బిడ్డలందరినీ భద్రంగా బతకనిస్తారా..??

ప్పుడొకసారి నిర్భయ
ఇప్పుడు కోల్ కతా ట్రైనీ డాక్టర్
మధ్యలో
మనం పట్టించుకోని శోకాలెన్నో
వినిపించుకోని ఆక్రందనలెన్నో-

అయినా
శరీరాలు రక్తాలు కారేదాకా,
ప్రాణముండగానే మాంసపు ముద్దలయ్యే దాకా,
హింసకు ప్రాణం పోయేదాకా-

భద్రతనో..రక్షణనో.. బాధ్యతనో..
గొంతెత్తి అడగలేకే కదా
ఏం జరిగినా జరగనట్టే.

ఏదో అయిపోయిందిలే అన్నట్టే
ఏం చేయగలం అనుకున్నట్టే

ఇంకో ఇంటి ఆడబిడ్డ చచ్చినా
నా ఇంటిదాకా రాలేదనో..
చావింటికి..నీ ఇంటికి..
వందలు వేల అబద్ధపు గోడలు కట్టుకొనో..

నిన్నా ఇయాల రోడ్లమీదికొస్తున్న
నా దేశ ప్రజలారా..!

చదువు కోసమో..ఉద్యోగం కోసమో
బడి కోసమో..బడలిక కోసమో
బయటికొచ్చిన ఆడబిడ్డని
ఒక్క వంకర చూపు కూడా చూడొద్దని
మనస్సాక్షికి చెప్పుకొని..
మీ చుట్టూ ఉన్న బతుకులక్కూడా
భద్రత ఉన్నదని
ధైర్యంగా చెప్పలేకపోయినరా ?

పరాయి బిడ్డ పానం పోకముందే
ఈ భయాన్ని..ధైర్యంగా మార్చకపోయినరా ?
రక్షణ అంటే అడగటమో,అడుక్కోవడమో, పోరాడటమో కాదని..
ఆత్మ గౌరవమని ఎలుగెత్తి చాటలేకపోయినరా ?

ఇప్పటికైనా న్యాయం కోసం ఒక్కటైనందుకు
నీ ఇల్లే కాదు..ఏ ఇల్లూ.. చావిల్లు కానీయమని
మీ మనసుకైనా మాటిచ్చుకుంటారా..?
బిడ్డలందరినీ భద్రంగా బతకనిస్తారా..??

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

స్వేచ్ఛ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇలాంటి దేశంలో పుట్టడం వారి ఖర్మ. ఈదేశంలో రాజకీయ పవరు తగ్గేవరకు న్యయంజరగదు.
    నిన్నటితో ఒ సీరియలో పప్రతిలిపిలో ముగిసింది. రెవిరాలమహలక్ష్మ గారు వ్రాసారు ఆమే ఇలాగె రాజకీయంగ మోసపోయి పరకాయప్రవేశ విద్య నేర్చుకోని ముష్కరులను మట్టుపెట్టింది.

  • బిడ్డలు బత్కాలి . బత్కనియ్యాలి.
    దుర్మార్గసమాజంలో ఈ ఘటనలు ఆక్టోపస్ లు అవుతున్న సందర్భాన స్వేచ్ఛ రాసిన కవిత బాగుంది

  • చాలా సందర్భోచితమైన కవిత.. రక్షణ అంటే అడగటమో, అడుక్కోవడమో/పోరాడటమో కాదని/ఆత్మ గౌరమని ఎలుగెత్తి చాటలేకపోయినరా ” అస్తిత్వం జీవిత పోరాటంలో ఓ భాగమని ఈ వాక్యాలు చాటిచెబుతూనే ఉన్నాయి.కవిత్వం ఓ ప్రేరకశక్తి.. స్ఫూర్తిమంత్రం.. కాలంతోపాటే ఈ కవయిత్రి స్వేచ్ఛ ప్రయాణం.. అభినందనలు ఈమెకు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు