1
ఖాళీగా..
ఖాళీలోంచి వచ్చావు
ఖాళీలో కలిసిపోతావు
మధ్యలో ఖాళీగా ఉండలేవా
అన్నారాయన టీ కప్పు పెదాలకి తాకిస్తూ
ఈ లోకం కూడా
ఖాళీలోంచి వచ్చింది
ఖాళీలోకి పోతుంది
మధ్యలోవి ఖాళీ పనులే గదా
అన్నాడతను కప్పు కింద పెడుతూ
ఖాళీలని గుర్తిస్తే సరే
అన్నారాయన
కప్పులు ప్రక్కకి జరుపుతూ.
2
జరగనివ్వాలి …
పూలు రాలుతుంటే రాలనివ్వాలి,
సీతాకోకలని ఎగరనివ్వాలి,
వాటిని కవిత్వం చేయాలనీ,
బొమ్మలుగా తీర్చాలనీ తలచరాదు
నీ లోంచి నవ్వు వస్తే రానివ్వాలి,
భయం పుడితే పుట్టనివ్వాలి
వాటిని తిరిగి తిరిగి దిద్దాలనీ,
కాదనో, ఔననో తేల్చాలనీ చూడరాదు
గాలి వీచినట్టు సహజంగా,
నీరు పారినట్టు సరళంగా
జరగనివ్వాలి, వెళ్ళనివ్వాలి
తేలికగా ఉండాలి, తెలియనట్లుండాలి
ప్రపంచాన్ని తన కల కననివ్వాలి,
అనంతాన్ని తన కౌగిలిలో ఉండనివ్వాలి
పెద్దగా గొడవపడేదేం లేదు ఇక్కడ,
అంతగా నిలబెట్టుకోవలసింది కనరాదు,
కాలం గడిచిందా, లేదా అన్నట్లుండాలి,
స్థల మొకటుందా, లేదా అనుకోవాలి
ఊరికే కదలాలి, మాట్లాడాలి,
అలసటతో హాయిగా నిద్రపోవాలి,
కడపటి బిందువు ఎదురైనపుడు
తృప్తిగా దానిలో లీనం కావాలి.
*
జరగనివ్వాలి… కవిత బాగుంది. ఔను..జరగనివ్వాలంతే..