సుశాంత్ సుప్రియ్ హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రసిద్ధి చెందిన కవి, కథకులు. పలు కథాసంపుటాలు, కవితా సంపుటాలు ప్రచురితమయ్యాయి. సుశాంత్ 28.03.1968న పాట్నాలో జన్మించి, పంజాబ్ లోని అమృత్‌సర్‌లో పెరిగారు. ఇంగ్లీష్‌లో ఎం.ఎ. చేశారు. కొన్నేళ్ళు పంజాబ్ లోని జలంధర్ లోని డి.ఎ.వి. కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో భారత పార్లమెంటులోని లోక్‌సభ సెక్రటేరియట్లో అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన కవితలు, కథల అనువాదాలు భారతదేశంలోను, విదేశాలలోను అనేక సాహిత్య పత్రికలలో, వార్తాపత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘ఇన్ గాంధీస్ కంట్రీ’ అనే ఆంగ్ల కవితా సంపుటి వీరికి బాగా పేరు తెచ్చిన పుస్తకం. భార్య లీనా, కుమారుడు వినాయక్, కుమార్తె ఆన్యలతో సుశాంత్ ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నివసిస్తున్నారు.
*
బాబయ్ గారు హిందీ సాహిత్యంలో ప్రసిద్ధ రచయిత. డజన్ల కొద్దీ కథా సంపుటాలు, కవితా సంపుటాలు, నవలలు వెలువరించారు. ఆయన రచించిన విమర్శనాత్మక గ్రంథాలు సమాజంలో పాతుకుపోయిన ఎన్నో గుడ్డి నమ్మకాలను చెదరగొట్టాయి. ఆయనకు పలు సాహిత్య పురస్కారాలు లభించాయి. పాఠశాలలలో, కళాశాలలలో విద్యార్థులు ఆయన రచనలను చదువుతారు. విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు ఆయన పుస్తకాలపై పరిశోధన చేస్తారు. అంటే, ఆయన హిందీ సాహిత్య ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు.
బాబయ్ గారు ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో నివసించేవారు. ఒకరోజు పిన్నిగారు అకస్మాత్తుగా చనిపోయాకా, ఆ పెద్ద ఇంట్లో బాబయ్ గారొక్కరు ఒంటరిగా మిగిలిపోయారు. ప్రస్తుతం రోజూ ఇంటి పనులు చేయడానికి వచ్చే సుశీలా బాయి తప్ప ఆయనని పలకరించేవారు లేరు. సుశీలా బాయి కూడా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోతుంది.
పిన్నిగారి మరణం తర్వాత నేను బాబయ్ గారిని కలిసినప్పుడు, ఆయన ఓ ప్రతిపాదన చేశారు. నా సాహితీ అభిరుచుల గురించి ఆయనకు తెలుసు. నేనో మాదిరిగా చదువుతాను, రాస్తాను. నాకు నలభై ఏళ్లు వచ్చాయి, అయితే నేను సాహిత్యానికి అంకితమైనవాడిని. అందుకే పెళ్లి చేసుకోలేదు. బాబయ్ గారికి ఈ సమయంలో, వృద్ధాప్యంలో తన పఠనానికి, రచనలలో సాయం చేయడానికి, తన సాహిత్య సమస్యలను తీర్చడానికి ఓ మనిషి అవసరం. అందుకే ఆయనతో పాటు ఆ ఇంట్లో ఉంటూ, ఆయన సాహిత్య సమస్యలను చూసుకుంటే, ప్రతి నెలా నాకు జీతం ఇస్తానని, తన మరణం తర్వాత ఈ ఇల్లు నాకు చెందేటట్లు వీలునామా రాస్తానని ఆయన ప్రతిపాదించారు. ఎటూ, ఆయనకు పిల్లలు లేరు.
ఈ ఆకర్షణీయమైన ప్రస్తావనని నేను తిరస్కరించలేకపోయాను. నిజానికి, నాకు మొదటి నుంచీ బాబయ్ గారంటే ఇష్టం. ఒక ప్రసిద్ధ సాహితీవేత్తగా ఆయనంటే నాకు చాలా గౌరవం. నాకు ఆయన ఇల్లు నచ్చింది. దాంతో, నేను ఆయన ప్రతిపాదనకి ఒప్పుకున్నాను. ఓ ఆదివారం నాకు కావల్సిన వస్తువులన్నింటినీ సర్దుకుని బాబయ్ గారింటికి మకాం మార్చాను.
అక్కడికి చేరుకున్న వెంటనే, బాధ్యతలను స్వీకరించాను. ఆయన లైబ్రరీ మొత్తాన్ని దుమ్ము దులిపి, అన్ని పుస్తకాలను క్రమపద్ధతిలో అమర్చాను. రోజూ ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం తర్వాత, బాబయ్ గారు ఒకటి లేదా రెండు గంటల పాటు రాసుకునేవారు. నేను ఆయన్ని శ్రద్ధగా చూసుకోసాగాను. ఆయనకి పోషకాహారం అందేలా చూసుకున్నాను. ఆయన జీవితాన్ని సరళమూ, సులభతరమూ చేయడానికి నేను ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. సాహిత్య ఉత్తర ప్రత్యుత్తరాలలో, ప్రచురణకర్తలతో చర్చలలో కూడా నేను ఆయనకి సహాయం చేయడం మొదలుపెట్టాను. సాయంత్రం పూట, ఆయన లాన్లో కాసేపు నడవడానికి సహాయం చేసేవాడిని. ఈ విధంగా, 80 ఏళ్ల బాబయ్ గారి జీవితం మళ్ళీ సజావుగా సాగడం మొదలైంది. ఆయన కూడా నన్ను ఇష్టపడేవారు. “ప్రశాంత్, నువ్వు రాకపోతే, నా జీవితం ఎలా ఉండేదో?” అని నాతో అనేవారు. నేను నవ్వుతూ వారి ఆప్యాయతను అంగీకరించేవాడిని.
బాబయ్ గారి పనులను చేపట్టి దాదాపు ఒక సంవత్సరం గడిచింది. ఈలోగా, ఆయనవి ఓ కవితా సంపుటి, రెండు కథా సంపుటాలు ప్రచురించబడ్డాయి. ఈ శీతాకాలంలో లాన్లో నీరెండలో రిక్లైనర్ కుర్చీలో కూర్చుని చదవుకోడం ఆయనకి చాలా ఇష్టం. అలాంటి సమయాల్లో, ఆయనకొచ్చే ముఖ్యమైన ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇచ్చేవాడిని, ఆయనకు ఇష్టమైన నెస్కేఫ్ లైట్ కాఫీని అందించేవాడిని.
కానీ ఎవరూ తప్పించుకోలేని ఆ రోజు రానే వచ్చింది. ఒక ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నేను ఆయన్ని భోజనానికి పిలవడానికి లాన్ లోకి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. ఆయన రిక్లైనర్ కుర్చీలో కూర్చొనే ప్రాణాలు విడిచారు. ఆయనకి గుండెపోటు వచ్చిందని డాక్టర్ తరువాత నాకు చెప్పారు.
ఆయన అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత, నేను దానిని అత్యంత శ్రద్ధతో నిర్వహించాను. నగరం నలుమూలల నుండి డజన్ల కొద్దీ సాహితీవేత్తలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. వార్తాపత్రికలు, న్యూస్ ఛానెల్స్ ఆయన మరణాన్ని హిందీ సాహిత్యానికి తీరని లోటుగా అభివర్ణించాయి. నేను అన్ని ఆచారాలను పాటించాను. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాకా, నేను ఆయన లైబ్రరీపై దృష్టి పెట్టాను. ఒక పెద్ద హాలులో విస్తరించి ఉన్న ఆయన లైబ్రరీ, వేలకొద్దీ అమూల్యమైన హిందీ, ఇంగ్లీషు పుస్తకాలతో నిండిపోయింది. పుస్తకాల సంఖ్య చాలా పెద్దది, జీవితాంతం వాటిని నిర్వహించడం ఓ తలనొప్పి లాంటిదే. ఇప్పుడు, బాబయ్ గారు లేనప్పుడు, ఈ పుస్తకాలని ఇక్కడ ఉంచి ఏం ప్రయోజనం? అందుకని విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకునేలా నగరంలోని విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇవ్వాలని తలచాను. ఓ సోమవారం నాడు బాబయ్ గారి లైబ్రరీ నుండి అన్ని పుస్తకాలను యూనివర్శిటీ లైబ్రరీకి పంపే ఏర్పాటు చేశాను.
తన ఆకస్మిక మరణానికి ముందు, బాబయ్ గారు తన కొత్త నవలపై పని చేస్తున్నారు. తొమ్మిది అధ్యాయాలు రాశారు. ఆ నవల రాతప్రతి ఆయన గదిలో లభించింది. ఓ రోజెప్పుడో మాటల సందర్భంలో, బాబయ్ గారు ఆ నవలలో పదవ అధ్యాయం చివరిదని నాతో అన్నారు. కానీ నవలను పూర్తి చేయకముందే మరణించారు.
ఆ నవల చదవాలనుకున్నాను. పదవ అధ్యాయం పూర్తయితే, ఆ నవలని ప్రచురించవచ్చు. ఆయన అసంపూర్ణ నవలని పూర్తి చేయాలనే కోరిక నాలో కలిగింది.
బాబయ్ గారి నవల మాన్యుస్క్రిప్ట్‌లోని తొమ్మిది అధ్యాయాలు ఆయన రాసిన ఐదు డైరీలలో స్వదస్తూరీలోనే ఉన్నాయి. తొమ్మిదవ అధ్యాయం ముగిసికా, తరువాతి పేజీలో, బాబయ్ గారు తన దస్తూరీతో ‘10వ అధ్యాయం’ రాసి దానికి అండర్లైన్ చేసుకున్నారు. కానీ డైరీలో దాని కింద లేదా దాని తర్వాత మరే పేజీలోనూ మరేమీ వ్రాసిలేదు. ఈ డైరీలు ఆయన స్టడీ టేబుల్‌పై పడి ఉన్నాయి.
యాదృచ్ఛికంగా, ఈ సంఘటన తర్వాత, నేను దాదాపు పదిహేను-ఇరవై రోజులు వేరే పనుల్లో మునిగిపోయాను, ఆ నవలపై దృష్టి పెట్టలేకపోయాను. పదిహేను-ఇరవై రోజుల తర్వాత, నాకు ఖాళీ సమయం దొరికినప్పుడు, నేను మళ్ళీ ఆయన స్టడీ రూమ్‌కి వెళ్ళాను. చివరి డైరీని తిప్పి చూస్తుండగా, ‘పదవ అధ్యాయం’ పేజీకి చేరుకున్నప్పుడు, విస్తుపోయాను. బాబయ్ గారి చేతివ్రాతలో ఒక కొత్త లైన్ వ్రాయబడింది – “అబ్బాయ్, నా ఈ పదవ అధ్యాయాన్ని వ్రాసి, ఈ నవలను వీలైనంత త్వరగా ప్రచురించు.” అని!
నా ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేనట్టయింది. ఈ వాక్యాలు నేను క్రితం సారి చూసినప్పుడు ఈ పేజీలో వ్రాసిలేవని నాకు ఖచ్చితంగా గుర్తుంది. మరైతే, బాబయ్ గారి మరణం తర్వాత వారి చేతివ్రాతలో ఆ వాక్యాలెవరు రాశారు? పనిమనిషి సుశీలా బాయి తప్ప, బయటి నుండి మరెవరూ ఇంట్లోకి రాలేదు. కానీ సుశీలా బాయి నిరక్షరాస్యురాలు. పైగా బాబయ్ గారి చేతివ్రాత లాగా రాయడం చాలా కష్టం. ఇది నేను పరిష్కరించలేని రహస్యం. నేను దయ్యాలను నమ్మకపోయినా, ఈ రహస్యం గురించి నా పరిచయస్థులతో మాట్లాడినప్పుడు, నవలని పూర్తి చేయలేకపోవటం వల్ల బాబయ్ గారి ఆత్మ అసంతృప్తి చెంది ఈ ఇంట్లోనే తిరుగుతోందని వాళ్ళు అన్నారు.
సరే, బాబయ్ గారి స్టడీ రూమ్‌కి తాళం వేసేశాను. ఇంటి శుద్ధి కోసం, బాబయ్ గారి ఆత్మ శాంతి కోసం ఇంట్లో పూజలు, యాగం చేయించమని స్నేహితులు సూచించారు. దాంతో, ఓ ఆదివారం నేను స్థానిక ఆలయం పూజారిని పిలిపించి ఇంట్లో పూజలు, యాగం చేయించాను.
మర్నాడు మళ్ళీ బాబయ్ గారి స్టడీ రూమ్‌లోకి వెళ్ళాను. వణుకుతున్న చేతులతో ఆ డైరీని తీసుకొని ‘పదవ అధ్యాయం’ అని రాసిన పేజీని తెరిచాను. మళ్ళీ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇప్పుడు క్రిందటిసారి వ్రాసిన వాటి క్రింద, బాబయ్ గారి చేతివ్రాతలో కొత్త వాక్యాలు కనబడ్డాయి –
“అబ్బాయ్, నువ్వు ఈ పనిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ నవలలోని పదవ అధ్యాయాన్ని నువ్వు పూర్తి చేయాలి. త్వరగా వచ్చి, పదవ అధ్యాయం రాసి ఈ నవలను ప్రచురించు.” అని.
నాకేమీ అర్థం కాలేదు. హృదయం వ్యక్తపరుస్తున్న అవకాశాన్ని నమ్మడానికి మెదడు నిరాకరిస్తోంది. కానీ మొదటిసారి నాకు భయంగా అనిపించింది. ఇది నిజంగా దెయ్యం పనేనా?
సరే, చూద్దాం అనుకున్నాను. బాబయ్ గారి నవలను మొదటి నుండి చివరి వరకు చదివాను. పదవ అధ్యాయం రాయడానికి సాధ్యమయ్యే ముగింపు గురించి ఆలోచించాను. బాబయ్ గారు బ్రతికుంటే, నేను అనుకున్న ముగింపు ఆయనకు కూడా నచ్చేదని అనిపించింది. తరువాత నేను ఓ నాలుగు రోజుల్లో ఆ నవల చివరి, పదవ అధ్యాయాన్ని రాశాను. తరువాత, బాబయ్ గారి పుస్తకాల ప్రచురణకర్తతో మాట్లాడి, ఆ నవలని ప్రచురించడానికి తుది ఒప్పందంపై సంతకం చేసాను. మూడు నెలల్లోనే, నవల ప్రచురించబడింది.
నేను నవల కాపీలు తీసుకొని బాబయ్ గారి స్టడీ రూమ్ లోకి వెళ్ళాను. డైరీలో పదవ అధ్యాయం అని రాసిన పేజీనే తెరిచాను. ఇప్పుడు మళ్ళీ ఆశ్చర్యపోయాను. బాబయ్ గారి అందమైన చేతివ్రాతలో, చివరి పంక్తుల క్రింద, –
“అబ్బాయ్, నా కోరిక తీర్చినందుకు నీకు కృతజ్ఞుడిని. ఇక వీడ్కోలు.” అని వ్రాసి ఉంది.
ఇదంతా ఏంటో అర్థం కాలేదు. దెయ్యాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ ఆ రోజు తర్వాత, ఆ డైరీలో మరో కొత్త వాక్యం ఏదీ రాసి ఉన్నట్టు కనబడలేదు.
*
Add comment