బాధ్యత

త నాలుగు నెలలుగా మేమెవరం ఇంటి నుంచి బయటకి వెళ్ళింది లేదు. మా ఇంట్లో ప్రస్తుతం అత్తయ్య, మావయ్య, నేను ఉంటున్నాం. మావారు ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నారు.
ఆయన రావడానికి ఇంకో మూడు నెలలు పడుతుంది. ఇలాంటి సమయంలో ఆయనంత దూరంలో ఉండడం కష్టమే అయినా తప్పదు.
అత్యవసర సరుకులు, కూరగాయలు లాంటివి మా పిన్ని గారి అబ్బాయి ప్రతీ ఆదివారం తెచ్చి పెడుతున్నాడు. మేము వాటిని శుభ్రం చేసి వాడుకుంటున్నాం.
స్వతహాగా బయట తిరిగే మనస్తత్వం కాదు కాబట్టి ఇలా ఇంట్లోనే ఉండడమనేది నాకు పెద్ద కష్టం కాలేదు.
అత్తయ్య గారు తోచినంత సాయం చేస్తుండడంతో పనిమనిషి రాకపోతున్నా ఇంటి పనులు సాఫీగానే సాగిపోతున్నాయి.
****
వాట్సాప్ లో నా ఫ్రెండ్ సౌమ్య మెసేజ్ చూస్తే తన కూతురి పుట్టినరోజు పార్టీకి ఆహ్వానం పలుకుతూ డిజైన్ చేసిన ఫోటో ఉంది.
చూస్తుండగానే సౌమ్య నుంచి ఫోన్ వచ్చింది.
‘చూశావా ఇన్విటేషన్?’
‘హా.. ఇప్పుడే.’
‘మేము కూడా నిన్నే డిసైడ్ అయ్యాం. మన ఫామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ వరకే చిన్నగా జరుపుకుందామనుకుని. మర్చిపోకు, రేపు సాయంత్రం ఆరుగంటలకి వచ్చేయ్.’
సౌమ్య, నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా కచ్చితంగా ఉంటాము.
కానీ ఈసారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అసలిలాంటి సమయంలో ఇంకొకర్ని కలవడమే ప్రమాదం అనుకుంటే, అంత మందిని ఒకేసారి కలవడమనే ఆలోచన ఒళ్ళు గగుర్పొడిచింది.
వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.
****
మా ఊర్లో కొత్తగా పెడుతున్న రెస్టారెంట్లలో ఒక చిన్న రెస్టారెంట్ లో పార్టీ జరుగుతుంది. మాకు మాత్రమే ప్రవేశం ఉండేలా ఏర్పాటు చేశారు.
సౌమ్య వాళ్ళ మూడేళ్ళ పాప కొత్త గౌనులో మెరిసిపోతోంది. ఇంకా కొంతమంది పిల్లలతో కళకళలాడుతోందా చోటు.
అక్కడకు వచ్చిన అందరి మొహాల్లోనూ చిరునవ్వు తొణికిసలాడుతోంది. ఒక్కరూ మాస్క్ తొడుక్కుని లేరు.
నాకు ఎక్కడో చిన్న కంగారు. రాకూడదనే అనుకున్నా సౌమ్య బలవంతం మీద రాకతప్పలేదు.
మొత్తంగా ముప్పై మంది వరకూ ఉంటాము. అందులో సగం మంది సౌమ్య భర్త స్నేహితులే ఉన్నారు. వారెవరూ నాకు తెలీదు.
నన్ను ఒప్పించేటప్పుడు ‘అందరూ మనోళ్లే భయం లేదు’ అని చెప్పింది సౌమ్య. కానీ వీళ్ళని చూశాక నా భయం రెట్టింపు అయ్యింది.
టైం తొమ్మిది అయ్యే సరికి పోలీస్ లతో ఇబ్బంది ఉండకూడదని రెస్టారెంట్ షట్టర్ మూసేశారు.
కేక్ కట్ చేశాక వెళ్లిపోయిన వారిని మినహాయిస్తే ఇరవై మంది మిగిలాము.
నేనూ వెళ్లిపోవాలని అనుకున్నాను గానీ మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం బాగోదని ఉండిపోయాను.
అయినా నిండా మునిగాక చలి ఎందుకు, ఏదైనా వచ్చేది ఉంటే ఈపాటికి వచ్చేసి ఉంటుంది. ఇంక భయం అనవసరం అనిపించింది.
ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చాను. మళ్లీ ఎప్పుడు వస్తానో కూడా తెలీదు. ఉన్న కాసేపైనా హాయిగా అనుభవిద్దామనుకుని అంతవరకు మొహానికి ఉన్న మాస్క్ తీసేసి వాళ్ళతో కలిసిపోయాను.
****
పొద్దున్న లేస్తూనే నాకు పొడి దగ్గు మొదలైంది. రాత్రి తాగిన కోల్డ్ డ్రింక్ వలన వస్తున్నట్టుంది. పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడంతో పట్టించుకోలేదు.
మరుసటి రోజు దగ్గుతో పాటు కాళ్ళ నొప్పులు, తలనొప్పి, జ్వరం లాంటివి మొదలయ్యాయి.
నాకు కొద్దిగా ఆందోళన మొదలైంది కానీ అప్పుడప్పుడు వచ్చేవే కదా అని తేలిగ్గా తీసుకోడానికి ప్రయత్నించాను.
కానీ మరుసటి రోజు రాత్రికి పరిస్థితి విషమించిందని అర్ధమైంది. ఉన్నట్టుండి ఛాతీ పట్టేసినట్టు అనిపించింది. గుండెలో మంట. ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టు భావన కలుగుతుంది.
పడుకున్నదాన్ని కాస్త ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. సమయం అర్ధరాత్రి దాటింది. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక మా వారికి కాల్ చేశాను.
‘ఏంటి మేడం ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదా? గుర్తొస్తున్నానా?’ అంటూ నా పరిస్థితి తెలీక కొంటెగా అడుగుతున్నారు.
ఆయనకు విషయం చెప్పి కంగారు పెట్టకూడదన్న ఉద్దేశంతో మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించాను.
ఆయనతో అరగంట మాట్లాడాక మనసు కొంచం తేలిక పడినట్టనిపించింది.
నిద్రకు ఉపక్రమించాక ఉండబట్టలేక నాకున్న వ్యాధి లక్షణాల గురించి గూగుల్ చేశాను.
కరోనా లక్షణాల్లో నాకిప్పుడు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అరచేతి కింద సూదలతో గుచ్చినట్టు ఉండడాన్ని ఈ మధ్య కొత్తగా నమోదు అవుతున్న కేస్ లలో గుర్తించారంట.
అది చదువుతూనే నా ఎడమ అరచేతి కింద వస్తున్న నొప్పిని గమనించి నాకు కరోనా వచ్చేసిందని నిర్ధారించేసుకున్నాను.
****
ఉదయం లేచాక టెస్ట్ కి వెళదామనే రెడీ అయ్యాను. నా రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి అత్తయ్య గారు ఎదురుపడ్డారు.
చూడగానే బాగా నీరసించిపోయారని అర్ధమవుతుంది.
‘ఏమైంది అత్తమ్మా?’
‘ఏమో రాత్రంతా నిద్ర లేదు. తలంతా ఏవో సూదులు గుచ్చుతున్నట్టు నొప్పి.’
ఆ మాట వింటూనే నా గుండెలు జారిపోయాయి. అంటే నాకు రావడమే కాకుండా అప్పుడే అంటించేశాను కూడానా!
‘ఇంకా ఏమేం ఉన్నాయి?’
‘కాళ్ళు నొప్పులు, ఒంటి నొప్పులు’
‘ఎన్ని రోజుల నుంచి’
‘వారం రోజులు అయ్యుండొచ్చు. ఈ వయసులో ఎప్పుడూ ఉండేవే గా అని చెప్పలేదు. కానీ రాత్రి మాత్రం బాగా ఇబ్బంది పెట్టేసింది.’
‘సరే మీరు పడుకోండి. నేను బయటకెళ్లి మాత్రలు తీసుకొస్తా.’
మాస్క్, గ్లోవ్స్ తొడుక్కుని బండి తీసి పోనిస్తున్నాను కానీ ఒకటే ఆలోచనలు. నాకు వచ్చి కూడా ఇంకా నాలుగో రోజు మాత్రమే, అత్తయ్యేమో వారం అంటారేంటని.
అప్పుడప్పుడు ఆవిడ అన్నీ ఎక్కువ చేసి చెప్తూ ఉంటారు. ఇది కూడా అలానే అయ్యుంటుంది.
అయినా నా చిన్న తప్పిదం ఎంత ప్రమాదం తీసుకు వచ్చిందో తల్చుకుంటేనే బాధగా ఉంది. ఆరోజు సౌమ్య అడిగినప్పుడు మోహమాటానికి పోకుండా ఖరాఖండిగా నేను రాను అని చెప్పేస్తే అయిపోయేది.
నాకంటే ఏదో వయసులో ఉన్నాను వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది కనుక బయటపడొచ్చు అనుకోవచ్చు. కానీ అత్తయ్య పరిస్థితి ఏంటి?
ఆమెతో ఆగుతుందా? మావయ్య గారికి కూడా సోకితే?
అసలు మావారికి ఏమని చెప్పను?
మాకు కరోనా వచ్చిందంటే చుట్టుపక్కల వారు ఎలా చూస్తారు?
ఇలా ఎన్నో ప్రశ్నలు.
ఇప్పుడు ఎంత బాధ పడినా ప్రయోజనం లేదు. ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి.
నేను టెస్ట్ చేసుకోకపోవడమే మంచిదనిపించింది. ఈ నిజాన్ని నాలోనే దాచుకోవాలని నిర్ణయించుకున్నాను.
యూట్యూబ్ లో ఒక డాక్టర్ చెప్పిన మందులు, థెర్మోమీటర్, ఆక్సీ మీటర్ లాంటివి కొనుక్కుని ఇంటికి చేరాను.
సౌమ్య కి కాల్ చేసి క్షేమ సమాచారాలు కనుకున్నాను. నాకే కాక ఇంకెవరికైనా సోకిందేమోనన్న అనుమానంతో. అందరూ బాగున్నారని చెప్పింది.
అసలు ఆ పార్టీకి వచ్చిన వారిలో ఎవరో ఒకరికి కరోనా ఉండి ఉంటుంది. ఆ వ్యక్తి నుంచి నాకు వచ్చి ఉంటుంది.
ఆ వ్యక్తి ఎవరు!?
నా ఈ దుస్థితికి కారణం ఎవరు?
ఎవరు!?
****
ఇంటర్నెట్ లోనున్న సమాచారాన్ని సేకరించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను.
ముఖ్యంగా అత్తయ్య మావయ్యలను కలవకుండా ఉండేలా చూసుకుంటున్నాను.
మందులు వేస్తున్న దగ్గర నుంచి కొద్దిగా ఉపశమనం కలిగింది. ముక్కు దిబ్బడ ఇబ్బంది పెడుతుండడంతో తరచూ ఆవిరి పట్టిస్తున్నాను.
సుమారు వారం రోజులు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంటిని ఒంటిని చూసుకునే సరికే సరిపోయింది.
మావారితో సహా ఎవరికీ కాల్ చేసింది లేదు. ఇవాళ కొద్దిగా నీరసం తగ్గడంతో నా తోటి కోడలుకి కాల్ చేశాను.
వాళ్ళ పిల్లలిద్దరూ నేను పార్టీ కి వెళ్లిన రెండు రోజుల ముందు వరకు ఇక్కడే ఉన్నారు.
బావగారు ఏదో ఊరెళ్లి తిరిగి వస్తున్నారని, ముందు జాగ్రత్తగా ఓ రెండు వారాలు తాతయ్య నాన్నమ్మలతో ఆడుకుంటారన్న నెపంతో పంపించేసింది.
వాళ్ళు వెళ్లిన దగ్గర నుంచి నేను ఈ కరోనా గోలలో పడి ఇన్నాళ్లు కాల్ కూడా చేయలేదు.
‘మీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన రోజు నుంచే చిన్న దానికి జ్వరం. నిన్నటికి కుదటపడింది మళ్లీ’ అని మాటల మధ్యలో చెప్పింది.
చింటూతో మాట్లాడితే తలనొప్పి, కాళ్ళు నొప్పి లాంటివి కూడా ఉండేవని, తగ్గిపోయాయని నవ్వేసింది.
ఈ ఆకస్మిక విషయానికి నిశ్చేష్టురాలిని అయ్యాను.
అంటే… నేను ఇన్నాళ్లు అనుకుంటున్నట్టు కరోనా నేను పార్టీకి వెళ్లడం వలన వచ్చినది కాదు. ముందు నుంచే ఉంది.
నాకు ఎవరి నుంచో రావడం కాదు. నేనే ఎవరికైనా అంటించి ఉండొచ్చు.
నేను వెతుకుతున్న ఆ ‘ఎవరు’, ఎవరో కాదు. నేనే!
నా దుస్థితికి కారణం – నేనే!
నేనే!!
****
ఇంకొన్ని రోజులకి నాకు, అత్తయ్యకు పూర్తిగా నయమైపోయింది.
అసలు మాకొచ్చినది కరోనానో కాదో తేలలేదు. కరోనానే అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా వచ్చిందో అంతు పట్టడం లేదు.
అప్పుడే ఫేస్ బుక్ లో ఒక దర్శకుడి పోస్ట్ కనిపించింది.
కరోనా ఎలా అయినా రావొచ్చు.
ఎవరికైనా రావొచ్చు.
కానీ ఎదురెళ్లి అంటించుకోడానికి,
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా వచ్చిందో
తెలియనితనానికి మధ్య వ్యత్యాసాన్నే…
‘బాధ్యత’ అంటారు.
నాకిప్పుడు నా బాధ్యత తెలిసొచ్చింది. మరోసారి మొహమాటంతోనో, మూర్ఖత్వంతోనో లేదా మొండి ధైర్యంతోనో కరోనా కి ఎదురెళ్లకూడదని స్థిరంగా నిర్ణయించుకున్నాను.
****

 

శ్రీను పాండ్రంకి

విజయనగర వాసిని. సినిమాగా అయినా, పుస్తక రూపేణా అయినా కదురకపోతే నలుగుర్ని కూర్చోపెట్టి నోటితో అయినా కథలు చెప్పేద్దామనేంత కథలు పిచ్చోడ్ని. ముప్పై పైగా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇంగ్లీష్ లో ప్రచురితమైన నవల రాశాను. అతి త్వరలో తెలుగు నవల విడుదల కాబోతోంది. నాటకం వైపు కూడా అడుగులు పడుతున్నాయి.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు