బాపుగారితో దాదాపు ముప్ఫై ఆరేళ్ళ స్నేహం. చిత్రకారుడిగా, దర్శకుడిగానే కాకుండా వ్యక్తిగా ఆయనతో చాలా దగ్గిరగా మెలిగే అవకాశం నిజంగా అదృష్టమే. ఎందుకంటే, బాపు గారు చాలా private person. అంత తేలిక కాదు, ఆయన మిత్రబృందంలో చేరడం! పని మాత్రమే లోకంగా బతుకుతూ అతితక్కువగా బయట కనిపించే వ్యక్తి ఆయన. అలాగే, అతి తక్కువ మాట్లాడే తత్వం ఆయనది. అలాంటప్పుడు బాపు సన్నిహితులలో వొకడిగా చేరడం, ఆ స్నేహం దాదాపు నలభయ్యేళ్ళ పైబడి నిలబడడం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.
1978- బాపుగారితో మొదటి సారి కలిసాను. అదీ ‘నవోదయ’ రామమోహన రావు గారూ, ఆంధ్రజ్యోతి నండూరి రామమోహన రావు గార్ల వల్ల- ముళ్ళపూడి రమణ గారికీ నండూరి వారికీ బంధుత్వం కూడా వుంది. అయితే, వాళ్ళ స్నేహాలకీ, మా ఇద్దరి స్నేహానికీ కొంత తేడా వుంది.
మొదటి నించీ నేనేదో మహాపండితుడినని – అది నిజమైనా కాకపోయినా సరే- ఒక అభిప్రాయమేదో ఆయనకీ వుండడం వల్ల మా ఇద్దరి మధ్య అపారమైన గౌరవ భావంతో కూడిన స్నేహం వుండేది. వ్యక్తిగా ఎంతవరకు సన్నిహితంగా వుండాలో అంత వరకూ వుండే వాళ్ళం. నేనేం రాసినా – అది వచనం కానీ, పాట కానీ- ఆయనకీ ఇష్టంగా వుండేది.
మొదటి సారి నాతో సినిమాకి రాయించింది ఆయనే. 1980లో ఆయన నా చేత మొదటి సారి సినిమా పాట రాయించారు, “కృష్ణావతారం” సినిమాకి- “చిన్ని చిన్ని నవ్వు, చిట్టి చిట్టి తామర పువ్వు,” అనే ఆ పాటని బాలు, శైలజ పాడారు.
అప్పటి నించీ నిన్న మొన్నటి “శ్రీరామరాజ్యం” దాకా బాపుగారి ప్రతి సినిమాతో నాకు ఏదో ఒక విధంగా అనుబంధం వుంది. నాకు బాగా గుర్తుండే జ్ఞాపకాలు బాపూ రమణల “మిస్టర్ పెళ్ళాం”తో ముడిపడి వున్నాయి.
చిత్రకళ అంటే ఎంత ప్రేమో ఆయనకీ చలనచిత్ర కళ అన్నా అంతే ప్రేమ! సినిమాలో దృశ్యాలూ, సన్నివేశాల విషయంలో ఆయన ఎంత ఆలోచన పెట్టే వారో గుర్తుకు తెచ్చుకుంటే, అది ఆయన వ్యకిత్వంలోని విశేషంగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనలో చాలా మందికి తెలియనిది ఏమిటంటే, ఆయన మొదట్లో గొప్ప ఫోటోగ్రాఫర్. ఆ ఫోటోగ్రఫీ ప్రావీణ్యమే ఆయన్ని సినిమా వైపు తీసుకువచ్చిందని నాకు అనిపిస్తుంది. ఆయన ప్రతి సినిమాలో ఆ ఫోటోగ్రఫీ కన్ను చాలా అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
అలాగే, ఆయన సినిమా సృజనాత్మకత ఆయనలోని చిత్రకారుడి తత్వాన్ని కూడా చెప్తుంది.
ఇక చిత్రరచనకి సంబంధించినంత వరకూ అంత స్వతంత్ర భావన వున్న తెలుగు చిత్రకారుడిని నా అనుభవంలో చూడలేదు. ఆంద్ర దేశంలో చిత్రకళ చరిత్రలో బాపుకి ముందూ బాపు తరవాత అన్న యుగవిభజన చేయాల్సి వుంటుంది. ఈ చరిత్రలో నూరింట ఎనభై వంతుల ఖ్యాతి బాపుగారికే దక్కుతుంది. ఎందుకంటే, అది ఆధునిక కథ కానివ్వండి, ప్రబంధ కథ కానివ్వండి. ఆ కథా హృదయాన్ని పట్టుకోవడంలో బాపు రేఖ అపూర్వం.
రచయిత ఏ కాలం వాడైనా సరే, ఆ రచయిత ఉద్దేశించిన భావాన్ని అందుకోవడమే కాకుండా దాని మీద వ్యాఖ్యానంలా వుంటుంది బాపు బొమ్మ. ఆ విధంగా రచన వుద్దేశాన్ని ఇనుమడింపచేసే శక్తి ఆయనకి వుంది. అందుకే, పత్రికల్లో కాని, పుస్తకాల కవర్ పేజీలుగా కాని బాపు బొమ్మ వుందంటే అది ఒక గౌరవంగా భావించే సాంప్రదాయం తెలుగు సంస్కృతిలో ఏర్పడింది. “అమరావతి కథల”కి బాపు వేసిన బొమ్మలు నాకు మహా ఇష్టం. ఆ కథలు వస్తున్నప్పుడు కథల కోసం ఎదురు చూపు ఒక ఎత్తు, బాపు బొమ్మ కోసం నిరీక్షణ ఇంకో ఎత్తు. ఆ ఎదురు చూపు చాలా ఇష్టంగా వుండేది నాకు.
కవిత్వంలో మనం సొంత గొంతు అంటూ వుంటామే, చిత్ర రచనలో అలాంటిది create చేసుకున్నారు బాపు. ఆయనదే అయిన సొంత రేఖ. బొమ్మ కింద సంతకం వేరే అక్కర్లేని సొంత రేఖ. దానికి కారణం- ఆయనకి రేఖల మీద అధికారం మాత్రమే కాదు, ఆయనలోని స్వతంత్రమైన భావుకత. అది ఆయన గీసిన బొమ్మలలోనే కాదు, రాసే అక్షరాల్లోనూ కనిపిస్తుంది. అది కూడా ఆయన వ్యక్తిత్వంలోంచి వచ్చిందే అనుకుంటాను. బాపు చిత్రకళా రీతి అనేదొకటి ఏర్పడడంలో ఆ రేఖల వ్యక్తిత్వంతో పాటు, ఆయనా సొంత స్వతంత్ర వ్యక్తిత్వమూ సమాన పాళ్ళలో వుంటాయని అనుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే, చిత్రకళకి బాపు జీవరేఖ వంటి వాడు. ఆయన ఇప్పుడు లేకపోయినా, ఆ జీవరేఖ జీవించే వుంటుంది.
మళ్ళీ ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడాలని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే, నన్ను ఆయనతో బాగా కట్టిపడేసింది అదే కాబట్టి! చాలా కచ్చితంగా వుండే మనిషి. మనిషైన వాడు ఎక్కడున్నా మనిషిగానే వుండాలని నమ్మిన వాడు. ఎంత స్పష్టత వుండేదో ఆయనకి! చాలా మందిలో లోపలి జీవితానికీ, బయటి జీవితానికీ మధ్య confusion వుంటుంది. లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా వుండడం బాపు వల్ల కాదు. తన పని పట్ల అంత భక్తి భావం వున్న మనిషిని కూడా నేను ఇప్పటిదాకా చూడలేదు. “బహుమతులూ పురస్కారాలూ కాదు, work మిగలాలి” అనే వారు. ఎక్కువగా బహిరంగ ప్రకటనలు చేయడం ఆయన మనస్తత్వానికి విరుద్ధం. ఒక అవార్డు సన్మాన సభలో చివరికి ఆయన్ని మాట్లాడమని అడిగారు. ఆయన కచ్చితంగా రెండు మాటలే మాట్లాడి, కూర్చున్నారు. ఒక మాట: ఈ సన్మానానికి కృతజ్ఞతలు. రెండో మాట: ఈ పురస్కారానికి కూడా కృతజ్ఞతలు. అంతే!
నలుగురిలోకీ దూసుకుంటే వచ్చే ధోరణి కూడా కాదు, మహా సిగ్గరి ఆయన! మామూలుగా స్నేహితుల మధ్య మాట్లాడేటప్పుడు కూడా ఆయన తక్కువే మాట్లాడే వారు. ఆయనకీ చాలా ఇష్టమైన విషయాలు: సాహిత్యం, కార్టూన్లు. ఈ రెండు విషయాల గురించే ఎక్కువ మాట్లాడే వారు. విస్తృతంగా చదివేవారు. ఆ చదివిన రచయితల గురించి మాట్లాడేవారు. కార్టూన్లు బాగా follow అయ్యేవారు. వాటి గురించి మాట్లాడే వారు. ఎంత మాట్లాడినా ఆయన వ్యక్తిగా చాలా private అని తెలిసిపోయేది.
చాలా ఆహ్లాదకరమైన జీవితం ఆయనది. మంచి స్నేహం ఆయనది. ఇప్పుడు ఆయన లేకపోయినా జీవరేఖలాంటి ఆయన చిత్రాలతో పాటు ఆ రెండూ మిగిలి వుంటాయి నాలో!
*
బాపుగారు బౌతికంగా మనమధ్య లేకపోయినా, అందరి అంతరంగాలలో నిలచియున్నారు. ఎపాత పత్రిక తిరగేసినా ఎక్కడోఅక్కడ వారి చిత్రం కనిపించేది.