసుకున్నాడు
అప్పటిదాకా చిక్కబట్టుకున్న ధైర్యం జారిపోయింది. ఏమీ తోచక “దామూ ! ఏం చేద్దామే ?” అన్నది
” మనం దుర్గాచరణ్ అంకుల్ ఇంటి వెళదాం. ఆయన చాలా మంచివాడు. మనం అంటే ప్రేమగా కూడా ఉంటాడు. ఈ సమయం లో దుర్గా అంకుల్ తప్పితే మనకు ఎవరూ సహాయం చేయరు.” అన్నది దమయంతి
జయంతి ప్యాంటూ టీ షర్ట్ లో ఉంది. దమయంతి రాత్రి వేసుకున్న నైటీ లో ఉంది. కానీ వాళ్ళు తమ దుస్తుల గురించి పట్టించుకునే మానసిక స్థితి లో లేరు. దుర్గాచరణ్ హెచ్ ఐ జి బ్లాక్ లో వుంటారు. సంతోష్ ఉండేది ఎల్ ఐ జి బ్లాక్ లో. దుర్గాచరణ్ ఇంటికి వెళుతూ
జయంతి ఆలోచనలలో మునిగిపోయింది. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే విడిపించడానికి ఒక లాయర్ కావాలి. దుర్గా చరణ్ అంకుల్ కి ఎవరో ఒక లాయర్ తెలిసే వుంటారు. ఆయన తమకు తప్పక సహాయం చేయగలుగుతారు. ఎందుకంటే నాన్న కీ అంకుల్ కీ మంచి స్నేహం ఉన్నది. వారానికి రెండు, మూడు సార్లు అంకుల్ తమ ఇంటికి రావడమో , నాన్న వాళ్ళ ఇంటికి వెళ్లడమో చేస్తూ వుంటారు. ఇలా ఆలోచించుకుంటూ అక్క చెల్లెల్లు ఇద్దరూ దుర్గాచరణ్ ఇంటికి వెళ్లారు.
వాళ్లిద్దరూ దుర్గాచరణ్ ఇంటి గేట్ మీద చేయి వేయగానే అక్కడే ఉన్న కుక్క ఒకటి భీకరంగా అరుస్తూ ముందుకు దూకింది. దమయంతి భయపడిపోయి అక్క వెనుక దాక్కుంది
” ఎవరూ ?” అంటూ దుర్గా చరణ్ భార్య బయటికి వచ్చింది
తడారి పోతున్న గొంతుతో జయంతి ” ఆంటీ ! మేము సంతోష్ కునార్ కూతుళ్ళం” అన్నది
ఆమె తలుపు తీసి ” రండి! రండి! లోపలికి ” అని పిలిచింది . దుర్గా చరణ్ లోపల టి వి చూస్తున్నట్టున్నాడు. వెంటనే లేచి బయటకు వచ్చి
” పిల్లలూ మీరా ! మీరిప్పుడు ఇంటికి వెళ్లిపోండి. ఏదైనా ఉంటే మనం తరువాత మాట్లాడుకుందాము. మీ నాన్న అంత కరుడు కట్టిన నక్సలైట్ అని తెలిసి ఉంటే నేనసలు మీ నాన్న తో స్నేహం చేసేవాడినే కాదు. ఇప్పుడే మీ నాన్న మొహాన్ని టెలివిజన్ తెర మీద చూపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి, పోలీసులను చంపి ఆయుధాలు ఎత్తుకుని వెళ్లిన క్రిమినల్స్ ఫోన్ లో మీ నాన్న నెంబర్ దొరికింది. మీ నాన్న తో సంబంధం ఉన్న అందరికోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. ఓరి ! భగవంతుడా మా మీద ఎంత ఆపద వచ్చి పడింది ( కౌన్సా ముసీబత్ ఆ గయా హమ్ పర్ )” అన్నాడు నుదురు కొట్టుకుంటూ
” కానీ అంకుల్ ! మా నాన్న ఎంత మంచి మనిషో మీకు తెలియదా ? మీరు నిజం చెప్పండి. మా నాన్న నక్సలైటా ? రండి అంకుల్ పోలీస్ స్టేషన్ కి వెళదాం . ఎవరో ఒక లాయర్ని మాట్లాడండి అంకుల్ ” అన్నది జయంతి
ఆమె మాట పూర్తి కాకుండానే ” పోలీస్ స్టేషన్ కి వెళ్లి లాభం ఏముంది ? అయినా మీ నాన్న గురించి నాకేం తెలుసనీ ? ఎవరి మనసులో ఏమున్నదో ఎవరికైనా ఎలా తెలుస్తుంది ? ఏ ఆధారమూ లేకుండా పోలీసులు అరెస్ట్ చేయరు కదా !”
ఆ క్షణం లో దుర్గా చరణ్ మొహం జయంతి కి ఒక గుంట నక్క మొహం లాగా కనిపించింది. జయంతి ఆశా భంగం స్పష్టంగా ఆమె మొహం లో కనిపిస్తున్నది. ” అంకుల్ నాన్న ని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పండి అంకుల్ . మేమెక్కడికి వెళతాము” అన్నది
“మీ నాన్న ను అరెస్ట్ చేసింది పతాపూర్ పోలీసులు. ఆయన్ని ఈపాటికి యెస్ పి ఆఫీస్ కు తీసుకుని వెళ్లి వుంటారు. మీరు అక్కడికి వెళ్ళండి.” అతడికి మాటలని పొడిగించాలని అనిపించ లేదు. ఆ పిల్లల తో మాట్లాడుతున్నంత సేపు ఆయన అటూ ఇటూ చూస్తూ మాట్లాడాడు తప్పిస్తే వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడలేదు. జయంతి , దమయంతి వెనక్కు మళ్లారు
వెనుక నుండి దుర్గాచరణ్ భార్య మాటలు వినిపిస్తున్నాయి. ” నేను ఎన్ని సార్లు చెప్పినా మీరు వినిపించుకుంటేనా ? ఆ ట్రైబల్స్ ను నమ్మొద్దని ? ఆయన్ని పట్టుకుని వేళ్లాడారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు”
పైన సూర్యుడు చూపిస్తున్న ప్రతాపానికి కింద నేల భగభగ మని మండిపోతున్నది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ నాలుగు రోడ్ల కూడలి లో నిలబడ్డారు. ఎటువైపు వెళ్లాలో అర్ధం కాలేదు జయంతి కి. దగ్గర లో ఉన్న టెలిఫోన్ బూత్ కి వెళ్లి తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి ఫోన్ ఎత్తలేదు కానీ రికార్డ్ చేసిన వాయిస్ ” దిస్ టెలిఫోన్ నెంబర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ ” వినిపించింది. ఆమె టీ షర్టు పాకెట్ లోకి చెయ్యి పెడితే ఐదు రూపాయల బిళ్ళ చేతికి తగిలింది. ఆ ఐదు రూపాయల తో బిస్కెట్ పాకెట్ కొని దమయంతికి ఇచ్చి ” ఇప్పటిది తిను, మనం ఇంటికి వెళ్లి కొన్ని డబ్బులు తీసుకుందాము . నా స్నేహితురాలు దీపాలికి ఫోన్ చేద్దాం. ఎలాగైనా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నాన్న ని విడిపిద్దాము.” అన్నది
“నాకేం ఆకలిగా లేదు. ముందు ఇంటికి వెళదాం పద !” అన్నది దమయంతి
జయంతి , దమయంతిని దగ్గరకు తీసుకుంది. జయంతి కళ్ళ నిండా నీళ్లు. తానే అధైర్య పడితే చెలెల్లికి ధైర్యం ఎవరు చెప్తారు?ఎట్టి పరిస్థితిలోనూ మన భయం, అధైర్యం బయటకు కనపడనీయవద్దని ఆమెకు తన తండ్రి చెప్పాడు. తల్లి కూడా అదే చెప్పేది. అందుకే ధైర్యం కూడ దీసుకుని
“సరే ! పదా ” అన్నది జయంతి
అప్పటికే సాయంత్రం అయింది. ఇంకాసేపట్లో చీకటి పడుతుంది. ఇంకో ఫర్లాంగ్ దూరం లో తమ ఇల్లు వున్నదనగా జయంతి దృష్టికి కి వచ్చింది అది. తమ ఇంటి గేట్ ముందు వందమందికి పైగా జనం గుమికూడి వున్నారు. వాళ్లంతా తన తండ్రిని తిడుతున్నారు. అసభ్యమైన భాషలో దూషిస్తున్నారు. కొంత మంది గేట్ ను బలంగా తంతున్నారు. మరికొంత మంది గేట్ పైకి ఎక్కి లోపలకు దూకడానికి సిద్దపడుతున్నారు. లోపలకు రాళ్లు విసురుతున్నారు. అలా గుమి కూడిన జనం లో జర్నలిస్ట్ రమేష్ సాహూ ను . ఇంటి ఎదురుగా వుండే మనోజ్ ను జయంతి పోల్చుకోగలిగింది. కాలనీలో అందరికీ బాగా పరిచయం ఉన్న గ్యారేజ్ లోని ఇద్దరు మెకానిక్ లు ఇంట్లోనుండి టెలివిజన్ ను బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఎలక్ట్రిక్ వైర్లు కట్ చేస్తున్నారు.
జయంతి దమయంతిని గట్టిగా వాటేసుకుంది. ఆమె తన కళ్ళను తాను నమ్మలేక పోతున్నది. వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు
“ఇంటిని తగలబెట్టండి. ఆ దయ్యం తన కార్యకలాపాలు అన్నీ ఇక్కడినుండే చేస్తున్నాడుగా ! వాడు పైకి పెద్ద సాదు సన్యాసి లాగా కనిపిస్తాడు కానీ వాడొక పెద్ద చుపా రుస్తుం (మారు వేషం వేసుకున్న దయ్యం). ఇంటిని తగులబెట్టండి అని కొంతమంది అరుస్తుంటే, మరి కొంత మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ” ఆ దయ్యం ఇంటిని ఆనుకుని చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇంటిని తగలబెడితే మన ఇల్లు కూడా తగులబడతాయి. దానికి బదులుగా తలుపులు పగులగొట్టి ఇంట్లో వున్న వస్తువులన్నీ నాశనం చేసేయండి. అలా అయితేనే అతడికి మనం సరి అయిన పాఠం చెప్పగలము.”
ఆ క్షణం అక్కడ గుమికూడిన మూకలో నుండి ఎవరో గట్టిగా అరిచారు. “అటు చూడండి ! అక్కడ వున్నది ఆ రాస్కెల్ కూతుళ్లే కదా !”
” అవునవును వాళ్లే ! వాళ్ళ వయసు ఎంత ?”
“పెద్దమ్మాయికి ఇరవై , చిన్న దానికి పదహారు ఉండొచ్చు”
ఆ మాటలు విన్న వెంటనే జయంతి వెనక్కు తిరిగింది. వాళ్ళు మాట్లాడుతున్న అసభ్యమైన మాటలు ఆమెకు స్పష్టంగా వినబడుతున్నాయి.
చెల్లెలు చేయి గట్టిగా పట్టుకుని ” దామూ! పద ఇక్కడనుండి వెళ్ళిపోదాం. వాళ్ళు మనుషులు కాదు”
వెను తిరిగిన అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కాలనీ వైపు నుండి వెనక్కు మళ్ళి సిటీ వైపు పరుగెత్తసాగారు. ఎవరో ” వాళ్ళను పట్టుకోండి! ” అంటూ వెంట పరుగెడుతూ వస్తున్న శబ్దాలు వినపడుతున్నాయి. అక్క చెల్లెల్లు ఇద్దరూ లేని ఓపిక తెచ్చుకుని బలంగా పరుగెత్తసాగారు. ఆ కాలనీ, ఆ రోడ్లు, ఆ ఆట స్థలము, ఆ ఉదయం వరకూ వాళ్లకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిన పరిసర ప్రాంతాలు అన్నీ ఇప్పుడు భయం గొలుపుతున్నాయి. ఇప్పుడవన్నీ కొత్తగా, వింతగా కనిపిస్తున్నాయి. ఎవరో ఒక మంత్రగాడు తన మంత్ర దండాన్ని తమ ఇంటి మీద అటూ ఇటూ తిప్పితే ఒక్క సారిగా నేలమట్టం అయిపోయినట్టు తమ సంతోషాన్ని ఎవరో దోచుకుని పోయినట్టు జయంతి కి అనిపించింది.
దమయంతి భయంగా
” వాళ్ళు మన చిన్న తోటను కూడా పాడు చేస్తారు కదా!” అన్నది
“వాళ్లందరి దృష్టి లో మన నాన్న పెద్ద నేరస్తుడు. అందుకే వాళ్ళు మనలని వేటాడుతున్నారు”
పరుగెడుతూ, పరుగెడుతూ వాళ్లొక చెట్టు కింద ఆగారు ఊపిరి తీసుకోవడానికి. వాళ్ళ వెనుక అప్పటిదాకా వాళ్లు వున్న కాలనీ, కాలనీ చివర మహాదేవుడి గుడి మసక మసక గా కనిపిస్తున్నాయి. స్కూల్ ఆట స్థలము, యూకలిఫ్టస్ చెట్లు, ఏడేళ్లుగా ఆ అక్కా చెల్లెళ్లను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాయి. ఆ కాలనీ లోని జనమంతా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లకు అత్తయ్యలు, మామయ్యలు , బాబాయిలూను. కానీ ఒక్క సారిగా అవన్నీ శత్రువులుగా ఎలా మారిపోతాయి?
5
ఆ రోజు మంగళ వారం
సాయంత్రం ఏడున్నర గంటల వార్తలలో నక్సలైట్లతో సంబంధాలు వున్నాయి అన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన స్కూల్ టీచర్ ను విడుదల చేసారని ప్రముఖంగా చెప్పారు. మానవ హక్కుల కమీషన్ ఆ టీచర్ కి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఆ వార్త ఒడిశా రాష్ట్రం అంతా పాకిపోయింది. కళింగ నగర్ కాలనీలో కూడా ! నారాయణ బాబు, దుర్గాచరణ్, జర్నలిస్ట్ రమేష్ సాహు కూడా ఆ వార్తను విన్నారు. బుల్డోజ్ చేసిన సంతోష్ ఇంటి దగ్గర, టీ స్టాల్ ముందు, మళ్ళీ చర్చలు మొదలయ్యాయి
” నేను మొదటి నుండీ చెపుతూనే వున్నాను. సంతోష్ బాబు అలాంటి పనులెప్పుడూ చేయడని!”
“అతడికి జరిగిన నష్టానికి పోలీసులు పరిహారం చెల్లిస్తారా?”
” అయినా తెలవక అడుగుతాను. ఆది వాసీలు అందరూ నక్సలైట్లేనా ?”
” వాళ్లిద్దరూ తల్లి లేని పిల్లలు. వాళ్లకు ఎంత కష్టం వచ్చింది?”
“మనమొక పని చేద్దాం”
“ఏమిటది ?”
“ఇలా దగ్గరగా రండీ!”
వాళ్ళ మాటలన్నీ వింటున్న ఒక ముసలివాడు మెల్లగా తనలో తానూ గొణుక్కున్నాడు
” ఊసరవెల్లులు ”
6
సంతోష్ కునార్ ఒక మూలగా విరిగిన కుర్చీలో కూర్చుని వున్నాడు. అతడికి ఇరువైపులా ఇద్దరు పిల్లలు. అందరూ బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. టెలివిజన్ సెట్ మానిటర్ దుండగుల చేతిలో విరిగిపోయి మౌనంగా కనిపిస్తున్నది. తలుపులు ఇనుప సుత్తుల దెబ్బలకి చిల్లులు పడి మశూచి సోకిన మొహంలాగా కనిపిస్తున్నాయి. ఇంటి వెనుక తోట లో ఒక్క పూల మొక్క కానీ, ఆకు కూరల మడి కానీ పచ్చగా కనిపించడం లేదు. మూడు రోజుల క్రితం శీతాకోక చిలుకలు వాలి సౌందర్యభరితంగా కనిపించిన ఆ తోట ఇప్పుడు ఏనుగులు తెగ తొక్కిన అడవిని తలపిస్తున్నది.
సంతోష్ కి ఎక్కడి నుండి పునర్ నిర్మాణం మొదలు పెట్టాలో తెలియక గందరగోళంగా వుంది. విరిగిన తలుపులను, పాడైపోయిన టి వి సెట్ ను, ఫ్రిడ్జ్ ను త్వరలోనే బాగు చేసుకోవచ్చ. కానీ లోపల తగిలిన గాయం ఎలా మానుతుంది. అది ఎప్పటికైనా మానుతుందా?
మానవ హక్కుల సంఘం ఢిల్లీ తరఫున ఒడిశా వచ్చిన జాకబ్ మామిడి చెట్టు కింద దిక్కుతోచని స్థితిలో భయం భయంగా కూర్చున్న సంతోష్ ఇద్దరు పిల్లలను ఫోటో తీసి , ఒడిషా రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం కలిగించకపోయినట్టు అయితే. హక్కుల సంఘాలని అప్రమత్తం చేయకపోయినట్టు అయితే బహుశా ఇంకా జైలు నాలుగు గోడల మధ్యే సంతోష్ ఉండి వుండేవాడేమో! గత వారం రోజులుగా జరిగిన సంఘటనలపట్ల ఆతడు దీర్ఘంగా ఆలోచనలో పడి పోయాడు.
నిజమైన టెర్రరిస్ట్ ఎవరు? కేవలం అనుమానం తో ఎవరినైనా వేధించి, అతి సాధారణ మనుషులను జైలులో పెట్టే వాళ్ళా ? లేక హక్కుల కోసం గొంతు ఎత్తే వాళ్ల్లా ? ఎవరు టెర్రరిస్టులు. ఎలాంటి సార్వభౌమత్వం ఇది? యూనిఫార్మ్ వేసుకున్న పోలీసులకు కనీస విచారణ కూడా జరపకుండానే ఎవరినైనా జైల్లో వేసి మరణాన్ని కానుకగా ఇచ్చే అవధులు లేని అధికారం ఉంటుందా? ఇదేమి ప్రజాస్వామ్యం? ఈ దేశ సార్వభౌమాధికారం ప్రజల చేతులలో ఉన్నదా? లేక పోలీసుల చేతులలోనా?
లోపల చీకటి చాలా అసౌకర్యంగా వుంది. బాధ్యత గల పౌరులైన కళింగ నగర్ ప్రజలు సంతోష్ కునార్ అనే నక్సలైట్ ను ఆయన ఇంటి కరంట్ సౌకర్యాన్ని తొలగించడం ద్వారా శిక్షించారు. పది మంది ఒకేసారి ఎక్కి కిందకు దూకడానికి ప్రయత్నించడం వలన ఇంటి ముందు గేటు సగం వంగి పోయింది. పోలీసులు పెట్టిన చిత్ర హింస ఎంత భయంకరంగా వున్నదో అతడు పిల్లలకి చెప్పలేదు. ఇంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడు అయింది
సంతోష్ కూర్చున్న చోటు నుండి కదలకుండానే ” ఎవరొచ్చారో చూడు ?” అని జయంతికి చెప్పాడు
జయంతి కళ్లనీళ్లు తుడుచుకుని తండ్రి పక్కనుండి కదిలింది. గత నాలుగు రోజులు గా జరిగిన సంఘటనలు అన్నీ ఆమెను ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్లాయి. పరుగెత్తడం వలన కాళ్ళన్నీ వాచిపోయి అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా వుంది. ఆమె మెల్లగా తలుపు తీసింది. కొంతమంది మనుషులు బయట నిల్చుని వున్నారు. వాళ్ళ చేతుల్లో ఒక పూల దండ. వాళ్ళ చేతిలోని పూల దండ జయంతికి ఉచ్చు లాగా కనిపించింది. సగం తెరచిన తలుపును ఆమె బలంగా మూసేసింది .
“ఏమైంది తల్లీ ! ఎందుకలా తలుపు వేశావు ? వచ్చింది ఎవరు ?” సంతోష్ అడిగాడు
జయంతి పెద్దగా చెప్పింది . ” ఆ వచ్చింది మనుషులో ? మరొకరో ? ఎలా చెప్పగలను ?”
సంతోష్ విరిగిన కిటికీలోనుండి బయటకు చూసాడు. జయంతి మాటలు తప్పు కాదు. అతడు సన్నగా నిట్టూర్చాడు. జయంతి ఏడుస్తూ ” నాన్నా ! మనం వెళ్ళిపోదాం ! ఇక్కడనుండి ఎక్కడికైనా వెళ్ళిపోదాం !” అన్నది . సంతోష్ కూతురు కన్నీళ్లను ఆపలేదు
సంతోష్ మెడలో పూల దండ వేసి అభినందించడానికి వచ్చిన వాళ్ళు తలుపు తడుతూనే వున్నారు. కానీ సంతోష్ కి తలుపు తెరచి వాళ్ళను ఆహ్వానించాలి అనిపించలేదు. తలుపు వెనుక పరిచితమైన ఆ మొహాలు , తనకు తెలియని, తనను చిత్రహింసలు పెట్టిన అపరిచిత పోలీసుల మొహాల కంటే భయంకరంగా, రాక్షసంగా కనిపించాయి
***
మనుషుల మనస్తత్వానికి అద్దం పట్టిన కథ
అభినందనలు