బాలగోపాల్ కి సాహిత్యంతో లోతైన పరిచయం లేదా?!

“నాకు సాహిత్యంతో లోతైన పరిచయం ఎప్పుడూ లేదు..” అని 1989 జూన్ లో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలగోపాల్ చెప్పిన మొదటి వాక్యమది. అప్పటికే ఆయన రావిశాస్త్రి రచనలు, జాతీయోద్యమం, కవిసేన మానిఫెస్టో మొదలైన అనేక అంశాలపై వ్యాసాలు రాశారు. ఆయన  సాహిత్య వ్యాసాలు ‘రూపం-సారం’ పేరుతో విజయవాడ విరసం సభల్లో కూడా విడుదల చేశారు.  కాని ఎందుకో ఆయన ఆ తర్వాత సాహితీ రచనలు తగ్గించారు. కాని సాహిత్యం చదవడం మాత్రం ఆయన ఏనాడూ మానేయలేదు. నేను 1989లో ఆంధ్రభూమిలో పనిచేసే సమయంలో ఆయన  పౌరహక్కుల సభల్లో తల మునకలై ఉంటూ, మారుమూల పల్లెల్లో నిజ నిర్ధారణ పేరుతో పర్యటనలు చేస్తూ ఉండేవారు.  హైదరాబాద్ లో విద్యానగర్ లో అనుకుంటా ఒక రేకుల షెడ్డులో నివసించేవారు. రెండడుగులు కూడా వేయలేని ఆ షెడ్డులో ఆయన ఎలా పడుకునేవారో నాకు అర్థమయ్యేది కాదు. ఆయనను ఏ విధంగానైనా సాహిత్యంపై ఇంటర్వ్యూ చేయాలని అనుకుని చాలా సార్లు ఆయన చుట్టూ తిరిగాను. ఎక్కడ కనపడితే అక్కడ నక్షత్రకుడులా వెంటపడ్డాను. చివరకు “వదిలేలా లేవే” అంటూ “సరే.. నీ ప్రశ్నలు రాసియ్యి.. సమాధానాలు రాసి పంపుతాను” అన్నాడు. అంతే సమధికోత్సాహంతో అనేక ప్రశ్నలు గుప్పించి ప్రశ్నాపత్రాన్ని పంపాను. తర్వాత ఆయన ఎక్కడికెళ్లాడో తెలియదు. ఎంత ప్రయత్నించినా ఆయనను కలుసుకోవడం సాధ్యం కాలేదు.

ఒకరోజు సాయంత్రం ఆఫీసులో పేజీ పెట్టిస్తుంటే “మీకోసం ఎవరో వచ్చారు.”. అని అటెండర్ చెప్పారు. లేఅవుట్ సెక్షన్ నుంచి బయటకు వచ్చే సరికి నా డెస్క్ దగ్గర నలిగిన, మాసిన దుస్తులతో, మాసిన గడ్డంతో బాలగోపాల్ కనిపించారు. “సార్” అని అప్యాయంగా చేయి పట్టుకున్నాను. “సరే.. నేను వెళ్లాలి.. టైమ్ లేదు. నీవు రాసిన ప్రశ్నలకు సమాధానాలు రాశాను.. చదువుకుని నీకు నచ్చితే వేయి..” అని చెప్పి హడావిడిగా వెళ్లిపోయారు. నేను “చాయ్ తాగుదాం సార్”  అన్నా వినలేదు.

నేను తేరుకునేసరికి ఆయన ఒక సుడిగాలిలా వెళ్లిపోయారు. ఆ కాగితాలను నా డెస్క్ లో దాచి, ఫస్డ్ ఎడిషన్ పేజీలు పెట్టించిన తర్వాత తిరిగి వచ్చి చదువుకున్నాను. ఫోటోటైప్ సెక్షన్ వెళ్లి ప్రశ్నలు, సమాధానాలను టైప్ చేయించాను. ఆంధ్రభూమి సాహిత్య పేజీల్లో 1989 జూన్ 17, జూన్ 24 తేదీల్లో ఆయన ఇంటర్వ్యూ రెండు సార్లు  ప్రచురించాను. రెండు సార్లూ అర పేజీ కంటే ఎక్కువే ఆయన ఇంటర్వ్యూ వచ్చింది.

35 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చదువుతుంటే బాలగోపాల్ నాతో ఇంకా మాట్లాడుతున్నట్లే ఉంటుంది. అప్పటికి నాకు , ఆయనకు దాదాపు  9 సంవత్సరాలుగా పరిచయం.  వరంగల్ లో ‘సృజన’ సాహితీ మిత్రుల సమావేశంలో ఒక రోజు ఆయన నాకు పరిచయం అయ్యారు. నేను బికాం చదువుతున్న సమయంలో ఆయన కాకతీయ యూనివర్సిటీలో లెక్చెరర్ గా ఉండేవారు. మా ఇల్లు  యూనివర్సిటీ సమీపంలోని నయీంనగర్ లో ఉండేది. సమయం దొరికితే చాలు, నేను యూనివర్సిటీకి వెళ్లి ఆయన డిపార్ట్ మెంట్ లో ఆయన కుర్చీలో కూర్చునేవాడిని. ఆయన వచ్చేవరకు ఆయన టేబుల్ పై ఉన్న పుస్తకాలు తిరగేసేవాడిని. వాటిలో అనేక పుస్తకాలు సాహిత్యానికి సంబంధించినవే. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో రకరకాల విషయాలు చర్చించేవాడిని. ఆయన నన్నెంతో అభిమానించేవాడు. నేను విద్యార్థినైనా ఒక సమవయస్కుడుగా భావించి ఆదరణతో మాట్లాడేవారు. చదువు పూర్తయిన తర్వాత నేను ఒకటి రెండు సంవత్సరాల్లోనే హైదరాబాద్ లో ఉదయం దినపత్రికలో చేరాను. ఆయన లెక్చెరర్ ఉద్యోగాన్ని వదులుకుని పౌరహక్కుల ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నారు.  తీవ్ర నిర్బంధాలకు, అరెస్టులకు గురయ్యారు.  తర్వాతి కాలంలో ఆయన కూడా  హైదరాబాద్ చేరుకున్నారు.

ఇంతకీ నేను బాలగోపాల్ ను ఏమి అడిగాను?

మీలో ప్రవహిస్తున్న సాహిత్యమనే జీవనదిని మీరే  బలవంతంగా ఎందుకు ఇంకింప చేస్తున్నారు?  అన్నది నా తొలి ప్రశ్న.

నాకు సాహిత్యంలో లోతైన పరిచయం ఎప్పుడూ లేదు. చదివే అలవాటు చిన్నప్పటినుంచీ ఉంది కాని తెలుగు సాహిత్యం కంటే పాశ్చాత్య సాహిత్యంతోనే నాకు పరిచయం ఎక్కువ అని ఆయన జవాబిచ్చారు. రాష్ట్రంలో ఉన్న తీవ్ర నిర్బంధం రీత్యా సాహిత్య రచనలు చేయడం కన్నా పౌరహక్కుల ఉద్యమం అవసరమే ఎక్కువ ఉంది.. అని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమే, పౌరహక్కుల ఉద్యమం ఆయనలోని జీవనదిని ఇంకింపచేయడమే కాక, జీవాన్ని కూడా లాగేసుకుంది.

ఇంటర్వ్యూలో ఆ తర్వాత సాహిత్య విమర్శ, శిల్పం, రచయిత సామాజిక బాధ్యత, మాండలిక భాష, శ్రామికవర్గ సాహిత్యం, పరాయీకరణ, దళిత సాహిత్యం వీటన్నిటి గురించి నా ఇంటర్వ్యూలో బాలగోపాల్ పై ప్రశ్నలు సంధించాను ఆయన వాటన్నిటికీ తనదైన శైలిలో వివరంగా సమాధానమిచ్చారు.

ఒక రచనను ఏ విధంగా విశ్లేషించాలి.. అన్న ప్రశ్న ఇప్పటికీ చాలామందిని పట్టి పీడిస్తుంది.  రచన లోతుల్లోకి వెళ్లకుండా, రచయిత అంతరాత్మను అర్థం చేసుకోకుండా కేవలం సామాజిక ఆర్థిక నేపథ్యంతో పరిశీలించి దాన్ని విశ్లేషిస్తే సరిపోతుందా?  సామాజిక ఆర్థిక నేపథ్యంతో పరిశీలించడం అవసరమే కాని అదే మార్క్సిస్టు సాహిత్య విమర్శ కాదని  బాలగోపాల్ స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యమే కాదు, వ్యక్తుల వైయక్తిక ప్రత్యేకతల్లో ప్రతిఫలించే సామాజిక సంఘర్షణ సాహిత్య వస్తువు అవుతుంది అన్నారు. ఉదాహరణకు టాల్ స్టాయ్ వార్ అండ్ పీస్ కంటే అన్నాకరెనినా  సాహిత్యపరంగా ఉన్నతమైన రచన అని ఆయన చెప్పారు. సాహిత్య వస్తువైన జీవితం ఒక  సమయంలో అనేక లెవెల్స్ లో ఉంటుంది. వస్తుగత సామాజిక సంబంధాలుంటాయి. వాటి మధ్య ఘర్షణలుంటాయి. వాటిని మనం దర్శించుకునే విభిన్న సిద్దాంత, తాత్విక, భావజాల చట్రాలుంటాయి. వాటి మధ్య సంఘర్షణ ఉంటుంది. ఈ తాత్విక చట్రాలు తార్కికంగా ఏర్పడవు. సామాజికంగా ఏర్పడతాయి. అంటే జీవితాన్ని వస్తుగతంగా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఏర్పడవు. జీవితాన్ని భిన్న ప్రయోజనాల దృష్టిలో వ్యాఖ్యానించే క్రమంలో ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఎదిగి, ఈ తాత్విక చట్రాల్లో ఆలోచించడం, సంఘర్షించడం అలవర్చుకున్న వ్యక్తులుంటారు. వాళ్లకు సామాజిక నేపథ్యమే కాక వైయక్తిక ప్రత్యేకతలుంటాయి. హేతుబద్దంగా అనిపించే ప్రత్యేకతలే కాక మానసిక వైపరీత్యాలు ఉంటాయి. వీటన్నిటినీ సమగ్రంగా  సందర్శించినప్పుడే  సరైన సాహిత్యవిమర్శ అవుతుందని బాలగోపాల్ చెప్పారు. వాస్తవికత-భావజాలం, సమాజం-వ్యక్తి అనే  గతితార్కిక ద్వంద్వాల్లోని అంతస్సంబంధాన్ని సమగ్రంగా విశ్లేషించకుండా, ఒక దాన్ని మట్టుకు ప్రతిపాదించి రెండో దాన్ని తత్ఫలితమైన అనివార్య పర్యవసానంగా కొట్టి పారేసేది సమగ్రమైన మార్క్సిస్టు విమర్శ కాదు.. అని ఆయన స్పష్టం చేశారు. క్రిస్టఫర్ కాడ్వెల్, రేమాండ్ విలియమ్స్ లాంటి వారి సాహిత్య విమర్శల్లో ఉన్న అసమగ్రతల్ని కూడా ఆయన ప్రస్తావించారు.

శిల్పం గురించి బాలగోపాల్ కు స్పష్టమైన అవగాహన ఉన్నది. వ్యాపార రచయితల్లాగే చాలా మంది విప్లవరచయితలు కూడా ప్రజల జీవితాలనుంచి దూరంగా జీవిస్తున్నారు.. అని అని ఆయన  ఆనాడే చెప్పారు. సిద్దాంత భయంతో మార్క్సిస్టులు రచనలు చేస్తే అవి మంచి రచనలు కావని, ఈ సిద్దాంత భయం ఇంట్లో కూర్చుని ఎన్ని సిద్దాంత గ్రంథాలు చదివినా పోదని ఆయన అన్నారు. ప్రజల జీవితాల్లో, వారి దైనందిన ఘర్షణల్లో పాల్గొన్నప్పుడే సిద్దాంత అధ్యయనం కూడా ఫలవంతం అవుతుంది అన్నారు.  మధ్యతరగతిలో పుట్టిన రచయితలు ఇవాళ మంచి సాహిత్యం సృష్టించాలంటే శ్రామిక వర్గ ఉద్యమాలతో సంకల్పపూర్వంగా సంబంధాలు పెట్టుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం, పాట లో వస్తువు రీత్యా, శిల్పం రీత్యా కొంతవరకు మంచి కృషి జరిగిందని ఆయన చెప్పారు.

తెలుగునాట అంతర్జాతీయ స్థాయికి చెందిన రచయితలు లేకపోవడాన్ని కూడా బాలగోపాల్ ప్రస్తావించారు. శ్రీశ్రీ ప్రపంచంలో ఏ కవితో అయినా సరితూగుతాడు కాని, దాస్తయెవస్కీకి పదవవంతు సరిపోయే నవలా రచయిత తెలుగులో లేడు. అని ఆయన నిక్కచ్చిగా చెప్పారు. రష్యాలో భూస్వామ్య వ్యవస్థ పతనం అయి పెట్టుబడిదారీ సంబంధాలు అవతరిస్తున్న క్రమంలో మానవ సంబంధాల్లో ఉన్న ధర్మం, కరుణ, దయ, క్షమ మొదలైన విలువలన్నీ పతనం అయిపోవడాన్ని దాస్తయెవస్కీ అసహ్యించుకున్నారని,  క్రైస్తవ సంప్రదాయంలో నిరాశామయమైన మానవతావాద దృక్పథంతో ఆయన సమాజాన్ని విశ్లేషించగలిగారని బాలగోపాల్ వివరించారు.

ప్రపంచంలో గొప్ప సాహిత్యమంతా బలమైన సామాజిక పరిణామాలు జరుగుతున్న కాలంలో రచించినవేనని బాలగోపాల్ చెప్పారు. ఉద్యమం అన్న మాటకు సంకుచితమైన అర్థం ఇవ్వకపోతే, గొప్పసాహిత్యమంతా ఉద్యమ సాహిత్యమే అని ఆయన అన్నారు. మిల్టన్, టాల్ స్టాయ్ లాంటి వారు స్పష్టమైన రాజకీయ లక్ష్యంతో రాశారని ఆయన విశ్లేషించారు

సాహిత్యంలో నిబద్దత అనేది అవసరమని బాలగోపాల్ అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ అనేది ఒక భ్రమ. చైతన్యవంతంగా ప్రకటించుకునే సిద్దాంతానికి నిబద్దులు కాని వారు అవ్యక్తంగా మన మీద పనిచేసే  ప్రభావాలకు బందీలవుతారని, పరిష్కారాల గురించి ఆలోచించకుండా సమస్యల గురించి ఆలోచించలేమని ఆయన స్పష్టీకరించారు. నేను జీవితాన్ని చిత్రిస్తాను తప్ప సమస్యల పరిష్కారాన్ని సూచించను అంటున్నామంటే మన బుద్దిజీవుల జీవితం ఎంత పరాయీకృతం అవుతుందో అర్థం అవుతుందని ఆయన అన్నారు. రచన జీవితంలోనుంచి పుడితే సమస్య, పరిష్కారం అనే విభజన తలెత్తదు.రచన మెదడులోనుంచి, అహం లోంచి  పుడితే ఈ విభజన తలెత్తుతుంది.. అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. రచయితకు బాధ్యత లేదనే వారు ఎంత బాధ్యతా రహితంగా జీవిస్తున్నారో, రచయితకు బాధ్యత ఉంది అనేవారు కూడా అంతే బాధ్యతా రహితంగా జీవిస్తున్నంతకాలం ఈ చర్చ పూర్తి కాదని అన్నారు. మనం అణిచివేతను ప్రతిఘటించే ప్రయత్నం చేయకుండా లొంగిపోవడాన్ని, పైగా దానిని సిద్దాంతరీకరించే స్థాయికి దిగజారడాన్ని బాలగోపాల్ ఎండగట్టారు.

మాండలిక భాష గురించి చెబుతూ ప్రజా సాహిత్యం ప్రజల భాషలోనే ఉండక తప్పదు అని బాలగోపాల్ చెప్పారు. మాండలిక భాషకు సార్వజనీనత లేదంటే తెలుగుభాషకే సార్వజనీనత లేదని చెప్పాలి అని ఆయన అన్నారు. కృష్ణానది విజయవాడమీదుగా కాక అనంతపురం మీదుగా ప్రవహించి ఉంటే, కాటన్ దొర దానికి అనంతపురం దగ్గర ఆనకట్ట కట్టి ఉంటే, బెజవాడ తెలుగు మాండలికం అయ్యేదని, అనంతపురం భాషే అసలైన తెలుగు అయ్యేదని ఆయన అన్నారు.

ఒక రచయిత తన మూలం నుంచి వేరు కావడమే పరాయీకరణ అని బాలగోపాల్ అన్నారు. ఒంటరితనం అనుభవిస్తున్న రచయిత తన రచనకు మూలం అయిన శ్రమను తిరిగి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఆలోచన , రచన సామాజిక మూలం నుంచి వేరుపడ్డప్పుడు బుద్దిజీవులకు జీవితం అర్థరహితంగా అనిపించడం, కోట్ల జనం మధ్య ఒంటరితనం అనిపించడం సహజం అని ఆయన చెప్పారు.

తెలుగులో పీడితవర్గాల సాహిత్యం చాలానే ఉన్నదని, అందులో అగ్రవర్ణ భావజాలం ఉందనేది సర్వత్రా నిజం కాదని ఆయన చెప్పారు. 1970 తర్వాత వచ్చిన పీడిత వర్గాల సాహిత్యం  కుల వ్యవస్థ పట్ల తీవ్రమైన వ్యతిరేకతను ధ్వనింపచేసిన విషయాన్ని బాలగోపాల్ గుర్తు చేశారు.

ప్రజాసాహిత్యం సృజించే పరిస్థితి ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉంటుంది.. అని చివరి వాక్యంలో చెప్పిన బాలగోపాల్  తనకు సాహిత్యంతో లోతైన పరిచయం లేదని అంటే అంగీకరిస్తామా?

(బాలగోపాల్ మనను వీడి ఈ అక్టోబర్ 8తో 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా)

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు